సబ్ ఫీచర్

లింగాయుతులు హైందవేతరులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటక ప్రభుత్వం లింగాయుతులు హిందువులు కారని, వారిది ఒక ప్రత్యేక మతమని నిర్ధారించి, మతపరమైన మైనారిటీలుగా వారిని గుర్తించాలంటూ కేంద్రానికి సిఫారసు చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలకు పరాకాష్ఠ. గతంలో మైనారిటీలను బుజ్జగించి ఓట్లు అడిగేవారు. ఇప్పుడు హిందూ మతస్థులను విభజించి, ఓట్లు సంపాదించే సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. తెల్లదొరలు అనుసరించిన ‘విభజించు-పాలించు’ రాజనీతిని గట్టిగా నమ్ముతున్నారు కాంగ్రెస్ దొరలు. లింగాయుతుల ధార్మిక విశ్వాసాలు, ఆరాధనా పద్ధతులు, ప్రాథమిక సూత్రాలు మిగిలిన హిందువుల కంటె భిన్నమైనవా? కాదా? అన్నది వేరే చర్చ. మతప్రసక్తిలేని లౌకిక రాజ్యంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనవచ్చా? అన్న చర్చ అత్యవసరం. మన దేశంలో ప్రభుత్వాలు పదే పదే హిందూ మత వ్యవహారాల్లోనే ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి? రాజ్యాంగబద్ధంగా ఇది సమ్మతమేనా?
2013లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లింగాయుతులను ప్రత్యేక మత వర్గీయులుగా గుర్తించటానికి అంగీకరించలేదు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక ప్రభుత్వం లింగాయుతులను ప్రత్యేక వర్గీయులుగా గుర్తించింది. ఇది రాజకీయ అవకాశవాదం తప్ప మరొకటి కాదు. ఒక మత రాజ్యానికి ఉన్న అన్ని అవలక్షణాలను కర్నాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది. మత రాజ్యాలున్న చోట మత గురువుల సలహాల మేరకు అక్కడి ప్రభుత్వాలు ఎవరు ‘అసమదీయులో’, ఎవరు ‘తసమదీయులో’ హుకుం జారీచేస్తుంటాయి. ఉదాహరణకు పాకిస్తాన్‌లో ప్రభుత్వం ఎవరు ముస్లింలో, ఎవరు కాదో ప్రకటిస్తూ ఉంటుంది. కొందరు ఇస్లామ్‌ను అనుసరించినా వారిని ముస్లిమ్‌లుగా అక్కడ గుర్తించడం లేదు. సున్నీ ముస్లిమ్‌లు, షియాలను ముస్లిమ్‌లుగా గుర్తించక, వారి ప్రార్థనా స్థలాల మీద, జనవాసాల మీద దాడిచేస్తున్నా పాక్ ప్రభుత్వం పట్టించుకోదు. తాలిబన్ వంటి ఉగ్రవాద సంస్థలు మతంపై పెత్తనం చెలాయిస్తాయి. సిద్ధరామయ్య ప్రభుత్వ నిర్ణయం తాలిబన్ల తరహాలో ఉండటం ఆందోళనకరం. అబ్రహామీయ మతాల ప్రాతిపదికనే సిద్ధరామయ్య అనుసరించి, ఎవరు హిందువులో? ఎవరు కాదో? నిర్ధారించారు. అల్లాను నమ్మినవాళ్ళు ముస్లిమ్‌లు. మహమ్మద్ ప్రవక్తను చివరి ప్రవక్తగా అంగీకరించి, ఖురాన్‌ను పవిత్ర గ్రంథంగా ఒప్పుకోవటం ముస్లిమ్‌లకు అనివార్యం. క్రీస్తు దైవత్వాన్ని విశ్వసించి, బైబిలును పవిత్ర గ్రంథంగా అంగీకరించిన వారే క్రైస్తవులు. ప్రత్యేక గురువు లేదా ప్రవక్త, ఒక దివ్యగ్రంథం, కొన్ని వౌలిక విశ్వాసాలు, మత చిహ్నాలు ధరించటం- వీటి ఆధారంగానే అబ్రహామీయ మతాలు తమ మతస్తులను గుర్తిస్తాయి. ఈ తర్కాన్ని అనుసరించే సిద్ధరామయ్య ప్రభుత్వం లింగాయుతులను హిందువులు కాదని నిర్ణయించింది. ధర్మానికి, మతానికి ఉన్న తేడాను కావాలని గుర్తించకపోవటమే ఈ అవకాశవాద రాజకీయాలకు కారణం.
బసవణ్ణను ధర్మగురువుగా నమ్మటం, బసవ వచనాన్ని అనుసరించటం, లింగధారణ చెయ్యటం ప్రాతిపదికగా లింగాయుతులను, వీరశైవ లింగాయుతులను హిందువులు కారని ప్రభుత్వం పేర్కొన్నది. హిందూ ధర్మం సనాతనమైంది. వివిధ కాలాల్లో సంస్కర్తలు, ఆచార్యులు, దివ్యపురుషులు, భక్తశిఖామణులు, దురాచారాలను ఖండించి, సంస్కరణలు ప్రవేశపెట్టి, కొత్త సాంప్రదాయాలు నెలకొల్పి, మార్గదర్శకత్వంచేస్తూ వచ్చారు. మూలం ఒకటే అయినా, భిన్నత్వం గోచరిస్తుంది. కొత్త తెగలు, పంథాలు ఏర్పడ్డాయి. విభిన్న ఆలోచనా స్రవంతులు హిందూధర్మంలో భాగమే. సత్యాన్ని చేరుకోవటానికి ఏ మార్గాన్ని అయినా అనుసరించవచ్చునని, వివిధ ఆరాధన, ఆలోచనా పద్ధతుల మధ్య సమన్వయం తీసుకొని వచ్చారు. ఫలానా కులం వారు గాని, తెగకు చెందినవారు గాని హిందువులు కాదని ఏ ధర్మాచార్యుడు ఇంతవరకు ప్రకటించలేదు. హిందూ కుటుంబంలో పుట్టిన వారందరూ దైవాన్ని నమ్మినా, నమ్మకపోయినా, వేదాలను ప్రమాణంగా అంగీకరించినా, అంగీకరించకపోయినా హిందువులే. శివుడ్ని కొలిచినా, కేశవుడ్ని ఆశ్రయించినా, శక్తిని ఉపాసించినా అందరూ హిందువులే. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడానికి బదులుగా, వైరుధ్యాలను ఆధారంగా చేసుకుని హిందూ సంఘాన్ని చిన్నాభిన్నం చేసే ప్రయత్నాలకు సిద్ధరామయ్య రాజమార్గం తెరిచారు.
భిన్నత్వమే ప్రాతిపదిక అయితే, ప్రతి వర్గమూ మేము ఎట్లా హిందువులమవుతామని అనవచ్చు. ఎవరు హిందువు అన్నదానికి సావర్కర్ యిచ్చిన నిర్వచనానికి మరింత మెరుగులుదిద్ది అంబేద్కర్ తను క్రోడీకరించిన హిందూ చట్టాలను క్రైస్తవులకు, ముస్లిమ్‌లకు, యూదులకు తప్ప ఈ దేశంలో ఉన్న ప్రతి వారికీ వర్తిస్తాయని చెప్పారు. లింగాయుతులను హైందవేతరులుగా ప్రకటించి ఇంతవరకు ఎవరూ చేయని సాహసానికి పూనుకొన్నాడు సిద్ధరామయ్య.
లింగాయుత పెద్దలు తమను మైనారిటీలుగా గుర్తించమని ఎందుకు అడుగుతున్నారు? కర్నాటకలో వందలాది ధార్మిక సంస్థలు, వేలాది ఉన్నత విద్యాసంస్థలను లింగాయుత ముఠాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థల దైనందిన నిర్వహణలో మితిమీరిన ప్రభుత్వ జోక్యం వల్ల ఆ సంస్థలను వారు అనుకున్నరీతిలో సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. రాజ్యాంగంలో 30వ అధికరణ క్రింద అల్పసంఖ్యాక మత, భాషావర్గాలకు తమ సంస్థలను తామే నిర్వహించుకునే హక్కు లభిస్తున్నది. మైనారిటీ విద్యాసంస్థలలో ప్రవేశాలకు, నియామకాలకు, రిజర్వేషన్లు వర్తించవు. ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులను తమ విద్యాసంస్థలలో ప్రవేశం కల్పించటం తప్పనిసరి కాదు. విద్యాసంస్థల నిర్వహణలో ప్రభుత్వ ప్రమేయం ఉండదు కనుక ప్రభుత్వ తనిఖీలు, ఆడిటింగ్‌లు వర్తించవు. నియామకాలలో, తమ వర్గానికి చెందిన వారినే సిబ్బందిగా నియమించుకోవచ్చు. విద్యావ్యాపారంలో లింగాయుత పెద్దలు, నాయకులు ఆరితేరారు. తాము హిందూ సమాజంలో భాగంగా ఉన్నంతవరకూ ప్రభుత్వ జోక్యం, ప్రవేశాల్లో, నియామకాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. ఒకసారి మైనారిటీ వర్గంగా గుర్తింపుపొందితే స్వేచ్ఛగా విద్యావ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చునన్న ప్రధాన ఆకాంక్ష వారిని తమని మైనారిటీ వర్గంగా గుర్తించమని డిమాండ్ చేయటానికి కారణమైంది. తమ విద్యావ్యాపారం నిరాఘాటంగా వర్థిల్లాలంటే ప్రభుత్వ ధృతరాష్ట్ర కౌగిలినుండి తప్పించుకోవాలి. వ్యాపార ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి వచ్చిందే ఈ డిమాండ్.
లింగాయుతులు భాజపా వెనుకవున్న బలమైన వర్గం. వీరి డిమాండ్‌ను నెరవేర్చటం ద్వారా తమవైపు తిప్పుకోవాలని సిద్ధరామయ్య ‘మైనారిటీ’ పాచిక వేశారు. మన ప్రభుత్వాలు హిందూ ధార్మిక సంస్థలు, దేవాలయాలు, విద్యాసంస్థల నిర్వహణలో మితిమీరి జోక్యం చేసుకుంటున్నాయి. ఒక రకంగా హిందూ సంస్థలను ప్రభుత్వం జాతీయం చేసింది. జాతీయం చెయ్యబడ్డ హిందూ సంస్థల నుండి ప్రభుత్వాలు తప్పుకొనకపోతే, ఇంకా అనేక వర్గాల నుండి తమను మైనారిటీలుగా గుర్తించాలనే డిమాండ్లు రాష్ట్రాలలోనూ మొదలవుతాయి. కనుక సమస్య మూలంలోకి వెళ్ళి రాజ్యాంగంలోని 30వ అధికరణాన్ని సవరించి అన్నివర్గాల వారు వారి వారి విద్యా, ధార్మిక సంస్థలను వారే నిర్వహించుకొనేందుకు వీలు కల్పించాలి. మెజారిటీ విద్యాసంస్థలకు వర్తించే నియమ నిబంధనలను మైనారిటీ విద్యాసంస్థలకు కూడా వర్తింపచేయాలి. రాజకీయ నాయకుడి చేతిలో అధికారం పిచ్చివాడి చేతిలో రాయివంటిది. తమ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు రాజకీయ నాయకుడు ఉన్మత్తుడవుతాడు. ఎన్నికలముందు ఈ ఉన్మాదం రెట్టింపు అవుతుంది. గెలుపే ధ్యేయంగా ఎత్తుగడలు వేసి, సమాజాన్ని ముక్కలుగా చేసేందుకు కూడా వెనుకాడడు. ఇందుకు సిద్ధరామయ్యే పెద్ద ఉదాహరణ.

- డా. బొమ్మరాజు సారంగపాణి 94408 28487