సబ్ ఫీచర్

బాల్కనీలో పెరడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఆధునికంగా ఎదుగుతున్నాం. ఎన్నో ఆధునిక పరికరాలను సమకూర్చుకున్నాం. భూమిలో ఉండే ఖనిజ సంపదను తెలుసుకొన్నాం. వాటిని తవ్వి తీసుకొంటున్నాం.కాని, వాటిని అవసరానికి మించి తవ్వి తీసేస్తూ భూమి సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాం. కాని, ఆదిమ మానవుడు ప్రకృతిని పరిశీలించి వివేచించి విశే్లషించాడు కనుకనే ప్రకృతి ఆరాధకుడుగా మారాడు.
ఇలా ఎందుకని ఆలోచిస్తే చెట్లు లేనిదే మనిషి లేడు. అసలు చెట్లు, మట్టి,గాలి,నీరు, మనిషి అన్నీ కలిస్తేనే పర్యావరణం. ప్రకృతి యే పర్యావరణం. పర్యావరణం బాగుంటే మనిషి బాగున్నట్టే. పర్యావరణంలో స్వచ్ఛమైన గాలి, నీరు అందితే చాలు మనిషి మానవీయ విలువలతో ఎదుగుతాడు.
మనిషిని అన్ని విధాల బతికించేది చెట్లే. కండపుష్టిని పెంచు కోవడానికి తిండి నిస్తాయ. ప్రాణంతోజీవించడానికి స్వచ్ఛమైన ప్రాణ వాయువునిస్తాయ. ప్రకృతి లోని వేడి, చలి, దుమారం నుంచి కాపాడుకోవడానికి కలపనిచ్చి రక్షిస్తాయ. అంతేకాదు ఇంకా ఇంకా ఎన్నో విధాలుగా మనిషి బతకేవీలును ప్రకృతిలోని చెట్లే ఎక్కువ దోహదం చేస్తాయ. శ్వాససంబంధమైన ఎన్నో వ్యాధుల నిర్మూలనకు చెట్లు ఉపయోగపడుతున్నాయ. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల నిర్మూలనలోను చెట్లు ఎంతో ప్రాముఖ్యతను పొంది ఉన్నాయ.వరదలూ వాగులపొంగులు వచ్చినపుడు సారవంతమైన మట్టి కొట్టుకుని పోతుందని మనకు తెలుసుకదా. ఈ మట్టి కొట్టుకుని పోవడాన్ని ప్రతి చెట్టు సుమారుగా పాతిక కిలోల మట్టి కొట్టుకుని పోకుండా కాపాడుతుంది. అంటే భూమిని మనకు రక్షించి ఇచ్చినట్లేకదా. భూమి ఉంటేనే కదా మనం ఉండేది.
సుమారుగా 30-40 మీటర్ల పొడవువెడల్పు ఉన్న ప్రాంతంలోని పచ్చదనం ఒక మనిషికి ఒకరోజుకు కావాల్సిన ప్రాణవాయువును అందిస్తాయట.అంతేకాదు మన ఆవరణలో పెంచుకున్న చెట్లు 10సెంటిగ్రేడు డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గిస్తాయని పరిశోధనల్లో తెలసింది.
ఇట్లా మనకు శాస్తజ్ఞ్రులు చెప్పడం కాదు వేదాలే మనకు వృక్షోరక్షితి రక్షతః అని ప్రబోధం చేసాయి. అంతేకాదు చెట్లు నాటినవారు చిరంజీవులని విష్ణ్ధుర్మోత్తర పురాణం చెబుతుంది. చెట్లు నాటితే వచ్చే ఫలాలను ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు వేయనోర్లతో చెబుతున్నాయ. అంతేకాదు మహావిష్ణువే అశ్వత్థ రూపంలో నేనే ఉన్నానని చెప్పాడు. మన పండుగలన్నీకూడా పర్యావరణంతోనే చెట్లతోనే ముడి వడి ఉన్నాయ కదా. ఉదాహరణకు బతుకమ్మ పండుగ వస్తే పూలనే కదా మనం పూజించేది. ఇలా పత్రక్షంగానో పరోక్షంగానో మనకు ఉపయోగపడే చెట్లను, మనం కాపాడడం మన వంతు బాధ్యతగా మనకు మనమే తీసుకోవాలి. ఇట్లా ఆలోచించినవారే అపార్ట్‌మెంట్ ల్లో నివసించినా చెట్ల ప్రేమికులుగా మారి అక్కడే నందనోద్యనాలనుతయారు చేస్తున్నారు.
మనిషి ఎక్కడుంటే అక్కడే ప్రకృతి పరమళించిందన్నట్టు నేడు అపార్ట్‌మెంట్లల్లో కుండీల్లో అనేకరకాలైన చెట్లు పెంచుతున్నారు. కూరగాయల చెట్లు కూడా పెంచుతున్నారు. వీటి వల్ల తాజా కూరగాయలు, వాటితో పాటు రకరకాలైన పూల చెట్లను పెంచితే కంటికి ఇంపుగాను, మనసుకు ఆహ్లాదంగా ఈ బాల్కనీ పెరడు అందాలీనుతోంది.
ఇలాకుండీల్లో చెట్లను పెంచడం అంత కష్టమేమీ కాదు. వేర్లను పాతిపెట్టడం ద్వారాను, చెట్ల కొమ్మలను అంటు కట్టడం ద్వారాను విత్తనాల చల్లడం ద్వారా ఈ చెట్లను పెంచవచ్చు. అభివృద్ధి చేయవచ్చు.
ఇలా చెట్లను పెంచుకోవడానికి ఇలా ఆరంభించండి. తర్వాత మీరే వివిధ రకాల చెట్లను కుండీల్లో పెంచడం సులువు అని గ్రహిస్తారు. ఆరంభంలో ఇలా చేయండి.
మనం కొత్తిమీరను కొన్నప్పుడు వాటి వేర్లతో సహా ఒక్కోసారి మనకు దొరుకుతాయి. కొత్తిమీర ఆకులను, కొమ్మలను తెంపివేసుకొని ఆ వేర్లను మళ్లీ చిన్న కుండీల్లో పెంచితే అవి పాదుకొని మళ్లీ కొత్తిమీర చిగురిస్తుంది. అది లేకపోతే చిన్న చిన్న కుండీల్లో కాసిని ధనియాలు చల్లి బాల్కనీలో ఉంచితే చాలు చక్కని కొత్తిమీర మొలకలు మూడు నాలుగు రోజులకే వస్తాయి. అవి కాస్త 10 రోజులు పెరగనిస్తే సాంబారులోకి కొత్తిమీర తాజాగా వాడుకోవచ్చు. అట్లానే చిన్న కుండీలో మిరప చెట్టు ఒక్కదాన్ని పెంచుకొంటే చాలు ఆ చిన్న కుటుంబానికి రోటి పచ్చడ్లల్లో కూరల్లోను పచ్చిమిరప తాజాగా దొరుకుతుంది. ఇంట్లో ఆ కుండీలను పెట్టుకోవడం వల్ల చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి. మంచి వాసన తో కూడిన గాలి ఇల్లంతా వ్యాపిస్తుంటుంది. ఇట్లానే పుదీనా నుకూడా పెంచుకోవచ్చు.
గోధుమలు, రాగి ఇట్లాంటి గింజలను పాడైన ట్రేల్లోనోలేక అందమైన సాసర్లు, మొర్రిపోయిన జాడీల్లోనో మట్టి పోసి చల్లితే మూడురోజులకు అందంగా పచ్చగా మొక్కలు వస్తాయి. వాటిని రోజు అరగ్లాసు నీటిని పోసి పెంచుతూ టేబుల్ పైన లేక గోడల మూలల్లో పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంటికి అందం చేకూరుతాయి.
టేబుల్స్ పక్కన కాని, టేబుల్ పైన గాని వీటిని పెట్టుకోవచ్చు. చిన్న చిన్న పూలు పూచే కుండీలను వివిధ రంగులు వెదజల్లే ఆకులు గలిగినచెట్లను కూడా టేబుల్ పైన ఇంటి ముందర హాయగా పెంచుకోవచ్చు.
అసలు చెట్ల మధ్య తిరుగుతూ వాటి అందాలను ఆస్వాదిస్తూ ఉంటే ఆ హాయ అనుభవిస్తేనే తెలియదు. చెప్పడానికి మాటలు చాలవు. కనుక అందరూ ఇక కుండీల్లో మట్టిని నింపండి. మొక్కలు నాటండి. పర్యావరణాన్ని రక్షించడానికి మన వంతు కృషిని ఆరంభించండి.

-జంగం శ్రీనివాసులు