సబ్ ఫీచర్

కులభేదాలకు అంతం ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ‘కులాల విభజన’ ఉన్నది హిందూ సమాజంలో మాత్రమే. ముస్లింలలో సున్నీలు, షియాలు అనే తెగలు, క్రైస్తవుల్లో రోమన్ కాథలిక్కులు, ప్రొటెస్టంట్లు అనే తెగలున్నాయి. ఆ తెగల్లో ఉన్నవి మత సంబంధమైన భేదాలే. హిందూ సమాజంలోనూ శైవ, వైష్ణవ, శాక్తీయ ఆర్య సమాజం, వీరశైవం వంటివి ఉన్నాయి. మతభేదాల కంటే కులభేదాల వల్లే హిందూ సమాజానికి, సంస్కృతికి, ధర్మానికి తరతరాలుగా హాని జరిగింది, జరుగుతోంది. కులభేదాలను తొలగించటానికి మన దేశంలో ఎందరో మహాపురుషులు కృషిచేసినా, అవి ఇంకా బలపడుతున్నాయి. స్వామి దయానంద, స్వామి శ్రద్ధానంద, నారాయణ గురు, డా.అంబేడ్కర్, మహాత్మా గాంధీ, డా.హెగ్డేవార్ వంటి మహాపురుషులంతా కుల భేదాలను తొలగించటానికి కృషిచేసిన వాళ్ళే. డా.అంబేడ్కరైతే ఎంతో నిరాశ చెంది ‘హిందూ మతం ఉన్నంతవరకు కుల భేదాలుంటాయని, తన అనుచరులతో బౌద్ధమతంలో చేరాడు. అంబేద్కర్ వలే మిగతా మహాపురుషులకు కూడ ఈ విషయంలో సంపూర్ణ విజయం లభించలేదు.
భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి అని, అన్ని కులాలూ సమానమేనని ఎంతమంది ప్రచారం చేసినా ఆ సమానత్వం నిర్మాణం కావటం లేదు. కులాలున్నంతవరకు ఈ భేదాలు తప్పవని మనం గ్రహించాలి. ఇక, కులాల వల్ల సమాజానికి ఏ కొద్దిగానైనా ప్రయోజనం ఉందా? అన్న విషయం గురించి కూడా ఆలోచించాలి. విద్య, వైజ్ఞానిక, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందని పూర్వకాలంలో మానవ మనుగడకు అవసరమైన వృత్తులన్నీ వంశపారంపర్యంగా నేర్చుకొనేవారు.
మానవుడి ఉనికికి ముఖ్యమైన అవసరాలు ఐదు. అవి తిండి, బట్ట, ఇల్లు, విద్య, వైద్యం అన్నవి. తిండికి ఆధారం పాడి, పంటలు. ఈ రెండూ వ్యవసాయాధారితమైనవి. రెడ్డి, కమ్మ, కాపు తదితర కులాలు వ్యవసాయంపై ఆధారపడేవి. వ్యవసాయానికి కావలసిన పని ముట్లు నాగలి, గొర్రు, గుంటక మొదలైన వాటిని తయారుచేయటానికి కొన్ని కులాలుండేవి. వంశపారంపర్యంగా కులవృత్తులు నేర్చుకుంటూ ఆయా కులాల వాళ్లు జీవయాత్ర చేసేవాళ్లు. ఇప్పుడు భూమిని దున్నటానికి, నాట్లు వేయడానికి, కోత కోయటానికి యంత్రాలు వచ్చాయి. కులంతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న వాళ్లెవరైనా ఆయా పనుల్లో శిక్షణ పొంది ఉపాధి పొందవచ్చు. బట్టల తయారీ పద్మశాలి కులస్థుల వృత్తిగా ఉండేది. వాటికి కూడా ఈనాడు మిల్లులు వచ్చాయి. వాటిల్లో అన్ని కులాలవాళ్లు పనిచేస్తున్నారు. ఇంటి నిర్మాణం విషయం కూడా అంతే. దానికోసం సివిల్ ఇంజనీరింగ్ విభాగమే ఏర్పడింది. కుల భేదం లేకుండా ఎవరైనా ఆ చదువులు చదవవచ్చు. పూర్వకాలంలో విద్యార్జనకు గురుకులాలు ముఖ్యంగా బ్రాహ్మణుల ఆధ్వర్యంలో నడిచేవి. అవి ఇప్పుడెక్కడా లేవు. దేశమంతటా ఆధునిక విద్యాలయాలే నడపబడుతున్నాయి. వీటిలో కులభేదాలకు తావే లేదు. వృత్తులు కొనే్న అయినా, మన సమాజంలో కొన్ని వందల కులాలు ఎందుకేర్పడ్డాయో, ఎట్లా ఏర్పడ్డాయో అర్థం కాదు. వేదాల్లో, భగవద్గీతలో నాలుగు వర్ణాల ప్రస్తావనే ఉంది. ఆ దృష్ట్యా ఇప్పుడు ఉనికిలో ఉన్న వందల కులాలకు వేద ప్రామాణ్యతగాని, భగవద్గీత ప్రామాణ్యత గాని లేవనే చెప్పాలి.
నేడు కులభేదాలు విపరీతం కావడానికి ఓట్ల రాజకీయాలు ముఖ్యకారణం. ఆంగ్లేయులు మన దేశంలో తమ రాజ్యాన్ని సుస్థిరం చేసుకోటానికి కుల భేదాలను ప్రోత్సహించినట్లే ఈనాడు రాజకీయ పార్టీలన్నీ అధికార దాహంతో కులభేదాలను ప్రోత్సహిస్తున్నాయి. కులాధారిత రిజర్వేషన్లు కూడా మరో కారణం. రిజర్వేషన్లను డా.అంబేడ్కర్ ఎంతో సదుద్దేశంతోనే ప్రవేశపెట్టాడు. అవి ఆయా కులాలకు ఏదో కొంత ఆర్థిక ప్రయోజనం మాత్రం కలగజేస్తున్నాయే తప్ప జాతీయ సమైక్యతకు దోహదం చేయటం లేదు. ఇటీవల మత రిజర్వేషన్లు కావాలన్న కోరికలు మొదలైనాయి.
ప్రస్తుతం మన మేధావులు, జాతీయవాదులు ఇంకా ముఖ్యంగా హిందూ ధర్మసంస్కృతుల రక్షణకు కంకణం కట్టుకున్న సంస్థలు, మఠాలు, మతాచార్యులు వంటివారు కులభేదాల అంతానికి ఏం చేయాలి? తరతరాలుగా ఎన్ని ఉపదేశాలు,ప్రచారాలు చేసినా తొలగని ఈ సాంఘిక దురాచారం- కులాంతర వివాహాలు జరిగితే కొంతవరకైనా తగ్గవచ్చు. కులాంతర వివాహాలతో వివిధ కులాల మధ్య రక్తసంబంధాలేర్పడి ఎవరి ఉపదేశాలతో పనిలేకుండానే సమాజమంతటా ప్రేమానురాగాలు, ఆత్మీయ భావాలు నెలకొంటాయి. రెండు, మూడు తరాలు గడిచేసరికి కులం పేరు చెప్పడమే ప్రాక్టికల్‌గా సాధ్యంకాదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు కులాలు వాటంతటవే అంతరించిపోతాయి. ప్రభుత్వం కూడా కులాల పేరుతో ఉన్న రిజర్వేషన్లు తొలగించి మెరిట్, ఆర్థిక పరిస్థితి, లలిత కళలు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ వంటి అంశాల్లో ప్రతిభ ఆధారంగా ఆర్థిక సహాయం అందజేయాలి. ప్రజలందరూ తమ పేర్ల చివర కులాన్ని సూచించే పదాలను వదిలేయాలి. ప్రభుత్వ రికార్డుల్లో కూడా కులం పేరు ఉండరాదని చట్టం చేయాలి. ఇందుకు మేధావులు, జాతీయవాదులు, హిందూ ధర్మ ప్రచారకులు కార్యాచరణకు పూనుకోవాలి.

- కె.శ్యాంప్రకాశ్ 94920 33953