సబ్ ఫీచర్

వంచించిన నేతలకు గుణపాఠం తప్పదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెదేపా, విపక్షమైన వైకాపా గత నాలుగేళ్లుగా రాజకీయ స్వార్థంతోనే వ్యవహరిస్తున్నాయి. సొంత బలం లేనందున వైకాపా, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లయినా గెలవాలని భాజపా తాపత్రయ పడుతోంది. ఈ పార్టీలకు ప్రజల గోడు వినిపించడం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలన్న విషయమై ఈ మూడు పార్టీల నేతల్లో ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఇక సిపిఐ, సిపిఎం వంటి వామపక్ష పార్టీలది విచిత్రమైన పరిస్థితి. సమస్యలపై చిత్తశుద్ధి వున్నా ఈ పార్టీల సిద్ధాంతాలు, రాజకీయ నిర్ణయాలు ప్రజలలో విశ్వాసం నింపలేకపోతున్నాయి. అందువల్ల చట్టసభల్లోకి అడుగుపెట్టే స్థాయిలో వామపక్ష పార్టీలు ఓట్లు సాధించలేకపోతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల ఏపీలో కాంగ్రెస్‌కు ఊహించని ఓటమి ఎదురైంది. అయితే, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి పకడ్బందీగా చట్టాన్ని తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇదంతా గత ఎన్నికలకు ముందు జరగడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పలేదు. ఎన్నికలకు ఏడాది ముందుగా రాష్ట్ర విభజన జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నక్కజిత్తులు ప్రదర్శించిన భాజపా, తెదేపా, వైకాపాలు ‘విభజన పాపం’ కాంగ్రెస్‌దే అని దుష్ప్రచారం చేసి ఎన్నికలలో లబ్ధి పొందాయి.
కేంద్రంలో భాజపా, ఏపీలో తెదేపా అధికార పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు గడచినా, ఏపీకి ప్రత్యేక హోదా దక్కలేదు. ‘హోదా’కు బదులు ప్యాకేజీ ఇస్తామని బిజెపి చెబితే, దానికి తెదేపా ఒప్పుకుంది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నెత్తీనోరూ కొట్టుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదు. హోదా కోసం ఉద్యమిచిన వారిపై అక్రమ కేసులు బనాయించారు. ఇక పాలనాపరంగా జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. ఎన్నికలు సమీపిస్తున్నందున- ప్రజల మనోగతాన్ని గుర్తించి తెదేపా, వైకాపాలు మళ్లీ ‘హోదా’ రాగాన్ని అందుకున్నాయి. ప్రత్యేక హోదా కావాలంటూ నిరసనలు, రాజీనామాలు, ర్యాలీలు, అవిశ్వాస తీర్మానాలంటూ ఈ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఈ డ్రామాలన్నీ ఎన్నికల వరకే సాగుతాయని తెదేపా, వైకాపా, భాజపా నేతలు గ్రహించాలి. ఆ తరువాత వీరి పాత్రలు అమాంతం మారిపోవడం తథ్యం. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పట్ల మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకున్నది. ఏపీకి మోదీ సర్కారు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలను ప్రారంభించింది. గత నాలుగేళ్లలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ హక్కులు, విభజన చట్టం అమలుపై పార్లమెంటులో, వెలుపలా చిత్తశుద్ధితో పోరాడుతోంది. పార్లమెంటులో తెదేపా, వైకాపా ఎంపీలు దిష్టిబొమ్మలుగా మారితే రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు ఒంటరి పోరాటం చేశారు.
దేశవ్యాప్తంగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, నిత్యాసర ధరల తగ్గింపు, అవినీతిపై పోరాటం, నల్లధనం వెలికితీత, రైతుల ఆదాయం రెట్టింపు, ఏపీలో రాజధాని నిర్మాణం, విభజన చట్టం అమలు వంటి ఎన్నికల హామీలను మోదీ ప్రభుత్వం తుంగలోకి తొక్కింది. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి , పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపు ద్వారా ప్రజలపై పెనుభారం మోపిన మోదీ నిర్వాకం పట్ల జనంలో వ్యతిరేకత పెల్లుబుకుతున్నది. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న వేలాది కోట్ల రూపాయల బ్యాంకు కుంభకోణాలు ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసం మోదీ, అమిత్ షా ద్వయం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించడం, తమను వ్యతిరేకిస్తున్న రచయితలను మట్టుబెట్టిస్తున్న తీరు చూసి యావత్తు దేశం తీవ్ర కలవరపాటుకు గురవుతున్నది.
అవినీతిపరులకు అపాయింట్‌మెంట్ ఇచ్చి గంటల తరబడి చర్చలు సాగిస్తున్న ప్రధాని మోదీ- ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంటులో నోరు మెదిపిన పాపాన పోలేదు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు మోదీ సర్కారుపై తీవ్ర వ్యతిరేకతతో వున్నారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఏ వైపే చూస్తున్నారు. మోదీ వంచనను అర్థం చేసుకున్న ప్రజానీకం 2019లో భాజపాకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో ఒకటి, రెండు రాష్ట్రాలలో మినహా కాంగ్రెస్ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఏపీలో సైతం కాంగ్రెస్‌పై సానుభూతి వున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా లభించడం ఖాయం. విభజన చట్టంలోని హామీలన్నీ కార్యరూపం దాల్చడం తథ్యం. తమకు అన్యాయం చేస్తున్న తెదేపా, వైకాపా, భాజపాలకు గుణపాఠాలు నేర్పడానికి జనం సిద్ధంగా ఉన్నారు. తమకు కాంగ్రెస్ వల్లనే సంపూర్ణ న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ప్రజల్లో మళ్లీ చిగురిస్తోంది.

-కొలనుకొండ శివాజీ 98662 00463