సుమధుర రామాయణం

సుమధుర రామాయణం -- యుధ్ధకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1166. హనుమ జూచి యాశ్చర్యఖేదముల తోడ
భండనం బాపె నిజముగ పుడమి తనయ
నే ఖలుడు జంపె నన్న నిస్పృహను జెందె
యసురులానంద నాట్యముల్ సల్పుచుండ

1167. ఇదియె యదనని ఇంద్రజిత్తురిగె హోమ
కార్యమును నిర్వహింప నికుంభిలకును
యసుర వీరుల కాపుంచి యగ్నివ్రేల్చి
మొదలు బెట్టె హోమము శత్రుమర్ధనకును

1168. జాంబవంతాది కపులతో నాంజనేయు
డరిగె రాముని చెంతకు కనుల నశ్రు
ధారలొలుకగ దేవ నాయెదుటె ఇంద్ర
జిత్తు జానకీమాతను సంహరించె

1169. విన్న రాముడు మొదలు నరికిన దృమము
వోలె దూలిపడె వివశత్వమ్ము జెంది
చల్ల నీటిని ముఖముపై జల్ల కపులు
దెలిసి దీనుడై దశరధనందనుండు

1170. జనక భూపతి సవనార్థ మవనిదున్న
ధర నయోనిజయై ప్రభవించి రఘుకు
లమ్ము మెట్టిన ధర్మ చారిత్ర జనకు
పట్టి మరణింప నేనింక బ్రతికియుంటి

1171. అనుచు పలు విధంబుల విలపించుచున్న
నన్న నోదార్చ సాధ్యముగాక లక్ష్మ
ణుండు మిన్నకుండె కనుల నశ్రులొలుక
నంతలో విభీషణుడేగె నచట కపుడు

1172. లక్ష్మణుడు వివరించగ విషయమంత
ఇంద్రజిత్తు సీతను జంపుటది యసంభ
వమ్ము నే నెరుంగుదు రావణు స్వభావ
మతడు బ్రతికుండ జనలేరు సీత దరికి

1173. అని విభీషణు డంబుజమిత్ర తేజ!
రాఘవా! మేరునగధీర తగునె తమకు
పామరునియట్లు శోకింప పాపి యింద్ర
జిత్తు గల్పించిన యసురతంత్ర మధిప!

1174. హోమకార్యము నిర్విఘ్నముగ నొనర్ప
జనె నతడు నికుంభిల బిలంబునకు మనము
వేగజని విఘ్నమొనరింప వలయు లేని
యడల నతని జంపుట కష్టసాధ్యవౌను’’

1175. అని విభీషణు దవనిజాపతి యనుమతి
వడసి సౌమిత్రితో హరియూధపతుల
వెంట నిడుకొని జని నికుంభిలను జుట్టు
ముట్టి రొక్కమ్మడిగ హోమవిఘ్నమునకు

1176. వానరులు విజృంభించిరి వనమృగేంద్రు
లవలె యసురసేనల నంతమొందజేయు
చుండ క్రోధరోషములను ఇంద్రజిత్తు
వచ్చె మధ్యలో హోమకార్యమ్ము నాపి

1177. ఇంద్రజిత్తు ప్రళయకాల రుద్రునివలె
వచ్చి వానరులను ముంచె వాడి బాణ
ములను నచ్చట నసుర సేనలతొ పోరు
పిన్న తండ్రిని జూచి యసహ్యపడుచు

1178. దుర్మతీ! స్వజనంబును వదలి నీవు
వైరులను గూడి పోరు వివేకహీన
జ్ఞాతి లక్షణము విడువలేడు నిన్ను
శతువును జేరిన విను శత్రువె వధించు

1179. అనుచు ఇంద్రజిత్తు తీవ్ర క్రోధమ్మున
బ్రహ్మదత్త దివ్యశక్తి హస్త
మందు బూని పిన్న తండ్రిపై విసరగ
లక్ష్మణుండు త్రుటిలో దునిమెదాని

1180. తలపడిరి ఇంద్రజిత్తు సౌమిత్రులనిలొ
భీకరమ్ముగ సాగె సంగరము నాక
వాసలచ్చెరువుగ జూచుచుండ విజయ
మెవ్వరి వరించునని సందియమ్ము తోడ

1181. మదగజమ్ముల వలెమృగేంద్రముల రీతి
పోరుసల్పిరి యా మహావీరవరులు
గడచె మూడు దినములిరుపక్షములను
నిహతులగు వారితో నిండె సమరభూమి

1182. శక్ర మర్దను డతిపరాక్రమమున కపి
సేననంతను ముంచె నిశిత శరముల
గంధమాదన శరభులు దూకి శత్రు
రధ పతాక యశ్వములను ద్రెళ్ళజేయ

1183. వేరొక స్యందనమ్మెక్కి ఇంద్రవైరి
సమర భూమి కేతెంచి శత్రువుల సంహ
రింపుచుండగ సౌమిత్రి రిపుని ధనువు
విరిచి ముఖముపై విడిచె త్రిశరములపుడు

1184. రక్త్ధారలు స్రవియింప ఇంద్రజిత్తు
యేమియు చలింపకుండ సౌమిత్రి నుదుట
మూడు బాణములేసి నొప్పింప నతని
యశ్వముల గూల్చె గదతొ విభీషణుండు

1185. రౌద్రమున పినతండ్రిపై ఇంద్రజిత్తు
శూలము విసర దాని సౌమిత్రి త్రుంచె
రావణి ప్రయోగించె దాశరధి పైని
రౌద్ర నామకాష్త్రమునంత లక్ష్మణుండు

--టంగుటూరి మహాలక్ష్మి