సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1066. ఆంజనేయుడు లక్ష్మణు భుజముపైకి
నెత్తుకుని రామచంద్రుని చెంత కరిగె
తమ్ముని పరిస్థితికి రఘురాము కనులు
తీక్షణమ్ములు రోషారుణిమములయ్యె

1067. రామచంద్రుడు కోదండమును ధరించి
అడుగు వేసెను రావణాసురుని వైపు
హనుమ రాఘవు దరిజేరి రామచంద్ర
అధివసింపుడు నా మూపుపైన ననగ

1068. రామచంద్రుడు హనుమంతు వాహనమున
సమర భూమికేతెంచి రావణున కెదురు
నిలచి విభుడు ధనుష్ఠంకారమ్మొనర్చి
నిలువుమనిలోన రావన విడువ నిన్ను

1069. రుద్రయమ వరుణ విరించులాది దేవ
గణములే వచ్చి నిన్ను రక్షింపలేవు
ప్రాణసముడు నాతమ్మున కింతటి దశ
గలుగజేసిన నిన్ను వధింతు నిపుడె

1070. పుత్ర మిత్ర బంధుజన సమేతము నిను సంహరించెద ఖరదూషణుల వధించి
నట్టి నిశిత బాణములకు నాకలింక
దీరలేదని దశరధాత్మజుడు బల్కె

1071. విన్నరావణుడమిత రోషమున వాయు
పుత్రు మీదికి ప్రళయకాలాగ్ని శిఖలు
జిమ్ము శరములు విడువ సమీరసుతుడు
లెక్కజేయక ముందునకేగె హనుమ

1072. రామభద్రుడు విడిచిన బాణములకు
రావణుధ్వజ రధపతాకములు నశ్వ
సారధులు ముక్కలై నేల బడియెవేరొ
కమ్ము లంకేశ్వరు కిరీట మవనిరాల్చె

1073. రామచాపమునుండి వేరొక శరమ్ము
రావణాసురు భుజమున గ్రుచ్చుకొనగ
ఇంద్రు వజ్రఘాతము లక్ష్యబెట్టనట్టి
రావణుడు రామబాణమునకు వడంకె

1074. చేయిజారెను ధనువు ప్రకాశహీను
డైన సూర్యునివలె విషశూన్యమైన
త్రాచువలె సంపద నశించిన ధనవంతు
బోలియున్న రావణుతో కౌసల్య సుతుడు

1075. రావణాసుర నీవింతవరకు యెంద
రో మహాయోధులతొ పోరి యలసినావు
ఖడ్గ రధ చాప శరములు ముక్కలయ్యె
ఇపుడు నీతోడ పోరుట యనుచితమ్ము

1076. నీ నివాసముజేరి విశ్రాంతి పొంది
రేపురమ్ము పొమ్మని వెనుదిరిగె రాము
డసుర వల్లభుడు కిరీటశూన్య శిరము
తోడ నగరము జొచ్చె పరాభవమున

1077. వనమృగేంద్రుని దెబ్బదిన్నట్టి మత్త
గజమువలె గరుడుని గోళ్ళుదాకి నలిగి
యున్న భుజగమువలె కొలువునకు నేగి
మంత్రులార నా తపమంత వృధగనయ్యె

1078. రంభ నీదంశ్వరుడు ఉమాదేవి యెంద
రో మహాఋషీశ్వరుల శాపమ్ములిట్లు
దాశరధి రూపమునుదాల్చి వచ్చెనేమొ
నిప్పుడిక కుంభకర్ణు మేల్కొల్పవలయు

1079. అతడొక్కడె శత్రుమర్దన సమర్ధు
డపుడు రణనిర్ణయము జేయునప్పుడుండె
మరల నిద్రించెనిట్లు నిద్రించ నసుర
జాతికుండదు నతని ప్రయోజనమ్ము

1080. ప్రభునియాజ్ఞను పాలింప భటులు జనిరి
అతి విశాలవౌ ఘటకర్ణు సౌధమునకు
రక్త భాండములతొ మాంసకుంభములతొ
నిద్ర మేల్కొన్న నాయనకందజేయ

1081. ఎంతొ కష్టముతో కుంభకర్ణు నిద్ర
లేపి దెచ్చినవెల్ల నందించి జరిగిన
విషయములు జెప్పి ఈ దినమునను దేవ
రాముడు ప్రభువుకు బెట్టె ప్రాణ భిక్ష

1082. అనుచు మంత్రులు దెల్పగ నుగ్రుడౌచు
నిపుడె రణరంగమున కేగి కపుల నరులు
రక్తముంద్రావి వచ్చెదనన మహోద
రుండు పతియాజ్ఞ వడయుట యుచితమనియె

1083. అందుకంగీకరించి సౌధమ్ముజేరి
స్నాన మొనరించి వస్తభ్రూషణ కిరీట
ముల నలంకృతుడై యన్న ముందుకేగి
వందనమొనర్చి యానతి దెల్పుడనియె

1084. ‘‘తక్షణము నీవు యుద్ధరంగమున కేగి
దాశరధులను వానరసేన నంత
నంత మొందించి రాక్షస జాతికీర్తి
నిల్పు’’మని బంపె తమ్ము నాశీర్వదించి

1085. అగ్రజుని యానతిని కుంభకర్ణుడరిగె
శాశ్వతముగ నిద్రింపనో యనగ ననికి
ఆకసంబంటు ఘనత్రిశూలము ధరించి
సర్వలోక క్షయమొనర్చు రుద్రుబోలి

టంగుటూరి మహాలక్ష్మి