సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1326. భరత డానతివ్వ శతృఘు్నడన్న రామ
చంద్రుని స్వాగతించ నయోధ్యపురిని
సర్వశోభాయమానముగా నలంకృ
తమ్ము జేయించి దేవాలయమ్ము లందు

1327. దానములను విశేష పూజలను సల్ప
జెప్పి నంది గ్రామము నుండయోధ్యకేగు
మార్గము పతాక తోరణములను గట్టి
సర్వ సుందరమ్ముగను జేయించె నపుడు

1328. తల్లుల రథము నెక్కించిమంత్రులు చతు
రంగ బలములతొ వశిష్ట గురువరేణ్యు
ముందు నిడుకొని కోసలాధీశ్వరునకు
స్వాగతముబల్క భరతుడు సాగెనపుడు

1329. గ్రామ పొలిమేరకుంజేరి వానర కల
కలమునుంగాని పుష్పక జాడగాని
గానరాక భరతుడు హనుమను జూడ
భరతరాజ! భరద్వాజ వౌని కృపను

1330. మధుర ఫలభక్షణమ్మున మా కపీశు
లంత శాంతులై జనుదెంచుచున్నవారు
హనుమ జెప్పుచున్నంత పుష్పకము వారి
ముందు దిగినది కరములు మోడ్చిరంత

1331. రామలక్ష్మణులు జనకాత్మజయు పుష్ప
కమ్ము దిగిరి భరతుడు వారి దరికేగి
రామపాదములకు మ్రొక్కె పరమభక్తి
రాఘవుడు తమ్ముసురమున జేర్చుకొనియె

1332. పరమపావని వదినకు ప్రణతి జేసి
రామసేవలో గడిపిన మహిత చిత్తు
లక్ష్మణున కభివాదము జేసి వాన
రాధిపు సుగ్రీవు కౌగిట జేర్చుకొనియె

1333. సోదరుండవు మాకింక సూర్యతనయ
యంచు జాంబవ దంగద యసుర విభుడు
ధర్మ నిరతు విభీషణుతోడ నింక
నెల్ల కపిరవేణ్యుల ప్రేమనాదరించె

1334. అంతట శతృఘు్న డతిభక్తినన్నరామ
చంద్రున కవనిజాత సౌమిత్రుల పద
ములకు సాష్టాంగము నమస్మృతుల జేసె
రాఘవుడు పిన్నతమ్ము కౌగిటను జేర్చె

1335. రాఘవుడు వడివడిగ కౌసల్య కడకు
నరిగి పుత్ర వియోగ దుఃఖంబుతోడ
నతి కృశించిన జనని పదములకు మ్రొక్కి
కన్న తల్లికానందము గల్గజేసె

1336. అంతట సుమిత్ర కైకేయి మాతల కతి
భక్తి పాద ప్రణామ మొనర్చి కుల గు
రువు వసిష్టున కత్యంత వినయుడౌచు
దాశరధి జేసె సాష్టాంగ దండ వతుల

1337. అత్తలకు మ్రొక్కె జానకి భక్తితోడ
వారు కోడలి నతిప్రేమ నురము జేర్చు
కొనుచు దీవించిరా మహా సుగుణవతిని
ధర్మచరిత రాముని ధర్మపత్ని నపుడు

1338. రామచంద్రుడు సచివులు పురజనముల
తన కటాక్ష వీక్షణములతోడ వారి
ముగ్ధులంజేసె తదనంతరమ్ము పుష్ప
కమ్ము నంపెను ధనదరు పురమ్ము కపుడు

1339. భరతు నాశ్రమమందరు జేరుకొనిరి
రామలక్ష్మణ భరతులు జటల వీడి
మంగళకర వాద్యమ్ములు మ్రోగుచుండ
పరిమళ జలముతో స్నానమాచరించి

1340. పట్టు పీతాంబరమ్ములు గట్టుకొనిరి
దివ్య మణిభూషణముల ధరించి వాన
రులకు వారల స్ర్తిజనంబులకు వస్త్ర
భూషణములతొ నందర సత్కరించి

1341. స్వయముగ తానె కౌసల్య జనకసుతను
మంగళ స్నాతగావించి మంచి దివ్య
పట్టు వస్తమ్రులు మణిమయంబులైన
భూషణములతో నలంకరింపజేసె

1342. రధము నాయత్తపరచె సుమంత్రుడపుడు
రామచంద్రుడు సీతతో రథము నెక్కె
తన మనోరధ మీడేరెననుచు భరతు
డన్న వదినలకుంబట్టె వెల్ల గొడుగు

1343. చామరలు వీచిరి సుమిత్ర సుతులు వేడ్క
వానర ప్రభువు సుగ్రీవు డధివసించె
భద్రదంతావళమ్ము శత్రుంజయమ్ము
హనుమ జాంబవంత విభీషణాంగదులును
రథముల ద్విరధములపై నరిగిరంత

1344. స్వస్తి వాచకములు పురోహితులు జడుపు
చుండ రామభద్రు నయోధ్య పురికి దోడు
కొనుచు వచ్చిరంతట వశిష్ఠముని నిశ్చ
యించె పట్ట్భాషేక ముహూర్తమపుడె

1345. అంత శతృఘు్న కోరిక కనక కలశ
ములతొ సాగర నదనదీ జలము హనుమ
జాంబవంత సుషేణ ఋషభగవయులు
పవన వేగంబుతో జని పట్టుకొచ్చ్రి

టంగుటూరి మహాలక్ష్మి