నమ్మండి! ఇది నిజం!!

థ్రిల్లాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలీవుడ్ సినిమాల్లో చూసే చాలా సన్నివేశాలు నిజ జీవితంలో ప్రేక్షకులకి అనుభవంలోనికి రానివి. కిడ్నాప్ చేయబడటం, తిరిగి క్షేమంగా బయటకి రావడం లాంటివి తమకి జరిగితే అవి భయంతో పాటు థ్రిల్‌ని కూడా కలిగిస్తాయి. అలాంటి థ్రిల్‌ని కోరే వారికి ఫ్రాన్స్‌లోని ఓ కంపెనీ ఆ సేవని అందిస్తోంది. తూర్పు ఫ్రాన్స్‌లోని ఆ కంపెనీ పేరు అల్టిమేట్ రియలైట్. వారు అందించే బేసిక్ పేకేజ్‌లో అపరిచిత దుండగులు కార్లో పడేసి నోట్లో గుడ్డలు కుక్కి ఎత్తుకెళ్లి కనీసం నాలుగు గంటలు చీకటి కొట్టంలో బంధిస్తారు. ఇలా ఎవరైనా క్షేమంగా కిడ్నాపింగ్ అనుభవాన్ని పొందవచ్చు. ఇందుకోసం వారు పదమూడు వందల అమెరికన్ డాలర్స్‌కి సరిపడే యూరోలని ఆ కంపెనీకి రుసుముగా చెల్లించాలి. అడ్వాన్స్‌డ్ పేకేజ్‌లో బోట్ ఛేజ్‌లు, హెలికాప్టర్‌లో పారిపోవడం, ఎక్కువ సమయం బంధింపబడటం లాంటివి ఉంటాయి.
కిడ్నాప్ చేసినప్పుడు కలిగే హింస, భయానకం, భయాలతో కూడిన స్పందనలని వారు అనుభవిస్తారని కంపెనీ వెబ్‌సైట్ హామీ ఇస్తోంది. వారికి డబ్బు చెల్లించాక తమని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ కిడ్నాప్ చేస్తారో ముందుగా తెలీదు. అది సస్పెన్స్.
వారిని కొద్ది రోజులపాటు రహస్యంగా అనుసరించి సరైన సమయంలో కంపెనీ మనుషులు వీధిలో కారు ఎక్కుతూండగానో, లేదా వారి కారుకి తమ కారుని అడ్డం పెట్టో, లేదా మరెక్కడో కిడ్నాప్ చేస్తారు. భౌతిక దాడి జరిగినా అది హానికరంగా కాకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. ముప్పై ఏళ్ల జార్జెస్ సెక్సస్ అనే ఫ్రెంచ్ దేశస్థుడు 2012లో ఈ కంపెనీని ఆరంభించాడు. రోజుకి కనీసం ఇద్దరు కస్టమర్స్ నేడు ఇతని సేవలని కోరుతున్నారంటే ఇది ఎంత ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. వారిలో పనిలో ఎక్కువ వొత్తిడిని అనుభవించే టాప్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్ ఈ సేవని అధికంగా వినియోగించుకుంటున్నారు. క్రమేపీ ఇది పాపులర్ అవడానికి కారణం బంగీ జంపింగ్, స్కై డైవింగ్ లాంటి థ్రిల్లింగ్ అవుట్‌డోర్ ఆటలకి దీన్ని ప్రత్యామ్నాయంగా ఫ్రాన్స్ ప్రజలు భావించడమే.
కిడ్నాప్ చేశాక నాలుగు నించి పదకొండు గంటలు మించి ఎవర్నీ బంధించి ఉంచరు. కారణం పదకొండు గంటల తర్వాత ఆ కొత్తదనం తగ్గిపోతోందని కనుక్కున్నారు. కిడ్నాప్ సమయంలో కాని, తర్వాత కాని ఎవరికీ హాని జరగదనే హామీని జార్జెస్ ఇస్తున్నాడు. కస్టమర్ ఇక తను భరించలేని స్థితికి చేరుకున్నానని చెప్తే ముందు కంపెనీకి ఇచ్చిన పాస్‌వర్డ్‌ని చెప్పాలి. వెంటనే కిడ్నాపింగ్ ఆగిపోయి అతను విడుదల చేయబడతాడు.
కిడ్నాపింగ్ లాంటివి జరిపేప్పుడు చుట్టుపక్కల వారికి అది ఉత్తుత్తి కిడ్నాప్ అని తెలీక పోలీసులకి ఫోన్లు చేస్తూంటారు. దీని మీద ఫ్రాన్స్ పోలీసు శాఖ స్పోక్స్‌పర్సన్ ఇలా చెప్తున్నాడు.
‘ఈ సేవ పూర్తిగా చట్టబద్ధమైంది కాదు. అదే విధంగా ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమూ కాదు. బాధితుడి అంగీకారంతో జరిగినప్పుడు నేరం జరగనట్లే. అందుకని ఈ వ్యాపారాన్ని నిషేధించాల్సిన అవసరం మాకు కనపడటం లేదు. ఐతే ఈ కంపెనీ వారు ముందుగా స్థానిక పోలీసులకి ఇలా జరుగుతుందని చెప్తే మంచిది. లేదా కిడ్నాపింగ్ వ్యవహారంలో పోలీసులు కూడా జోక్యం చేసుకుంటారు’
ఈ కంపెనీ కిడ్నాపింగే కాక ఇతర థ్రిల్లింగ్ సేవలని కూడా అందిస్తోంది. ఎవరూ నిజ జీవితంలో నేరం చేసి పారిపోరు. అలా నేరం చేయకుండా పారిపోయే క్లైంట్‌ని వేటాడి పట్టుకోవడం అందులో ఒకటి. వారిని ఉత్తుత్తిగా చంపే సేవని కూడా అందిస్తున్నారు. కిరాయి హంతకుడు బ్లేంక్ బుల్లెట్స్‌ని పేల్చో, నీళ్లల్లో ముంచో, మెట్లు దిగుతూంటే భుజం మీద చేతులు ఉంచో చెప్పాడు.
‘ఇది ఆట కాబట్టి సరిపోయింది. లేదా చచ్చేవాడిని’
ఓ రాత్రి శవాల గదిలో గడిపే సేవని కూడా ఈ కంపెనీ కొత్తగా అందిస్తోంది. ఇలా సాధారణ జీవితంలో లభించని అనేక అనుభవాలని ఈ కంపెనీ అమ్ముతోంది.
ఈ కంపెనీ స్థాపనకి స్ఫూర్తి ఓ హాలీవుడ్ సినిమా. మైఖేల్ డగ్లస్ నటించిన ‘ది గేమ్’ అనే సినిమాలో ఓ పాత్రధారి గౌరవం, డబ్బు, భద్రత ప్రమాదంలో పడతాయి. సినిమా చివరి దాకా అదంతా నిజమని ప్రేక్షకులు భావిస్తారు. కాని చివర్లో అదంతా కల్పితమని, ఓ కంపెనీ అందించిన సేవని చెప్తూ ముగుస్తుంది. దీనివల్ల ఆ పాత్రధారి జీవితాన్ని తేలిగ్గా తీసుకోకుండా తన పంథాని మార్చుకుంటాడు. అల్టిమేట్ రియలైట్ కంపెనీ ధ్యేయం కూడా ఇదే. కిడ్నాపింగ్ వల్ల కలిగే సైకలాజికల్ షాక్‌ని వారు ఓ పట్టాన మర్చిపోలేరు. జీవితం ఎంత బుద్బుధప్రాయమో అర్థమై, వారు ఇక మీదట కాలాన్ని వృధా చేయకుండా చక్కగా జీవిస్తారని ఈ కంపెనీని స్థాపించిన జార్జెస్ నమ్ముతున్నాడు.
ఇంతదాకా వేల మంది ఈ అనుభవాన్ని పొందారు. వారి వెబ్‌సైట్‌లో క్లైంట్స్ తమ స్పందనలని ఇలా నమోదు చేస్తూంటారు.
‘సినిమాల్లో చూసేది నాకు అనుభవంలోకి వచ్చింది’
‘నేను అందరికన్నా అదృష్టవంతుడ్ని. నా మేరేజ్ ఏనివర్సరీ బహుమతిగా నా భార్య నాకు చెప్పకుండా నా తరఫున డబ్బు చెల్లించడంతో నేను నిజంగా కిడ్నాప్ అయ్యాననే భావించాను’
‘ఇది ప్రతీ వారు జీవితంలో ఓసారైనా పొందాల్సిన అనుభవం. విమానం కూలి మనం మాత్రమే బ్రతకడం లాంటి అనుభవం ఇది.’

పద్మజ