ఈ వారం స్పెషల్

సహస్ర యశస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదిమందికి మంచి జరిగేదైతే
ఒకరికి కీడు కలిగినా పరవాలేదు. అష్టాక్షరితో అందరికీ మోక్షం
లభిస్తుందనుకుంటే, నేను
నరకానికి వెళ్లినా మంచిదే.
అందరిపట్లా మానవత్వం
పరిమళించటమే భగవంతుడు.

ఆచార వ్యవహారాలు సమాజ
శ్రేయస్సుకే ఉపయోగపడాలి.
అంధ విశ్వాసాలను
రాజేయకూడదు. గురువులు
చెప్పినదాన్ని వివేచించి, విశే్లషించి చూసి తెలుసుకోవలసిన బాధ్యత
జిజ్ఞాసువులదే. వ్యక్తిగతం కంటే లోక కల్యాణమే ముఖ్యం.

శ్రీ రామానుజుల వారి
జీవితంలో ద్రావిడ
ప్రబంధముల అధ్యయనం, బ్రహ్మ సూత్రాదులైన సంస్కృత వేదాంత అధ్యయనం..
ఈ రెంటి సంగమం చేత
ఒక సమన్విత మైన దృష్టి
ఏర్పడింది. భగవంతుడిని భావించేప్పుడు ‘ఎత్ తే కల్యాణ సమం రూపం’ అని ఈశోపనిషత్ చెప్పినట్లుగా
భగవంతుడిని నిరాకారుడిగా కాకుండా సర్వమంగళ
స్వరూపుడిగా భావించటం ఆధ్యాత్మిక అనుభవంలో సౌందర్య దృష్టికి ప్రాధాన్యం రావటం వల్ల వారి తత్త్వం శుష్క వేదాంతం కాకుండా
రసమయమై సౌందర్య
అనుభవంగా రూపొందింది.

రామానుజులు భారత దేశంలో భక్తి ఉద్యమానికి బంగారు శిఖరం నిర్మించారు. అసలు భక్తి తత్త్వం దేశంలో వ్యాపించింది తమిళ దేశం నుంచే. సంగం కాలానికే తమిళ వాఙ్మయంలో భక్తి కవిత్వం రూపుదిద్దుకుంది. అళ్వారులు, నాయన్మారులు, వైష్ణవ శైవ భక్తి సాహిత్యాన్ని పాటలుగా జనంలో వ్యాప్తం చేశారు. శైవ భక్తులు అరవై మూడు మంది, వైష్ణవ భక్తులు పనె్నండుగురు తమ భాషలో సాహిత్యాన్ని సృష్టి చేసి బౌద్ధ దర్శనం తరువాత తమ తాత్విక దృష్టిని దేశీయ భాష ద్వారా ప్రచారం చేశారు. పారంపరికంగా వైష్ణవ సంప్రదాయం మూడు మెట్లుగా లోకంలోకి దిగివచ్చింది. నిత్య తపస్వులైన నరనారాయణులు బదరికాశ్రమంలో గురుశిష్యులై అష్టాక్షరీ మహామంత్రాన్ని భూమి మీదికి తీసుకుని వచ్చారు. అట్లాగే, శ్రీవైకుంఠంలో అమ్మవారు మహాలక్ష్మి ద్వయ మంత్రాన్ని (రెండు వాక్యాల మంత్రం) స్వామి వల్ల పొంది తానే గురువై విష్వక్సేనాదులకు బోధించి జీవకోటిని ఉద్ధరించే ప్రయత్నం చేసింది. విష్వక్సేనుల తరువాత ఈ సంప్రదాయం నమ్మాళ్వార్ అనబడే శ్రీశఠగోపుల వల్ల అనుభవ ప్రపంచంలోకి దిగివచ్చింది. నమ్మాళ్వారులు పుట్టగానే శఠమనే వాయువును నియంత్రించటం చేత మాయావరణలోనికి ప్రవేశించకుండా జీవన్ముక్తులుగానే ఉండిపోయినారు. వారు సామాన్య శిశువుల వలె రోదించకపోవటం చేత వారిని ఒక చింతచెట్టు తొర్రలో పారవేసినారట. అక్కడే వారు పెరిగి భగవత్ ఉన్ముఖమైన చిత్తవృత్తితో నాలుగు ద్రవిడ ప్రబంధాలు నిర్మించారు. వాటిల్లో జగత్ప్రసిద్ధమైంది తిరువాయిమొజి ప్రబంధం. ఇది పది శతకాలుగా నూరు దశకాలుగా ఫలశ్రుతి పద్యంతో కలిసి పదకొండు వందల పద్యాలకు మించిన ప్రబంధం. తిరువాయిమొజి అంటే పవిత్రమైన, నోటి నుంచి వెలువడిన వాక్కు (శ్రీముఖ సూక్తి) అని అర్థం.
ఈ క్రమంలో ద్రావిడ దేశంలో వైష్ణవ భక్తి సంప్రదాయాన్ని పెంచి పోషించిన మహా భక్తులు విష్ణుచిత్తులు, తిరుప్పాణి అళ్వారులు, తిరుమంగై ఆళ్వారులు, గోదాదేవి మొదలైన వారు.
ఈ ద్రావిడ ప్రబంధం క్రమంగా కొంతకాలానికి కాలగర్భంలో కలిసిపోయింది. దానికి ఎన్నో కారణాలు చెప్తున్నారు. అయితే మధురకవి ఆళ్వారులనే వారు నమ్మాళ్వారుల ఒకానొక పాశురం దొరికితే అలాంటి గొప్ప ప్రబంధం పునః లోకంలో ఆవిష్కరించాలి అని నమ్మాళ్వారుల జన్మస్థలంలో తపస్సు చేసి వారిని ప్రార్థించి ఆ ప్రబంధాలను తిరిగి లోకంలోకి తీసుకువచ్చారు. నమ్మాళ్వారు ప్రబంధాలు ఇతర ఆళ్వారుల ప్రబంధాలు విరళంగానే చాలా కాలంగా ఉన్నాయ. అయితే ఈ ప్రబంధాల సమూహం విడివిడిగా ఉండగా దానికి ఒక పద్ధతిని ఏర్పరిచి నాలుగు భాగాలుగా చేసి నాల్ ఆయిరం (నాలుగు వేలు) అనే రచనగా తీర్చిదిద్ది వాటికి రాగతాళాలను ఏర్పరిచి దేవాలయాలలో నిత్య పఠనానికి ఆదేశించి సర్వజనులలోకి వ్యాప్తిని చేసినవారు నాథముని. ఈ నాథమునులు యోగులు సంగీత పరిజ్ఞానం ఉన్న వారు, భాషావేత్తలు, అన్నింటికీ మించి రంగనాథుని అనుగ్రహం కలవారు. నాథమునులనే రంగనాథ మునులని కూడా వ్యవహరిస్తారు. నాథమునుల మనుమలే యామునాచార్యులు. ఈ యామునాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంతానికి, దాని ప్రచారానికి చేసిన సేవ అపారమైనది. వారు ఆగమ ప్రామాణ్యం, స్తోత్రరత్నం మొదలైన రచనలు చేశారు. అద్వైత సిద్ధాంత స్థాపనం జరిగిన తరువాత ఉపనిషత్తులు ప్రతిపాదించిన జీవేశ్వర భేద భావం మళ్లీ బలపడటానికి కావలసిన సిద్ధాంత ఉపపత్తులు వారు నిర్మించారు. వారు తమ శిష్యుల ద్వారా సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ శ్రీరంగంలోనే తన జీవనాన్ని గడిపారు. యామునులు వయోభారం వల్ల ఈ సిద్ధాంతాన్ని నిర్వహించి మొత్తం దేశంలో వ్యాప్తం చేసి బ్రహ్మసూత్రాది మూడు ప్రస్థానాలకు భాష్యాలు రచించి విశిష్టాద్వైత సిద్ధాంతానికి పతాకాన్ని నిలబెట్ట గలిగిన సమర్థుల కోసం ఎదురుచూసినప్పుడు వారికి రామానుజులు అందుకు యోగ్యమైన వారుగా కనిపించారు.
రామానుజులు చెన్నై సమీపంలోని శ్రీపెరుంబుదూర్ గ్రామంలో 1017 సంవత్సరంలో జన్మించారు. తండ్రి కేశవ సోమయాజి. తల్లి కాంతిమతీ దేవి. రామానుజులకు లక్ష్మణస్వామి అనే పేరు కూడా ఉండేది. ఆయన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. మేనమామ అయిన తిరుమల నంబి ఆదేశంతో విద్యాభ్యాసం చేశారు. చురుకుగా చదువులో ముందుకుపోతూ వచ్చారు. వారు శాస్రాధ్యయనం చేయటం కోసం కాంచీపురంలోని యాదవ ప్రకాశులనే అద్వైత సిద్ధాంతి గురుకులంలో విద్యార్థిగా చేరారు. ఆనాడు ఏడు మోక్షమిచ్చే నగరాల్లో కంచి కూడా ఒకటి. అట్లాగే భారత దేశంలోని ముఖ్య విద్యాస్థానాల్లో ఒకటి కంచి. యాదవ ప్రకాశుల దగ్గర రామానుజులు దినదినాభివృద్ధిగా శాస్త్ధ్య్రాయనం చేశారు. వారి ప్రతిభ సమకాలంలో అందరి ప్రశంసలను పొందింది. యాదవ ప్రకాశులు అద్వైతంలో శ్రీ శంకరుల మాదిరి ఘోర వివర్త వాది కాదు. ఈయన పరిణామవాది. ఈ వాదం ఆధారంగా వారు తమ సిద్ధాంతాన్ని నిర్మించారు. ఆధునిక కాలంలో శ్రీఅరవిందులది పరిణామ వాదమే. అయితే యాదవ ప్రకాశుల సిద్ధాంత గ్రంథాలు ఈనాడు లభ్యం కావటం లేదు. వారి వాదనలను ఖండించిన సందర్భాల్లో తరువాత సిద్ధాంతకర్తలు ఉదహరించిన అంశాలే మనకు వారి సిద్ధాంతాన్ని గూర్చి తెలియజేస్తున్నవి. యాదవ ప్రకాశుల దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న క్రమంలో రామానుజులకు కొన్ని ఉపనిషద్వాక్యాలకు అర్థం చెప్పే సందర్భంలో గురువుగారితో భేదాభిప్రాయం కలిగింది. ‘కప్యాసం పుండరీకమేవ మక్షిణి’ అన్న వాక్యానికి అర్థం చెప్తూ యాదవ ప్రకాశులు ‘కోతి పృష్ఠం వలె ఎర్రనైన రెండు కన్నులు కలవాడు భగవంతుడు’ అని అర్థం చెప్పినారట. అప్పుడు రామానుజులు నిత్యము భగవంతుని సేవించి ఆయన రూప వైభవాన్ని భావించి అనుభవించే సందర్భంలో ఇలాంటి అర్థం వారికి ఎంతో ఆవేదన కలిగించింది. అప్పుడు భగవంతుని నేత్రములకు ఇంత నీచమైన ఉపమానం చెప్పటం సరైనది కాదని రామానుజులు దుఃఖంతో వారి వ్యాఖ్యానాన్ని కాదనగా, గురువుగారు ‘నీవైనా అర్థం చెప్పు’ అన్నారట. ‘కం పిబతీతి కపిః’ అని, కపి అనగా సూర్యుడని సూర్యుని కిరణ స్పర్శ చేత వికసించిన తామరల వంటి నేత్రములు కలవాడు అని వారు సమాధానం చెప్పారు. దీనితో యాదవ ప్రకాశులకు రామానుజుల మీద కోపం వచ్చిందిట. అందువల్ల ఆయన రామానుజులను తుదముట్టించాలని ప్రయత్నం చేశారని కాశీయాత్ర నెపంతో కొంత దూరం ప్రయాణించిన తరువాత ఆయన్ను వదిలివేశారని ఆ సందర్భంలో కోయ దంపతుల రూపంలో కంచి వరదరాజస్వామి, ఆయన దేవేరి పెరుందేవి అమ్మవారు మళ్లీ కంచిదాకా తీసుకుని వచ్చారని ఒక కథనం వ్యాప్తిలో ఉన్నది. ఇందులోని సత్యాసత్యాలు ఎలా ఉన్నా యాదవ ప్రకాశుడు వంటి దార్శనికుడు ఇలాంటి కార్యక్రమం చేస్తాడని భావించటం కష్టం. కానీ ఏదో పరిణామం వల్ల రామానుజులు ఎక్కడో తప్పిపోయి మళ్లీ కాంచీ నగరానికి చేరినట్టుగా భావించవచ్చు.
కాంచీనగరంలో వరదరాజస్వామి యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించిన వాడు కావటం వల్ల సహజమైన తాపాన్ని తగ్గించేందుకు తిరుక్కచ్చినంబి (కాంచీపూర్ణులు) నిరంతరం విసనకర్రతో వీచే ఉపచారం చేసేవారు. వరదరాజస్వామి వారికి ఎంత సన్నిహితులంటే ఏకాంతంలో అర్చావతార సమాధి విడిచి ఆయనతో మాట్లాడేవారు. అలాంటి కాంచీపూర్ణులు వైశ్యులైనా వారిని ఆశ్రయించి సంప్రదాయ రహస్యాలను తెలుసుకొమ్మని తల్లి ఆదేశించటంతో వారిని రామానుజులు గురువుగా స్వీకరించారు. రామానుజుల వారి జీవితంలో ద్రావిడ ప్రబంధముల అధ్యయనం, బ్రహ్మ సూత్రాదులైన సంస్కృత వేదాంత అధ్యయనం.. ఈ రెంటి సంగమం చేత ఒక సమన్వితమైన దృష్టి ఏర్పడింది. భగవంతుడిని భావించేప్పుడు ‘యత్ తే కల్యాణ తమం రూపం’ అని ఈశోపనిషత్ చెప్పినట్లుగా భగవంతుడిని నిరాకారుడిగా కాకుండా సర్వమంగళ స్వరూపుడిగా భావించటం ఆధ్యాత్మిక అనుభవంలో సౌందర్య దృష్టికి ప్రాధాన్యం రావటం వల్ల వారి తత్త్వం శుష్క వేదాంతం కాకుండా రసమయమై సౌందర్య అనుభవంగా రూపొందింది.
భగవంతుడి స్పర్శ కలిగితే చాలు అతడు భగవంతుడితో సమానుడే అవుతాడు అన్న బ్రహవిత్ బ్రహ్మైవ భవత్ అన్న సూక్తి తాత్పర్యంతో మనుషుల మధ్య అప్పటికే అనేక తరాలుగా సాగి వస్తున్న భేద వ్యవస్థ, కుల వ్యవస్థ మనుషుల మధ్య అంతరాలు వారికి అర్ధరహితంగా గోచరించాయి. ఒక విధంగా శ్రౌత, బ్రాహ్మణ్య సంప్రదాయానికి రామానుజులకు ఇక్కడ విభేదం కనిపిస్తుంది. బసవేశ్వరుడు రామానుజులకు కొంచెం తరువాతి సమకాలికుడైనా ఆయన భక్తి ఎంత గొప్పది అయినా వేద ప్రామాణ్యాన్ని తిరస్కరింపజేసింది. రామానుజులు వేద ప్రామాణ్యాన్ని అనుసరిస్తూనే సమాజంలోని సమతాస్ఫూర్తిని భక్తి అనే సూత్రంతో కట్టివేసి దేశానికి జీవన సమైక్య దృష్టిని ప్రసాదించారు.
రామానుజుల తరువాతి కాలంలో రామానందుడు, ఆనందతీర్థులు, లింబార్కుడు, చైతన్య మహాప్రభువు మొదలైన వారందరూ భగవదనుభవాన్ని పొందేందుకు సర్వజీవులకు ఉన్న అధికారాన్ని నొక్కి చెప్పారు. ఇంతకు ముందు పేర్కొన్న కప్యాసం మొదలైన శ్రుతిలో అచ్ఛిణి శబ్దం రెండు కన్నులను చెప్తున్నది. పరదేవతగా శివాది దేవతలను భావించే వారికి ఈ అక్షిణి శబ్దం కేవల నారాయణపరమై ఇబ్బందిని కల్గిస్తుంది.
రామానుజులు కాంచీపురంలో జ్ఞాన అనుష్ఠానాలను పెంపొందించుకుంటూ వరదరాజస్వామికి అభిషేకానికి జలాన్ని అందిస్తూ ఉన్న రోజుల్లో అక్కడికి విచ్చేసిన యామునాచార్యుల వారి కంట పడ్డారు. ఆజానుబాహువు విశాల నేత్రములు కలిగిన రామానుజులలో వారికి భావి వైష్ణవ ధర్మ ప్రతిష్ఠాపకులు గోచరించారు. దైవ వశాత్తూ వారిద్దరూ అక్కడ కలుసుకోవటం జరగలేదు. కానీ, వారు శ్రీరంగం చేరిన తరువాత రామానుజులను తీసుకుని రమ్మని తమ శిష్యులలో ఒకరైన మహానంబిని పంపించారు. రామానుజులు తాము స్వయంగా బయలుదేరి శ్రీరంగానికి చేరుకునే సరికి యామునులు దేహత్యాగం చేశారు. వారి చివరి కోరికను గూర్చి వారి శిష్యబృందం రామానుజులకు తెలియజేసింది. 1. బ్రహ్మసూత్రాలకు బోధాయన వృత్తిని అనుసరించి భాష్యం నిర్మించటం. 2. విష్ణుపురాణాన్ని అనుగ్రహించిన పరాశరులకు కృతజ్ఞతగా వారికి గౌరవ స్థానాన్ని కల్పించటం. 3. శ్రీశఠగోపుల తిరువాయి మొజి ప్రబంధాన్ని దాని తాత్పర్యాన్ని సామాన్య ప్రజల్లో పరివ్యాప్తం చేయటం. రామానుజులు వెంటనే చరమ వారి శరీరం దగ్గర పరమగురువులైన యామునుల కోరికలను నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేశారు.
రామానుజుల జీవితం ఈ ప్రతిజ్ఞలను పూర్తి చేయటం కోసం అనేకులైన గురువులను ఆశ్రయించి సాధన చేయవలసి వచ్చింది. ఒకరి దగ్గర పంచసంస్కారాలను ఇంకొకరి దగ్గర రామాయణ రహస్యాలను, మరొకరి దగ్గర భగవద్విషయాన్ని, మరొకరి దగ్గర గీతాసారాన్ని అధ్యయనం చేశారు. పంచసంస్కారాలు పొందే సందర్భంలో మహాపూర్ణులనే గురువు సులభంగా వారికి ఆ సంస్కారాలను ప్రసాదించలేదు. పద్ధెనిమిదిసార్లకు వారి మనస్సులో ఉన్న దృఢ నిశ్చయాన్ని గ్రహించి వారికి మంత్రోపదేశం చేశారు. ఆ మంత్రోపదేశం చేసిన సందర్భంలో ‘ఇది మోక్ష ప్రదాయకమైన మహా మంత్రం, సామాన్యులెవరికీ ఉపదేశించరాదు, అందువల్ల ఇది దురుపయోగం అవుతుంది అయితే నా మాట తప్పి నీవు ఇతరులకు ఉపదేశిస్తే (అనధికారులకు) నీకు నరకం వస్తుంది’ అని చెప్పారు. కానీ రామానుజులు విశ్వమంత విశాల హృదయం కలవారు. సర్వజీవకోటి చైతన్యాన్ని తామే స్వాయత్తం చేసుకున్నారు. ఎక్కడ చూసినా వారికి భగవత్ తత్త్వమే తప్ప మరొక అంశం దర్శనమివ్వలేదు. అందువల్ల సర్వజీవులకు మోక్షం కలిగించే ఆ మంత్రాన్ని అందరికీ ఉపదేశించి గురువుల ఆజ్ఞను తిరస్కరించినందులకు తాను నరకం చేరినా పరవాలేదని భావించారు. ఆ నిశ్చయంతోనే గోపురం ఎక్కి అందరినీ చేరువగా పిలిచి మోక్షమిచ్చే ఈ మంత్రాన్ని మీరు స్వీకరించండి అని సర్వ జనులకు ఆ గుప్త రహస్య విద్యను ఉపదేశించారు. తరువాత గురువులకు కొంచెం కోపం వచ్చి ఎందుకు తమ ఆజ్ఞను తిరస్కరించవలసి వచ్చింది అని అడిగారట. అందుకు రామానుజుల వారు ‘అయ్యా ఇన్ని వేలమందికి మోక్షం కలిగించిన ఈ మంత్రోపదేశం, మీ ఆజ్ఞను తిరస్కరించినందువల్ల నా ఒక్కరికి నరకం వస్తే నష్టమేమి?’ అన్నారు. వారిలోని సర్వజీవ కారుణ్యాన్ని చూసి గురువులే అబ్బురపడి కౌగిలించుకుని ప్రశంసించారు.
ఒక సందర్భంలో రామానుజులు తమకు కొన్ని సందేహాలు కలిగి వాటిని వరదరాజస్వామి ద్వారా తెలుసుకొమ్మని కాంచీపూర్ణులను అభ్యర్థించారు. వారు ఏకాంతంలో వరదరాజస్వామిని రామానుజుల ప్రశ్నను అడుగగా స్వామి ఆరు సమాధానాలను ఇచ్చారు.
1. నేనే (శ్రీమన్నారాయణుడు) పరతత్త్వం.
2. జీవేశ్వరులకు భేదమే తత్త్వం
3. ప్రపత్తి మార్గమే ఉపాయం
4. నా భక్తులైన వారు ప్రాణ ప్రయాణ సమయంలో నన్ను స్మరించకున్నా అతణ్ణి నేనే స్మరించి
మోక్షాన్నిస్తాను.
5. మోక్ష ప్రాప్తి శరీరం విడిచిపెట్టినప్పుడే
కలుగుతుంది.
6. రామానుజులు మహాపూర్ణులను ఆచార్యులుగా ఆశ్రయించాలి.
క్రమంగా రామానుజులు శ్రీరంగంలో యామునుల తరువాత వైష్ణవ పీఠాన్ని అధిష్ఠించారు. అనేక రచనలు కొనసాగించారు. బ్రహ్మసూత్రభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపం, వేదార్థ సంగ్రహం, గీతాభాష్యం, గద్యత్రయం, నిత్య గ్రంథము వారి రచనలు. వారి బ్రహ్మసూత్ర భాష్యాన్ని శ్రీ్భష్యమని పేర్కొంటారు. ఈ గ్రంథాలలో ఉపనిషత్ భాష్యం కనిపించకపోయినా వారి వేదార్థ సంగ్రహం అనేక ఆధికారిక ఉపనిషత్తులను తడుముతూ సిద్ధాంతాన్ని స్థాపించేట్టుగా ఉన్నది.
భగవద్రామానుజులు గ్రంథ రచన చేస్తూనే భారత దేశమంతా ఆసేతు శీతాచలం పర్యటించారు. ప్రతివాదులను జయించి తమ సిద్ధాంతాన్ని స్థాపించారు. ఈ సందర్భంలో వారు కాశ్మీరం, బదరికాశ్రమం కూడా వెళ్లారు. కాశ్మీరానికి వెళ్లినప్పుడు శారదాపీఠంలో దాచి ఉంచిన బ్రహ్మ సూత్రాలకు బోధాయన వృత్తి కావలసి వచ్చింది. ఆ పీఠాధిపతులు దాన్ని ఎవరికీ ఇవ్వమని అక్కడే ఉండి చదువుకోవాలని నియమం పెట్టారు. రామానుజుల శిష్యులలో ఒకరైన కూరేశులు ఆ గ్రంథాన్ని ఒకసారి తిప్పిచూసి ఏకసంథాగ్రాహులై తరువాత స్వామివారికి ఏ సన్నివేశంలో ఏ వాక్యం కావలసి వచ్చినా అప్పజెప్పినారు.
ఈ యాత్రలోనే తిరుపతిలో స్వామిని వేంకటేశ్వరుడని నిరూపించటం జరిగింది. ముదలాళ్వారుల సంకీర్తనలలో స్వామి వైభవం నారాయణుడిగా కీర్తింపబడింది. ఆ రచనలు అప్పటికే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వము వాటిని అట్లాగే అనేక ఆలయాల్లో అర్చనావిధానంలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. పూరీలో జగన్నాధ క్షేత్రం వెళ్లినప్పుడు అక్కడ అర్చనావిధానంలో స్వామి పాంచరాత్రాన్ని ప్రవేశింపచేయనెంచినప్పుడు స్వామి కలలో రెండు రాత్రుళ్లు కన్పించి అప్పటి విధానం అలాగే ఉంచమని చెప్పినా రామానుజులు సంకల్పం మార్చుకోలేదట. అప్పుడు జగన్నాధస్వామి గరుడుని పిలిచి తెల్లవారేసరికి రామానుజుల వారిని తమ తల్పంతో సహా శ్రీకూర్మంలో ప్రవేశపెట్టవలసిందిగా ఆదేశించినట్లు ఒక కథనం వ్యాప్తిలో ఉంది.
రామానుజులు స్వయంగా విద్వాంసులు మాత్రమే కాదు, ఆయన వచనం భక్త్భివ భరితమైంది. గద్యత్రయం ఆయన కవితాశక్తికి గొప్ప ఉదాహరణ. భగవంతునిమీద ఆయనకు ఉన్న ప్రేమను, శరణాగతిని సర్వ సమర్పణను అద్భుతంగా వ్యక్తం చేస్తుంది. తరువాత దేశభాషల్లో వచ్చిన పోతన నృసింహావతార ఘట్టం వంటి వాటికి రామానుజుల గద్యత్రయం ఒజ్జబంతి వంటి రచన.
రామానుజులు తమ సిద్ధాంత వ్యాప్తికి మూడు స్థాయిల్లో సంస్కరణలు ప్రవేశపెట్టారు. శ్రీరంగం, తిరుపతి, కంచి క్షేత్రాలలో అర్చనలు, ఉత్సవాలు, సేవలు ఎలా జరగాలో నిర్ణయం చేశారు. కోయిల్ ఒళుగు అనే గ్రంథం శ్రీరంగంలో జరిగే ఉత్సవాలను చెప్తుంది. ఈనాటికీ దాని ప్రకారమే ఉత్సవాలు నడుస్తున్నవి.
ధనుర్దాసు అనే ఒక మల్లయోధుడు భార్యానేత్ర సౌందర్య మోహంలో ఉండగా, అతనికి రంగనాథుని నేత్ర సౌందర్యం చూపి మహాభక్తుని చేసినారు. మూగవారిని, గ్రుడ్డివారిని అనుగ్రహించి మోక్షం ఇచ్చారు.
రామానుజులు సుమారు 70 సంవత్సరాల కాలంలో ఉండగా తమిళదేశాన్ని కుళోత్తుంగ చోళుడు పరిపాలిస్తున్నాడు. ఆయన శైవమత పారమ్యాన్ని తప్ప మరొకటి అంగీకరించేవాడు కాడు. శైవమతం అంగీకరించని వాళ్లను ఆయన పలురకాలుగా ఇబ్బంది పెట్టేవాడు. ఒకసారి రామానుజులను ఆయన పిలిపించగా కూరేశుడు, పెరియనంబి కాషాయ వస్త్రాలు ధరించి రామానుజుల వారి వలెనె అక్కడికి చేరుకున్నారు. ఈ ఇద్దరూ రాజు ఆజ్ఞను అంగీకరించక తిరస్కరించారు. రాజు వారి కళ్లను పెకిలించబోగా వారే తమ చేతి గోళ్లతో కళ్లు పెకిలించుకున్నారు. ఈ ఉపద్రవ పరిస్థితుల్లో రామానుజులు మైసూరు వెళ్లారు. అక్కడ రాజుని వైష్ణవుడిగా మార్చి అనేక దేవాలయాలను నిర్మించారు. విమతస్కులు అపహరించిన మేల్కోటే లోని శ్రీసంపత్కుమార స్వామి విగ్రహాన్ని అంత్యజుల సహాయంతో మరల సంపాదించారు. ఆ సందర్భంలో తనకు సహాయం చేసిన అంత్యజులకు దేవాలయంలో ప్రవేశము, ప్రసాద స్వీకరణ, ఉత్సవాల్లో భాగస్వామ్యం కల్పించారు. శ్రీరంగనాథుడి దేవాలయంలో కూడా ఈ సన్నివేశానికి గుర్తుగా బీబీ నాంచారుకు ప్రత్యేక సన్నిధి ఉన్నది. కుళోత్తుంగ చోళుడి రాజ్య పరిపాలన ముగిసి తమిళనాడులో శాంతి నెలకొన్న సందర్భంలో శ్రీరంగంలోని భక్తులు రామానుజులను తిరిగి రమ్మని కోరుకున్నారు. అప్పటికి ఆయన వయసు 90 సంవత్సరాలు దాటింది. మేల్కోటేలోని భక్తులు ఆ విషయాన్ని సులభంగా అంగీకరించలేదు. అప్పుడు రామానుజులు స్వయంగా తమకని ఒక దేవాలయం నిర్మించి తమ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. అక్కడి భక్తులకు అది చాలా తృప్తి కలిగించిన విషయం. తరువాత వారు శ్రీరంగం చేరుకున్నారు. 30 సంవత్సరాలు శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని, విశిష్టాద్వైత తత్త్వాన్ని నిరంతరంగా వ్యాపింపజేయటానికి అష్టదిగ్గజముల వ్యవస్థను ఏర్పాటు చేశారు. డెబ్భైనలుగురు సింహాసనాధీశులను ఏర్పాటు చేశారు. ఏడు వందలమంది ఏకాంగీ యతులను ప్రచారానికి ఒక వ్యవస్థగా ఏర్పరిచారు. భగవద్రామానుజులు వింశోత్తర శతి క్రమం (120)లో సంపూర్ణ జీవితం, లోకాన్ని అనుగ్రహించటం కోసం ప్రతి క్షణాన్ని ధారపోసే జీవితం అనుభవించారు. బలరాముడి తమ్ముడైన శ్రీకృష్ణుడివలె ఈ రామానుజులు కూడా 120 సంవత్సరములు ఈ భూమి మీద చరించారు. మనిషికి, భగవంతుడికి, ప్రకృతికి మధ్య ఉండవలసిన సంబంధాన్ని విశిష్టమైన ఏకరూపంగా నిర్ణయించి భేదాన్ని, అభేదాన్ని గంగాయమునల వలె తమ తత్త్వ నిర్మాణంలో సంగమింపజేశారు.

- కోవెల సుప్రసన్నాచార్య