ఈ వారం స్పెషల్

నగదు వద్దు... ఈ-మనీ ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రెండు విజయాలు!

ఎమ్-పెసా

కెన్యాలో ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టేందుకు ఉపకరిస్తున్న ఓ మొబైల్ వ్యాలెట్ సంస్థ. ఇది ఆ దేశంలో ప్రతి ఇంటికి పరిచయమే. ప్రతి వ్యక్తికి పరిచయమైపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే అది వారి జీవితంలో ఓ భాగమైపోయింది. పాలు కొనుక్కోవాలన్నా... ఓ చాక్లెట్ కొనుక్కోవాలన్నా ఈ మొబైల్ ద్వారా చెల్లించి కొనుక్కోవచ్చు. అందుకోసం ఎక్కడికక్కడ ఆ సంస్థ దుకాణాలు తెరిచింది. ప్రతి ఒక్కరికి అక్కౌంట్ ఓపెన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. 2007 నుంచి ఈ సంస్థ సేవలు అందిస్తోంది. అక్కడి ప్రభుత్వం దానికి మద్దతు ఇచ్చింది. ‘సఫారీ.కామ్’ ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో ఇది అందుబాటులోకి వచ్చింది. 2008 నాటికి 2.7 మిలియన్ ఖాతాదారులు, 3వేలమంది ఏజెంట్లతో సేవలందించిన ‘ఎమ్-పెసా’ ఇప్పుడు 14.6 మిలియన్ల మంది ఖాతాదారులతో పనిచేస్తోంది. సెకనుకు 80 లావాదేవీలు నిర్వహిస్తోంది. ఆ దేశ స్థూల జాతీయోత్పత్తిలో 31శాతం వాటా ఈ ఒక్క సంస్థ చెల్లింపులతో లభ్యమవుతోంది. 33.62 బిలియన్ల యుఎస్ డాలర్ల మొత్తం లావాదేవీలు నిర్వహిస్తోంది. ఇదంతా కేవలం మొబైల్ బ్యాంకింగ్‌తోనే. పెద్ద విజయం కదా!. అందుకే నైజీరియా సహా ఎన్నో దేశాలు, అక్కడి ప్రభుత్వాలు ‘ఎమ్-పెసా’ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని కొత్తకొత్త విధానాలను అమలు చేస్తున్నాయి.

పేటిఎమ్

ఎటిఎమ్‌లను మనం డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికే వాడతాం. భారత్‌లో ఎక్కువగా వాడేది అందుకే. కానీ ఎటిఎమ్‌లు ఎన్నో సేవలు అందిస్తాయి. క్యాష్‌లెస్ విధానాల వల్ల ఎటిఎమ్‌ల నిర్వహణ, కరెన్సీ ముద్రణ, తరలింపు, బ్యాంకులలో భద్రత ఏర్పాట్లు, వసతి సమస్య అన్నీ తీరిపోతాయి. డబ్బుకు లెక్క దొరుకుతుంది. క్యాష్‌లెస్ విధానాలకు ఆదరణ అందుకే. ఇటీవల మనదేశంలో పెద్దనోట్ల రద్దుతో ఈ-మనీ చెల్లింపులు విస్తృతంగా పెరిగాయి. మొబైల్ వాలెట్ సేవలు అందిస్తున్న ‘పేటిఎమ్’కు లభించిన ఆదరణే అందుకు ఉదాహరణ. నామమాత్రపు లావాదేవీలు నిర్వహించిన పేటిఎమ్, పెద్దనోట్ల రద్దు తరువాత సగటున రోజుకు 70 లక్షల చొప్పున ట్రాన్సాక్షన్స్‌తో 120 కోట్ల రూపాయల మేర లావాదేవీలు నిర్వహించింది. ప్రస్తుతం ఈ సంస్థలో 150 మిలియన్ల మంది ఖాతాదారులున్నారు. విజయ్‌శంకర్ శర్మ సారథ్యంలో పనిచేస్తున్న పెటిఎమ్, ఎమ్‌వాలెట్ సేవలు అందించేందుకు ఆర్‌బిఐ కూడా అనుమతి ఇచ్చింది. మున్ముందు ఎక్కడికక్కడ వీటి దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. 2015లో 8 ట్రిలియన్ రూపాయల లావాదేవీలు నిర్వహించిన ఈ సంస్థ 2021 నాటికి 2000 ట్రిలియన్ రూపాయల లావాదేవీలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
.................................
నగదు...
చాలా దేశాల్లో ఇప్పటికీ రారాజే..
కానీ ఆ పీఠం ఎంతో కాలం ఉండేలా కనిపించడం లేదు..
ఎందుకంటే ‘నగదు’ వద్దంటోంది ఈ లోకం..
‘ఈ-మనీ’కి అలవాటు పడుతున్న కొత్తప్రపంచం నగదు వద్దుకాక వద్దంటోంది. నెమ్మదిగా నాణాలు, కరెన్సీని వదిలించుకుంటోంది..
ఈ- మనీతో మూడోకంటికి తెలీకుండా ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకోవడంలో భద్రత, సౌలభ్యం, వ్యయప్రయాసలు తగ్గడం ఈ ఆకర్షణ, ఆదరణకు కారణం.

ప్రపంచంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికాలోను..
ఈ విశ్వంలో అతి పేదదేశమైన కెన్యాలోను..‘ఈ-మనీ’దే కీలకపాత్ర. పెద్దాచిన్నా తేడా లేదు. కేవలం అవగాహన, వౌలిక సదుపాయాలు ఉంటే చాలు నగదురహిత సమాజంలో బతకడం చాలా ఈజీ. ఇది ఇప్పటికే చాలా దేశాల్లో రుజువైంది. అయితే అది దశలవారీగానే సాధ్యం. ప్రస్తుతం ‘క్యాష్‌లెస్ ఎకానమీ’లో దాదాపు 90శాతం వరకు ప్రగతి సాధించిన స్వీడన్ కూడా ఏళ్లతరబడి చేసిన కృషితోనే ఈ స్థాయికి చేరింది. సరే..మన విషయానికి వద్దాం!
నిన్నగాక మొన్న ప్రధానమంత్రి కార్యాలయంలో గుట్టుచప్పుడు కాకుండా ఓ భేటీ జరిగింది. దాదాపు 700 మంది హాజరయ్యారు. అందరూ కార్యాలయ సిబ్బందే. వారందరికీ- ఇకముందు ఆర్థిక వ్యవహారాలన్నీ నగదు రహితంగానే నడపాలన్నది ఓ ఆలోచన. అందుకు తగిన అవగాహన, అందుబాటులో ఉన్న ఏర్పాట్లు, సాంకేతిక నైపుణ్యం కల్పించుకోవడం వంటి అంశాలపై సీరియస్‌గానే చర్చించారు. మరోవైపు క్యాష్‌లెస్ చెల్లింపులను ప్రోత్సహించే విధివిధానాల రూపకల్పన, ప్రచారం ఇతర కార్యక్రమాలను రూపొందించేందుకు ఓ ముఖ్యమంత్రుల కమిటీ సిద్ధమైంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా చాలామంది నగదురహిత ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు మద్దతు ఇస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కొన్ని సంస్థలు తాయిలాలూ ప్రకటిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు తరువాత దేశంలో ఆర్థిక వ్యవహారాలపై సగటు పౌరుడు కూడా ఏదోఒక అంశంపై తన అభిప్రాయాలను చెబుతున్నాడు. చర్చలో పాల్గొంటున్నాడు. టెక్నాలజీ పాత్ర, ఔచిత్యాన్ని తెలుసుకుంటున్నాడు. వౌలిక వసతుల లేమి, సంప్రదాయాలు, అక్షరాస్యత తగినంతగా లేకపోవడం అనే సమస్యల ప్రభావం ఉన్నా ఇప్పుడిప్పుడే సగటు భారతీయుడు ‘కొత్త తరహా’ విధానాలకు అలవాటుపడాల్సిన అవసరాన్ని నెమ్మదిగా గుర్తిస్తున్నాడు.
నగదు రహితమంటే..
ఆర్థిక వ్యవహారాల్లో నగదుదే కీలక పాత్ర. ఆధునిక సమాజంలో నాణాలు చాలా కాలం నుంచే చలామణిలో ఉన్నాయి. సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితం పేపర్ కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. వస్తుమార్పిడి విధానం తరువాత లావాదేవీలన్నీ నగదుతోనే జరిగేవి. అయితే గడచిన రెండుమూడు దశాబ్దాలుగా, ముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగం విస్తృతమయ్యాక నగదుకు చెల్లుచీటీ పాడటం మొదలైంది. డెబిట్, క్రెడిట్ కార్డులతో ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టడం మొదలైంది. తాజాగా మొబైల్ ఫోన్లు, ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు వచ్చాక మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జరిగే ప్రక్రియ విస్తృతమైంది. నగదుతో సంబంధం లేకుండా క్రయవిక్రయాలు సాఫీగా సాగిపోవడం సాధారణమైపోయింది. దీంతో నగదును ఇంట్లో దాచుకోవలసిన అగత్యం లేకపోయింది. ఇలా నగదు చెల్లింపులు లేకుండా ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోవడానే్న క్యాష్‌లెస్ ఎకానమీ అంటున్నారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలన్నీ ‘ఈ-మనీ’తో అంటే క్యాష్‌లెస్ విధానాలతో నిర్వహించుకునే దిశగా పలు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు మనం తొలి అడుగు వేస్తున్నాం.
స్వీడన్ నుంచి కెన్యా వరకు..
ప్రపంచంలో క్యాష్‌లెస్ ఎకానమీకి కనుచూపు దూరంలో స్వీడన్ ఉంది. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో 90 శాతానికి పైగా ‘ఈ-మనీ’ పద్ధతిలోనే సాగుతున్నాయి. అక్కడ నగదుతో ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టడం కేవలం 5 నుంచి 8శాతం లోపే. అదీ ప్రభుత్వ శాఖల వరకూ మాత్రమే. అక్కడ బస్సు టిక్కెట్ల నుంచి తినుబండారాల వరకు అన్ని చెల్లింపులూ ‘ఈ-మనీ’తోనే. 2020 నాటికి నూటికి నూరుశాతం క్యాష్‌లెస్ ఎకానమీ కలిగిన దేశంగా నిలిచేందుకు స్వీడన్ ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది. ఆ దేశంలో ఆరు లీడ్‌బ్యాంకులు క్యాష్ ట్రాన్సాక్షన్స్‌ను నిరాకరిస్తున్నాయి. 1600 బ్యాంకు శాఖల్లో 900 చోట్ల నగదు చెల్లింపులు లేవు. ఏటీఎమ్‌ల సంఖ్యను క్రమంగా తగ్గిస్తున్నారు. 2009లో దేశంలో 106 బిలియన్ల స్వీడిస్ ‘క్రోన’లు ఉంటే 2014 నాటికి వాటిని 80 బిలియన్లకు తగ్గించారు. ప్రస్తుతం జిడిపిలో 3 శాతం నగదు లావాదేవీలు నిర్వహిస్తున్న స్వీడన్ మరో మూడేళ్లలో కేవలం 0.5 శాతం ఉండేలా చూడాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ- మనీ నిర్వహణలో ప్రథమ స్థానంలో నిలిచింది. డొనేషన్ల స్వీకరణ దగ్గరి నుంచి ఏ చెల్లింపులైనా కార్డు లేదా మొబైల్ ద్వారానే నిర్వహించడం అక్కడివారికి తప్పనిసరి. అంతెందుకు..? ఆఫ్రికాలో అత్యంత నగదు వద్దు.. పేద దేశమైన కెన్యాలో చిన్నపిల్లల పెన్సిల్ లేదా పెన్ను, పొద్దునే్న కొనే పాలు, తినుబండారాలు, చివరకు ఫోన్ రీఛార్జ్...ఇలా అన్నీ ‘మొబైల్’ ద్వారానే చక్కబెడుతున్నారు. నిజానికి మనకన్నా పేదరికం, నిరక్షరాస్యత, వౌలిక సదుపాయాల లేమితో బాధపడుతున్న కెన్యాలో ఎన్నో దేశాలకంటే మిన్నగా ‘మొబైల్ ఫోన్ల’లో ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కాదుకాదు.. ఈ విషయంలో కెన్యా ఎన్నో దేశాలకు మార్గదర్శిగా నిలిచింది. నైజీరియాదీ అదే దారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అతిపెద్దదైన అమెరికాలోనూ ‘క్యాష్‌లెస్’ విధానాలకు ఆదరణ పెరుగుతోంది. అక్కడ 80 శాతం మంది ‘ఈ-మనీ’తో పనులు చక్కబెడుతున్నారు. 72శాతం మందికి డెబిట్ కార్డులున్నాయి. బెల్జియంలో 93 శాతం, ఫ్రాన్స్‌లో 92 శాతం, కెనడాలో 90 శాతం, యుకెలో 89 శాతం, స్వీడన్‌లో 89 శాతం, ఆస్ట్రేలియాలో 86 శాతం, నెదర్లాండ్స్‌లో 85 శాతం, జర్మనీలో 76 శాతం, సౌత్ కొరియాలో 70 శాతం ట్రాన్సాక్షన్స్ నగదురహితంగానే నిర్వహిస్తున్నారు. ఈ పది దేశాలూ క్యాష్‌లెస్ ఎకానమీ దిశగా ముందంజలో ఉన్నాయి. స్వీడన్‌లో క్యాష్‌లెస్ విధానాలకు ఆదరణ పెరిగిన తరువాత ఇళ్లలో నగదు నిల్వలు లేకుండా పోయాయి. 2008లో స్వీడన్‌లో నగదు కోసం 110 దోపిడీ దొంగతనాలు జరిగితే గతేడాది దోపిడీలు కేవలం పదహారు మాత్రమే జరిగాయి. అయితే సైబర్ నేరాలు కొద్దిగా పెరిగాయి.
మన దేశంలో..
నల్లధనాన్ని నిరోధించేందుకు, వెలికితెచ్చేందుకు కేంద్రప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పెద్దనోట్లను రద్దు చేసింది. నెమ్మదిగా నగదురహిత ఆర్థిక వ్యవస్థవైపు అడుగులు వేసేందుకు సిద్ధమైంది. మానసికంగా, సాంకేతికంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం లోకి వచ్చాక ‘ఈ-కామర్స్’కు ఆదరణ పెరిగినమాట వాస్తవమే. కానీ, 125 కోట్ల జనాభాతో ఉన్న భారత్‌లో అందుకు తగ్గ రీతిలో అడుగులు పడటం లేదు. పెద్దనోట్ల రద్దుతరువాత అనూహ్యంగా మొబైల్ చెల్లింపులు పెరిగాయి. ఇది ప్రభుత్వాన్ని ఆశ్ఛర్యపరిచింది. అవసరాలకు తగ్గట్లు ప్రజలు మారతారన్నది దీనితో రూఢీ అయ్యింది. ఇప్పుడు క్యాష్‌లెస్ విధానానికి అలవాటు పడేలా చేయాలన్నది కేంద్రం ఆలోచన. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అందుకు సై అంటున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ కార్యకలాపాలు, స్వల్పస్థాయిలో మొబైల్ ఫోన్లలో చెల్లింపులు జరుపుతున్నప్పటికీ దీనిని విస్తృతం చేయాలన్నది ఇప్పుడు కేంద్రం ఆలోచన. అయితే ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాకపోవచ్చు. కానీ దశలవారీగానైనా సాధించాలంటే ఇప్పుడు అడుగువేయక తప్పదు. చిన్నచిన్న దేశాలు ఉత్సాహంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ఆర్థికంగా సత్ఫలితాలు సాధిస్తూంటే సంప్రదాయ చక్రబంధంలో ఇరుక్కుపోవడం సరికాదు. ప్రజల ఆలోచనల్లోనూ మార్పుమొదలవుతోంది. గడచిన పదిపదిహేను రోజుల్లో జరిగిన పరిణామాలే ఇందుకు ఉదాహరణ.
ఇవీ సమస్యలు..
ఆధార్ అనుసంధాన కార్యక్రమానికి రూపకర్త, బిలియనీర్ అయిన నందన్ నిలేకని కూడా ‘క్యాష్‌లెస్’ విధానానికి మద్దతు తెలిపారు. అయితే నగదును నిల్వచేసుకునే సంప్రదాయ భారతీయ విధానం ఒక్కసారిగా రాత్రికి రాత్రి మారిపోవడం సాధ్యం కాదు. బ్యాంకింగ్ వ్యవస్థ ఇంకా గ్రామీణ భారతానికి చేరువ కాలేదు. దేశంలో సగం మందికి ఇంటర్నెట్ అందుబాటులో లేదు. అక్షరాస్యత కూడా అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో టెక్నాలజీపై అవగాహన, నిర్వహణలో నైపుణ్యం, జాగ్రత్తలు తీసుకోవడం అన్నది సగటు భారతీయుడికి అంత సులభం కాదు. ఒక్కసారిగా ‘ఈ-మనీ’ వ్యవహారాలపై పట్టు సాధ్యం కాదు. ఇందుకు తగిన శిక్షణ, ప్రచారం, ప్రోత్సాహం అవసరం. ఎంతో పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న అమెరికాలో ఇప్పటికీ 8శాతం మందికి ఇంటర్నెట్ అందుబాటులో లేదు.
యాప్స్ హవా
ఇంటర్నెట్ వచ్చాక ‘నెట్ బ్యాంకింగ్’కు ఆదరణ పెరిగింది. మనదేశంలో ఇప్పుడు ఇది పుంజుకుంది. స్మార్ట్ఫోన్లు వచ్చాక ‘మొబైల్ బ్యాంకింగ్’ అనుకున్నంత వేగంగా పుంజుకోలేదు. కెన్యాలో దాదాపు 90 ఆర్థిక లావాదేవీలు కేవలం మొబైల్ బ్యాంకింగ్‌తోనే జరిగిపోతున్నాయి. అక్కడ ‘ఎమ్-పెసా’, మనదగ్గర ‘పేటిఎమ్’, యాపిల్ పే, వెనోమ్, బంగ్లాదేశ్‌లో బి-కాష్ వంటి యాప్‌లు, మొబైల్ బ్యాంకింగ్ సంస్థలు ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2009లో మూడింట రెండువంతులు నగదు లావాదేవీలు సాగిన కెన్యాలో ఇప్పుడు 80శాతం మొబైల్ బ్యాంకింగ్‌లోనే సాగిపోతున్నాయి. జీతాల చెల్లింపుల దగ్గరినుంచి చాక్లెట్ కొనుగోలు వరకు అన్నీ మొబైల్ ఫోన్లలోనే. అక్షరాస్యులు, నిరక్షరాస్యులన్న తేడా లేదు. అందరికీ ఈ- మనీ వ్యవహారాలపై పట్టు వచ్చేసింది. పరిస్థితులు, అవసరాలు వారికి ఈ విద్యను నేర్పాయి. ఇక మనదేశంలో అదేమీ పెద్దసమస్య కాబోదు. దొంగ డబ్బు నిల్వ సాధ్యం కాకపోవడం, ప్రతిపైసా ఆర్థిక వ్యవస్థలో ఉపయోగపడటం దీనివల్ల సాధ్యం. కెన్యా, నైజీరియా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఈ-మనీ వ్యవహారాలకు వచ్చిన సమస్య అల్లా ఒకటీరెండూ మాత్రమే. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సౌకర్యాలు లేకపోవడం. దీనివల్లే నూటికి నూరుశాతం ఫలితాలు సాధ్యం కావడం లేదు.
ఆసక్తికర ఫలితాలు
భారత్‌లో నగదు మాయం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పవచ్చు. స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఈ నమ్మకం ఏర్పడింది. మొబైల్ చెల్లింపులు పెరిగాయన్నది అంచనా. 2020 నాటికి 500 బిలియన్ డాలర్ల మొత్తం డిజిటల్ చెల్లింపులద్వారా సాగుతుందని ఓ అంచనా. ఇది ఇప్పటికంటే పదిరెట్లు ఎక్కువ. గూగుల్ ఇండియా, ద బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఈ విషయాన్ని వెల్లడించాయి. మనదేశంలో 102 కోట్లమందికి బ్యాంక్ ఎకౌంట్లు లేవు. మహిళల్లో 80 శాతం మందికి బ్యాంకు అకౌంట్లు లేవు. గతేడాది మన దేశంలో 78 శాతం చెల్లింపులు నగదురూపంలోనే జరిగాయి. అదే యుకె, యుఎస్‌లలో 20శాతం లోపే. 2025 నాటికి ఇది నగదు లావాదేవీలు 40శాతానికి తగ్గుతాయని అంచనావేస్తున్నారు. వ్యక్తిగత ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు భారత్‌లో ఆదరణ ఎక్కువగా ఉంది. ఇది ఆశలు రేపుతోంది. నగదు చెల్లింపులకు కొత్తగా యాప్స్ రావడం, వాలెట్ విధానాలను వివిధ టెలికమ్ కంపెనీలు తీసుకురావడం కొత్త పరిణామం. పేటిఎమ్, ఒన్97, ఎయిర్‌టెల్, ఒడాఫోన్ వాలెట్ ఆఫర్లు, మొబిక్విక్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. కిరాణా దుకాణాల్లో కొనుగోళ్లకు కూడా వీటిద్వారా చెల్లింపులు జరిపే వీలుంది. ఇప్పటికే సినిమా, బస్సు, రైలు, విమాన టిక్కెట్ల కొనుగోలు చేస్తున్న జనం మునుముందు ఇతర చెల్లింపులనూ వీటిద్వారా చేయడం నేర్చుకుంటారు. కొత్త ప్రపంచంలో అవసరాలు మనిషికి కొత్త విషయాలను నేర్పుతాయి. ఇప్పుడు మనం నేర్చుకోవలసిన స్థితిలో ఉన్నామన్నమాట. *

-ఎస్.కె.రామానుజం