రాష్ట్రీయం

రోజా సస్పెన్షన్ నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీ హాజరుకు లైన్ క్లియర్
ఎమ్మెల్యే ప్రవర్తనకు ఇది కితాబుకాదు
స్పీకర్‌కూ వ్యతిరేకం కాదు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఇరకాటంలో పడిన ప్రభుత్వం
పార్టీ పెద్దలతో బాబు భేటీ
హైకోర్టు ఫుల్‌బెంచ్‌కు వెళ్లాలని నిర్ణయం
నేడు సభకు హాజరుకానున్న రోజా
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జగన్ వ్యూహం

వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో గురువారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రోజా అసెంబ్లీకి హాజరుకావచ్చునని పేర్కొంది. అసెంబ్లీ 340వ నిబంధనకు విరుద్ధంగా తీర్మానం చేశారని పేర్కొంటూనే కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచుతూ సస్పెన్షన్‌ను మాత్రం ఎత్తివేస్తున్నామని వివరించింది. డిసెంబర్ 18న ఆమె అసెంబ్లీలో వ్యవహరించిన తీరు సక్రమమేనని చెప్పినట్టుగా తమ ఆదేశాలను భావించరాదని తెలిపింది. మరోవైపు ఈ మధ్యంతర ఉత్తర్వులు స్పీకర్‌కు గానీ, అసెంబ్లీ అథారిటీకి గాని వ్యతిరేకం కావని వివరించింది. ఇదిలాఉంటే, హైకోర్టు ఉత్తర్వుల అనంతరం అధికార, విపక్ష పార్టీలు హైడ్రామాకు తెరతీశాయి. హైకోర్టు తీర్పు కాపీని తీసుకుని ఎమ్మెల్యే రోజా నేరుగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అసెంబ్లీకి వచ్చి హల్‌చల్ చేశారు. అయితే అప్పటికే అసెంబ్లీ వాయిదా పడింది. రోజా విలేఖరులతో మాట్లాడుతూ శుక్రవారం సభకు వస్తానన్నారు. ఆమె రాక సందర్భంగా అసెంబ్లీ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ పరిణామాలపై సహజంగానే అధికార పక్షం ఇరకాటంలో పడింది. ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలీక తర్జన భర్జన పడింది. హైకోర్టు ఉత్తర్వుల గురించి తెలుసుకున్న వెంటనే సిఎం చంద్రబాబు తదుపరి వ్యూహ రచన కోసం పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ వ్యవహారంలో తప్పటడుగు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సైతం అడ్డుకోజాలదని, ఇదే అంశంపై హైకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం ముందు శుక్రవారమే పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. కాగా, ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన హక్కుల కమిటీ శుక్రవారం చంద్రబాబుకు తన అభిప్రాయం తెలియజేస్తుంది. దాని ప్రాతిపదికగానే ఆయన తుది నిర్ణయం తీసుకుంటారు. ఏదిఏమైనా క్షమాపణ చెప్పకుండా రోజాను సభలోకి అడుగు పెట్టనివ్వకూడదనే అభిప్రాయాన్ని పార్టీ నేతలు వెల్లడించినట్టు తెలిసింది. రోజా ఉదంతంలో తాజా పరిణామాలు ప్రత్యేకించి మంత్రి యనమలను ఇరకాటంలోకి నెట్టేశాయి. రోజా సస్పెన్షన్‌లో రూల్ 340 సబ్ సెక్షన్ 2ను ఉటంకించడంతోనే ఇబ్బంది ఎదురైందనే అభిప్రాయం వ్యక్తమైంది. గతంలో కరణం బలరాంను సభనుంచి ఆరు నెలలపాటు సస్పెండ్ చేసినప్పుడు నిబంధనల ప్రస్తావన తీసుకురాలేదనే విషయాన్ని కూడా కొందరు గుర్తుకు తెచ్చినట్టు సమాచారం. ఇక, తాజా పరిణామాలపట్ల వైకాపాలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. రోజా సభాప్రవేశానికి తాత్కాలికంగా ఆటంకాలు తొలగిపోయిన నేపథ్యంలో ఇది తమ ఘన విజయంగా భావిస్తున్న జగన్ ప్రభృతులు శుక్రవారం రోజా వ్యవహారానే్న సభలో ప్రముఖంగా లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహం రచిస్తున్నారు. (చిత్రం) హైకోర్టు ఉత్తర్వుల అనంతరం సహచరులతో కలిసి అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన ఎమ్మెల్యే రోజా