స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-197

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే లింగ వివక్ష లేక వారిని విచారింపకయే వధింపమని అథర్వవేదం రాజును ఆదేశించింది. అయితే రాజు ఎవరు ఆతతాయే, ఎవరుకాదో నిర్ణయించే విషయంలో బహుజాగరూకుడైయుండాలి. అందుకై దానికి తగిన న్యాయ- ధర్మవ్యవస్థను, తత్కార్య నిర్వహణ వ్యవస్థను సువ్యవస్థితం చేయవలసి యుంది.
**
అతిథి పూజ
హిరణ్యస్రగయం మణిః శ్రద్ధాం యజ్ఞం మహో దధత్
గృహే వసతు నో - తిథి.
తస్మై ఘృతం సురాం మధ్వన్నమన్నం క్షదామహే
స న.పితేవ పుత్రేభ్య. శ్రేయః శ్రేయశ్చికిత్సతు భుయోభూయాః
శ్వః శ్వో దేవేధ్యో మణిరేత్య॥ అథర్వణవేదం. 10-6-4,5॥
భావం:- మణిలా, బంగారు దండలా సమాదరణీయుడైన ఈ అతిథి శ్రద్ధ- పరోపకార పరాయణత, పూజ్యత మున్నగు సద్గుణ సంపన్నుడుగా వచ్చి మా యింట నివసించుగాక! ఆయనకు బలవర్ధకమైన నేతిని, మధుర పానీయాలను, మధుర పదార్థాలను వివిధ మధురాన్నాలను మేము సమర్పిస్తాం. గౌరవనీయుడైన అతిథి మా యింటికి వచ్చి పుత్రులకు తండ్రివలె దివ్యమైన గుణ సంపద అలవడునట్లుగా నిరంతరం శుభాలు సిద్ధించే రీతిగా ప్రీతితో ప్రత్యేకంగా జ్ఞానం ప్రబోధించుగాక!
వివరణ:- వైది ధర్మం యజ్ఞ ప్రధానమైనది. ప్రతి హిందువు బ్రహ్మయజ్ఞం. వైశ్వదేవయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, అతిథి యజ్ఞం అనే ఐదు యజ్ఞాలు నిత్యమూ విధిగా ఆచరించాలి. వీనిని ఆచరింపకుంటె ఆ వ్యక్తికి పాపం సంక్రమిస్తుంది. వీనిలో అతిథి యజ్ఞాన్ని గురించి అథర్వణ వేదంలో పదునైదవ కాండలో వివరించబడింది. ఆ సందర్భంగా అచట అతిథి మహిమ విశేషంగా వర్ణింపబడింది. ఆర్య సంస్కృతిలో అతిథి చాల వందనీయుడు, పూజనీయుడు. ఈ విషయంపై రెండు మంత్రాలలో సప్రమాణంగా చెప్పబడింది. ప్రధానంగా అతిథి లక్షణాలు నాలుగు చెప్పబడ్డాయి. 1. హిరణ్యసృక్ 2. మణిః 3. శ్రద్ధాః 4. పితేవ పుత్రేభ్యః
1. హిరణ్యస్రక్:- బంగారు దండ ధరించినవాడు అని దీనికి సామాన్యార్థం. అంటే గృహస్థులు పూజ్యభావంతో బంగారు దండలతో సమ్మానించాలని ఒక అర్థం. అంటే అది అంత సులభమైన చౌక బేరమా? కాదు. అయినా ఇంటికి వచ్చిన అతిథిని విలువైన ద్రవ్యాలతో, పదార్థాలతో సమ్మానించాలని మాత్రమే దాని అంతరార్థం. అట్టి సన్మానానికి అతిథి కూడ యోగ్యుడుగా ఉండాలి కదా! మంత్ర మీ అభిప్రాయాన్ని కూడ స్పర్శించియే ‘హిరణ్యసృక్’ అనే పదాన్ని ప్రయోగించింది. అంటే అతడు బంగారంతో తుల్యమైన అనేక సద్గుణాల మాల ధరించినవాడు కావాలని వేద మంత్ర అంతరార్థం. పరోపకార పరాయణత, హితబోధత, త్యాగశీలత మొదలైన గుణాలన్నీ ‘హిరణ్‌యస్పృక్’ అన్న పద వాచకాలే.
2. మణిః:- అతిథి స్వయంగా మణియే అయి యుండాలని భావం. మణి ఎంత మూల్యమైనదో ఆ రీతిగా శ్రోత్రియత్వం, శుచిత్వం, తపఃసంపన్నత్వం, కర్మానుష్ఠాన- పరాయణత, అంతర్ముఖత్వం, బ్రహ్మనిష్ఠత మొదలయిన అనర్ఘశీల సంపన్నుడు కావాలని ఆంతర్యం. ఇది అతిథి వ్యక్తిగత సౌశీల్యాన్ని తెలుపుతూంటే ‘హిరణ్యసృక్’ ఆయన లోక సర్వమానవ కల్యాణ సౌశీల్యాన్ని ప్రకటిస్తూంది. ఇట్టి శీల సంపద కలవాడే అతిథి. గృహస్థులకు సదా పూజనీయుడు.
3. శ్రద్ధా:- స్వయంగా సత్కర్మాచరణలో ఎలా శ్రద్ధకలిగియుంటాడో ఇతరులను సత్కర్మాచరణ పరాయణులుగా ప్రబోధన చేసేందుకు కూడ శ్రద్ధ కలిగినవాడై యుండాలి. అనగా తన సత్కర్మాచరణ ఫలాన్ని ఇతరులు కూడ పొందే విధంగా శ్రద్ధాళువై కృషిచేయాలి.
4. పితేవ పుత్రేభ్యః:- తండ్రి పుత్రులకువలె అని ఆమాటకర్థం. ఈ మాటపై శ్రద్ధాళువు శబ్దానికి వివరణయే. ఇతరులను సన్మార్గవర్తులనుగా చేసే పనిని కేవలం మ్రొక్కుబడి పనిగా గాక తండ్రి కుమారులకు అత్యంత క్షమాబుద్ధితో జ్ఞానోపదేశకుడై సన్మార్గవర్తలను చేసే రీతిగా అతిథి ప్రవర్తించాలని భావం. అందుకే అట్టి సద్గుణ సంపన్నులను బాబాజీ అని పిలిచి ఆదరించడం మనం చూస్తూనే ఉన్నాం. అట్టి ఉత్తమ అతిథులను గృహస్థులు ఏ విధంగా సన్మానించాలో అథర్వణవేద మావిధంగా వివరించింది.
తద్య స్యైవం విద్వాన్ వ్రాత్యో- తిథిర్గృహానాగచ్ఛేత్‌॥
స్వయమేన మభ్యుదేత్య బ్రూయాత్ వ్రాత్యక్వా- వాత్సీర్ర్వాత్యోదకం
వ్రాత్య తర్పయంతు వ్రాత్వ యథా తే ప్రియం తథాస్తువ్రాత్య యథా తే
వశస్త్థాస్తు వ్రాత్య యథా తే నికామస్త్థాస్త్వితి॥
‘‘సదా వ్రతనిష్ఠుడైన అతిథి ఇంటికి వచ్చినపుడు గృహ యజమాని లేచి ఎదురేగి ఇలా పలకాలి ‘‘వ్రాత్య! ఎక్కడుంటారు? వ్రాత్య! ఈ నీటిని స్వీకరించండి. వ్రాత్య! దయ చూపండి. ప్రసన్నులుకండి. వ్రాత్య! మీకేది అభిమతమో ఇక్కడ అలాగే జరుగుతుంది వ్రాత్య! మీకేది ఇష్టమో అదే సమకూర్చబడుతుంది. వ్రాత్య! మీ కోరిక ఏదియో అది నెరవేర్చబడుతుంది.’’
ఇచ్చట వ్రాత్య శబ్దం పలుమారులు చెప్పబడింది. ప్రస్తుత మంత్రంలో చెప్పబడిన ‘హిరణ్యసృక్’ ఇచ్చటి వ్రాత్యశబ్దం సమానార్థకాలే. అట్టి అతిథి పుంగవులు రాగానే గృహస్థులకు కలిగే ఆనందమెట్టిదో అథర్వణవేదంలో ఇలా వర్ణింపబడింది.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు