స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను భగవంతుని పూజిస్తున్నాను
అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్‌
హోతారం రత్నధాతమమ్‌॥ ఋ.1-1-1॥
భావం:- సమస్త విశ్వంకంటె ముందున్నవానిని, విశ్వసృష్టి అనే యజ్ఞాన్ని ప్రకాశింపచేసే వానిని, ఋతువులను కల్పించే వానిని, మహాదాతను, రత్నాలను సృష్టించేవానిని - అగ్రేసరుడైన భగవానుని నేను స్తుతిస్తున్నాను.
వివరణ:- ఈ మంత్రం ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం. భగవానుని ప్రప్రథమ సందేశం కూడ ఇదే. మానవుడికంటే ముందే సమస్తమైన సృష్టి జరిగిపోయింది. తదుపరి పుట్టిన మానవుడు అన్నివైపుల దృష్టిసారించి అద్భుతమైన సృష్టిని చూచి ఆశ్చర్యచకితుడయ్యాడు. భగవానుడు దయాళువై సృష్టిలోని సమస్త పదార్థాల- ద్రవ్యాల నామ, గుణ, ధర్మాలను మరియు వానిని సద్వినియోగపరచుకొనే విధానాన్ని తెలుపుతూ వేదవిజ్ఞానాన్ని మానవుడికి ప్రదానం చేసాడు. కవికుల గురువైన పరమేశ్వరుడు ఆరంభంలోనే కవితాత్మకంగా శే్లషాలంకారంలో తన తత్త్వాన్ని గురించి- జీవుని గురించి, అగ్నిని గురించి మానవులకు ప్రథమోపదేశం చేసాడు.
జగత్‌సృష్టి లేనప్పుడు కూడ భగవంతుడున్నాడు. ఇలా జగత్తుకంటే పూర్వమే ఉన్నవాడు కావడంచే సర్వేశ్వరుడు ‘పురోహితుడు’. జడమైన శరీరంకంటే పూర్వమే జీవుడు ఉన్నాడు. అందుచేత జీవుడు కూడ ‘పురోహితుడే’. అలాగే జగత్తుకంటే పూర్వమే సూర్యుని రూపంలో అగ్ని ప్రకాశిస్తూ ఉండటం కారణంగా అగ్నికూడ ‘పురోహితుడే.’
పరమేశ్వరుడు ఈ సమస్తసృష్టికి నిర్మాత. కాబట్టి సృష్టి అనే యజ్ఞాన్ని దేవ=ప్రకాశింపచేసినవాడు కాబట్టి పరమాత్మ దేవ శబ్దవాచ్యుడు. ఇంద్రియాల ద్వారా శరీర నిర్వహణమనే యజ్ఞాన్ని నిర్వహించేవాడు కాబట్టి జీవుడు దేవశబ్దవాచ్యుడు. భౌతికమైన అగ్నిహోత్ర దశనుండి అశ్వమేధాది మహాయజ్ఞాల పర్యంతమూ సమస్తాన్ని నిర్వహిస్తూ ప్రకాశింపచేసేవాడు కాబట్టి అగ్నికూడ యజ్ఞదేవ శబ్దవాచ్యుడే.
ఋతువుల వ్యవస్థను కల్పించి నిర్వహించే కర్మశీలి కావడంచేత దేవదేవుడు ఋత్విక్కు. యజ్ఞయాగాదులను చేసేవాడుగా జీవుడు ఋత్విక్కు. ఋతుచక్రభ్రమణమన్నది సూర్యాగ్నిచేత నిర్వహింపబడుతుంది కాబట్టి అగ్ని- ఋత్విక్కు.
విశ్వాధారుడు చేసే ప్రదానంతో సమానమైనది మరొకటి లేదు కాబట్టి భగవానుడు = హోత. తన కర్మఫలాలను అనుభవించేవాడుగా జీవుడు= హోత. యజ్ఞంలో హోమానికి సాధనమైనవాడు కాబట్టి అగ్నిహోత. సూర్యుడు, చంద్రుడు, పృథివి, జలం. అగ్ని, వాయువు మొదలైన రత్నాలను సృష్టించినవాడు కావున భగవానుడు=రత్నధాతముడు. సమస్తవిశ్వాన్ని, విశ్వంలోని సర్వపదార్థాలను, ద్రవ్యాలను ఉపయోగించుకొని అనుభవించేవాడు జీవుడే కాబట్టి జీవుడు= రత్నధాతముడు. భూగర్భంలోఉండే రాక్షసి బొగ్గును సహితం ఒక కాల పరిధిలో రత్నంగా మార్చగల అగ్ని శక్తివంతం కావడం చేత అగ్ని= రత్నధాతముడు.
ఈ విధంగా అగ్ని శబ్దానికి కూడ మూడర్థాలున్నా వానిలో ముఖ్యార్థం పరమేశ్వరుడే. అగ్నియేకాదు సూర్యచంద్రాది శబ్దాలన్నీ వానికిగల సూర్య- చంద్రాది అర్థాలతోబాటు వానికి ప్రధానార్థం పరమేశ్వరుడే. దీనికి ప్రమాణంగా క్రింది శుక్లయజుర్వేద మంత్రాన్ని పరిశీలించండి.
తదేవాగ్నిస్తదాదిత్యస్తద్వాయుస్తదు చంద్రమాః
త దేవ శుక్రం తద్ బ్రహ్మ తా ఆపః స ప్రజాపతిః॥ (శు.య.32-1)
అతడే అగ్ని. అతడే ఆదిత్యుడు. అతడే వాయువు. అతడే చంద్రుడు. అతడే శుక్రుడు. అతడే బ్రహ్మ. అతడే ప్రజాపతి. ఈ నామాలన్నీ తమ ముఖ్యవృత్తిఅయిన అభిదావృత్తిచేత వాచ్యుడైనవాడు పరమేశ్వరుడే. అగ్ని శబ్దానికి నిర్వచనం అగ్రణీ= ముందుకు తీసుకొనిపోయేవాడు అని. అంటే ఉన్నత స్థితికి సాధకుడని భావం. అట్టివాడు భగవానుడే. అతడే రూపము గలవాడైనా కావచ్చు. ఏ నామం గలవాడైనా కావచ్చు.
ఇంకా ఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512