స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-86

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శమ- దమ- ఉపరతి- తితిక్ష- శ్రద్ధ మరియు సమాధానం ఈ యారు షట్క సంపత్తి. అధర్మాచరణ నుండి మరలించి ధర్మాచరణ దిశగా మనోబుద్ధి అహంకార చిత్తాలనే అంతరింద్రియాలను మరలించుట ‘శమం’ నేత్ర- శ్రోత్ర- జిహ్వాది జ్ఞానేంద్రియాలను మరియు హస్త- పాదాది కర్మేంద్రియాలను దుష్టకర్మల నుండి మరలించి శుభకర్మల దిశగా ప్రవర్తింపచేసే ఇంద్రియ జయత్వం ‘దమం’. దురాచారులకు సదా దూరంగా ఉండటం ‘ఉపరతి’. నింద- స్తుతి- లాభం- నష్టం- హాని- శుభం ఎన్ని సంభవించినా వాటివలన కలిగే హర్ష- శోకాలను విడిచి ముక్తిసాధనలో మనస్సును లగ్నం చేయడమే ‘తితిక్ష’. వేదశాస్త్ర పురాణాది విజ్ఞానంలో పరిపూర్ణులైన విద్వాంసులు- సత్యోపదేశికుల వచనాల ఎడల, శాస్తవ్రచనాల ఎడల సంపూర్ణ విశ్వాసమే ‘శ్రద్ధ’. చిత్తమునందలి ఏకాగ్రత లేదా స్థిరత్వ స్వభావం ‘సమాధానం’. ఈ అన్నింటి పరిపూర్ణ సాధనచేత చేకూరిన సిద్ధి తరువాతనే ‘మోక్షప్రాప్తి’. ఇవి కాక శ్రవణ- మనన- నిధిధ్యాసన మరియు భగవద్దర్శన భాగ్యలబ్ధులు కూడ ముక్తిసిద్ధికి అత్యావశ్యక సాధనాలు. వేదశాస్త్ర పురాణవేత్తల శ్రద్ధగా వినడం ‘శ్రవణం’. వానిలో సమస్త విద్యల సారమైన- సూక్ష్మమైన బ్రహ్మవిద్య నిక్షిప్తమైయుంది గావున సాధకుడు ఆ విద్యపై అత్యంత శ్రద్ధవహించవలసి యుంది. శ్రవణానంతరం ఏకాంతంగా కూర్చుండి ఆ బ్రహ్మవిద్యను ఆత్మయందు విచారించడం, సందేహం కలిగిన విద్వాంసుల వలన శంకానివృత్తి చేసికొనడం ‘మననం’. శ్రవణ- మననాంతరం సమాధి స్థితి పొంది విన్నది- మననం చేసింది ఏకరూపంగా ఉన్నాయా లేదా అని నిస్సందేహంగా నిశ్చయానికి రావలసియుంది. అలా ధ్యానయోగం చేత బ్రహ్మాన్నీ దర్శించడం ‘నిదిధ్యాసనం’. స్వరూప- గుణ- స్వభావాలకు అభిన్నమైన అనగా యథార్థమైన బ్రహ్మను దర్శించడమే ‘దర్శనం’ లేదా ‘సాక్షాత్కారం’. ఈ రీతిగా ఈశ్వర సాక్షాత్కార సిద్ధి కలిగేవరకు ప్రతి దినమొ సాధన చేయడం అత్యంతావశక్యకం.
ఈ విధంగా నిష్ఠాగరిష్ఠమైన నిత్యసాధనల అనంతరం లభించే ముక్తిని వేదం ‘పురూదధానా అమృతం సపంత ‘‘ఎన్నో సాధనాల ద్వారా భగవద్వైభవాన్ని అనుసరించి విద్వాంసులు మోక్షాన్ని పొందుతున్నారు’’ అని నిర్ధారించింది. అయినా పై సాధనలు మాత్రమే మోక్షసిద్ధికి పరమోపాయం కాదు. పరమోపాయం కేవలం పరమాత్మ కరుణ మాత్రమే. ‘న ఋతే త్వ దమృతామాదయంతే’ (ఋ.7-11-1) ‘‘ఓ దేవా! నీ కరుణ వినా ముక్తజనులకు బ్రహ్మానందం కలుగ’’దని ఋగ్వేదం అంతిమంగా నిర్ణయించింది.
అందుచేతనే మోక్షాభిలాషులు జగన్నాయకుడైన ఆ మహాదైవానే్న నిత్యమూ ధ్యానిస్తూ మరియు ఉపాసన చేస్తూ ఉంటారని మంత్రంలోని ద్వితీయార్థం ద్వారా వేదర్షి మోక్షమార్గ సత్యాన్ని విప్పి చెప్పాడు. వేదర్షులైనా- ఆధునిక సత్యానే్వషకులయినా చెప్పేది ఈ పరమసత్యానే్న. ఆధునిక దివ్య మహర్షి అయిన దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాశంలో ఇదే విషయాన్ని ఇలా వివరించారు-
‘‘చరాచర జగత్తున విశ్వాత్మగా సర్వవ్యాపకుడైన పరమాత్మ యొక్క నిత్య నివాసమైన బ్రహ్మలోకంలో నిత్యనివాసులైన మోక్షసుఖాన్ని పొంది ఆనందించేందుకు విద్వాంసులైనవారు ఉపాసనలను చేస్తారు. (సత్యార్థ ప్రకాశం. 9వ సముల్లాసం)
ఆ విధంగా నిత్యోపాసనలు చేసి భగవత్తత్త్వాన్ని దర్శించిన తత్త్వదర్శులు మోక్షసిద్ధిని కోరే ముముక్షు జనులకు దయతో ఉపదేశం చేస్తారు. ‘దశస్యంతః ఉశిజ శంసమాయోః’ అని వేదర్షి తత్త్వవేత్తల కారుణికత్వాన్ని ప్రకటించాడు. అలా వారు బోధింపకుంటే ముక్తిమార్గాన్ని కడ్డుపడే దోషాలు జీవుల కెలా తెలుస్తాయి? అందుకే తాత్త్వికులు తమ నాశ్రయించినవారికి ‘‘ముక్తిమార్గాన్ని సువ్యవస్థితం చేసినవాడు పరమాత్ముడే. జీవులు లోకంలో పూర్వకర్మానుసారం జన్మించి వాటి ఫలాలను అనుభవిస్తూ ఉంటారు. కర్మబంధనంలో చిక్కుపడిన జీవులు సుఖ-దుఃఖాలలో దురవస్థలలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఆ కర్మబంధనాలు భగవత్కృపవలన సడలితే జీవుడు ముక్తుడై ప్రకాశిస్తాడు’’ అని ముక్తి మార్గోపదేశం చేస్తారు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు