రాష్ట్రీయం

వకుళమాత ఆలయంకోసం ప్రాణత్యాగానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీలో సిఎం స్పష్టత ఇవ్వాలి
హిందూ సెక్యూరిటీ జోన్‌గా తిరుపతి
శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి

తిరుపతి, మార్చి 17: హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వరుడి మాతృమూర్తి వకుళమాత ఆలయ నిర్మాణం చేపట్టకపోతే ప్రాణత్యాగానికి కూడా వెనకాడబోనని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి హెచ్చరించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వకుళమాత ఆలయ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయడంతోపాటు నిజనిర్ధారణ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. పేరూరు బండపై ఉన్న వకుళమాత ఆలయానికి సంబంధించిన చారిత్రక అధారాలు ఉన్నాయన్నారు. ఎంతో పవిత్రమైన ఆ ఆలయం నేడు అవసాన దశకు చేరుకుందన్నారు. ఈ ఆలయాన్ని పునర్ నిర్మించాలంటూ గత కొనే్నండ్లుగా ఆందోళనలు జరిగాయని, జిల్లా కలెక్టర్‌గా శేషాద్రి ఉన్నప్పుడే వకుళమాత ఆలయానికి సంబంధించిన ప్రాంతాన్ని టిటిడిదిగా ప్రకటించారన్నారు. అయితే అక్రమ మైనింగ్ చేస్తున్న కొంతమంది ప్రయోజనాలను కాపాడేందుకే ఆలయ నిర్మాణాన్ని అశ్రద్ధ చేశారని స్వామీజీ ఆరోపించారు. సిఎం తన సొంత జిల్లాలో శ్రీనివాసుని మాతృమూర్తి నిరాదరణకు గురైన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొంతమంది వకుళమాతను గ్రామదేవతగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పురావస్తుశాఖ వద్ద వకుళమాత ఆలయానికి సంబంధించిన పూర్తి ఆధారాలున్నాయన్నారు. టిప్పుసుల్తాన్ దండయాత్రల సమయంలోనే తిరుమలపై దాడిచేసేందుకు ప్రయత్నం చేసినా కప్పం కట్టేందుకు అప్పటి పెద్దలు ఒప్పించారని, శ్రీనివాసుని ఆలయానికి అనుబంధంగా ఉన్న వకుళమాత ఆలయంపై దాడి చేసేందుకు ఆయన ప్రయత్నం చేసినట్లు ఆధారాలున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి వకుళమాత ఆలయ నిర్మాణం పనులు సత్వరం చేపట్టేందుకు వీలుగా నిజనిర్ధారణ చేసేవిధంగా హైపవర్ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు.
తిరుమల ఆలయ పరిసరాల్లో దాదాపు 100 కిలోమీటర్లు మేర ఎక్కడా మైనింగ్‌లు చేపట్టరాదని 1943వ సంవత్సరంలో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఒక చట్టాన్ని విడుదల చేసిందని చెప్పారు. ఈప్రాంతం అంతా బఫర్ జోన్‌గా ప్రకటించారని తెలిపారు. తెల్లదొరలు హిందువుల ఆలయాన్ని పరిరక్షించేందుకు తీసుకున్న చర్యల్లో కనీసం ఒక్క వంతు కూడా నేటి ప్రభుత్వాలు, రాజకీయ నేతలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి కమిటీని నియమిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన రాకపోతే తాను త్వరలోనే నిరవధిక దీక్షకు శ్రీకారం చుడతానని హెచ్చరించారు. అవసరమైతే అమరణ నిరాహారదీక్ష చేపట్టి, అత్మత్యాగానికి కూడా తాను సిద్ధమని ప్రకటించారు.
హిందూ సెక్యూరిటీ జోన్‌గా తిరుపతి
భవిష్యత్తులో తిరుపతిలో మత ఘర్షణలు, అసాంఘిక కార్యక్రమాలను నిరోధించే దిశగా ప్రభుత్వం హై సెక్యూరిటీ జోన్‌గా ఈ ప్రాంతాన్ని ప్రకటించాలని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి కోరారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు టిటిడి ఇప్పటికే మద్యం, మాంసం నిషేధించిందని అన్నారు. ఇది తిరుమలకు చేరుకుండా ఉండేందుకు పలు రకాలైన నిఘా సంస్థలను, యంత్రాంగాలను ఏర్పాటు చేసిందన్నారు. అయితే కొంతమంది స్వార్థపరులు అక్రమంగా తిరుమలకు మద్యం, మాంసం తీసుకువెళ్లి పవిత్రతకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 90 శాతం మంది శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. యాత్రికులకు తాగడానికి నీరు, భోజనం సరిపోతుందని వారికి మద్యం, మాంసం అవసరం లేదని అన్నారు. కాని ప్రభుత్వం తిరుపతి పట్టణంలోనే దాదాపు 70కి పైగా మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వడం దారుణమన్నారు. ఈ నేపధ్యంలోనే అన్య మతస్థులు చాపకిందనీరులా తమ మత వ్యాప్తి కోసం ప్రయత్నాలను తీవ్రం చేశారని చెప్పారు. అధికారికంగా తిరుపతిలో 30 మసీదులు, 70 చర్చీలు ఉన్నాయని అనధికారికంగా 40 మసీదులు, వందకు పైగా చర్చిలు ఏర్పాటు చేసినట్లు స్వామీజీ వివరించారు. హిందూ ప్రాధాన్యత కలిగిన తిరుపతి పట్టణంలో భవిష్యత్తులో మత ఘర్షణలు చెలరేగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇప్పటి నుంచే కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. వాటికన్, మక్కా తరహాలో తిరుపతిలో కూడా హిందూ ప్రాధాన్యత కల్పిస్తూ హిందూ సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఏపార్టీకి కాని, మతాలకు కాని వ్యతిరేకిని కాదని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తిరుపతిని పరిరక్షించుకునే ఆలోచనతో ఉన్నానన్నారు. సీమాంతర ఉగ్రవాదులు తిరుమల క్షేత్రంపై దాడి చేసే అవకాశం ఉందని పలుమార్లు నిఘా సంస్థలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. (చిత్రం) తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి