జాతీయ వార్తలు

తిరుగులేని ఆర్థిక శక్తి భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాలకు లోనైనప్పటికీ భారత్ మాత్రం స్థిరంగా, బలంగా నిలబడిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇందుకు కారణం తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేనని వెల్లడించారు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సహా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలన్నీ భారతదేశ వౌలిక విధానాలను శ్లాఘిస్తున్నాయని ప్రధాని తెలిపారు. సంపన్న దేశాలుసహా అన్నికూడా ఆర్థిక మాంద్య పరిస్థితుల కారణంగా సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయని, కాని, ఒక్క భారతదేశం మాత్రమే వృద్ధివేగాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతోందన్నది ఈ ఆర్థిక సంస్థల అభిప్రాయమని ఆదివారంనాడిక్కడ దయానంద సరస్వతి 140వ జయంతి సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ తెలిపారు. ఒకపక్క ప్రపంచమంతా మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే, భారత్ మాత్రం ప్రబలశక్తిగా దూసుకుపోవడం అన్నది అసాధారణమైన విషయమని తెలిపారు. ఈ రకమైన సానుకూల పరిస్థితికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న గుణాత్మక విధానాలేనని కూడా ఈ సంస్థలన్నీ వెల్లడించడం దేశ ఆర్థిక వ్యవస్థ వౌలిక విధానాల పటుత్వానికి అద్దం పడుతోందన్నారు. పేదరికం, నిరుద్యోగం, విద్యా రాహిత్యం అన్ని సమస్యల నుంచి భారతదేశానికి విముక్తి కలిగించి అభివృద్ధి పథంలో ముందుకు సాగడం ఒక్కటేనని మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ముద్ర, నైపుణ్య అభివృద్ధిసహా తమ ప్రభుత్వం ఇప్పటివరకూ చేపట్టిన సామాజిక, ఆర్థిక కార్యక్రమాల గురించి వెల్లడించిన ఆయన, ‘ముద్ర యోజన ద్వారా 2కోట్ల మంది లబ్ధిపొందుతున్నారు. ఇప్పటివరకూ లక్ష కోట్ల రూపాయలు పంపిణీ చేశాం’ అని వివరించారు. దేశ జనాభాలో 60శాతం మందికి పైగా 35 సంవత్సరాల లోపు వారేనని, దీన్నిబట్టి చూస్తే ప్రపంచంలోనే తిరుగులేని యువశక్తి కలిగిన ఏకైక దేశం భారత్ అని స్పష్టమవుతోందన్నారు. దేశాభివృద్ధిలో ఈ యువశక్తిని మమేకం చేయడానికి ఏవిధంగా ముందుకు వెళ్లాలన్నదానిపైనే తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగానే నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, దీన్ని అభివృద్ధి చేయడానికి సొంత బడ్జెట్‌తో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని మోదీ వెల్లడించారు. 2030 నాటికల్లా ప్రపంచంలో చాలా దేశాల జనాభా వృద్దాప్య దశకు చేరుకుంటుందని, అలాంటి సమయంలో యువభారతం అనేక దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ వృద్ధ జనాభా దేశాలన్నింటికీ నైపుణ్యపరంగా, సాంకేతికంగా భారత్ ఉపయోగపడాలంటే నేటి యువశక్తిని అందుకు సమాయత్తం చేయాల్సి వుంటుందన్నారు. తమ ఆలోచనలను ఆచరణాత్మకం చేసేదిశగా యువత అడుగులు వేయాలని, ఆ ఆలోచనల ఆలంబనగానే దేశం ముందుకు సాగాలని తెలిపారు.