కర్నూల్

తగ్గిన ఉల్లిధర..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఫిబ్రవరి 14:ఉల్లి ధర మార్కెట్‌లో ఒకేసారి క్వింటాల్‌కు రూ. 1300 తగ్గిపోవడంతో ఉల్లి పంటలు పండించిన రైతులకు తగ్గిన ధరలు కంట నీరు పెట్టిస్తున్నాయి. అయితే రిటైల్ ఉల్లి వ్యాపారస్థులు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు ఉల్లి గడ్డలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారుల మాయాజాలంతో ఉల్లి రైతులు విల విలాడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఉల్లిరైతులు తీవ్రంగా నష్టపోవడం ఖాయమని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం వరకు బహిరంగ మార్కెట్‌లో రైతులు పండించిన ఉల్లి ధరకు క్వింటాల్ రూ.2వేల ప్రకారం ఉండడంతో రైతులు ఎంతో సంతోషంగా పంట కోతలను మొదలు పెట్టి మార్కెట్‌కు ఉల్లిగడ్డలను అమ్మకానికి తీసుకు వస్తున్నారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లి ధర రూ.700లకు పలకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఉల్లి రైతులు పేర్కొన్నారు. క్వింటాల్‌కు రూ.1300లు ధర తగ్గడంతో ఉల్లి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. గత రెండు నెలల క్రితం కిలో ఉల్లి ధర రూ.100లకు చేరింది. తీరా రైతులు మార్కెట్‌కు అమ్మకానికి తీసుకు వచ్చే సరికి ధర పడిపోవడంతో రైతులు వ్యాపారుల చర్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. రైతులు వద్ద క్వింటాల్‌కు రూ.700లు కొనుగోలు చేసిన వ్యాపారులు అవే ఉల్లిగడ్డలను ప్రజలకు కిలో రూ.20ల ప్రకారం అమ్ముతున్నారు. ఈ విధంగా చూసుకుంటే రైతుల వద్ద కొనుగోలు చేసే ఉల్లిగడ్డల ధరలు కనీసం రూ.1500ల నుంచి రూ.1600లకు క్వింటాల్ ప్రకారం కొనుగోలు చేయాలి. కాని రైతుల వద్ద మాత్రం క్వింటాల్ రూ.700ల ప్రకారం వ్యాపారులు కోనుగోలు చేస్తున్నారు. ప్రజలకు మాత్రం కిలో రూ.20ల ప్రకారం అమ్ముతూ వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. ఉల్లి వ్యాపారులు ఏకమై రైతులను నష్ట పరుస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈసమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలో దిగి రైతుల వద్ద ఉన్న సరుకులను కనీసం రూ.1500 క్వింటాల్ చొప్పున కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లి గడ్డలను చౌక దుకాణాల ద్వారా లేదా కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో రూ.10లేదా రూ.15లకు కిలో ప్రకారం సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. దీని వల్ల వ్యాపారుల మాయ జాలానికి అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. అంతేకాకుండా ఉల్లి వ్యాపారులు, మధ్య దలారులు తక్కువ ధరకు రైతులకు కొనుగోలు చేసి, స్టాక్ పెట్టి ధరలు వచ్చినప ఉప్పుడు అమ్మెందుకు సన్నద్దం అవుతున్నారు. ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలలో అన్ని గ్రామాలల్లో బావుల కింద ప్రతి సంవత్సరం 20వేల ఎకరాలలోఉల్లి పంట వేయడం జరుగుతుంది. ఇప్పుడు కోతకు రావడం జరిగింది. ఇలాంటి సమయంలో ఉల్లి గడ్డల వ్యాపారులు ధరలు తగ్గించి రైతుల కడుపుతున్నారు. మార్కెట్‌లో ప్రజలకు అధిక ధరలకు అమ్మిప్రజలను దోపిడి చేస్తున్నారు. కావున ఉల్లిగడ్డల వ్యాపారుల అక్రమ దందాకు ప్రభుత్వ రంగ సంస్థలనుప్రభుత్వం రంగంలోకి దింపి ఉల్లిగడ్డల వ్యాపారుల అక్రమార్జనకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఉల్లి రైతులకు ఆత్మహత్యాలే శరణ్యం.
సంజీవయ్య ఆశయాలను
స్ఫూర్తిగా తీసుకోవాలి
* జయంతి సభలో డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి
కర్నూలు, ఫిబ్రవరి 14:మహామేధావి, సున్నిత మనస్కుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడవాలని డిప్యూటీ సిఎం, రెవెన్యూ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి సూచించారు. దామోదరం సంజీవయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలోని నంద్యాల రోడ్డు చెక్ పోస్టు 3 రోడ్ల కూడలిలో సంజీవయ్య చిత్రపటానికి కెఇ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కెఇ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య జన్మంచిన పెద్దపాడు గ్రామాన్ని నవ్యాంధ్రప్రదేశ్‌లో అత్యంత ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానన్నారు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మంచిన సంజీవయ్య స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగి, ప్రతిఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. ఆయనతో కలిసి మా నాన్న కెఇ మాదన్న అట్టడుగు వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. చాలా మంది సభ్యులు కర్నూలు జిల్లాను దామోదరం సంజీవయ్య జిల్లాగా మార్చాలని కోరుతున్నారన్నారు. నంద్యాల చెక్‌పోస్టును దామోదరం సంజీవయ్య సర్కిల్‌గా మార్చేంకుకు గెజిట్‌లో రూపొందించాలని కలెక్టర్ విజయమోహన్‌ను ఆదేశించారు. వెనుకబడిన వర్గాలు, హరిజనులు, దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సంజీవయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చేందుకు హెచ్‌ఆర్‌డి మంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంజీవయ్య ఉత్సవాలు నిర్వహించామన్నారు. చదువే అన్నింటికీ మూలమని పిల్లలను బాగా చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని మంత్రి సూచించారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య అనేక కష్టనష్టాలకోర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుడని కొనియాడారు. సంజీవయ్య ముఖ్యమంత్రిగా వున్న సమయంలో దళితులకు లక్షల ఎకరాల బంజరు భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు మంజూరు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్ పెంపునకు శ్రీకారం చుట్టారని తెలిపారు. వృద్ధాప్య పింఛను, నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, విద్యార్థులకు స్కాలర్‌షిప్ పథకాలు అందజేయడంలో విశేష కృషి చేశారన్నారు. ఆయన జన్మించిన పెద్దపాడు గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సంజీవయ్య ఆదర్శవంతమైన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నడుచుకోవాలన్నారు. జిల్లాలో దళిత అభివృద్ధి కార్యక్రమాలకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. జోహరాపురం ఎస్సీ కాలనీని తాను దత్తత తీసకున్నానని రూ. 2 కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు కలెక్టర్ సహకరించారన్నారు. ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు సంజీవయ్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే గౌరిచరితారెడ్డి మాట్లాడుతూ నీతి, నీజాయితీ, పరిపాలనాదక్షతకు సంజీవయ్య స్ఫూర్తి అన్నారురు. అలాగే మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ మేయర్ బంగి అనంతయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు చంద్రప్ప, సుగంధమ్మ, సంజీవరావు, డేవిడ్ విల్సన్, మద్దయ్య, గుర్రాల శ్రీనివాసులు, సుబ్బరాయుడు, ఇడుపుల రాజు, గడ్డం రామకృష్ణ, వేల్పుల జ్యోతి, ఆనంద్, సలోమి, కైలాస్‌నాయక్, సోమసుందరం, త్యాగరాజు, అనంతరత్నం, చిన్నలక్ష్మన్న, షడ్రక్, బాలసుందరం, నాగరాజు, దండు వీరయ్య తదితరులు సంజీవయ్య సేవలను కొనియాడారు. అనంతరం సంజీవయ్య జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ప్రోత్సాహకాలు అందజేశారు.
‘ఉపాధి’ కూలీలకు ప్రత్యేక అలవెన్సు
* డ్వామా పిడి పుల్లారెడ్డి
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 14:జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు ప్రత్యేకంగా వేసవి అలవెన్సు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పిడి పుల్లారెడ్డి తెలిపారు. ఆ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సర్క్యులర్ నెం.685ని విడుదల చేశారన్నారు. ఈ సర్క్యులర్ ప్రకారం జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు వేసవిని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ గరిష్ట వేతనం కంటే అదనంగా వేతనం ఇస్తారన్నారు. అయితే వేసవి అలవెన్సు ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25, ఏప్రిల్, మే నెలల్లో 30, జూన్ నెలలో 20 శాతం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉపాధి పథకంలో పని చేస్తున్న వికలాంగుల శ్రమశక్తి సంఘాలకు గరిష్ట వేతనం కంటే ప్రత్యేకంగా 30 శాతం ఇస్తామన్నారు. ఉపాధి కూలీ శ్రమ శక్తి సంఘాల్లోని సభ్యులు పని చేసే గ్రామం నుంచి 5 కి.మీ దాటినట్లయితే గ్రూపులోని సభ్యులకు రవాణా భత్యం కింద ఒక్కో సభ్యుడికి రూ. 15, వికలాంగుల శ్రమశక్తి సంఘాల్లోని సభ్యులకు దూరంతో సంబంధం లేకుండా రవాణా భత్యం రూ. 10 ఇస్తామన్నారు. ఉపాధి కూలీలు తమ వెంట గడ్డపార, గంపతో పాటు వాటర్ బాటిల్ తీసుకువచ్చినట్లయితే ప్రతి రోజూ గడ్డపారకు రూ. 10, గంపకు రూ. 3, వాటర్ బాటిల్‌కు రూ. 5 అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే పని చేసే ప్రదేశంలో ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌కు రూ. 3, షెడ్ సెట్‌కు రూ. 10 ప్రతి రోజూ అదనంగా ఇస్తామన్నారు. కావున కూలీలు తమ గ్రామంలో జరిగే ఉపాధి పనుల్లో పాల్గొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని పిడి కోరారు.
భారతీయ సంస్కృతిని
పరిరక్షించుకుందాం..
* విద్యార్థులు కలాం, వివేకానందల బాటలో నడవాలి
* రథసప్తమి వేడుకల్లో డిఐజి రమణకుమార్
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఫిబ్రవరి 14:్భరతీయ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కర్నూలు రేంజ్ డిఐజి బివి.రమణకుమార్ పేర్కొన్నారు. నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న ఇండస్ పాఠశాలలో ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నూలు రేంజ్ డిఐజి బివి.రమణకుమార్ హాజరై రథసప్తమి వేడుకలను ప్రారంభించారు. అలాగే ఉద యం 6.30 గంటలకు విద్యార్థులతో కలిసి భక్తిశ్రద్ధలతో సామూహిక సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐజి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించేతత్త్వం భారతీయుల సొంతమని, సమస్త జీవరాశికి మేలు కల్గించేది దైవ శక్తి అన్నారు. భారతీయ యోగాపై నేడు విశ్వమంతా పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. మానవుడు సంఘజీవి కాబట్టి పరోపకారం అలవర్చుకోవాలన్నారు. సూర్యుడు సమస్త జీవరాశుల కోసం తన కిరణాలను ప్రసరింప జేస్తున్నాడన్నారు. అలాగే నదులు సమస్త జీవరాశికి ప్రాణాధారంగా, వృక్షాలు పరుల కోసమే ఫలించినట్లుగా మానవ జీవితం కూడా పరుల కోసమేననే పరమార్థాన్ని మరువరాదని సూచించారు. ఇన్ని ఇచ్చిన నా దేశానికి నేను ఏమి చేశానని ప్రతి పౌరుడు ఆలోచించుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, సద్గురు నారాయణతీర్థులు, ఆదిశంకరులు వంటి మహనీయుల బాటలో నడవాలని పిలుపునిచ్చారు. సమస్త జగతికి సూర్యుడు వెలుగు ఇచ్చినట్లే విద్యార్థులు కూడా కష్టపడి చదివి పరిశోధనలు చేసి ఆధునిక రుషులు కావాలని కోరారు. అనంతరం మరో అతిథి జిల్లా చిన్మయా మిషన్ ఆచార్య విభాచైతన్యజీ సౌరశక్తి విశిష్టతను సోదాహరంగా వివరించారు. అన్నమాచార్య కీర్తనలను కుమారి సాయిహారిక బృందం అలపించింది. సామూహిక సూర్య నమస్కారాలు ఆహుతులను అకట్టుకున్నాయి. అలాగే విద్యార్థులు రాగయుక్తంగా చేసిన ఆదిత్య హృదయం వీనుల విందు చేసింది. కార్యక్రమంలో టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, ధర్మ ప్రచార మండలి సభ్యులు సుబ్బారావు, వనజ, విష్ణు సహస్రనామ మండలి సభ్యులు విఠల్‌శెట్టి, సుధాకర్, పాఠశాల ప్రధానాచార్యులు బి.మీనాక్షి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
వైభవంగా రథసప్తమి వేడుకలు
మహానంది, ఫిబ్రవరి 14:మహానందిలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆదివారం రథ సప్తమి సందర్బంగా మూలవిరాట్‌లు అయిన శ్రీ కామేశ్వరిదేవి సమేత మహానందీశ్వరస్వామి వార్లకు ప్రత్యేక అభిషేకార్చనలు నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రారంభ సూచికగా వచ్చే ఈ రథసప్తమి వేడుకలను వేద పండితులు రవిశంకర్ అవధాని, శాంతారామ్ భట్‌ల వేదమంత్రాలతో చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఎఇఓ మధు, దర్మకర్తలు శివారెడ్డి, మునయ్య, బండి శ్రీనివాసులచే పూజలు నిర్వహించారు. అనంతరం రథశాల వద్దకు చేరుకుని రథాధిపతి సూర్యభగవానుడికి కలశ పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మత్సవాలకు ముస్తాబు అయ్యేందుకు రథాన్ని బయటకు లాగారు. నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ప్రారంభిస్తారు. కాగా మండలంలోని నవనందులలో ఒక క్షేత్రమైన సూర్యనందీశ్వర స్వామి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను నిర్వహించారు. రథ సప్తమి సూర్యభగవానుడికి ప్రత్యేకం కావడంతో సూర్యనందీశ్వరస్వామి క్షేత్రంగా విరాజిల్లుతున్న సూర్యనందిలో పాలక మండలి, అధికారులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఆధ్యాత్మిక వేత్త అయిన శాంభవి ఆ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వైభవంగా భద్రావతి భావనాఋషి
కల్యాణోత్సవం
నంద్యాల, ఫిబ్రవరి 14:పట్టణంలోని భద్రావతి భావనాఋషి ఆలయంలో 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివార్లకు వైభవంగా కల్యా ణం నిర్వహించారు. నంద్యాల పట్టణ పద్మశాలీయ సంఘం ఆద్వర్యంలో స్వామి వారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామి వార్ల ఉత్సవ మూర్తులను రమణీయంగా అలంకరించి వేదమంత్రాలతో వైభవంగా కల్యాణం జరిపించారు. కల్యాణదాతలుగా చెన్నా శ్రీనివాసులు దంపతులు, వాసి వెంకటస్వామి దంపతులు, శేపూరి వెంకటేశ్వర్లు, పాలపాటి శ్రీనివాసులు, మాడా శివశంకర్, కట్టా నర్సయ్య దంపతులు ఉభయ చారులుగా కల్యాణం నిర్వహించారు. పద్మశాలీయ సంఘం అధ్యక్షులు చెన్నా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కుల భాంధవ్యాలు కల్యాణ కార్యక్రమానికి విశేష సంఖ్యలో హాజరుకావడం సంతోషదాయకమన్నారు. స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. సాయంత్రం స్వామి వారికి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పురవీదుల్లో స్వామి వారి రథాన్ని పద్మశాలీయులు ఉత్సాహంగా పాల్గొని మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భీమునిపల్లె వెంకటసుబ్బయ్య, పబ్బు తులసికృష్ణ, సుధాకర్, సోమా చంద్రశేఖర్, గాజుల శంకర్, సుబ్బరాయుడు పాల్గొన్నారు.
కుమ్మర్లను బిసి-ఎలోకి మార్చాలి
* కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఫిబ్రవరి 14:కుమ్మర శాలివాహనులను బిసి-బి నుంచి బిసి-‘ఎ’ గ్రూపులోకి మార్చాలని కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని బి.క్యాంపులో ఉన్న బిసి భవన్‌లో ఆదివారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దయ్య అధ్యక్షతన జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తుగ్గలి నాగేంద్ర, జిల్లా గౌరవ అధ్యక్షుడు పుల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ నెల్లూరులోని సిరామిక్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేసి కుమ్మర్లను ఆదుకోవాలని కోరారు. కుమ్మర్లు ఆర్థిక, రాజకీయ, విద్య తదితర రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నారని వారి అభివృద్ధికి ప్రభుత్వం తక్షణమే బిసి-ఎ గ్రూపులోకి చేర్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కుమ్మర శాలివాహన సొసైటీలకు బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలని పుల్లయ్య డిమాండ్ చేశారు. గని గ్రామంలోని కుమ్మరి ఈశ్వరమ్మ నుంచి ప్రభుత్వం లాక్కున్న ఐదెకరాల భూమిని ఆమెకు తక్షణమే అప్పగించాలని కె.మద్దయ్య డిమాండ్ చేశారు. అనంతరం నూతన జిల్లా, నగర కమిటీలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో శ్రీశైలం శాలివాహన అన్నదాన సత్రం అసోసియేషన్ అధ్యక్షుడు పిఎస్.అనంతరమణ, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కె.చిన్నరామయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.బజారాప్ప, జిల్లా కోశాధికారి కె.బలరాముడు, కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం నందికొట్కూరు, కోడుమూరు అధ్యక్షులు సుబ్బరాయుడు, కె.మహేష్, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక రాష్ట్రంతోనే సీమ అభివృద్ధి
* ఆత్మగౌరవం దెబ్బతీస్తే రాజకీయ సమాధే..
* బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
ఆలూరు, ఫిబ్రవరి 14:రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే సాధ్యం పడుతుందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆ దివారం ఆలూరు మండలం మూసనహళ్ళి గ్రామంలో ప్రత్యేక రాష్ట్రం కోస ం బైరెడ్డి బస్సుయాత్ర ప్రారంభించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమకు అన్నివిధాలుగా అన్యాయం జరుగుతోందని అన్నారు. రాష్ట్ర విభజన జరగక ముందే రాయలసీమను ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని విన్నవించిన కేంద్రం పెడచేవిన పెట్టిందని అన్నారు. కర్నూలుకు రావాల్సిన రాజధానిని అమరావతికి తరలించడం వల్ల రాయలసీమకు తీర ని అన్యాయం జరిగిందని అన్నారు. కర్నాటకలో అక్రమ ప్రాజెక్టులను కడుతున్న ముఖ్యమంత్రి కేంద్రానికి ఒక్కసారైన ఉత్తరం రాశారాని బైరెడ్డి ధ్వజమెత్తారు. 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నా రాయలసీమపై పాలకులు దృష్టి సారించకపోవడం తగదన్నారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు బస్సు యాత్ర ద్వారా వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని అన్నారు. ప్రతి ఒక్కరు రాయలసీమ అభివృద్ధికై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. హైకోర్టు ఏఐఎంఎస్ వంటివి కూడా గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు తరలించడం ద్వారా రాయలసీమకు అన్యాయం జరుగుతోందని అన్నారు. కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. పక్కనే తుంగభద్ర, వేదావతి నదులు ఉన్నా తాగడానికి నీరు రాకపోవడం సిగ్గుచేటని అన్నారు. స్వార్థరాజకీయ నాయకులు ప్రతిసారి టమోట జ్యూస్ ప్యాక్టరీ కడుతామని ఆపద్దాలు చెబుతున్నారని విమర్శించారు. రెండవ ముంబాయిగా ఉన్న ఆదోని నేడు పరిశ్రమలు మూతపడి కళావిహీనంగా ఉందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు రాఘవేంద్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.