తెలంగాణ

బీబీనగర్ నిమ్స్‌లో నేటి నుంచి ఓపి సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: నల్లగొండ జిల్లా బీబీనగర్ నిమ్స్ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఎట్టకేలకు నేడు ఆదివారం ఓపి సేవలను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి నిమ్స్‌లో ఓపి విభాగం సేవలను ఆదివారం ఉదయం 9-30గంటలకు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నిమ్స్ నుండి 169 మంది వైద్య సిబ్బందిని, 20 మంది సీనియర్ డాక్టర్లను, 20 మంది జూనియర్ డాక్టర్లను, 40 మంది పారామెడికల్ సిబ్బందిని, నాల్గవ తరగతి ఉద్యోగులను బీబీనగర్ నిమ్స్‌కు కేటాయించినట్లు డైరక్టర్ మనోహర్ వెల్లడించారు. రానున్న ఆరు నెలల్లో ఏడు విభాగాల్లో పూర్తి స్థాయి వైద్య సేవలందించేందుకు అవసరమైన నిర్మాణాలు, ఏర్పాట్లకు 60 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించామన్నారు. ఓపి సేవల కోసం నిమ్స్ భవనంలో 42 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 32 గదులను సిద్ధం చేశారు. ఆర్థోపెడిక్, గైనిక్, పిడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాల్లో ఓపి సేవలందిస్తారు. నిమ్స్‌లో ఓపి వైద్య సేవల ప్రారంభంతో నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్, ఖమ్మం జిల్లాల ప్రజలకు ప్రయోజనకరం కానుంది. ముఖ్యంగా నిమ్స్ ముందుగా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి, బీబీనగర్-నడికుడి, సికింద్రాబాద్-ఖాజీపేట రైలు మార్గాలుండగా అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారికి, ప్రమాదాల బారిన పడిన వారికి నిమ్స్ ద్వారా తక్షణ వైద్య సేవలు పొందే అవకాశముంది. అయితే 350 పడకల సామర్ధ్యంతో మెడికల్ యూనివర్సిటీ ప్రణాళికతో 161 ఎకరాల్లో 100 కోట్లతో నిర్మించిన నిమ్స్ భవనంలో పూర్తి స్థాయిలో అన్ని విభాగాల్లో వైద్య సేవలు ఆరంభిస్తే ఆయా ప్రాంతాల ప్రజలకు మరింత ప్రయోజనకరంకానుంది. ఇందుకు ప్రభుత్వం త్వరగా చర్యలు చేపట్టాల్సివుంది. 2005 డిసెంబర్ 31న బీబీనగర్ నిమ్స్ యూనివర్సిటీ, ఆసుపత్రి నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 2009 ఫిబ్రవరి 22న ఎన్నికలకు ముందు హడావుడిగా అసంపూర్తి నిమ్స్ భవనానికి వైఎస్సార్ ప్రారంభోత్సం చేశారు. ఎన్నికల పిదప అసంపూర్తి భవన నిర్మాణం పనుల పూర్తికి కాంట్రాక్టర్ చేతులెత్తేయగా ఇక అప్పటినుండి నిమ్స్ భవనం నిరుపయోగంగా మారిపోయింది. టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రెండు నెలల్లో నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలందిస్తామన్న హామీ మేరకు గత వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య, ప్రస్తుత వైద్య శాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి పలుమార్లు ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. 2015 జనవరి 20న సిఎం కెసిఆర్ నిమ్స్‌ను సందర్శించి ఎయిమ్స్‌గా మారుస్తామంటూ ప్రకటించారు. అయితే నిమ్స్ భవనం ఎయిమ్స్ స్థాయికి సరిపడకపోవడంతో నిమ్స్ ప్రాంగణంలో ఉన్న స్థలం 152 ఎకరాలతో పాటు పక్కనే మరో 91 ఎకరాలు సేకరణ చేపట్టి మొత్తం 241 ఎకరాలు ఎయిమ్స్‌కు కేటాయిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. తెలంగాణకు కేంద్రం ఇస్తానన్న ఎయిమ్స్‌ను బీబీనగర్‌లోనే ఏర్పాటు చేయనుండడంతో ఈ ప్రాంత ప్రజలకు నిమ్స్‌తో పాటు భవిష్యత్‌లో ఎయిమ్స్ వైద్య సేవలు కూడా అందుబాటులో రానుండడం విశేషం.