తెలంగాణ

హెచ్‌సియు ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మరోమారు రణరంగంగా మారింది. జనవరి 17న పిహెచ్‌డి విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యతో చెలరేగిన వివాదం సద్దుమణుగుతున్న సమయంలో తిరిగి విసిగా బాధ్యతలు స్వీకరించేందుకు ప్రొఫెసర్ అప్పారావు రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రొఫెసర్ అప్పారావును విద్యార్థులు అడ్డుకుని విసి ఛాంబర్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.దాంతో యూనివర్శిటీలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విసిని అడ్డుకున్న 10 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జరిగే రోహిత్ సభలో పాల్గొనేందుకు ఢిల్లీ జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ వస్తున్నాడనే వార్తతో పోలీసులు వర్శిటీలో పహరాను మరింత పటిష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం, మరో పక్క మీడియా సమావేశం నిర్వహించాలని విసి అప్పారావు భావించారు. లైఫ్‌సైన్స్ విభాగం విద్యార్ధులకు ఈ విషయం తెలియడంతో వారు కూడా వచ్చి ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో దాదాపు వంద మంది విద్యార్ధులు వచ్చి కర్రలు, రాడ్లుతో దాడికి తెగబడ్డారు. తలుపులు, అద్దాలు కనబడిన ప్రతి వస్తువును పిండిపిండి చేసేశారు. సమావేశ మందిరంలో డీన్‌లు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, లైఫ్ సైన్స్ విద్యార్ధులు ఉండగా వారిపై కూడా దాడికి ప్రయత్నించారు. దాంతో అప్రమత్తమైన ఉద్యోగులు తలుపులు కిటికీలకు అడ్డంగా ఫర్నీచర్‌ను ఉంచి రెండు ద్వారాల వద్ద అడ్డుగా నిలిచారు. ఇంత జరుగుతున్నా యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు అడ్డుకోకపోవడం గమనార్హం. వర్శిటీలో పరిస్థితిపై కొంత మంది సమాచారం ఇవ్వడంతో పోలీసు బలగాలు వచ్చాయి. పోలీసుల రాకతో విద్యార్ధులు విసికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విధ్వంసాన్ని రికార్డు చేసిన ఎలక్ట్రానిక్ మీడియా కెమరామన్లపై కూడా వారుదాడికి పాల్పడ్డారు. నగర కమిషనర్ రాక
గచ్చిబౌలి: సైబరాబాద్ జాయింట్ కమిషనర్ శశిధర్‌రెడ్డి, మాదాపూర్ డిసిపి కార్తికేయలు వచ్చి విద్యార్ధులకు నచ్చచెప్పారు. నగర కమిషనర్ సివి ఆనంద్ యూనివర్శిటీకి వచ్చి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదే సమయంలో యూనివర్శిటీకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిని ఆంక్షలు ఉల్లంఘించారనే ఆరోపణలతో అరెస్టు చేసి రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే తన తప్పేమీ లేదని పేర్కొంటూ పోలీసు స్టేషన్‌లోనే వంశీచంద్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.
పోలీసులకు గాయాలు
గచ్చిబౌలి: పోలీసులకు, విద్యార్ధులకు మధ్య జరిగిన రణరంగంలో 10వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ శ్రీకాంత్‌రెడ్డి తలకు బలమైన గాయమైంది. ఆయనతో పాటు సివిల్ పోలీసులు జితేందర్‌కు, విజేందర్‌కు,గచ్చిబౌలి మహిళా సిఐ సునీతకు, సిఐ రమేష్‌కుమార్‌కు స్వల్పగాయాలయ్యాయి. శ్రీకాంత్‌రెడ్డిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విద్యార్ధుల ఆందోళన చూసిన ఉద్వేగానికి గురలైన క్రమశిక్షణా కమిటీ అధికారి అలక్‌పాండే రక్తపోటుకు గురై స్పృహతప్పి పడిపోయారు. దాంతో ఆయనను మరో ఆస్పత్రికి తరలించారు.
అప్పారావు మళ్లీ రావడం దుర్మార్గం: ఎస్‌ఎఫ్‌ఐ
హెచ్‌సియులో రోహిత్ మృతికి కారణమైన విసి అప్పారావు రెండు నెలలు సెలవుపై ఉండి మళ్లీ విధుల్లో చేరడం దుర్మార్గమని భారత విద్యార్ధి ఫెడరేషన్ నేతలు ఆరోపించారు. విసి కార్యాలయం ముందు ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ‘విసి గో బ్యాక్ ’ అంటూ ధర్నా చేశారు. అయితే పోలీసులు వారిని అడ్టుకునే క్రమంలో ఇరు పక్షాలు పడిగుద్దులు, లాఠీఛార్జీ జరిగింది. చాలా మంది విద్యార్ధులు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
జాతి వ్యతిరేక శక్తుల ఆగడాలు
విసి వసతి గృహంపై జాతి వ్యతిరేక శక్తులు దాడి చేయడాన్ని ఎబివిపి తీవ్రంగా ఖండిస్తోందని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎల్ అయ్యప్ప పేర్కొన్నారు. యూనివర్శిటీలో ప్రశాంత వాతావరణంలో తరగతులు జరుగుతున్న సమయంలో కొన్ని స్వార్ధశక్తులు అలజడి సృష్టించడాన్ని ఎబివిపి వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఐదు వేల మంది విద్యార్ధులు చదువుతుండగా, కొద్ది మంది విద్యార్ధులు మాత్రమే తరగతులకు హాజరుకావడంపై ఆదేశాలు ఇవ్వడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. అలాగే విసిగా ఎవరు ఉండాలనేదానిపై కూడా ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. గతంలోనూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆత్మహత్యలపైనా దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
పరిస్థితి సర్దుకుంటుంది:విసి
గచ్చిబౌలి: వర్శిటీలో పరిస్థితులు అన్నీ సర్దుకుంటాయని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మానవవనరుల మంత్రిత్వశాఖ ఆదేశాలతో తాను తిరిగి వర్శిటీలో బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చానని అప్పారావు పాత్రికేయులకు తెలిపారు. తనపై ఉన్న కేసుల విషయం కోర్టు చూసుకుంటుందని, వర్శిటీలో విద్యాత్మక చర్యలకు తాను కృషి చేస్తానని అన్నారు.

చిత్రం... హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ ప్రాంగణంలో పోలీసులతో
విద్యార్థుల ఘర్షణ. విద్యార్థుల దాడిలో ధ్వంసమైన విసి ఛాంబర్