తెలంగాణ

తుంగభద్ర నదిపై.. మరో ప్రాజెక్టు నిర్మాణానికి కర్నాటక సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 16: ఆర్డీఎస్ ఎగువ ప్రాంతంలో తుంగభద్ర నదిపై కర్నాటక ప్రభుత్వం మరో ప్రాజెక్టును నిర్మించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే తుంగభద్ర నుండి ఆర్డీఎస్‌కు (రాజోలిబండ) రావల్సిన నీటి కేటాయింపులు లేక ఒకపక్క ఆయకట్టుకు నీరందక ఆయకట్టు బీడు వారింది. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆర్డీఎస్ రైతులు భవిష్యత్తులో మరిన్ని కష్టాలను ఎదుర్కోక తప్పదు. ఆర్డీఎస్ కింద 87500 ఎకరాల ఆయకట్టుకు గాను ప్రస్తుతం 25 వేల నుండి 35 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపు దాదాపు 17 టిఎంసిలు ఉన్నప్పటికీ ఏటా కేవలం 4 నుండి 7 టిఎంసిల మేరకు మాత్రమే ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందుతోంది. ఒకవేళ తుంగభద్ర నది నుండి వరద జలాలు వచ్చినపుడు మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు 30 వేల ఎకరాలకు ఖరీఫ్ సీజన్‌లో సాగునీటిని అందిస్తున్నప్పటికీ ఏటా రబీకి మాత్రం 10 వేల నుండి 15 వేల ఎకరాలకు మాత్రమే నీరందిస్తున్నారు. గత మూడునాలుగేళ్ల నుండి జూరాల లింక్ కెనాల్ ద్వారా ఆర్డీఎస్ ఆయకట్టుకు 10 వేల ఎకరాలకు మేరకు సాగునీటిని వదులుతున్నారు. మొత్తంగా రబీ సీజన్‌లో గత మూడునాలుగేళ్ల నుండి ఆయకట్టుకు నీరే అందడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతాంగానికి కర్నాటక ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కర్నాటక ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును నిర్మించి దాదాపు 15 టిఎంసిల నీటిని కర్నాటకకు మళ్లించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లోని సుంకేసుల బ్యారేజీ, తెలంగాణకు సంబంధించిన ఆర్డీఎస్‌కు నికర జలాల మాట మరచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. వరుణుడు కరుణించి భారీ వర్షాలు కురిసి తుంగభద్ర డ్యాంకు భారీ వరద వచ్చి డ్యాంకు సంబంధించిన గేట్లు ఎత్తితే తప్పా దిగువ ప్రాంతానికి ప్రస్తుతం నీరు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే తుంగభద్ర డ్యాం 150 టిఎంసిల కెపాసిటికి గాను కేవలం 100 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంటుంది. తుంగభద్ర డ్యాంలో పూడిక పేరుకుపోవడంతో డ్యాం కెపాసిటి రోజురోజుకు తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆర్డీఎస్‌కు, తుంగభద్ర డ్యాంకు మధ్యలో మరో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు కర్నాటక ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇదే జరిగితే ఆర్డీఎస్ రైతాంగం భవిష్యత్తులో నికర జలాలను మరచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అదృష్టం ఉండి వరద జలాలు వస్తే తప్పా నికర జలాలు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ విషయం ఇప్పుడిప్పుడే బయట పొక్కుతుండడంతో అలంపూర్ నియోజకవర్గంలోని రైతుల్లో ఆందోళన మొదలైంది. కర్నాటకలో నిర్మించే ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. కర్నాటక ప్రభుత్వం నిర్మించబోయే ప్రాజెక్టును ముందుగానే అడ్డుకునేందుకు ఆర్డీఎస్ రైతాంగం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. కాగా, కృష్ణానదిపై ఎన్నో ప్రాజెక్టులు నిర్మించుకున్న కర్నాటక మరోసారి తుంగభద్ర నది వైపు దృష్టి సారించి మరిన్ని ప్రాజెక్టులను నిర్మించతలపెట్టింది.
సర్వే పనులు పూర్తయ్యాయి
-ఆర్డీఎస్ చైర్మన్ సీతారాంరెడ్డి
కర్నాటకలోని తుంగభద్ర దిగువ ప్రాంతం రాజోళిబండ ఎగువ ప్రాంతంలో దాదాపు 15 టిఎంసిల నీటి కెపాసిటీ గల మరో ప్రాజెక్టు నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోందని, అందుకు సంబంధించిన సర్వే పనులు కూడా పూర్తయ్యాయని ఆర్డీఎస్ ఆయకట్టు చైర్మన్ సీతారాంరెడ్డి తెలిపారు. కర్నాటకలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుపై ఆర్డీఎస్ చైర్మన్ సీతారాంరెడ్డితో ఆంధ్రభూమి ప్రతినిధి ఫోన్‌లో మాట్లాడగా కర్నాటక ప్రభుత్వం ఇప్పటికే తుంగభద్ర డ్యాం దిగువ ప్రాంతంలోని బెనుకూర్, చిక్కలపల్లి ప్రాంతాలలో ప్రాజెక్టును నిర్మించేందుకు సిద్ధం చేసుకుందని స్పష్టం చేశారు. కొప్పల్, బళ్లారి, రాయిచూర్ జిల్లాల సరిహద్దు తుంగభద్ర నదిపై 15 టిఎంసిలకు సంబంధించిన ప్రాజెక్టు నిర్మించే యోచనలో కర్నాటక ఉందని ఆయన అన్నారు. ఇదే జరిగితే ఆర్డీఎస్‌కు మరింత కష్టకాలం తప్పదని ఆయన తెలిపారు. అంతేకాకుండా రాయలసీమలోని సుంకేసుల డ్యాంకు కూడా ఇబ్బందులు తప్పవని ఆయన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు మంత్రి హరీశ్‌రావును కలిసి ఈ విషయాన్ని వివరిస్తామని తెలిపారు.
chitram...
రాజోలిబండ మళ్లింపు పథకం