తెలంగాణ

మరో సిద్దిపేటగా ఖేడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 10: ప్రలోబపెట్టడం, మద్యం తాగించడం, ఒట్టు పెట్టించడం, గూండాగిరి, దాదాగిరితో దౌర్జన్యంగా కొనసాగిన నారాయణఖేడ్ రాజకీయానికి చరమగీతం పాడాల్సిన బాధ్యత ఓటర్లపై ఉంటే, నియోజకవర్గాన్ని ఇప్పటి నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా అభివృద్ధి చేసే బాధ్యత మెదక్ జిల్లా బిడ్డగా తనపై ఉందని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. మెదక్ జిల్లావాసినైన నేను సిఎంగా ఎక్కడికైనా వెళితే నారాయణఖేడ్ వెనుకబాటుతనాన్ని గుర్తు చేస్తే ముఖం చెల్లదని, అలాంటి పరిస్థితి రాకుండా పూర్తిస్థాయిలో తీర్చిదిద్దడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ నెల 13న జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన నారాయణఖేడ్‌లోని రహమాన్ ఫంక్షన్‌హాల్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడారు. ఖేడ్ సమస్యలు తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు మరో సిద్దిపేటలా అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చాడని, మాట నిలబెట్టడానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. అభివృద్ధి కోసం సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 20ఏళ్ల క్రితం అందోల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వెనుకబడిన ప్రాంతం పరిస్థితులను రవాణాశాఖ మంత్రిగా తాను చెప్పిన మాటలే ఖేడ్ వెనుకబాటు తనం గురించి ఇప్పుడు హరీశ్‌రావు చెబుతున్నారంటే, మెదక్ జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధిలో ఎంతటి నిర్లక్ష్యానికి గురవుతుందో స్పష్టమవుతుందన్నారు. పశ్చిమ మెదక్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఖేడ్ ఉప ఎన్నిక రూపంలో కలిసి వచ్చిందని వివరించారు. గ్రామ గ్రామాన తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చలించిన మంత్రి హరీష్‌రావు నా కాళ్లు మొక్కుతానని మీ సాక్షిగా ప్రత్యేక ప్యాకేజీ అడిగాడని, హరీష్ తన కాళ్లు మొక్కాల్సిన అవసరం లేదని గోదావరి జలాలను గట్‌లింగంపల్లి ప్రాజెక్టుకు తీసుకువచ్చి ఖేడ్ ప్రజల కాళ్లు కడుగుతానని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో మార్కెట్ యార్డు, ఆసుపత్రి ఉండదా? ఇదేం దరిద్రమంటూ సిఎం ఆవేదన వ్యక్తం చేసారు. 60 సంవత్సరాలుగా కాంగ్రెస్, టిడిపిలు ఏం చేసాయో మీరు చూసారని, ఒక సారి టిఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చి చూడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. నులక మంచంపై స్నానం చేసి నీళ్లు వాడుకునే దుస్థితి ఇక నుంచి ఉండదని మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా పెట్టించి నీటిని అందజేస్తామన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 200 గిరిజన తండాలను రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికల నాటికి గ్రామ పంచాయతీలుగా మార్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పించడానికి కమిషన్‌ను ఏర్పాటు చేసామని త్వరలోనే అది నెరవేరబోతుందన్నారు. తెలిసి గొయ్యిలో పడకుండా విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు, మేదావులు ఆలోచించి టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు వివరించి చైతన్య పర్చాల్సిన అవసం ఉందని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. వరంగల్, హైదరాబాద్ జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపించినట్లుగా నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని గెలిపించే బాధ్యత ఓటర్లు తీసుకుంటే అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఈ సభలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీష్‌రావు, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రాజమణి, ఎంపిలు బిబి పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాబుమోహన్, చింతా ప్రభాకర్, రాంలింగారెడ్డి, మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... నారాయణఖేడ్ ఉప ఎన్నిక బహిరంగ
సభలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్