తెలంగాణ

సంక్షోభాలు చాలా చూశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో తెలుగు దేశం పార్టీని వదిలేసే ప్రసక్తి లేదని జాతీయ అధ్యక్షుడు, ఏపీ సిఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెదేపా బడుగు, బలహీన వర్గాల కోసం పని చేస్తోందన్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమని, నమ్మకద్రోహులు బయటకు పోయనంత మాత్రాన భయపడాల్సిన పని లేదన్నారు. 34 ఏళ్ల పార్టీలో అన్నీ అనుభవించి బయటకు వెళ్లిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గురువారం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ విస్తత్రస్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ ఓటమి, అనంతరం ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్‌లు పార్టీని వీడి తెరాసలో చేరడం వంటి తాజా పరిణామాలపై స్పందించారు. నేతలు వెళ్లినా తెలంగాణలో పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదన్నారు. భవిష్యత్ పరిణామాలపైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు, నేతలకు మనోధైర్యం కల్పించారు. తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎన్నో ఇబ్బందులు ఎదున్నామన్నారు. కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేయడమే కాకుండా హత్యలు చేశారన్నారు. అయినా ధైర్యంగా నిలబడిగలిగామన్నారు. గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పోటీ చేసేందుకే సాహసం చేయలేకపోయిందని గుర్తు చేశారు. ఇప్పుడు గెలిచినంత మాత్రాన టిఆర్‌ఎస్‌ను చూసి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని పని చేసినప్పుడే నాయకత్వ లక్షణం బయటపడుతుందని తెలిపారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమేనన్నారు. ఇదివరకు ఇద్దరు ఎంపిలు ఉన్న బిజెపి ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, తమిళనాడులో డిఎంకె అధికారంలో ఉండగా ఉప ఎన్నికల్లో ఏఐడిఎంకె పోటీ కూడా చేయలేదన్న సంగతి కార్యకర్తలు గమనించాలని అన్నారు. నన్ను మీరు హైదరాబాద్‌లో ఉండాలని కోరుతున్నారు, అందుకు నాపై ఉన్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. వీలైనంత వరకు ఎంత సమయం దొరికితే అంత సమయం తెలంగాణ ప్రజల కోసం పార్టీ తరపున మీ అందరితో కలిసి పని చేస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు. మీ మీ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని ఏవిధంగా బలోపేతం చేయాలి, ప్రజల పక్షాన ఎలా నిలబడి పోరాడాలనేది ఆలోచించుకుని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని క్యాడర్‌కు ఆయన దిశానిర్ధేశం చేశారు. అన్ని విధాల కార్యకర్తలను ఆదుకుంటాం, అధైర్యపడాల్సిన పని లేదని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. త్వరలోనే ముఖ్య నేతలతో మరో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేద్దామని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న కొత్తగా నియమితులైన టిటిడిఎల్పీ నేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కేంద్రమంత్రిని చేయాలని కోరారు. పార్టీ బాధ్యతలే కాకుండా అధికారిక బాధ్యతలు కూడా అప్పగిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. తద్వారా తెలంగాణలో అధికారులకు ఆదేశాలు జారీ చేసే పరిస్థితి ఉంటుందని అన్నారు. ఈ విస్తత్ర స్థాయి సమావేశంలో ఎంపిలు మల్లారెడ్డి, గరికపాటి, టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ ఎంపి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, సండ్ర వెంకట వీరయ్య, రాజేంద్రనాథ్ రెడ్డి, ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డితదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సమావేశానికి ఎల్‌బి నగర్ ఎమ్మెల్యే, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరు కాలేదు.