కృష్ణ

నగరంలో ఐదు తహశీల్దార్ కార్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 17: విజయవాడ నగరానికి చెందిన ప్రస్తుత తహశీల్దారు కార్యాలయ పరిధిని గతంలో 3మండలాలుగా చేసిన ప్రతిపాదనలను ప్రజల పరిపాలన సౌలభ్యం నేపథ్యంలో పునఃసమీక్షించి 4 లేక 5 మండలాలుగా మార్పు చేసేందుకు పరిశీలించాలని ప్రభుత్వానికి నివేదిక పంపామని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. స్థానిక జాయింట్ కలెక్టర్ ఛాంబరులో గురువారం కొత్త రెవెన్యూ డివిజన్, మండలాల కూర్పుపై సబ్ కలెక్టర్ జి.సృజన, అర్బన్ తహశీల్దారు (ఎమ్మార్వో) ఆర్ ఆర్ శివరావు, రూరల్ తహశీల్దారు వి.మదన మోహన్‌లతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వివరాలు తెలుపుతూ, 2011 సెన్సస్ ప్రకారం విజయవాడ సెంట్రల్ నియోకవర్గంలో 4.66 లక్షలు, తూర్పు నియోజకవర్గంలో 3.31 లక్షలు, పశ్చిమ నియోజకవర్గంలో 3.03 మంది జనాభా వున్నారన్నారు. ప్రస్తుత జనాభా గణాంకాల ప్రకారం విజయవాడ నగర పరిధిలోని 3 నియోజకవర్గాలలో సుమారు 15 లక్షలు జనాభా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అధిక జనాభా కలిగిన విజయవాడ మధ్య నియోజకవర్గాన్ని, తూర్పు, పశ్చిమలను 4 లేక 5 మండలాలుగా విభజించి నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రభుత్వానికి సూచనలను సమర్పించామన్నారు. మొత్తం ప్రస్తుతం ఉన్న మండల రెవెన్యూ కార్యాలయానికి అదనంగా సుమారు 3 లేక 4 తహశీల్దారు కార్యాలయాలను మంజూరు చేయవలసి ఉంటుందని జాయింట్ కలెక్టర్ చంద్రుడు తెలిపారు.

నేడు జిల్లా మత్స్య సహకార సంఘ ఎన్నిక
* చైర్మన్ పదవికి రేసులో తమ్ము, లకనం
* ఓటేయనున్న 139 మంది సొసైటీ అధ్యక్షులు
* అందరిలోనూ ఉత్కంఠ
మచిలీపట్నం, మార్చి 17: జిల్లా మత్స్య సహకార సంఘం ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. 15 ఏళ్ల అనంతరం సొసైటీ ఎన్నికకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, పరిశీలన పూర్తి కాగా శుక్రవారం ఎన్నిక నిర్వహించేందుకు మత్స్య శాఖాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 11 డైరెక్టర్ పదవులకు గాను 16 మంది బరిలో నిలిచారు. అయితే వీరిలో ఐదుగురిని తప్పించి మిగిలిన వారితో ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీ చేసిన కృషి ఫలించ లేదు. నామినేషన్లు దాఖలు చేసిన వారంతా ఉపసంహరణకు ససేమిరా అనటంతో ఎన్నిక అనివార్యమైంది. శుక్రవారం ఉదయం 8గంటల నుండి 2గంటల వరకు బందరు కోటలోని మత్స్య శాఖ ఎడి కార్యాలయం వద్ద పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు గాను ప్రిసైడింగ్ అధికారిగా పెనమలూరు ఎఫ్‌డిఓ చక్రాణి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారిగా మచిలీపట్నం ఫిషరీస్ డిడి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ అప్పారావు, పోలింగ్ ఆఫీసర్లుగా ఫిషరీస్ డిడి కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, మోటూరు ఫీల్డ్‌మెన్ స్వామి శేఖర్‌లను నియమించారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలో జిల్లాలోని మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు ఓటు హక్కు కలిగి ఉంటారు. జిల్లాలో మొత్తం 300 పైగా మత్స్య సహకార సంఘాలు ఉండగా ఇందులో 139 మంది సొసైటీలకు మాత్రమే అధ్యక్షులు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా మత్స్య సహకార సంఘ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ మధ్యే పోటీ నెలకొంది. 11 మంది డైరెక్టర్ పదవులకు గాను నామినేషన్‌లు దాఖలు చేసిన 16 మందిలో 11 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఉన్నారు. చైర్మన్ పదవి కోసం ఎవరికి వారు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా మచిలీపట్నం గిలకలదిండి సొసైటీ అధ్యక్షుడు తమ్ము ఏడుకొండలు, నాగాయలంక సొసైటీ అధ్యక్షుడు లకనం నాగాంజనేయులు మధ్య పోటీ నెలకొంది. అయితే చైర్మన్ పదవికి తమ్ము ఏడుకొండలు పేరు ఇప్పటికే ఖరారైందన్న ప్రచారం జరుగుతోంది. మత్స్యకార వర్గానికి చెందిన మంత్రి కొల్లు రవీంద్ర ఏడుకొండలు పేరును ప్రస్థావించినట్లు తెలుస్తోంది. నాగాయలంక మండలం శంకరాపురం సొసైటీ అధ్యక్షులు లంకే మణిచంద్రరావు, మచిలీపట్నం గిలకలదిండి సొసైటీ అధ్యక్షుడు తమ్ము ఏడుకొండలు, కంకిపాడు మండలం ఓండ్రంపాడుకు చెందిన మోకా మోహనరావు, బందరు మండలం క్యాంబెల్‌పేటకు చెందిన పెదశింగు సామేరు, గుడివాడకు చెందిన విష్ణుమూర్తుల శ్రీనివాసరావు, గన్నవరం మండలం చిక్కవరానికి చెందిన నువ్వుల సుబ్బయ్య, పమిడిముక్కల మండలం పడమటలంకపల్లికి చెందిన మోకా విష్ణు వర్ధనరావు, బందరు మండలం చిన్నాపురంకు చెందిన కొక్కిలిగడ్డ నాగ రమేష్, లంకే నాగమునేంద్రరావు, నాగాయలంకకు చెందిన లకనం నాగాంజనేయులు, కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంకు చెందిన తిరుమలశెట్టి మార్కండేయులు, బందరు మండలం కానూరుకు చెందిన ఒడుగు గంగాధర ప్రసాద్, చినకరగ్రహారానికి చెందిన గాడి వెంకట శ్రీనివాసరావు, కంకిపాడు మండలం మద్దూరుకు చెందిన చిప్పల రామదాసు, గొడవర్రుకు చెందిన గారపాటి రాజు డైరెక్టర్ పదవుల కోసం పోటీ పడుతున్నారు.

చీపుళ్లు చేతపట్టి బంగారం వ్యాపారుల నిరసన
మచిలీపట్నం, మార్చి 17: బంగారం వ్యాపారంపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని నిరసిస్తూ ది మచిలీపట్నం బులియన్, జ్యూయలరీ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం బంద్ నిర్వహించారు. అన్ని షాపుల యజమానులు దుకాణాలు మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా స్థానిక కోనేరుసెంటరులో వ్యాపారులు చీపుళ్లతో నిరసన తెలిపారు. అనంతరం మానవహారం నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని), మున్సిపల్ మాజీ ఛైర్మన్ షేక్ సలార్‌దాదా, జనతాదళ్ ప్రతినిధి మజ్జి జనార్ధనరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి మామిడి మురళీకృష్ణ, వస్త్ర వ్యాపారులు, కరిగింపు పనివార్లు, స్వర్ణకారుల సంఘం ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.

ఒవైసీ వ్యాఖ్యలు సిగ్గుచేటు
మచిలీపట్నం , మార్చి 17: ఎంఐఎం పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ భారతమాతాకీ జై అనను అనడం సరికాదని బిజెపి జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ అమృద్దీన్ ఖండించారు. స్థానిక బిజెపి కార్యాలయంలో గురువారం విలేఖర్లతో మాట్లాడుతూ మైనార్టీల కష్టనష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కలిగిన నాయకుడు ఈవిధంగా మాట్లాడటం తగదన్నారు. భారతదేశంలో పుట్టినవారు దేశానికి నష్టం కలిగించే విధంగా మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 28 రాష్ట్రాల్లోని దేశ జనాభాలో 25శాతం ముస్లింలకు ఆయన ప్రతినిధి కాదన్నారు. మారణహోమాలు, మతవిద్వేషాలు, కుంభకోణాలకు నిలయమైన కాంగ్రెస్ పార్టీ పాలనను భరించలేక ప్రజలు బిజెపిని గెలిపించారన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో భారత ఔన్నత్యాన్ని చాటుతున్న ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. పేదవాడికి రూ.1000 పెన్షన్, వికలాంగులకు రూ.1500 పెన్షన్ ప్రవేశపెట్టిన ఘనత ప్రధాని మోదీదేనన్నారు. విజయవాడ, విశాఖపట్టణం అభివృద్ధి, విశాఖపట్నం రైల్వేజోన్ ఏర్పాటుకు ప్రధాని పెద్దపీట వేశారన్నారు. నదుల అనుసంధానానికి వీలుగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజాసంక్షేమానికి కృషి చేస్తున్న బిజెపి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా డాక్టర్ల సెల్ కన్వీనర్ ఉడత్తు శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వైవిఆర్ పాండురంగారావు, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, జిల్లా మాజీ సెక్రటరీ కూనపరెడ్డి శ్రీనివాసరావు, మజ్దూర్ మోర్చా జిల్లా అధ్యక్షులు చిలంకుర్తి పృధ్వీప్రసన్న పాల్గొన్నారు.