సబ్ ఫీచర్

ఫ్రేరణతో విద్యార్థులకు విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుడి ప్రేరణ ఎంత అవసరమో, తల్లిదండ్రుల ప్రేరణ కూడా అంతే అవసరం. దక్షిణ కొరియాలోనైతే మొత్తం ఓ నగరమే విద్యార్థులకు ప్రేరణ కల్గిస్తుంది. అందుకే బహుశా ఈనాడు దక్షిణ కొరియా అన్ని దేశాలకన్నా విద్యారంగంలో ఎక్కువ మెప్పులు పొందింది. కేవలం తరగతి గదిలో పిల్లలకు మోటివేషన్ చేస్తే సరిపోదు. గతంలో ఓసారి పదవ తరగతి పరీక్ష హాల్‌టిక్కెట్లు ఇచ్చేటప్పుడు ఆనాటి కలెక్టర్ బుర్రా వెంకటేశం ఒక మారుమూల గ్రామానికి నన్ను తీసుకువెళ్లారు. అక్కడ గ్రామ ప్రజానీకం మొత్తం వచ్చి కూర్చున్నది. ఒక్కో విద్యార్థి హాల్ టిక్కెట్టు తీసుకుంటుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కినట్లనిపించింది. తెలంగాణలో ఆనాడు మేం ఎస్‌ఎస్‌సి పాసైతే ఊరు పెద్దలు వచ్చి మాకు ప్రోత్సాహాన్నిచ్చారు. అలాగే, ఎవరైనా కొత్త ఆవిష్కరణలు చేస్తే మనం వారికి అభినందనలే కాదు, వారి జన్మదినోత్సవాలు కూడా చేస్తాం. సర్ సి.వి.రామన్, రామానుజం లాంటి మేధావుల జన్మదినోత్సవాలు విద్యార్థుల విజయాలకు తొలి మెట్లు. బ్రెజిల్‌లో ఫుట్‌బాల్ టోర్నమెంట్ అయితే ఊరంతా వచ్చి తిలకిస్తుంది. అదీ ప్రేరణ. తెలంగాణలో కూడా భువనగిరిలో చంద్రయ్య, ప్రకాశ్ అనే క్లర్క్‌లు కలిసి రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు చేసేవారు. ఈనాడు కొత్తగూడెంలో 25 సంవత్సరాలుగా డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో బాలోత్సవ్ నిర్వహిస్తున్నారు. సమాజం ఇచ్చే ఆదరణ పిల్లలను పైకినెట్టుతుంది.
చదువంటే కేవలం పరీక్షలే కాదు. ఆటలు కావొచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు కావొచ్చు. పుస్తక పఠనం కావొచ్చు. చివరకు హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను కూడా జూలూరు గౌరీశంకర్ ఉత్సవంగా మార్చాడు. ప్రేరణ, మోటివేషన్ వెనుక తరగతి గది విజయాల రహస్యం దాగి ఉన్నది. ఓసారి ఖమ్మం జిల్లా కట్లారులో స్కూల్ డేకు వెళ్లాను . మొత్తం ఆ ఊరు ప్రజలు 4వేల మంది వచ్చి ఆ వేడుకలో పాల్గొన్నారు. ఆ ఊరిలో ఎంతమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారో చూడండి. అమెరికాలో ఉంటున్న ఒక విద్యార్థి ప్రతి సంవత్సరం ఇండియాకొచ్చి వరంగల్ జిల్లా నర్సంపేటలో పేద దళిత పిల్లలకు పాఠ్య పుస్తకాలు, ఇతర స్టేషనరీ సామగ్రి అందిస్తాడు.
తెలంగాణలో చదువుకు ఆదరణ లేదంటూ రాబోయే తరం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఒక విద్యార్థి పైస్థాయికి వెళితే ఊరంతా గర్విస్తుంది. ‘ఇతను మా ఊరి వ్యక్తి’ అని గొప్పగా చెప్పుకుంటుంది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం కొత్త శకానే్న ఆరంభం చేస్తున్నది. ప్రతి ఊరు నుంచి ఆవిష్కర్తలు రావాలి. ఆవిష్కర్తలు తాముచేసే ఆలోచనలతో వందల మందికి ఉపాధి కల్పించగలుగుతారు. అమెరికాలో రైట్ బ్రదర్స్ విమాన పరిశ్రమకు కారకులయ్యారు. ఇలాంటివారు ప్రతి ఊళ్లో ఉంటే దేశం సంక్షేమ కార్యక్రమాలతోపాటు భవిష్యత్ సమాజ నిర్మాణానికి పునాదులు వేస్తుంది. కనీసం నెలకొకసారైనా ఊరి ప్రజలు స్కూళ్లలో జరిగే చదువును పట్టించుకోవాలి. ప్రజల సందర్శనే విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తుంది. మీరిచ్చే ఈ ప్రోత్సాహమే రేపటి ప్రపంచానికి మణి కిరీటాలు కావొచ్చు. ప్రోత్సాహానికి, విజయానికి సన్నిహిత సంబంధం ఉంటుంది. తరగతి గదికి సమాజ పోషణ అవసరం.

- చుక్కా రామయ్య