అక్షర

తెలుగు పత్రిక సింహావలోకనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలుగు పత్రికారంగం -1832 నుంచి 2002 వరకు’
కంచి వాసుదేవరావు
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

తెలుగు పత్రికారంగ చరిత్రను గ్రంథస్తం చేయడానికి పూనుకోవడం ఓ విధంగా సాహసమే. పొత్తూరిలాంటి వారిని కొందర్ని మినహాయిస్తే కొమ్ములు తిరిగిన పాత్రికేయులు సైతం చేయలేని పనికి ఓ సాధారణ జర్నలిస్టు నడుం బిగించడం, అందుకోసం అహరహం శ్రమించి, అపారమైన సమాచారాన్ని సేకరించి ఓ గ్రంథంగా వెలువరించడం సామాన్యమైన విషయం కాదు. ఓ పక్కన వృత్త్ధిర్మాన్ని నిర్వర్తిస్తూనే మరోపక్క విషయ సేకరణకు సమయం కేటాయించడం, అదీ డెబ్భయ్యేళ్ల వయసులో చేసినందుకు కంచి వాసుదేవరావుగారిని అభినందించవలసిందే.
తొలి తెలుగు పత్రిక ఎప్పుడు వచ్చింది? ముందొచ్చింది దిన పత్రికా, వార పత్రికా? అప్పటి పత్రికల తీరుతెన్నులెలా ఉండేవి? బ్రిటిష్ వారి హయాంలో తెలుగు పత్రికల స్థితిగతులేమిటి? వంటి సమస్త సమాచారాన్ని వాసుదేవరావు తన గ్రంథం ‘తెలుగు పత్రికారంగం-1832 నుంచి 2002 వరకు’లో వివరంగా, విపులంగా ప్రస్తావించేందుకు ప్రయత్నం చేశారు. ఆయన ఆదినుంచీ దినపత్రికల్లోనే పనిచేసినా తన పరిశోధనను దిన పత్రికలకే పరిమితం చేయలేదు. బూతు పత్రికలను, ఎల్లో జర్నలిజం పత్రికలను మినహాయించి, తన పరిశోధనా ప్రస్థానంలో ఎదురైన ప్రతి తెలుగు పత్రికనూ స్పృశించారు. వీలైనంతమేరకు విశే్లషించేందుకూ ప్రయత్నించారు.
చదువుకున్నది డిప్లొమో ఇన్ ఫార్మసీయే అయినా, జర్నలిజం పట్ల మక్కువతోనే పత్రికల్లోకి వచ్చినట్టు రచయిత స్వయంగా చెప్పుకున్నారు. ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివితే ఆయనకు పాత్రికేయ వృత్తి పట్ల ఎంత మక్కువో తెలుస్తుంది.
తొలి తెలుగు పత్రిక ఏది అనే విషయంలో చాలామందికి అభిప్రాయభేదాలు ఉండవచ్చు. రచయిత పరిశోధన ప్రకారం మాత్రం మొట్టమొదటిసారిగా తెలుగు పత్రిక ప్రచురణకు 1832లోనే సన్నాహాలు జరిగాయి. ‘మద్రాస్ క్రానికల్’ పేరిట తెలుగు, తమిళ భాషల్లో పత్రికను తీసుకురావాలన్న ఆలోచన కాన్‌స్టాంటిన్ సాంపీ అనే ఆంగ్లేయుడికీ, మరో ముగ్గురు తెలుగువారు- ఎ.వాదిశైవ, వి.పి అయ్యంగార్, సాయన పెరుమాళ్లయ్య అనేవారికి కలిగిందట. అయితే ఇది దినపత్రిక కాదు...వారపత్రిక. బుధవారం తెలుగులోనూ, శనివారం తమిళంలోనూ తీసుకువచ్చేందుకు నిర్ణయించారట. పత్రిక నెల చందా రూపాయట. 185 ఏళ్ల కిందట ఈ ధర చాలా ఎక్కువే. కొసమెరుపేమిటంటే- ఇంత హడావిడి చేసినా, ఈ పత్రిక మొదలైందో లేదో, ఒకవేళ మొదలైతే ఎంతకాలం నడిచిందో తెలియలేదట. అయితే ఆ తర్వాత మరో ఏడాదికే- 1833లో ‘కర్ణాటక క్రానికల్’ అనే వారపత్రిక వెలువడినట్టు రచయిత కొన్ని ఆధారాలను సైతం ప్రస్తావించారు. చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ రాసిన ఓ లేఖను బట్టి 1835 నాటికి కచ్చితంగా తెలుగు పత్రికల ప్రచురణ మొదలైందని రచయిత ఘంటాపథంగా చెప్పారు. అలాచూస్తే 1830-35 మధ్యనే తెలుగు పత్రిక వెలుగు చూసిందని చెప్పవచ్చు. అంటే తెలుగు పత్రికలకు 180 ఏళ్ల పైమాటేనన్నమాట!
తెలంగాణలో నిజాం నవాబు ప్రోత్సాహంతో అడవి బాపిరాజుగారి సంపాదకత్వంలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ‘మిజాన్’ అనే పత్రిక వెలువడేదట. నిజాం నవాబు అండదండలున్నా, నిజాం వ్యతిరేక వార్తలు ఎక్కువగా ప్రచురితమయ్యేవట. ఈ పత్రికలో సుప్రసిద్ధ పాత్రికేయులు రాంభట్ల కృష్ణమూర్తి, శ్రీనివాస చక్రవర్తి, చినకామరాజు వంటి లబ్ధప్రతిష్ఠులైన పాత్రికేయులు కాలమ్స్ రాసేవారట. ఓసారి రాంభట్ల ‘నిజాం నవాబును నారాయణగూడలో ఉరి తీయాలి’ అంటూ ఓ వార్తను ప్రచురించారట. దానిపై పెద్ద గొడవే జరిగిందట. చివరికి బాపిరాజుగారు ఎలాగో పరిస్థితిని సద్దుమణిగేలా చేశారట. ఇలాంటి ఆసక్తిదాయకమైన విశేషాలు ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి.
‘ఈనాడు’ ఆవిర్భావాన్ని, పత్రిక ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ ఓ సందర్భంలో- ‘శాస్ర్తియతకు నిలవని వారఫలాలను ప్రచురించి పాఠకుల మానసిక దౌర్బల్యం నుంచి సొమ్ము చేసుకోవడం మంచిది కాదని ప్రధాన సంపాదకులు రామోజీరావుగారు భావించేవారు’ అని రాశారు. (అయితే తదనంతర కాలంలో ‘ఈనాడు’లోనూ వారఫలాలు మొదలయ్యాయి. ఈ పుస్తకం 2002 వరకూ సాగిన పత్రికల ప్రస్థానానికి మాత్రమే పరిమితమైంది. ప్రచురణకు ముందైనా ఇలాంటి వ్యాఖ్యలను రచయిత పరిహరించుకుని ఉండాల్సింది.)
వాసుదేవరావు తన రచనకు 2002లోనే ఫుల్‌స్టాప్ పెట్టినా, కారణాంతరాల వల్ల 2015నాటికి గానీ పుస్తకరూపంలో రాలేదు. (అయితే రాజమండ్రినుంచి వెలువడే ‘సమాచారమ్’లో 1998నుంచి రెండేళ్లపాటు ఈ రచన ధారావాహికంగా వెలువడింది.) ఈలోగా పత్రికారంగంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సూర్య, సాక్షివంటి పత్రికలు వచ్చాయి. వాటి ప్రస్తావన ఈ పుస్తకంలో లేకపోవడానికి కారణం ఈ రచనను 2002తో ముగించడమే.
పాత్రికేయ వృత్తిని ఉదరపోషణార్థం చేసేవారు కొందరు. వృత్తిమీద ఆసక్తితో, అనురక్తితో చేసేవారు మరికొందరు. రచయిత కంచి వాసుదేవరావు రెండోకోవకు చెందుతారు. రాసిన ప్రతి పత్రిక గురించీ ఏదో తెలిసిన సమాచారాన్ని రాసి ముగించకుండా, వ్యయప్రయాసలకోర్చి తెలుసుకుని రాయడం ప్రశంసనీయం. ఈ ప్రస్థానంలో ఆయనకు ఎన్నో అవరోధాలూ, ఆటంకాలూ ఎదురై ఉండొచ్చు. (‘మీ పత్రిక వివరాలు పంపమని కొందరు సంపాదకులకు లేఖ రాస్తే అటునుంచి ఎలాంటి స్పందనా లేదు’ అని రచయితే రాసుకున్నారు.) అయినా మొక్కవోని దీక్షతో రచయిత పుస్తక రచన సాగించారు. ఇంత పరిశోధన చేసి రాసినా, ‘ఈ రచన సమగ్రమనికానీ, లోపరహితమని కానీ చెప్పలేను’ అని పేర్కొనడం రచయిత వినయశీలతకు నిదర్శనం. చివర్లో 1832నుంచి 2002వరకూ వెలుగు చూసిన తెలుగు పత్రికల వివరాల పట్టికను ఇవ్వడం బాగుంది. పాత్రికేయులే కాదు, పాత్రికేయ వృత్తి మీద ఆసక్తి గలవారు కూడా చదవవలసిన పుస్తకమిది.

-రమణ