తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

విలువలు పెంచే దిశగా అక్షరాలు ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య సాహిత్య ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. లోగడ ఇవే జిల్లా సాహిత్య సభలుగా, మహాసభలుగా, రాష్ట్ర స్థాయి, ప్రపంచ స్థాయి మహాసభలుగా ఉండేవి. ఇప్పుడు దేశంలో ఇతరచోట్ల జరిగే బుక్ ఫెస్టివల్స్ నమూనాలో ఉత్సవాలు జరిపే ఆలోచన మొదలైంది. క్రాఫ్ట్స్‌మేలా, నాటకోత్సవాలు, సంగీతోత్సవాలు జరపడం ఆనవాయితీ. అదే విధంగా సాహిత్యోత్సవాలు జరగాలని, జరపాలనే ఆలోచనలు ఇప్పుడు వీస్తున్నవి. ఉ త్సవం అనగానే అదొక సౌరంభం. అలాగే జరపాలని భావించడం తప్పుకాదు. లలిత కళలకు అ లాంటివి జరుగుతుండగా సాహిత్యానికి ఎందుకు జరగ్గూడదు? జైపూర్ బుక్ ఫెస్టివల్ లాగే హైదరాబాద్ బుక్ ఫెస్టివల్‌ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో ఎక్కువగా ఆంగ్ల పుస్తకాలు, ఆ రచయితలకే ప్రాధాన్యత ఉంటుంది. ప్రాంతీయ భాషలకి రెండో స్థానమే. లిటరరీ ఫెస్టివల్‌కి, బుక్ ఫెస్టివల్, బుక్ ఫెయిర్ మధ్య తేడా ఉంది. బుక్ ఎగ్జిబిషన్ అంటూ ఏటా జనవరిలో హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈమధ్య విజయవాడలో కూడా పెద్దఎత్తున మొదలైంది. ఈ ప్రదర్శనల ప్రయోజనం, స్వ భావం వేరు. పుస్తక ప్రదర్శనలో పుస్తక విక్రేతలందరూ ఒకచోట చేరతారు. ఇది పుస్తక విక్రేతల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ కొనుగోలు, అమ్మకాలే ముఖ్యం. కొనుగోలుదారులను ఆకర్షించడం, వారి కోసం ఒకచోట పుస్తకాలను అందుబాటులోకి తేవడం ప్రధానం. పుస్తకాల కొనుగోలుదారుల కేంద్రంగా ఈ ప్రదర్శన నడుస్తుంది. ఇక్కడ సాహిత్యం ముఖ్యం కాదు. వివిధ రంగాలకు చెందిన పుస్తకాలు లభ్యత ముఖ్యం. స్థానిక, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు, పుస్తక విక్రేతలు ఒకచోట తమ పుస్తకాలను ప్రదర్శిస్తాయ. ప్రదర్శన అనే పేరు పెట్టినా అంతరార్థంలో వాటి అమ్మకాలే ముఖ్యం. అమ్మకం ఆలోచనే పరమావధి. అందుకే డబ్బులు చెల్లించి స్టాల్ కొని అందులో పుస్తకాలు పెడతారు. పెట్టడంతో సరిపోదు. స్టాల్‌కి ఒక పేరు పెట్టాలి. కరపత్రాలు ముద్రించి తమవద్ద లభించే పుస్తకాల పట్టికని ఇవ్వాలి. తమ స్టాల్ ఏ రకంగా ప్రత్యేకమైనదో కొనుగోలుదారులకు చెప్పాలి. అలా చేయడానికి కొన్ని ఇతర మార్గాలను అనే్వషించాలి. కొందరు వ్యాపార ఎత్తుగడలు వేస్తారు. మరికొందరు అలాంటి దానిని పైకి కనుపించకుండా లోలోన వ్యాపారీకరిస్తారు. ఇక్కడే ప్రచారం కోసం పాకులాట మొదలవుతుంది. కాక తప్పదు. పుస్తక ప్రదర్శన పండగలో అది ఒక భాగం. అందులోకి కావాలని ప్రవేశించిన వారు మరోలా వ్యవహరించలేరు.
ఈమధ్య పుస్తకాల అమ్మకాలు ఇలాంటి ప్రదర్శనలలో ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అక్కడకు వామపక్ష, విప్లవ సాహిత్య సంస్థలు కూడా వచ్చి వాలడం గమనించవచ్చు. పుస్తకం అచ్చేశాక, దానికి ధర పెట్టాక, ఇతర విక్రయదారులకు పర్సెంటేజిలు ఇచ్చాక, ఇక అమ్ముకోవడం తప్పదు. అమ్ముకోవడం, కొనుగోలుల మధ్య లాభనష్టాలు కూడా తప్పవు. స్టాల్‌ని కొనుక్కున్నాక ఆ డబ్బు అయినా రావాలి కదా. అక్కడ ఒకరో ఇద్దరో ఉండాలి. రానుపోను ఖర్చులు, తిండి ఖర్చులు ఎలానూ ఉంటాయి. కాబట్టి లాభం చేకూరాలి. ఇక్కడ జరిగేది పుస్తక వ్యాపారం. ఆ వ్యాపారం కోసం కొన్ని తిప్పలు తప్పవు. వాటిని అధిగమించాలి అనుకొంటారు కొందరు.
ఈ నేపథ్యంలో విప్లవ సాహిత్య సంస్థలు, రచయితలు పోటీపడి ఈమధ్య బుక్ ఎగ్జిబిషన్‌లో పుస్తకాలు పెట్టి అమ్మకాలు చేయడం కొందరికి విడ్డూరం అనిపిస్తోంది. మరికొందరు ఇందులో తప్పేముంది? పాఠకుడికి పుస్తకం అందించడం ముఖ్యం కదా అంటారు. కాని ఎందుకో ఈ వ్యా పార సంస్కృతి హడావిడిలో విప్లవ సాహిత్యం, విప్లవ రచయితల్ని చూడ్డం అంత సరిగా అనిపించడం లేదని భావించేవారు చాలామందే ఉన్నారు.
ఏదిఏమైనా బుక్ ఎగ్జిబిషన్‌లో పుస్తకాల అ మ్మకం వ్యాపారంలో వారూ భాగస్వాములు కావడం గమనించాలి. ఐతే ఇది ఒక రోజులో వచ్చిన మార్పు కాదు. విప్లవ సాహిత్య వ్యవస్థలోంచి జారిపోయిన, పోతున్న వారు కొందరు ప్రగతిశీల పుస్తక వ్యాపారం వృత్తిగా జీవించడం మొదలుపెట్టారు. వారు కేవలం ఇక్కడే కాదు జిల్లాజిల్లాకి తిరుగుతున్నారు. ప్రతి సభ దగ్గర పుస్తకాలు పెట్టి పడిగాపులు పడుతున్నారు. లాభాల కోసం అమ్ముడుపోయే పుస్తకాలు అచ్చేస్తున్నారు.
వట్టికోట ఆళ్వారుస్వామి ఊరూరా తిరిగి కావలసిన వారికి ప్రగతిశీల పుస్తకాలు అందించేవారు. వారికి పుస్తకాల్ని చేరువ చేయడమే ఆయన ఉ ద్దేశం. పుస్తకాలు అమ్మడానికి విక్రయ, లాభ సంస్కృతిలోకి ఆయన ప్రవేశించలేదు. అదీ ఆయన నుండి నేర్చుకోవలసిన పాఠం. సొంత ఆస్తి హరింప చేసి, అష్టకష్టాలు పడి ఎవరికి ఏ పుస్తకం అవసరమో వారికి దానిని అందించేవారు. అది ఒక విప్లవాత్మక ఆలోచన. ఇప్పుడు నడుస్తున్నది వేరు. విప్లవం వేరు. విప్లవం పేరుతో దానికి పెద్దగా ఉపయోగపడని పుస్తకాల అమ్మకం వేరు. చెట్టు పేరొకటి. పుస్తకం పండొకటి. ఏ ప్రజలకి దేనిని అందిస్తున్నామనే గీటురాయి లాంటి సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పుస్తకాల అమ్మకానికి, రాజకీయ నమ్మకాలకి సంబంధం ఉంటుందని కొందరి విశ్వాసం. ఆయా సంస్థల నేతలు, ఇతర రచయితలు, సాహిత్య సంస్థలతో వ్యవహరించే అప్రజాస్వామిక విధానం వెలుగులో వ్యాపార విక్రయ వేదికపై ఇతర సంస్థల, రచయితలతో పాటించే లాభాపేక్ష విధానం, సంకేతాలు చూసిన వారికి వాళ్ళ ద్వంద్వ వైఖరిని గుర్తించక మానరు. నీవూ మాతో సమానం. నా స్టాల్ పక్కనే నీవు అమ్ముకుంటున్నావు. నేనూ అమ్ముకుంటున్నాను అని మనసులోనైనా వారు అనుకోక తప్పదు.
విప్లవ కార్యక్షేత్రంలోని రచయితలు నిర్వహించే పాత్ర వేరు. నగరాల్లో మాత్రమే తిష్టవేసుకున్న ప్రగతిశీల విప్లవ నేతల మాటలు, చేతలు వేరు. ఈ రెండు ధోరణులను గమనించే సునిశిత పాఠకవర్గం, ప్రజలు కొల్లలు. అందుకేనేమో దండకారణ్యం రచయితలు అని ఒక విభాగం వేరుగా ఉంది. నగరారణ్యంలో చిక్కుకుపోయి రోజురోజుకి పెరిగిపోతున్నది వ్యక్తివాదపు ధోరణి ఒకటి ఆవరించి ఉంది. ఈ ధోరణి అధికమై అసలు లక్ష్యానికి దూరం పెరిగినప్పుడు ప్రవర్తించే వాడు సిసలైన మనిషి. విప్లవకారుల హింసని కూడా ప్రశ్నిస్తామనే విప్లవ సాహిత్య సంస్థల నిబద్ధత కొంతకాలం కిందే బట్టబయలైంది. అందుకేనేమో వీరి పుస్తకాల కొత్త వ్యాపార విధానం. రాజ్యాన్ని తుదముట్టించాలని, దాన్ని ప్రశ్నించాలంటూనే రాజ్యం తాబేదారీ రచయితలతో అంటకాగడం వెనుక మర్మం ఏమిటో ఆలోచించాలి. మొత్తానికి పుస్తక వ్యాపారం దినదినాభివృద్ధి పొందుతోంది. రోజురోజుకి స్టాళ్ళు పెరగడానికి ప్రగతిశీల రంగం తహతహ ఒక ఉదాహరణ. నిజానికి సొంత ఆలోచనతో, సంక్లిష్ట జీవితాల్లోంచి రచనలు చేసి అచ్చేసిన అనేకమంది అడుగువర్గాల రచయితలు తమ పుస్తకాలను అమ్ముకోవడానికి స్టాళ్ళు కొనుక్కోలేక పోవడానికి గల కారణాలు గమనించాలి. వీరిని ఆదరించే సంస్థలు సైతం లేకపోవడం గుర్తించాలి.
పుస్తక వ్యాపారం, వ్యాపార రచయితలకు చాలా దూరంగా మొన్నటి సాహిత్యోత్సవాలు జరగడడం విశేషం. మొన్న అలాంటి ఉత్సవం ఒకటి జరిగింది. దేశంలో సుమారు అరవై సాహిత్యోత్సవాలలో ఈమధ్య జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సాహిత్యోత్సవాలు జరుగుతాయి. కాని ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతే వరసగా ఏటా జరపడానికి పురికొలుపుతుంటుంది. ఉత్సవాలు పండగ కాదు. అది సాహిత్య వ్యవస్థకు ఎంతోకొంత ఉపయోగపడాలి. నిర్వాహకులు అలా వాటిని డిజైన్ చేయవలసి ఉంటుంది. సాహిత్యం పట్ల యువతరాన్ని ఆకర్షించే విధంగా సంస్థలు ఉండాలి. పాడిందే పాట లాగ ఉండకూడదు. కొత్త తరాలని సాహిత్య వ్యవస్థలోకి మలపాలి. ఎంత కాదన్నా, పెరిగిన జనాభా దామాషా ప్రకారం పాఠకులు పెరగడం లేదు. నిజానికి కొత్త పాఠకులను ఆకర్షించే విధంగా రచనలు వస్తున్నాయా? కొత్త రచయితల, కొత్త పుస్తకాలను పరిచయం చేయడం, ప్రదర్శనలు సాహిత్యోత్సవాల కర్తవ్యం కావాలి. ఆలోచనాత్మక, దార్శనిక సాహిత్య రచన పెరగాలి. పుస్తకాలను సూపర్ మార్కెటీకరించే క్రమంలో సమాంతర విప్లవ రాజకీయవాదులు ఆ పోటీనుండి తప్పుకోవడం సముచితం. నిజానికి ప్రదర్శనలు, ఉత్సవాల దశ దాటి సాహిత్య స్థాయి పెరగాల్సిన అవసరం ఉంది.
*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242