తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

... అలాంటి జ్ఞాపకాలు సమాజానికి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న డిసెంబర్ 2వ తేదీన నలగొండ జిల్లా నకిరేకల్లు మండలంలోని పెరిక కొండారం గ్రామంలో ఒక సభ జరిగింది. అది పలస భిక్షం అనే అతని పదో వర్ధంతి సభ. 1924లో పుట్టిన ఇతను నైజాం వ్యతిరేకోద్యమంలో రైతుల పక్షాన నిలిచి పోరాడాడు. ఎన్నో నిర్బంధాలకు తట్టుకున్నాడు. రజాకార్లు, పోలీసులు వేటాడుతుంటే అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు. కూలి పనులు చేసి తిరిగి ఊరు చేరాడు. ఎన్నో ఇక్కట్లు పడుతూ దళ కమాండర్‌గా, కళాకారుడిగా జీవితాంతం తన సేవలు అందించాడు. అటువంటి భిక్షం ఊరికి వెళ్ళి కల్లు రామచంద్రారెడ్డితో కలిసి 1979లో తెలంగాణా పోరాట పాటలు కొన్ని సేకరించాను. అప్పుడు ఆయన చూపిన ఆదరం ఈనాటికీ మరచిపోలేనిది.
హైదరాబాదు నుండి బయలుదేరినప్పటినుండి పాత జ్ఞాపకాల వేట మొదలైంది. నేను వాటి బారినుండి ఎంత తప్పించుకోవాలని చూసినా సాధ్యంకాలేదు. చదువుసంధ్యలు లేని శ్రమజీవులు చూపిన పటిమ అబ్బురపరిచింది. ప్రపంచంలోనే అత్యంత ధనికుడు, భారతదేశంలో అతి పెద్ద సంస్థానాధీశుడు అయిన నైజాం నవాబుని గడగడలాడించడం బురద కాళ్ళకి ఎలా సాధ్యమైందో ఆలోచిస్తే ఒళ్ళు జలదరిస్తుంది.
ఏ కొద్దిపాటి చైతన్యం కనుపించినా గ్రామాధికారులు, దొరలు, జాగీర్దార్లూ దానిని మూలాలనుండి అణచివేసేవారు. తిరిగి తలెత్తకుండా తుడిచి వేయడం మామూలు. దీనికి భయపడి ఎవరూ నోరెత్తేవారు కాదు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ విచారంలో కూరుకుపోయేవారు. ప్రభుత్వం ‘లెవి’ పేరుతో పండిన పంటలో కొంత భాగం వసూలుచేసేవారు. దొంగలెక్క చెప్పి బలవంతంగా కళ్ళముందే ధాన్యం తీసుకుపోయేవారు. ఎవరైనా అది తప్పని అంటే వారిని శిక్షించేవారు. ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం ఎదురుతిరిగితే కరణాలు, దొరలు ఏకమై రైతులను చితకబాదేవారు. రైతుల బాధలు చూసి రైతుకూలీలు కూడా వారికి మద్దతుగా నిలిచారు.
యువకుడైన పలస భిక్షాన్ని ఆ వాతావరణం కలచివేసింది. ఆ దురాగతాల్ని ఎదిరించేందుకు సిద్ధమయ్యాడు. పల్లాల గ్రామంలో లెవి కొలిచే సమయానికి అక్కడకు చేరుకుని అధికారుల దురాగతాల్ని ఎదుర్కున్నాడు. కాసరగోడు గ్రామంలో ధాన్యం బండ్లకెత్తించి తీసుకుపోతుంటే అడ్డుకున్నాడు. 1944లో జరిగిన 11వ ఆంధ్ర మహాసభల చైతన్యంతో పలస భిక్షం పూర్తిగా మారిపోయాడు. కుటుంబ వృత్తి అయిన కల్లుగీత పనిని, చదువును పక్కనపెట్టి నాయకులతో కలసి ఊరూరు తిరిగాడు. విసునూరు దొర ఆగడాలను విని చలించిపోయాడు. కొరియర్‌గా ప్రారంభమై కమ్యూనిస్టు దళ కమాండర్‌గా ఎదిగాడు. ఆ ప్రాంతం క్షుణ్ణంగా తెలిసి ఉండడంవల్ల ఎంతో మందికి రక్షణ కల్పించాడు. 1947-48ల మధ్య యూనియన్ సైన్యాలు రాకముందు ప్రాంతీయ సమన్వయకర్తగా, కళాకారునిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తరువాత శత్రుదాడులు పెరిగినకొద్దీ వూళ్లో ఉండలేక విజయవాడ వెళ్ళిపోయాడు. అక్కడ కూడా పోలీసులు వెంటబడడంతో మదరాసు నగరం చేరాడు.
కొంతకాలానికి ఖమ్మం సరిహద్దులు చేరి అక్కడ కూలీగా పనిచేస్తూ ఉద్యమాన్ని నిర్మించాడు. దేశం స్వాతంత్య్రం పొందాక, మిలటరీ చర్య జరిగి సంస్థానం విముక్తి చెందాక, 1952లో పోలీసులు పలస భిక్షాన్ని అరెస్టుచేసి నానా నరకయాతనలకు గురిచేశారు. 1954 జనవరిలో ఆయన జైలునుంచి బెయిలుపై విడుదలయ్యాడు.
ఇంత జరిగినా అతను బలహీనపడలేదు. పైగా మరింత చురుగ్గా కార్యక్రమాలు చేబట్టాడు. ‘దునే్నవానికి భూమి’ నినాదంలా ‘గీసే వాడికే చెట్టు’అనే నినాదంలాగా గీత కార్మికోద్యమాన్ని ఆ ప్రాంతంలో ఉధృతం చేశాడు. అప్పటినుండి మరణించేవరకు ప్రజావిప్లవోద్యమమే అతని పతా అయ్యింది. వివిధ కాలాలలో దశలలో అతను ప్రజల పక్షం నిలిచాడు. ఇలాంటి ఉద్యమకారుల గొప్పదనం ఏమంటే, వారు స్థానికంగా ఉంటూ, స్థానిక సమస్యలపై యుద్ధం చేయడం. స్థానికత అంటే నిర్దిష్టత. నిర్దుష్టమైన కార్యక్రమాలు జరపడం చాలా కష్టం. సాధారణీకరింపబడిన ఉద్యమాలలో పాల్గొనడం సులభం. అది పెద్దగా ఫలితం చూపని పని. స్థానిక ఉద్యమంలో పనిచేసే వారిపైనే అందరి దృష్టిపడుతుంది. ఏమాత్రం ఆదమరిచి ఉన్నా శత్రువు చేతిలో చిక్కుతాడు. వారి దుశ్ప్రచారంలో పడి గిలగిలలాడుతాడు. వ్యక్తిత్వ హననానికి గురవుతాడు. అందుకే చాలామంది సాధారణీకరింపబడిన ఉద్యమాలలో చురుగ్గా ఉండాలని భావిస్తారు. నిజానికి దీనివల్ల పెద్దగా ఒరిగిందేమీ ఉండదు.
కాని పలస భిక్షం తాను నివసించే ఊరిని, మండలాన్ని, ప్రాంతాన్ని జాగృతం చేయడంలో అహర్నిశలు పనిచేశాడు. జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు.
పలస భిక్షం కవిగా పాటలు రాశాడు. గాయకుడిగా తన పాటలూ, ఆనాటి ప్రజాకవులు వయ్యరాజారాం, సుద్దాల హనుమంతు, యాదగిరి, తిరునగరి రామాంజనేయుల వంటివారి పాటలు పాడాడు. ఎన్నో రకాల బాణీలలో పాడి ప్రజలను ఉర్రూతలూగించాడు. వీధి నాటకాలు వేశాడు. కోలాటాలు ఆడాడు. సన్యాసి పాటలు, బైరాగి బాణీలు, గొల్లసుద్దుల రాగాలు తీశాడు. ఒక సాంస్కృతిక యోధునిగా పనిచేశాడు. ఐనా అతని నడకలో, నడవడిలో, ప్రవర్తనలో అణకువ కనుపించేది. ప్రజలలో కలిసి పనిచేసే వాడే నిజమైన ఉద్యమకారుడు. ఉద్యమాల పేరుతో తమకి పేరుప్రఖ్యాతులు తెచ్చుకొనే నేతలు చాలామంది ఉంటారు. వారికి కీర్తి ప్రతిష్టలు రావడానికి స్థానిక ఉద్యమకారుల కృషే పునాది.
మా కారు నలగొండ జిల్లా సరిహద్దుల్లోకి చేరింది.
ఎనె్నన్నో జ్ఞాపకాలు ముసురుకున్నాయి.
కాలిలో తూటా తగిలి మరణించేవరకు దానితో సహచర్యం చేసిన శివయ్య గుర్తొచ్చాడు. నాట్లలో, కోతల్లో పనిచేస్తూ తెలంగాణా పోరాట వీరులను స్మరించుకునే శ్రామిక తల్లుల ఉయ్యాల పాటలు ఎన్నో గుర్తొచ్చాయి. వెనె్నల్లో ఆ పాటలే చుట్టకాముడు పాటలయ్యాయి వారికి.
నైజాంని ఎదిరించి భూస్వాములను పారదోలిన మామూలు కోన్‌కిస్కాగాళ్ళు చేసిన పోరాటం ప్రపంచంలో గుర్తింపు పొందడానికి ఆనాటి సాంస్కృతిక రంగాన్ని ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఆ రంగం పునాది ఇంకా ఆరోజు రాత్రి పెరికకొండారంలో కనుపించింది. పదో వర్ధంతినాడు తమ ప్రియతమ నాయకుడిని జ్ఞాపకాలతో సత్కరించారు ప్రజలు.
రాత్రి ఆరంభమైన సభ, అర్థరాత్రివరకు ఆటపాటలతో కొనసాగింది. టీవీలను కట్టేసి, నిద్రని పడకలకి గుచ్చేసి, అలసటని భిక్షం స్మృతులతో పారదోలారు. గబగబ ఇంత తిని వేదిక దగ్గరకు చేరారు. న్యుడెమాక్రసి వారి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వేసిన స్ర్తిల కోలాటం ఆ నేలని పరవశింపజేసింది. పాటల ఉరవడితో ఊరిని దిగ్బంధం చేశారు. ఆడిన ప్రతి ఆట ప్రేక్షకుల హృదయాలను హిట్ చేసింది. ఒక సాంస్కృతిక సంరంభంలో నాలాంటివాళ్ళు సైతం మునిగిపోయారు.
మధ్యమధ్య మోగిన ఒక జంకార సంగీత నాదం నరాలలో కలసి ఉరకలెత్తింది. ఆ వాద్యం పేరు జమిడిక. 1960 దశకంలో సుబ్బారావు పాణిగ్రాహి , తరువాత దానిని ఇప్పుడు ఇంతకాలానికి కుంభజడ సుబ్బారావు లు ప్రజల మధ్య వాయించారు. బననీలు అనబడే బైండ్లవారు రేణుకాఎల్లమ్మ కథలు చెబుతూ వాయించే వాద్యం ఇది. పనె్నండో శతాబ్దపు కవి అయన పాలకురికి సోమన ఉటంకించిన వాద్యమిది. నిజానికి ఇది అంటరాని కులంవాళ్ళ వాద్యం. కాని దానిని విన్న హృదయాల నుండి ఏనాటికీ ఆ ధ్వని దూరం కాదు. అలాంటి వాద్యాలను అరుణోదయంలో లీనం చేయడంవల్ల ఎంతో మంచి సందేశం ఇచ్చినట్లవుతుంది. జానపద సంగీత వాద్యాలు మానవ జ్ఞానంలో భాగాలు. వాటిని ఇవ్వాళ ఎవరికి ఇష్టమైన రీతిలో, దేనికైనా వాడవచ్చు. కాని ఆ వాద్యం విప్లవాగ్నులు రగిలిస్తుందన్న మాట మాత్రం వాస్తవం.
ఇలాంటి చైతన్యం నిరంతరాయంగా ప్రసారం కావాలి. మన దేశీ సమాజంలోని మానవీయతకి, జ్ఞానానికి మనం వారసులం. మన సాంస్కృతిక వ్యక్తీకరణ మన ఆయుధంగా ఉండాలి. అప్పుడే అశేష ప్రజలు, దేశం, పౌర సమాజం క్షేమంగా ఉంటుంది. ఎవరికివారు అనుబంధ రాహిత్యంతో, దేనినీ పట్టించుకోకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా ఉండడం అంత క్షేమంకాదు. మనకి మనం గ్రహాల్లా బతుకుతు విడివిడిగా ఉన్నాం. ఇప్పుడు పరాయివాడు ఏ రూపంలో కూడా మనని విడగొట్టలేడనే ఆశ్వాసన కావాలి. అది సాంస్కృతిక చైతన్యం ద్వారానే విస్తరిస్తుంది.
మన చుట్టూ పలస భిక్షాలు ఉంటే ఎంతో ధైర్యంగా ఉండేది. అలాంటి వారి జ్ఞాపకాలైనా మనవెంట ఉంటే బాగుంటుందని అనిపించింది తిరుగుప్రయాణంలో.

జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242 jayadhirtr@gmail.com