తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

లక్ష్మణరేఖల మధ్య మల్లన్నసాగర్ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణా (5 జూన్, 2016) రచయితల వేదిక ఏటిగడ్డ కిష్టాపూర్ పర్యటన జరిపి దాదాపు నాలుగు నెలలైంది. నాలుగు నెల్ల కిందటి జ్ఞాపకాలు రోజురోజుకి ఎక్కవవుతున్నాయ. వాటిని ఈ వారం మీతో-
మల్లన్నసాగర్‌కి వ్యతిరేకంగా అంతకుముందు నెలకిందే ఎవరి ప్రమేయం లేకుండా ప్రజాఉద్యమం ఆరంభమైంది. ఈమధ్య కాలంలో అనేక మలుపులు, ప్రభుత్వం పట్టింపులు, ప్రజల ధర్మాగ్రహం, కోర్టుల దో బూచులాటలు ఎనె్నన్నో. ఉన్నత న్యాయస్థానంలో కేసులు, స్టేలు, తీర్పులు అంతా కలగాపులగం.
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలది నైతిక వి జయం. అడ్డగోలు ప్రతిపాదనలు, ఆగ్రహావేశాలు, తెలియని అజెండాలతో ప్రభుత్వవర్గాలు! ప్రజలను విడదీసే బహిరంగ ఎత్తుగడలు, చదువులేని ప్రజలను భయాందోళనలకు గురిచేసిన ప్రభుత్వాధికారులు. వెనకట దొరలు కాగితాలపై వేలిముద్రలు వేయించుకున్న పాత వైనం పునరావృతం కావడం ఒక లీల. చదువుకున్న వాళ్ళని- తాయిలాలు ఇస్తామని ప్రలోభాలకు రాజ్యమే గురిచేస్తున్నది. ‘అభివృద్ధి’ పేరుతో అధికార వర్గాల వైఖరి వ్యథలకు గురిచేస్తున్నది. పెద్దపెద్ద తలపండిన ఇంజనీర్లని సైతం ధిక్కరిస్తూ రాజకీయ భాషణలు, పత్రికా ప్రకటనలు.. నోరులేని ప్రజలకు అసలు ఏం జరుగుతుందో తెలియని వైనం. ప్రాజెక్టు ఆగుతుందా లేదా అది వేగవంతమై భూమితోపాటే తమ బతుకులు సాగరం నీళ్ళలో అట్టడుగుకు చేరిపోతాయా అనే భయం పాతుకుపోయంది. అంతటా శ్వసాడనితనం. ఊపిరాడనితనం తెలంగాణా మూల మూల వ్యాపించింది. ఏదో ఒక అభివృద్ధి మిషతో తమ బతుకుల్ని స్వాహాచేస్తారనే భయవిహ్వలత, ఆందోళన, కనిపించని వేదన. ఎక్కిళ్ళు పట్టే రోదన. ఎందుకిలా జరుగుతోంది? ప్రజలు ఏం పాపం చేశారని.
వేల కోట్ల అప్పులు. అప్పులు తేవడమే పరిపాలనా విజయంగా భావించడం. అలా తెచ్చిన కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్లకు పందేరం. ప్రాజెక్టు వ్యయం అంచనాలు అమాంతం రెట్టింపు. డ్యాముల ఎత్తు ఎంత పెరుగుతుందో లేదో ఎవరికెరుక. ప్రస్తుతం మాత్రం పెంచిన అంచనాల మేర బడ్జెట్ పంపకాలు సజావుగా జరిగిపోతున్నాయ. నీళ్ళ వాటాకోసం రేపటి యుద్ధాల మాట దేవుడెరుగు. ప్రస్తుతం వాటాల పంపకం మాత్రం హాయగా జరిగిపోతున్నది. ఎవరేమన్నా ఒకటి మాత్రం నిజం. జలయజ్ఞం ఎప్పుడూ ధనయజ్ఞమే అన్నది చరిత్ర చెప్పిన వాస్తవం. అందుకే ఏ పాలకులైనా కట్టడాలు, తవ్వడాలకే పరిమితం. అదే పరిపాలన అనే స్థితి సృష్టించి దానిలోనే రాజకీయాలు నెరపడం. ఎన్ని లక్షల ఎకరాల భూమి తడుస్తుందో కాగితాలు ఖరారుగా చెప్పలేక పోతున్నాయ. కాని ఎన్ని టియంసీల డబ్బుతో ఎన్ని చేతులు తడపబడుతున్నాయో మాత్రం ప్రజలకి అర్థం అవుతునే ఉన్నది.
గతంలో జరిగిన జలతంతులో కోట్లాది రూపాయలు కొన్నిచోట్ల కూడుకున్నాయి. కాని సమాజం చీల్చబడలేదు. అప్పుడు ప్రజావ్యతిరేక సంఘాలు పాలకవర్గాలచే పోషింపబడలేదు. ప్రాజెక్టులు కట్టడం కోసం ప్రజాసామాన్యాన్ని భయాందోళనలకు గురిచేయ లేదు. బంగారు పాలన అనే పేరు చెప్పలేదు. కొందరే సింగారింపబడినా పౌర సమాజాన్ని చిందరవందర, పేలిక చీలికలు చేయలేదు. కాగితాల మీద తమ పనులు నిశ్శబ్దంగా కానిచ్చుకున్నారు. పెరిగినవారు పెరిగారు. తరిగినవారు దిమ్మతిరిగి పడిపోయారు.
కాని, ఇప్పుడు ఉద్యమాలు చేసి, త్యాగాలు రాసిపోసి, ఓట్ల పంట పండించి బంగారు గద్దెల మీద కూచోబెట్టిన రాజకీయ నాయకులు ప్రజల జీవితాలలో తెలియని భయం తాండవింప చేస్తున్నారు. మాట్లాడలేని వౌనం. ప్రజల గొంతుకలో కత్తులు దింపి, నిశ్శబ్ద రాజ్యంలో వారిని నిర్జీవులుగా మార్చే పరిస్థితి నెలకొనింది. దీని వెనుక ఏదో మతలబు కనిపిస్తోంది. సహజంగానే చేతులు తడిసిన ప్రతిపక్ష రాజకీయ నాయకులు తమకేమని పట్టనట్టు ఉండిపోతారు. మరికొందరు చెలరేగిపోయి అసలు అంతిమ చర్య దగ్గర తమ నాటకానికి ‘కావలసిన’ ముగింపులు పలుకుతారు. కొద్దిమంది మాత్రమే అన్యాయానికి గురయ్యే ప్రజల పరిస్థితి గమనించి, వారి తరఫున నిలబడతారు. అది చాలు! ప్రతిపక్షాల మీద నెపాల బుల్డోజర్లు దొరలుతాయి. ఇదంతా వాటి కుట్రే అని పాలకపక్షాలు, చేతులు తడిసిన విపక్ష సపక్షీయులు తేల్చివేస్తారు. తేలాల్సిందే. ఈ దేశంలో ఏదీ స్థిరమైన పాలకపక్షం కాదు. ప్రతి పార్టీ ఏదో ఒకరోజు ప్రతిపక్షమే. రేపు అధికారపక్షం కూడా ప్రతిపక్షం కాదనే హామీ ఎవరూ ఇవ్వలేరు. ప్రపంచంలో మహామహా నేతలకే ఆ గతి పట్టక తప్పలేదు. ఐతే ఇప్పుడు సమస్య ఏమంటే, పాలకపక్షం ప్రతిసారి ప్రతిపక్షాల కుట్ర అని అలవోగ్గా అనడం తప్పు. ఇక్కడ సమస్య పధ్నాలుగు గ్రామాల ప్రజలది. ఒక్క నోటి మాటతో ప్రతిపక్షాల కుట్ర అంటే దాని వెనుక ఉన్న అసలు సమస్యని, అసలు ప్రజల ఆకాంక్షల్ని మరుగునపడేసే పాలకపక్ష కుట్ర ఒకటి దాగి ఉంది అనిపించక మానదు.
నిజానికి ఏ పార్టీ, గ్రూపు మద్దతులేకుండానే ప్రజలు ఏటిగడ్డ కిష్టాపూర్‌లో నిరాహారదీక్షకు కూర్చున్నారు. అరవై రోజులు దాటాక గాని అది ఊపందుకోలేదు. ఎలాంటి వివరాలు నింపకుండా తమ భూములను తహశీల్దార్ల పేర రాసి ఇవ్వడానికి వెనకాడిన రైతుల నుంచి నయాన భయాన సంతకాలు తీసుకుంటుంటే ఉద్యమం ఉద్ధృతమైంది. అప్పుడు ముందు పౌర సమాజం, స్థానిక యువత ముందుకు వచ్చింది. ఆ క్రమంలోనే తెలంగాణా రచయితల వేదిక పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తరువాతే టిజేఏసీ వంటి వేదికలు, సిపియం, కాంగ్రెస్, సిపిఐ వంటి పార్టీలు పూర్తి స్థాయలో అక్కడకు వెళ్ళాయి. కొన్ని పార్టీలు అంతకుముందే తమ కేడర్ అక్కడి ప్రజలకు మద్దతు పలుకుతామంటే సరే అన్నాయి. అలాంటి పరిస్థితులలో ప్రభుత్వం నాలుగు వైపులనుండి ప్రజల మీద వత్తిడి తెచ్చి బేషరతుగా ఉద్యమాన్ని ఆపాలని చూసింది. అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థని, రాజకీయ దళారులను రంగంలోకి దింపింది. అప్పుడు ఒంటరి అయిన ప్రజల తరఫున ప్రతిపక్షాలు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. ప్రజల న్యాయపోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రత్యామ్నాయం చూపుతామని ముందుకువస్తే ప్రతిపక్షాల ప్రశ్న ఉత్పన్నం అయ్యేది కాదు. మల్లన్నసాగర్ ప్రజల పక్షం నిలిచే కవులూ, కళాకారులను, మేధావులను ప్రభుత్వం- తెరాస వ్యతిరేకులని, తెలంగాణా ప్రభుత్వ వ్యతిరేకులని, తెలంగాణా ఉద్యమానికే వ్యతిరేకులనే ముద్ర వేయడానికి ప్రయత్నించడం బాధాకరం. ఇలాంటి చౌకబారు యుక్తులవల్ల కొత్త ప్రభుత్వానికి వచ్చిన చెడ్డపేరు చెరిపేస్తే సులభంగా పోయేదికాదు. పైగా ప్రభుత్వంలో భాగమైన సియం పేషీ, మంత్రి పేషీలలో పనిచేసే ఉద్యోగులకి ప్రభుత్వం ముందుగా సమాచారం సప్లైచేసి చాలా దినపత్రికలలో వ్యాసాలు రాయించింది. పార్టీ అధికార ప్రతినిధులు రాసిన వ్యాసాలను ప్రచురించేట్లు పత్రికలపై వత్తిడి తేవడం కూడా విచారకరం. తమవరకు వస్తేనే పత్రికా స్వేచ్ఛ అని గగ్గోలు పెట్టే కొన్ని పత్రికలు ఈ విషయంలో పాలక, ప్రభుత్వ పక్షాల రచయితల వ్యాసాలకు, వార్తలకు ఇచ్చిన స్థానం చాలా ఎక్కువ. ప్రజల తరఫున రాసిన వ్యాసాలు తక్కువగా ప్రచురింపబడినాయి. ఇలాంటి పరిస్థితి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో కూడా సంభవించలేదు. అన్ని పత్రికలు తెలంగాణా ప్రజల ఆకాంక్షని గుర్తించి, వారి ఉద్యమ వార్తలని ప్రచురించాయి. విచిత్రం ఏమంటే మల్లన్నసాగర్ ప్రజల ఉద్యమం పత్రికల పాత్రని, వాటి స్వభావాన్ని సైతం బహిర్గతపరిచింది. తెలీకుండానే ఈ సందర్భంలో సాహిత్య సాంస్కృతిక రంగం దోహదం చేయవలసినంత చేయలేకపోయింది. సృజన రంగం ఎలుగెత్తాల్సినంతగా ఎలుగెత్తలేదు. రచనలు ఎక్కువగా వెలువడవలసిన తరుణంలో చాలా కలాలు నిశ్శబ్దం పాటించాయి. ఉద్యమాల వెంట నీడలా వెన్నంటే పాళీలు ఎందుకోగాని అశక్తతకి లోనయ్యాయ. అలా తమకైతాము దోషులుగా నిలిచాయా అని అనిపిస్తున్నది. ఎవరి అండలేకుండా మొదలైన ప్రజాఉద్యమాలను గుర్తించకుండా, గుర్తించి కూడా కిమ్మనకుండా ఉండడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గుర్తించదగిన విషాన సాహిత్య సందర్భం. ఇది ఇలాగే కొనసాగే ప్రమాదం ఉందా అని భయం వేస్తుంది. ప్రభుత్వం కనుసన్నల్లో ఏర్పడిన కవిత్వ మంజీరాలు, తెలంగాణా పేరుతో ఏర్పడిన సాహిత్య సంఘాలు ఈ పరిస్థితికి కారణభూతులు అని తెలుసుకోవాలి. రచయితల వర్గ దృక్పథం, సామాజిక కుల దృక్పథాల కారణంగా తెలంగాణా పేరుతో ప్రజల చైతన్యాన్ని దెబ్బతీసే పరిస్థితి కల్పించబడింది. ఈ వాతావరణాన్ని బద్దలుకొట్టి కలాలు ప్రజల పక్షం నిలిచే సంప్రదాయాన్ని పునరుద్ధరించాలి. అప్పుడు- ఎన్ని మల్లన్న సాగరాలు సృష్టింపబడినా విజయ కేతనాలు ప్రజల వైపే నిలుస్తాయ.

-జయధీర్ తిరుమలరావు jayadhirtr@gmail.com సెల్ : 9951942242