తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

కళవెళపడే అభివృద్ధి వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతులేని పోరాటం ఒక వైపు. అంతుచిక్కని ఎత్తుగడలు మరో దిక్కు. ఆట గతి తప్పింది. ప్రజల కలలు సాకారమయ్యే క్షణాలలో లెక్కకు పదునాలుగూళ్ళే కావచ్చు... కాని అక్కడ అంతటా అంతులేని కన్నీటి కడలులు. అవి పదునాలుగూళ్లకే కాదు. రెండు రాష్ట్రాలలో అదే వరస. ఉదాహరణకు ఆ ఊళ్లలో గోసని లెక్కగడదాం. బలవంతంగా ఊళ్ళని లేపేయటం చూసి రాజ్యాంగం సిగ్గుతో తలదించుకుంది. స్పష్టంగా గర్జించాల్సిన న్యాయవ్యవస్థ తనను తాను ‘రిజర్వ్’ చేసుకుంది. నిశ్శబ్దంలోకి దిగజారిపోయింది. బావురుమంటున్న బతుకుల పక్షాన నిలబడ్డానికి అగ్నిపరీక్షా కాలం మంచుబారింది. మిత్రుడిలా భుజం మీద చేయివేసి ఆలింగనం చేసుకోవాల్సిన రాజ్యాలు రెండూ శత్రువైఖరితో బ్రూటస్ పాత్రధారులయ్యాయి. అభివృద్ధి పేరుతో కొత్తగా లక్షల ఎకరాలకు ఊహించని ఎసరు పెడుతున్నారు. మొన్ననే బెర్లిన్ గోడని పగలగొట్టడం చూశాం. రెండో ప్రపంచ యుద్ధకాలంలో ప్రాణాలు తీసిన మహామహా యుద్ధ సేనానులను అభిశంసించడం చూశాం.
మనిషి కట్టే సమాధి నమూనా పాలకులకే రేపు అక్కరపడుతుందని భయం. బలాత్కరించి కట్టే గోడలు, తవ్వి తీసిన కందకాలు, సాగరాలు తిరగబడక తప్పదు. అందుకే ఇవేవీ వద్దు. మనుషులూ, ప్రకృతీ కలగలసి కట్టుకున్న గూడులో వికృత విషాదాలు వద్దు. అంతగా అవసరం అయితే మరోచోటు చూసుకుందాం. మనుషులు లేని మానుల మధ్య రాజధానులు, సాగరాలు కట్టుకుందాం. ప్రకృతి కనె్నర్రలో సముద్రాలు ఉప్పొంగి సునామీలు పుడుతున్న కాలమిది. నిండిన చెరువులు పొంగి, కాలువలు ఊటలు ఉబికి చెలిమలు, మానవ ఆవాసాలను కాష్టాల భూమిగా ప్రాజెక్టుల్ని మార్చొద్దు. ఎక్కడో ఓ దగ్గర సమస్యకి తెర పడుతుందనే నమ్మకంతోనే అసలు వాటి అవసరమే పడదనుకున్నాం.
అక్షరాల్లో తెలంగాణలో మల్లన్నసాగర్ విషాదం గుర్తులేకపోతే బాగుంటుందనే ఆశ ఎక్కడో కదలాడింది. కాని, పట్టువిడుపులు లేకుండా చెప్పింది చెప్పకుండా చేసేదేమిటో తెలీనివ్వకుండా అంతా మయాపరదాలు. వేలాది జీవితాలతో చెరలాటలు. ఇది కొత్త రాష్ట్రానికి మంచిది కాదు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలు విలీనం చేసి, తెలంగాణ ఆదివాసుల ప్రాణాలు పణంగా పెట్టాం. కొత్త రాష్ట్రంలోకి అడుగుపెట్టిన జాడ ఇలా వరసగా కన్నీటి ముంపులై ముంచేస్తాయని ఎవరూ అనుకోలేదు. చరిత్రకి ఒక విషాద ఘట్టాన్ని అగ్నిపరీక్షగా పెట్టి ‘ఏం చేస్తావ్’ అని ప్రశ్నించడానికి తెగువ అవసరం లేదు. తెలివి అవసరం లేదు. ఇది సరికాదేమో? ఈ పేజీలు చూసి అయినా ఆలోచించమని... గెలుపోటముల మాట కాదు. కాస్త యో చిద్దాం. ఓ నాలుగేళ్ళు ఆగి, కావాలంటే పునరాలోచిద్దాం. ఈలోగా ప్రకృతి ఎలాంటి పాఠాలు చెబుతుందో చేతులు కట్టుకుని విందాం. మనుషులు ఉద్యమాలై ఎగిసిపడకుండా మనని మనం సంరక్షించుకుందాం.
తెలంగాణ రచయితల వేదిక ముంపు గ్రామమైన ఏటిగడ్డ కిష్టాపూర్ తదితర గ్రామాలలో పర్యటన జరిపింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా అంతకుముందు నెల రోజుల కిందే ఎవరి ప్రమేయం లేకుండానే అక్కడ ప్రజా ఉద్యమం ఆరంభమైంది. ఈమధ్యకాలంలో అనేక మలుపులు, ప్రభుత్వం పట్టింపులు, ప్రజల ధర్మాగ్రహం, కోర్టుల దోబూచులాటలు ఎనె్నన్నో. ఉన్నత న్యాయస్థానంలో కేసులు, ‘స్టే’లు, తీర్పులు అంతా కలగాపులగం.
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలది నైతిక విజయం. అడ్డగోలు ప్రతిపాదనలు, పట్టింపులు, ఆగ్రహావేశాలు, తెలియని అజెండాలతో ప్రభుత్వవర్గాలు! ప్రజలను విడదీసే బహిరంగ ఎత్తుగడలు. చదువులేని ప్రజలని భయాందోళనలకు గురిచేసిన ప్రభుత్వాధికారులు. వెనకటి దొరలు కాగితాలపై వేలిముద్రలు వేయించుకున్న పాత వైనం పునరావృతం కావడం ఒక లీల. చదువుకున్న వాళ్ళకి తాయిలాలు ఇస్తామని రాజ్యమే ప్రలోభాలకు గురిచేయడం చిత్రం. ‘అభివృద్ధి’ పేరుతో సాధిస్తున్న నయా అధికార వర్గాల సరికొత్త వైఖరి. పెద్దపెద్ద తలపండిన ఇంజనీర్లని సైతం ధిక్కరిస్తూ రాజకీయ భాషణలు, పత్రికా ప్రకటనలు. నోరు లేని ప్రజలకు అసలు ఏం జరుగుతుందో తెలియని వైనం. ప్రాజెక్టు ఆగుతుందా? లేక అది వేగవంతమై భూమితోపాటే తమ బతుకులు సాగరం నీళ్ళలో అట్టడుగుకు చేరిపోతాయా? అనే భ యం. అంతటా శ్వాసాడని తనం. ఆ ఊపిరాడనితనం తెలంగాణ అంతటా వ్యా పించింది. ఏదో ఒక అభివృద్ధి మిషతో తమ బతుకులు స్వాహా అవుతాయనే భయవిహ్వలత, ఆందోళన. ‘కనుపించని వేదన. ఎక్కిళ్ళుపట్టే రోదన’. ఎందుకిలా జరుగుతోంది? ప్రజలు ఏం పాపం చేశారని?
మల్లన్నసాగర్ ప్రజల పక్షంలో నిలిచే కవులూ కళాకారులను, మేధావులను తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేకులని, తెలంగాణ ఉద్యమానికే వ్యతిరేకులనే ముద్రవేయడానికి ప్రయత్నించడం బాధాకరం. అట్లని ప్రజలు ఎవరూ దీనిని ఆమోదించలేదు. పైగా వ్యతిరేకించారు. ఇలాంటి చౌకబారు కుయుక్తుల వల్ల కొత్త ప్రభుత్వానికి వచ్చిన చెడ్డపేరు చెరిపేస్తే సులభంగా పోయేదికాదని గ్రహించాలి. పైగా ప్రభుత్వంలో భాగమైన సిఎం, మంత్రి పేషీలలో పనిచేసే ఉద్యోగులకి ప్రభుత్వం ముందుగా సమాచారం సప్లైచేసి చాలా దినపత్రికలలో వ్యాసాలు రాయించింది. పార్టీ అధికార ప్రతినిధులు రాసిన వ్యాసాలను ప్రచురించేట్లు పత్రికలపై వత్తిడి తేవడం కూడా విచారకరం. తమవరకు వస్తేనే పత్రికాస్వేచ్ఛ అని గగ్గోలుపెట్టే కొన్ని పత్రికలు ఈ విషయంలో పాలక వర్గాల, ప్రభుత్వ పక్ష రచయితల వ్యాసాలకు, వార్తలకు ఇచ్చిన స్థానం చాలా ఎక్కువ. ప్రజల తరఫున రాసిన వ్యాసాలు తక్కువగా ప్రచురించబడినాయి. ఇలాంటి పరిస్థితి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో కూడా సంభవించలేదు. అప్పుడు అన్ని పత్రికలు తెలంగాణ ప్రజల ఆకాంక్షని గుర్తించి వారి ఉద్యమ వార్తలని ప్రముఖంగా ప్రచురించాయి. విచిత్రం ఏమంటే, మల్లన్నసాగర్ ప్రజల ఉద్యమం పత్రికల పాత్రని, వాటి స్వభావాన్ని సైతం బహిర్గత పరిచింది. ఆ పధ్నాలుగు ఊళ్ళ ఉద్యమ వెలుగుల ఊసులేని పత్రికల పేజీలే ఎక్కువ. ఆ గ్రామాల మీద పాత్రికేయ చీకటి ఆవరించింది.
అంతేకాదు, విముక్త సాహిత్య సాంస్కృతిక రంగం దోహదం చేయవలసినంత చేయలేకపోయింది. సృజన రంగం ఎలుగెత్తాల్సినంతగా ఎలుగెత్తడం లేదు. రచనలు ఎక్కువగా వెలువడవలసిన తరుణంలో చాలా కలాలు నిశ్శబ్దం పాటించాయి. ఉద్యమాల వెంట నిరంతరం నీడలా వెన్నంటి ఉండే పాళీలు ఎందుకోగాని కళవెళ పడ్డాయి. అక్షరాలకి దూరమయ్యాయి. అలా తమకై తాము దోషులుగా నిలిచాయా? అని అనిపిస్తున్నది. ఎవరి అండ లేకుండా మొదలైన ప్రజా ఉద్యమాలను గుర్తించకుండా, గుర్తించి కూడా కిమ్మనకుండా ఉండడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గుర్తించదగిన సాహిత్య సందర్భం. ఇది ఇలాగే కొనసాగే ప్రమాదం ఉందా? అని భయం వేస్తుంది. ప్రభుత్వం కనుసన్నలలో ఉన్న కవిత్వ మంజీరాలు, చాలాసార్లు ఎస్టాబ్లిష్‌మెంట్ పాట పాడుతున్నాయి. తెలంగాణ పేరుతో ఏర్పడిన కొత్త సాహిత్య సంఘాలు మల్లన్నసాగర్ వంటి ఎన్నో ఉద్యమాలకు మద్దతు ప్రకటించలేదు. పైగా ఈసడించాయి. అభివృద్ధి వద్దా? అని పాలక గళంతో గద్దించింది. ఇలాంటి స్వరాల పట్ల ప్రజలు అప్రమత్తులై ఉండాలని కోరక తప్పదు.
రచయితల వర్గ దృక్పథం, సామాజిక కుల దృక్పథాల కారణంగా బంగారు తెలంగాణ పేరుతో ప్రజల చైతన్యాన్ని దెబ్బతీసే పరిస్థితి కూడా కల్పించబడింది. ఈ వాతావరణాన్ని బద్దలుకొట్టి కలాలు ప్రజల పక్షం నిలిచే సంప్రదాయాన్ని పునరుద్ధరించాలి. మల్లన్నసాగరంలో మునగాల్సినవి ఏమిటో తేలాలి. ఇక ముందు ఉప్పెనల్లో ‘లైఫ్ సపోర్టర్స్’లా అక్షరాలు పనిచేయాలి. చేయకపోతే చారిత్రక తప్పిదం!
అందుకే- ఒక్క మాట.. ఉత్తర్వులతో కాదు. కళకళలాడే ఊళ్ల జోలికి పోవద్దు. జీవగంజి పోసే ధాతువులు ముఖ్యం. నాగళ్ళతో, నాగేటి చాళ్ళతో, ఊరిలోని ఎల్లమ్మలతో పంచాయతీ వద్దు. అభివృద్ధి చావుకు నమూనా కావద్దన్నదే ప్రజల అభిమతం. ప్రకృతి కనె్నర్రలకు తోడు సామాన్యుల కన్నీళ్లు వంతపాడే రోజు రావద్దు.

*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242