తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

కొత్త వాసనల కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు వారాలుగా ఒక వ్యక్తి నన్ను సలపరానికి గురిచేస్తున్నాడు. అతని తెలియని అమాయకత్వం, దానిలోంచి రాసిన అతని కవిత్వం మహాద్భుతం కాదు. కాని- నన్ను, నా ఆలోచనల్ని ఆక్రమించాడు. ఏ పని చేసినా, ఏ కవిత చదివినా అతనే. పుస్తకానికి కవర్ పేజీ కోసం రమణ జీవీ వద్దకు వెళ్తే అక్కడ తారసపడ్డాడు. కవర్‌పేజీ వెనక అట్టమీద కవితని కంపోజ్ చేస్తున్నారు. అందులో ఒకటీ అరా పదాలపై చర్చ జరుగుతుంటే విన్నాను. మా పుస్తకం గురించి చర్చించుకుంటున్నాం. కొద్ది సేపటికి తన కవిత చదివి వినిపించాడు- ఏమైనా మార్పులు సూచించమని. అంతే.. అది మొదలు అతను నన్ను వెంటాడుతున్నాడు. తన ఆరో కవితా సంకలనం ‘నేను అస్తమించను’కి ముందుమాట రాయమన్నాడు. అతనెవరో తెలియదు. ఎక్కడో విన్న పేరు. కాని.. కవిత మాత్రం మెల్లి మెల్లిగా మనసుని తడుతూనే వుంది.
నిండా పనుల్లో మునిగి ఉన్నా, నెల తరువాత ఫోన్ చేయమని చెప్పాను. టంచన్‌గా 30వ రోజు ఉదయం ఫోను.. ‘నెల తర్వాత చేయమన్నారు’గా అన్నాడు. ఏదో చెప్పి తప్పించుకోవచ్చని అనుకున్నా, కాని అతను ఇచ్చిన ఐదు పుస్తకాలు అంతే అమాయకంగా పలకరించాయి. అవ్వన్నీ రెండేళ్లలో రాసినవే. 2014 నుండి 2016 మధ్యలో అచ్చులోకి వచ్చాయి. మాజీ మానవుడు, తాజా అన్యాయం, కన్నీటి వాచకం, చెరసాలలో చిరునవ్వు, మహాశ్మశానం.. అచ్చయిన సంపుటాలు ఒక్కొక్కటే చూశా. ‘నేను అస్తమించను’ రాతప్రతి వాటి పక్కనే ఉంది. కవితా శీర్షికలు కొంగొత్తగా ఉన్నాయి. ఏదో తాజా పరిమళం ఆవరించింది. అమాయకత్వంలోంచి విసరికొడుతున్న కెరటాల్లా భావాలు. ఒక్కోసారి ఉద్ధృతంగా నీటి దెబ్బ. మరోసారి అలవోకగా శరీరాన్ని తాకే అలలా పలకరింపు. మరోసారి ఉవ్వెత్తున ఎగిరిపడే ప్రవాహం. కాళ్ళూ చేతులకే కాదు, మొత్తం మనశ్శరీరాల కుదింపు.
నిజానికి అతి పునశ్చరణ, వ్యక్తివాద స్థాయికి లోనుకావడం కవిత్వానికి అశుభ సూచకం. వచనమే కవిత్వంగా చెలామణి చేస్తున్న పెద్దకవులు క్షమార్హులు కాదు. సాహిత్య ప్రియులు కవిత్వాన్ని దాటేసి పోయారు. ఏ కొద్ది మందో మిగిలిన సందర్భంలో తనని తాను రిపీట్ చేసుకునే తత్వం పెరగడంవల్ల పాఠకులను కోల్పోయిన దశలో కవిత్వం కొట్టుమిట్టాడుతోంది. మిగిలిన కొద్దిపాటి మంచి కవిత్వంలో పరాయి భాషల భావాలు స్పష్టంగా కానరావడం బాధాకరం. దేశీయత, సామాజిక మూలాల లభ్యత, కొత్త నుడికారం, వ్యక్తీకరణలు తగ్గుతున్న వేళ ఇంద్రపాల శ్రీనివాస్ నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. ఎవరి ప్రమేయం లేకుండా తన రచనలని తాను చేసుకుంటూ పోవడమే. తోచింది రాయడం, రాసింది చూసుకోవడం. ఎవరి నుండి తన కవిత్వానికి దినుసులు కావాలని ఆశించలేదు. ఎవరి అభిప్రాయాన్ని అతను కోరలేదు. తనకి తెలుసు- పత్రికలలో వస్తున్న కొన్ని కవితల్ని చదివినప్పుడు తనదీ కవిత్వమే అని.
డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నపుడు ‘ప్రభాత విపంచిక’ కవితా సంకలనం అచ్చేయాలనుకున్నాడు. నల్లగొండ జిల్లాలోని తన ఊరు తుమ్మలగూడెం పెద్దలకు చూపినపుడు అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి. ఊరంతా ఒక్కటైనా, ఏ కారణమో ఏమో తెలియదు గాని అది విరమించబడిన ఘట్టంగా మిగిలింది. సినీగీతాల ఝరీ ప్రవాహంలో కొట్టుకుపోయిన కాలంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని చూశారే తప్ప ఆసరా ఇచ్చిన వారు లేరు. ఆరో తరగతిలో ఆరంభమైన కవిత్వ జల ఇప్పటికీ అనేక వలయాలుగా, ఎత్తుపల్లాలుగా సాగుతోంది.
‘మనసుకు దూరంగా..’ కవితా సంకలనం అచ్చేయాలనుకున్నాడు. ముందు ముఖపత్రం కావాలి కదా. శిలా వీర్రాజుగారి దగ్గరకు వెళ్ళమన్నారు. ఆయన ఆ కవిత్వాన్ని చదివి, ఒక ముందుమాట రాయించుకోమని, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన ఓ కవి ఫోను నెంబర్ ఇచ్చారు. కష్టపడి వెతుక్కుంటూ వెళ్లి చేతులు కట్టుకుని నిలబడి ఆ పుస్తకాన్ని అతని చేతుల్లో పెట్టాడు. రాబోయే తన పుస్తకం కళ్ళల్లో మెదలాడుతుండగా- అతని కవితలు మొత్తం చదివి ఇది కవిత్వమా- చెత్తా అని ఆ పెద్దమనిషి చీదరించుకున్నాడు. అంతే, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మళ్లీ ఆ కవిగారి దగ్గరకు వెళ్లి తన పుస్తకం తెచ్చుకోవాలన్నా భయపడిపోయాడు. అలా రెండో పుస్తకం ప్రయత్నానికి గండిపడింది. అతనిలో అమాయకత్వం పట్టుదలగా మారింది.
పుస్తకంగా రాకపోయినా తన కవితలను చదివి అభిమానించేవారి సంఖ్య పెరిగింది. తప్పనిసరిగా పుస్తకంగా తీసుకురావాలనే ఒత్తిడి ఎక్కువైంది. అంతే ఇంద్రపాల ఇక ఆగలేదు. తన సాధుత్వం నుండి ఒకింత బయటపడి అచ్చు పనిలో పడ్డాడు. దానికిముందు అప్పులు చేశాడు. కవిత్వానికి అంకితమైన అతని జీవితం చదువుని, డిగ్రీలను పక్కనపెట్టింది. నిరుద్యోగాన్ని వరించాడు. అదేకాలంలో కులాంతర ప్రేమ వివాహాన్ని ఆహ్వానించాడు.
సాహిత్య సంస్థలకి చాటుగా, కవులకు అల్లంత దూరంగా తన మానాన తాను రాసుకున్న ‘మాజీ మానవుడు’ తొలి కవితా సంకలనాన్ని చెప్పులు కుట్టుకుని జీవించే మహిళతో ఆవిష్కరింపజేశాడు. ‘తాజా అన్యాయం’ సంపుటిని కూరగాయలమ్మే మహిళతో విడుదల చేయించాడు. మూడో సంపుటం ‘కన్నీటి వాచకాన్ని’ పారిశుద్ధ్య కార్మికురాలితో లోకార్పణం చేయించాడు. నాలుగో సంపుటం ‘చెరసాలలో చిరునవ్వు’ సంకలనాన్ని హైదరాబాదులోని ఓ కాటికాపరితో సభ్య సమాజానికి అందించాడు. ఐదో సంపుటి ‘మహాశ్మశానం’ సంపుటిని వృద్ధ యాచక దంపతులతో- ముఖ్యంగా పక్షవాతంతో చేతులు పనిచేయని మహిళతో సాహిత్యలోకంలోకి పుస్తకాన్ని చేరవేశాడు. ఇలా చేయాలని అతనికి ఎవరూ చెప్పలేదు. అప్పటికప్పుడు అతను తీసుకున్న నిర్ణయం. మొదట వ్యతిరేకించినా ఆ తరువాత అందరూ హర్షించినవారే. ‘నా కవిత్వం వాళ్లని చేరినందుకు, వాళ్ళు నా కవితని చేతులతో తట్టినందుకు నాకు ఆనందంగా ఉందంటాడు’ ఇంద్రపాల.
అలా వెలువరించిన పుస్తకాలను నవోదయ, నవయుగ, నవ తెలంగాణ వంటి పెద్ద పుస్తక విక్రయశాలలు అమ్మకానికి స్వీకరించలేదు. కవిత్వ పుస్తకాలు అమ్మకం లేవని స్పష్టంగా చెప్పారు. కథలో, నవలలో రాయండి అమ్మిపెడతాం అన్నారు. ఇంద్రపాల ‘నేను కవిని. కవిత్వం తప్ప మరేమీ రాయను’ అని చెప్పాడు వాళ్లకి. అందుకే తన పుస్తకాలను తానే అమ్ముకోవడం మొదలుపెట్టాడు. తన పుస్తకాలను పాఠకుల దగ్గరకు చేర్చేదిశగా ఎన్నో ప్రయోగాలు చేశాడు. తన తమ్ముడితో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మూడుసార్లు అమ్మాడు. కెబిఆర్ పార్క్ దగ్గర, సికిందరాబాద్ జూబిలీ బస్‌స్టేషన్ దగ్గర అమ్మకానికి పెట్టారు. ఇఎస్‌ఐ కంజర్ల పార్కు దగ్గర ఉచితంగా ప్రతులు ఇచ్చాడు. చాలామంది ఆ కవిత్వాన్ని చదివి ఫోన్లు చేసి అభినందించడం ముఖ్య విషయం. ఎంపిక చేసిన కొన్ని కవితలని జిరాక్సు చేసి గోడలకు అతికించాడు. ఫోను నెంబర్ చూసి ఇంటికివచ్చి పుస్తకాలు కొనుక్కున్నారు కొందరు. తనకు తోచిన ప్రత్యక్ష పద్ధతిలో పాఠకులకి చేరే ప్రయత్నాలు చేసిన ఇటీవలి కవి ఇంద్రపాలే. కవిత్వంలో శ్రమకు తగిన ఫలితం అంటూ ఉండదు. కవి శ్రమిస్తూ పోవలసిందే. అదే అతని ధర్మం అంటాడు. ‘నేను రాసింది నాకే నచ్చనపుడు /నేను కవిగా పునర్జన్మిస్తాను / పరమ చెత్తంతా వెలికి తీసినంకే / ప్రముఖ కవిగా వెలుగులోకి వస్తా’ అంటాడు. కవిగా ఏనాడూ కుంగిపోలేదు. అవార్డులు రాలేదని, గుర్తింపు దూరమైందని అనుకోలేదు. ‘ప్రతి కవి ఒక సబ్బు కనుక్కోవాలి / అందులో ఆమ్లాలు కాదు / అక్షరాలు ఉండాలి / ఆ సబ్బుతో / దేశానికి అభ్యంగన స్నానం చేయిస్తే / దెబ్బకు దరిద్రం తీరిపోవాలి’ అని అంటాడు. ఐదు వికెట్లు తీయడం కన్నా / ఒక పుస్తకం గొప్పది / అందులో ఒక వాక్యం బహు గొప్పది’ -అని యువతని ఉద్దేశించి అంటాడు. ఆనందం అంగడి సరుకైన ఈ లోకంలో దుఃఖం పెంపుడు కుక్క అయిందని అంటాడు.
‘వాళ్లాయన బీడీలు తాగి తాగి కాలం చేశాడు, ఆమె బీడీలు చుడుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది’ అనడంలో ఇంద్రపాల కవితాశక్తి అమోఘం. తిలక్‌ని అభిమానించే ఇంద్రపాల ఒక అలిశెట్టి ప్రభాకర్‌లా సూటిగా, ఘాటుగా కొత్తగా కవిత్వాన్ని చెప్పి మెప్పిస్తున్నాడు. నవ్యత తన బాధ్యతగా భావించాడు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మారిన కవితగా అతని కవిత్వాన్ని చెప్పుకోవచ్చు. ఇటీవలి తెలుగు కవితను ఇతర భాషల్లోకి అనువదించడానికి ఇద్దరు కవులను సూచించండని అడిగితే తప్పక ఇంద్రపాల పేరు చెబుతాను. దానిని ఇంకాస్త శ్రద్ధతో ఎడిటింగ్ చేసుకోగలిగితే తెలుగు కవిత్వానికి కొంత శక్తిని తప్పక అందిస్తాడు.
*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242