తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

భావ ఘర్షణల్లో వర్సిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్న చెన్నైలోని మదరాసు విశ్వవిద్యాలయం కేంద్ర స్థానంలో నిలబడి ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) శతాబ్ది ఉత్సవాల గురించి ఆలోచిస్తున్నా.. మదరాసు విశ్వవిద్యాలయం ప్రారంభమైన ఓ అరవై ఏళ్ళ తరువాత ఓయు ప్రారంభమైంది. దక్షిణ భారతంలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభమైంది. దక్కన్ పీఠభూమిలో హైదరాబాదు సంస్థానాధీశుల చొరవతో ఏర్పడిన ఓయులో మాత్రం ఉరుదూ భాష మాధ్యమంగా మొదలైంది. ముఖ్యంగా ఉరుదూ భాషీయులకోసమే ఈ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. విశ్వంలోని జ్ఞాన స్థాయిని అందిపుచ్చుకుని అధ్యయనం జరగాలి. కాని ఓయులో స్నాతకోత్తర స్థాయిలో వైద్యం, ఇంజనీరింగు కోర్సులలో ఉరుదూ భాషలో విద్యాబోధన జరపడం ఒక ప్రయోగం. దాని ఫలితాలు ఎలా ఉన్నాయో, వైఫల్యాలు ఏమిటో ఎక్కడా చర్చించబడలేదు.
మదరాసు వర్సిటీలో తమిళ, తెలుగు ప్రజల కోసం ఉన్నతస్థాయి విద్యలో బోధనకు ప్రయత్నించలేదు. ఆంగ్లం మధ్యలోనే బోధన జరిగింది. 1916లో ఏర్పడిన మైసూరు విశ్వవిద్యాలయంలో కన్నడ భాషలో వృత్తి విద్యాకోర్సులు ఏర్పాటు చేయలేదు. ప్రాంతీయ భాష ఉన్నత విద్యకు సరిపోదని భావించారు. బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో ఆంగ్లం తప్ప ఇతర భాషలను మాధ్యమంగా పెట్టాలని ఊహ రాలేదు. ఇతర భాషలు సాహిత్య భాషలుగా అభివృద్ధి చెందాయే తప్ప ఆధునికతను ఆనాటికి సంతరించుకోలేదనే భావన ఉండేది. నిజానికి ఈ భావనలో నిజం ఉందా?
మేం వరంగల్ పీజీ సెంటర్‌లో తెలుగు యం.ఏ. చేశాం. మా బ్యాచ్ తరువాత మరో బ్యాచ్ తరువాత 1976లో కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఓయు ప్రారంభ దశ తెలియదు కాని, వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, ఖమ్మం ఉత్తర తెలంగాణాలో దాని చివరి ప్రాభవం కళ్ళారాచూశాం. 1969లో తెలంగాణ తొలి ఉద్యమ దశ అనంతరం వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో చేరాం. అంతకుముందే ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ నినాదంతో విశాఖ ఉక్కు ఫ్యా క్టరీ కోసం లాఠీ దె బ్బలు తిని జైలుకెళ్ళాం. తెలంగాణ ఉద్యమానంతరం ఓయు నుండి తొలి వి ప్లవ వీచికలు పలకరించా యి. విద్యార్థులుగా మాకు హైదరాబాదులోని ఓయునుండి సమాచారం, చైతన్యం అందాయి. ఆనాడు వరంగల్‌లో విప్లవ కార్యక్రమాలు బాగానే నడిచేవి. కాని వాటితో కొంత ‘దూరం’ ఉండేది. ఆ రకంగా విద్యార్థులకు ఓయు భావజాల కేంద్రంగా పనిచేసింది. అంతకుముందు తెలంగాణ ఉద్యమ చైతన్యం కూడా అక్కడ నుండి దిగుమతి అయ్యింది. అదే క్రమంలో సైద్ధాంతిక చర్చ, కార్యక్రమ ప్రణాళికలు, సాహిత్యం మాకు అక్కడనుండే అందింది. జార్జిరెడ్డితో హైదరాబాదులో ప్రత్యక్ష పరిచయం. ఆంగ్రీయంగ్ తరం కూడా దాదాపు అదే కాలం. దిగంబర కవితోద్యమం ప్రభావం కూడా గాలిలో ఉండేది. ఏ చిన్న నిరసన, ఏటికెదురీదే తత్వం, పోరాటం, సాహసం చేయాలనే తలంపులు. సుదూర హిప్పీ ఉద్యమం ఛాయలు కూడా ప్రసరించడానికి ప్రయత్నం జరిగింది. ఐతే వీటన్నింటికి దూరంగా జరుగుతూ చదువు, చైతన్యం పెంచుకుంటూ పోవడం ఆనాటి యుగధర్మం. మొదటినుండి ఓయు వివిధ భావజాలాల తయారీ కేంద్రం. ఓయు అంటే హైదరాబాదులోని కేంపస్ కాదు. తెలంగాణలోని చాలా అనుబంధ కళాశాలల సమాహారం. సర్ట్ఫికెట్‌పై ఓయు ఉన్న ప్రతివాడు ఆ చైతన్యధారకి వారసుడే. కేంపస్‌లో చదివేవారికన్నా ఇతర చోట్ల, ఇతర కళాశాలలో చదువుకున్నవారే తమదైన ముద్రవేశారు.
ఐతే, చాలా విశ్వవిద్యాలయాలు ఆనాడు ప్రత్యక్ష, అప్రత్యక్ష రాజకీయాలకు నెలవులు. మితవాదం, అతివాదం రెండు భావజాలాలకు ఒకే తరహా పట్టం కట్టడం గమనించాలి. వామపక్షాల విద్యార్థి సంఘాలు చీలకలు పేలికలయ్యాయి. రైటిస్ట్ భావజాలం చీలలేదు. పైగా రోజురోజు అది బలపడుతున్నది. ఓయులో మాత్రం వామపక్ష రాజకీయాలు ఎక్కువ మొత్తంలో పైకి కనుపిస్తాయి. కాని జార్జిరెడ్డి హత్య వంటి సంఘటనలు అక్కడే జరిగాయన్నది మరిచిపోరాదు. ఓయు వందేళ్ళ త్రాసులో కొలత వేసి చూస్తే రెండు పక్షాలు చెరిసగం ఆక్రమిస్తాయి. వామపక్ష భావజాలం ఎగిసి దూకితే, రైటిస్ట్ విద్యార్థి ఉద్యమం చాపకింద నీరులా నిరంతరం పాకిపోవడం గమనించాలి. తెలుగు మాధ్యమంలో చదువుకుని వచ్చినవారు ఓయులో పెరిగారు. వారిలో చాలామంది ప్రజాద్యమాల వల్ల ప్రభావితం అయ్యారు. విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలలోకి, ఇతర ప్రజాసంఘాలలోకి తరలి వెళ్ళారు. అంతిమంగా వారు రాజకీయ పార్టీలో తేలారు. మితవాద విద్యార్థులలో ఉన్నత కుటుంబీకులు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. వారు తొందరపాటు లేకుండా స్థిరంగా, నెమ్మదిగా తాము ఉన్న నిర్మాణంలోనే ఉండి పనిచేసేవారు. తెలుగు మీడియంలో చదివిన వారిలోనే ఎక్కువ మంది ఉద్యమాలకి వెళ్ళారు. అలా తెలుగు మీడియంకి ఉద్యమ శక్తుల నిర్మాణాలకి దగ్గరి సంబంధం ఏర్పడింది. ఆధునిక సాంకేతికత ఎంతో పెరిగింది. కాని దాని సహకారంతో ఉద్యమాలకి ఎంతో కొంత ఊపుని తీసుకురాలేకపోయారు.
ఒకప్పుడు ప్రతి చిన్న సామాజిక సమస్య పట్ల విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రతిస్పందించేవారు. కాని వర్తమానంలో ఆయా గ్రూపుల నాయకుల ప్రేరేపితంతో మాత్రమే కదలుతున్నారు, గ్రూపుల వారిగా, కులాల, కుల సమూహంలోని ఉపకులాల భావనతో విడిపోయారు. విద్యార్థులు ప్రస్తుతం చీలికలు పేలికలైన మత్తగజాలు. అన్ని విశ్వవిద్యాలలో బోధన, పరిశోధన స్థాయి తగ్గిపోతున్నది. విద్యార్థి లోకంలో ఆదర్శాలు కూడా తగ్గిపోయాయి. సామూహిక సమస్యల పట్ల అవగాహన కూడా విడగొట్టబడిన పార్శ్వాలతో కూడుకుంటున్నది. మరో మాటలో చెప్పాలంటే సామ్రాజ్యవాదం, జాతీయ సమస్యల పట్ల ఉదాసీనత వ్యాపించింది. ఆసమస్యలను గుర్తించకపోవడం. గుర్తించి కూడా మిన్నకుండడం జరుగుతోంది.
విశ్వవిద్యాలయాల స్థాపనలో విశ్వంలోని విజ్ఞాన స్థాయిని అందుకుని ఆ జ్ఞాన స్థాయిని పెంచేదిశగా బోధన, పరిశోధన, అవగాహనలను పెంచుకోవాలి. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితులు తగ్గిపోయాయి. మానవ సంచిత జ్ఞానం కుదింపుకి లోనవుతున్నది. దానికి విశ్వవిద్యాలయాల విద్యార్థులే కారణం అన్న అపోహని తొలగించవలసి ఉంది. ఆ దిశగా ఓయు దశాబ్ది ఉత్సవాలను చూడాలి. ఎన్ని కోట్ల నిధులతో ఉత్సవాలు చేస్తున్నామని కాదు. గతంలోని విద్యార్థి పాత్రని సరికొత్తగా పోషించడమే ఈనాటి అవసరం. విభేదించండి.. కానీ కలిసి పోరాడండి. మాతృభాషని, లిపుల్ని గౌరవించండి. వృత్తి కులాల భాషాజ్ఞానాలను కాపాడుకునే రీతిలో ఆలోచించాలి. ఒక్కసారి ఆకాశం పైకి చూశాను. ఇంకా అది శకలాలుగా విడిపోలేదు. సముద్రపు గాలి అస్తిత్వాల వారిగా వీయడం లేదు.. విశ్వవిద్యాలయాలలోకి దృష్టి సారిస్తే.. *

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242