తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

రాజమండ్రి టు అప్పన్నపాలెం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న రెండో తేదీన రాజమండ్రిలో సినారె ప్రత్యేక సంచిక ఆవిష్కరణ. రాజమండ్రి పాత స్నేహితుల పలకరింపులు. సందడిలో రెండు రో జులు కరిగి అనేక జ్ఞాపకాలతో తిరుగు ప్రయాణం. వాటిలో కొన్ని.. మీ ముందుకు..! కొన్ని సాంస్కృతిక నగరాలు ఉంటాయి. వాటిని ఎవరైనా ఆస్వాదించవచ్చు. రాజమండ్రి తీర గోదావరికి ఎప్పుడూ కొత్తనీరు తాకిడే. అక్కడికి ఎవరు వచ్చినా ఆ నగరం స్వాగతం పలుకుతుంది. తనలో ఇముడ్చుకుంటుంది. రెక్కలొచ్చి తిరిగి ఎగిరిపోతానంటే సాగనంపుతుంది. నేనూ ఒకనాడు అలాగే దాని ఒడిలో గడిపి, మధురమైన జ్ఞాపకాలతో మరలిపోయినవాడినే. రెండు రోజులు రాజమండ్రి రోడ్లమ్మట తిరగడం ఆపలేదు. ఎనె్నన్నో దృశ్యాలు! గౌతమి గ్రంథాలయం అదే. రాళ్ళపల్లి వారి సంస్థ అదే. కొత్తవేమీ పుట్టలేదు. పాతవి మాత్రం బక్కచిక్కిపోతున్నాయి. నేదునూరి గంగాధరం గ్రంథాలయం ఎప్పుడూ తెరచి లేదు. గ్రహణం పట్టిన జానపద సూర్యుడు. తనవాళ్ళే తనకి అడ్డుచేతులు. సరిగా లేని చేతల్లో గంగాధరం ఒక బందీ. దానికి ఒక కమిటీ వేయాలని తోచని కలెక్టరేట్ యంత్రాంగం. ఎవరి పనిని వారు గుర్తించకపోవడమే నేటి విషాదం.
ఏభై ఐదేళ్ళ కిందట భోజనం చేసిన అజంతా హోటల్ పలకరింపు. ఉత్తర భారతీయుల కోసం ప్రత్యేకంగా పెట్టిన రాజస్థాన్ భోజనాలయం. పులకాల పలకరింపు. పునాదులు కూడా మాయమైన అప్సరా హోటల్ ఆనవాళ్ళు. వీరేశలింగం నిర్మించిన మొదటి టౌన్ హాల్‌లో కాంతి రాహిత్యం. శతాబ్దాల క్రితపు మణిహారాల సొబగు వాడిపోయిన వైనం. ఆవలి తీరం చేరిన ఆత్మీయ మిత్రుల గుర్తులు ఒక్కొక్కటే రీలు తిరుగుతోంది. బి.వి.ఎస్.శాస్ర్తీ, జె.రామనాథం, మధునాపంతుల, మల్లంపల్లి శరభయ్య, ఆర్.బి.పెండ్యాల, జనమంచి కామేశ్వరరావు, చింతల గోపాలరావు ఎందరో ఎదని వీడని ముద్రలు. ఈ గుర్తుల్ని ఇప్పటికీ గుర్తుచేసే సన్నిధానం శర్మ, సూర్యవంశి. సాహితీప్రియుల మధ్య సినారె ప్రత్యేక సంచిక విడుదల. అడుగుజాడ పి.ఎస్.రవికాంత్ సంపాదకత్వంలో సినారెకి రెండు రాష్ట్రాలలో మొదటి మరణానంతర కానుక. సినారె రాతకవే. ఐనా అది నోటి సాహిత్యంగా గోదావరిలా ప్రవహించింది.
రాజమండ్రి ఎంత పండిత సాహిత్యం సృష్టించిందో, అంతకన్నా వందరెట్లు ఎక్కువ పామరజన సాహిత్యానికి కేంద్రమైంది. ఆస్థాన సాహిత్యం, ఆలయ సంబంధ పౌరాణిక భక్తి రచనలు, జన సాహిత్యం, ప్రదర్శనలతో ఆ తీరం మారుమోగింది. ఆది ఆంధ్ర మహాభారత అనువాదం నుండి ఆంధ్ర భాషా సవ్వడులకి ఆరామమైంది. ఆధునిక కాలంలో తెలుగు భాషా సాహిత్యాలకి, ప్రక్రియలకి ఆదిస్థానంగా అలరారింది. వీరేశలింగం కన్నా ముందే ముద్దు నరసింహం ‘హితసూచని’ తెలుగు వచనానికి కీర్తి కిరీటమై వెలిగింది. ఎన్నో, ఎనె్నన్నో పుస్తక ప్రచురణ సంస్థలు వెలువడి తెలుగు నేల అంతా పొత్తాల పురుటిగడ్డని చేసింది. జాతరల్లో, పండగల్లో, పబ్బాలలో, ఉత్సవాలలో చిన్న చిన్న పుస్తకాలు పామరజన కరకమలాలై అలంకరించాయి. ఈ పుస్తకాలని ‘గుజిలీ ప్రతులు’ అని పిలుస్తారు. అతి చిన్న పుస్తకాల నుండి పెద్ద పుస్తకాల వరకు చౌకగా, పాఠకుడికి అందుబాటు లో ఉండేలా అచ్చేసేవా రు. ధర తక్కువ, స మాచారం ఎక్కువ, పాఠకుడికి అందుబాటు- ఈ పుస్తకాల ప్రత్యేకత. సాంకేతిక అభివృద్ధి అచ్చుయంత్రాన్ని ప్రజల దగ్గరకు తీసుకుపోయింది. కాగితం తయారీ పెరిగిపోయింది. శిష్ట సాహి త్య గ్రంథాల ప్రచురణతో పోటీపడి గుజిలీ ప్రతులు పాఠకుల దరి చేరాయి. పద్యాన్ని వచనంలోకి, వచనం మ రింత సాదాసీదా రచనగా, సులభశైలిలో చదివే గుణంతో ఈ గ్రంధాలు ప్రజల ఆదరాన్ని పొందాయి. రాజమండ్రి కేంద్రంగా కాళహస్తి తమ్మారావు, కొండపల్లి వీరవెంకయ్య, గొల్లపూడి ప్రచురణలు, గోదావరి బుక్ డిపో, రౌతు బుక్ డిపో వంటివి ఎన్నో ప్రచురణ సంస్థలు ఈ రంగంలో ప్రసిద్ధి చెందాయి. నేను 1989లో మొదటిసారి తెలుగు విశ్వవిద్యాలంలో అధ్యాపకునిగా చేరాను. అప్పటికి అద్దేపల్లి అండ్ కో వంటి ప్రచురణ సంస్థలు పని చేస్తున్నాయి. వాటిని మరచిపోలేం.
బులుసు సీతారామశాస్ర్తీ ఆధ్వర్యంలో ‘ఫైవ్ పండిట్స్’ తయారుచేసిన గైడ్లు చదవని విద్యార్థులు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రచురణలకి వచ్చిన కీర్తి, డబ్బు చూసి రాజమండ్రిలోనే ‘ఎయిట్ పండిట్స్’ పేరుతో గైడ్లు రాయించి అమ్మారు. గైడ్ల రచన, తయారీ, ముద్రణ, అమ్మకాలు అన్నీ రాజమండ్రి నుండే. ఆ తరువాత స్వస్తిక్ బుక్ డిపో వారు విద్యార్థులకు పుస్తకాలు, గైడ్లు, రీడింగ్ మెటీరియల్ కూడా ఇక్కడ నుండే సరఫరా చేసేవారు. ఇలా ఎనె్నన్ని జ్ఞాపకాలో. సన్నిధానం శర్మతో మాట్లాడుతూ కోటగుమ్మం దారిలో నడిచిపోతుంటే ఆ రోడ్డుమీద ఓ మూల, చిన్న టిక్కీలో కాళహస్తి తమ్మారావు అండ్ కో బోర్డు కనిపించింది. ఆయన మనుమడు ఇప్పటికీ గుజిలా ప్రతులు తయారుచేసి అమ్మడం విశేషం. ఆనాటి ప్రాభవం పోయినా, తమ విధిని మాత్రం ఇంకా నిర్వహిస్తున్నారు. ఇలా అలనాటి తీపి జ్ఞాపకాలు ఇంకా ఎన్ని మిగిలాయో అనే్వషించాల్సిందే. మరి కొన్ని చేదు దృశ్యాలు ముల్లులై తగిలాయి.
మరుసటి రోజు ఏలేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఓ మారుమూల గ్రామమైన అప్పన్నపాలెం దిబ్బలలో ఇల్లు కట్టుకుని వ్యవసాయం చేస్తున్న మిత్రులు పవన్, అనులని చూడాలని బయలుదేరాం. మార్గంలో జగ్గంపేట బోర్డు కనుపించింది. వెంటనే సుప్రసిద్ధ కథా రచయిత్రి కె.వరలక్ష్మి గుర్తొచ్చారు. అందరం ఆవిడని పలకరించాలని హైవే దిగి ఊళ్ళోకి దారితీశాం. పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటే నాకు జగ్గంపేట గోపి గుర్తొచ్చారు. ఆయన తొవ్వ ముచ్చట్లు కాలమ్ చదువరి. చదివిన ప్రతిసారీ ఫోనులోనే పలకరింపు. ఆయనను ఎప్పుడూ చూడలేదు. ఈవారం వ్యాసానికి గోపి నుండి ఫోన్ స్పందన వస్తుందనుకున్న చాలాసార్లు ఆయన పలకరిస్తారు. చదివిన వ్యాసంలోని విషయాలపై విశే్లషణ చేస్తారు. ఒకటీ అరా చురకలు కూడా. ఆయనని కలువకుండా పోతే వెలితి ఉండేది. అందుకే సన్నిధానం సూర్యవంశి, శ్రీ్ధర్, కె.వరలక్ష్మిలకు మప్పిదాలు చెప్పాల్సిందే. ఏలేశ్వరం ఊరుదాటి పక్కన ఉన్న కాలువని ఆనుకుని ఉన్న మట్టి రోడ్డు ఎక్కాం. అలా కొంత దూరం పోతే వోలం కొండ ఉంది. అర కిలోమీటర్ దూరంలో సూదికొండల మధ్య ఏలేశ్వరం బ్యారేజి. చక్కని అటవీ ప్రాంతం. దట్టమైన చెట్ల మధ్య పవన్ ఇల్లు. సిమెంటు, ఇనుము వంటి బయటి సామగ్రి లేకుండా సాంప్రదాయక రీతిలో కట్టిన ఇల్లు. పవన్ అక్కడికి వచ్చాక- దిబ్బ ప్రాంతానికి రోడ్లు నడిచివచ్చాయి. పక్కనే ఉన్న సలేశ్వరం నుండి కరెంటు తీగలు, వాటిలోంచి మొదటిసారి దీప కాంతులు సరఫరా అయ్యాయి. ఆలస్యమైనా ఉపాధి హామీ పథకం ఆ ప్రాంతపు పేదలను పలకరించింది. దానివెనుక పవన్ శ్రమ ప్రస్ఫుటం. రాజమండ్రి టు అప్పన్నపాలెం దిబ్బలు ప్రయాణం మా అందరికీ నచ్చింది. ప్రకృతిలోకి దారి ఎ ప్పుడూ గొప్ప అనుభవమే. వర్తమానం కళ్ళలోంచి గ తాన్ని వీక్షించడం కూడా. అవి రెండూ వేరు వేరు కాదు. *

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242