తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

బంజారా తొలి దేశీ సంస్కర్త సేవాలాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంజారాలకి వున్నన్ని పేర్లు మరే తెగకి లేవు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యాపించిన తెగ కూడా ఇదే. ఐనా సంస్కృతీ సంప్రదాయాలు, భాష, అంతటా ఒకటే. హంగేరీ వంటి దేశాలలోని రోమాజిప్సీ తెగవారు తాము భారతదేశంనుండి వచ్చామని చెప్పుకుంటారు. ఆ రకంగా బంజారాలు పర దేశాల్లో కూడా జీవిస్తున్నారు. అక్కడ కూడా వీరు సంచార జీవులే!
బంజారాలు తండాల్లో జీవిస్తారు. ఊళ్లల్లో జీవించరు. ఏ ఆదివాసీ తెగ అయినా ప్రత్యేక అటవీ ప్రాంతాల్లోనో, కొండ కోనల్లోనో జీవిస్తారు. వారు మన దగ్గరకు రారు. మనమే వారిని కొల్లగొట్టడానికి వారి దగ్గరకు పోతాం. అత్యంత నిరుపేదలుగా జీవిస్తున్నవారి అటవీ ఉత్పత్తులను, ఖనిజాలు, భూమి నీరు వంటి వాటిని లాక్కుంటాం. వారు ప్రతిఘటించిన ప్రతిసారి వారిని హతమార్చి హంతకులం అవుతాం. వారికోసం పని చేసే వ్యక్తులపై, పార్టీలపై అభియోగాలు మోపుతాం. అవరం లేకున్నా వారిని నిషేధిస్తాం. ఇది తరతరాల తంతు.
బంజారాల బతుకంతా నిత్యపోరాటమే. వారు ప్రకృతితో, పరిసరాలతో పోరాడాలి. నిత్య సంచారం వల్ల స్థానిక ప్రభుత్వాలతో పోరాడాలి. ఇది వారి బతుకు. కష్ట జీవులైన బంజారాలు తమ కుటుంబంతో ఊరూరా తిరుగుతు సరుకులు సరఫరా చేసేవారు. మధ్యకాలాల్లోని పృధ్వీరాజ్ చౌహాన్ సంతతి వారమని చెప్పుకునే బంజారాలు రాజస్థాన్‌నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. వీరికొక్కరికే భారతీయ పౌరాణిక మూలాలు లేవు. వాటి ప్రభావాన్నుంచి వారు దూరం వున్నారు. వారి అనాది మూల పురుషుల కాల్పనిక చరిత్ర కూడా జత కలవలేదు. ఒకనాటి అఖండ భారతఖండంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంనుండి మన దేశానికి వచ్చారని చరిత్రకారుల భావన. బంజారాలకు దైవాలు ఎక్కువగా లేరు. చారిత్ర పురుషులు కూడా తక్కువే. అలాంటి సందర్భంలో 1741లో తెలుగునేల మీద జన్మించిన సంత్ సేవాలాల్ గురించి తెలుసుకోవడం అవసరం.
బంజారాలు మొదటినుండి వీర యోధులు. బానిసత్వాన్ని వ్యతిరేకించడం వీరి నైజం. పదకొండో శతాబ్దంలో ఢిల్లీని పాలిస్తున్న పృధ్వీరాజ్ చౌహాన్ తరఫున నిలిచి మహ్మద్ ఘోరీకి వ్యతిరేకంగా పోరాడారు. పృధ్వీరాజ్‌కి ‘్భట్’ బంజారా గురువు. రాజు మరణించాక బంజారా సమాజం చెల్లాచెదురైంది. ఒక బంజారా సమాజం రాజస్థాన్‌కు చేరి రాజ్యపాలన చేసింది. రెండో సమాజం అడవుల పాలై చిత్తోడ్‌ఘడ్ కోట కట్టుకున్నారు. దాని రాజు అయన రాణాప్రతాప్‌సింగ్ నాయకత్వంలో మొగలులపై పొరాడారు. మూడో సమాజం ఇతర రాజ్యాలకు వెళ్లి రోమా బంజారాలుగా స్థిరపడిపోయారు.
ఔరంగజేబు కాశ్మీర్ రాజు అయిన తేజ్ బహదూర్ సింగ్‌ను (1621-1675) మహ్మదీయ మతం తీసుకోవాలని బలవంతం చేసాడు. కానీ గురువు అందుకు అంగీకరించలేదు. ఉరి తీయబడినా సంతోషంగా ఒప్పుకున్నాడు. ప్రస్తుతం చాందినీ చౌక్ ప్రాంతంలో లక్కీషా బంజారాకి చెందిన మూడు వందల ఎకరాల స్థలంలో వేలాది గోవులతో రాకబ్ గంజ్ తండాలో నివసిస్తున్నాడు. ఆయన వేలాది గోవులను పరిగెత్తించి శత్రువుని హడలెత్తించి తేజ్ బహదూర్ శవాన్ని దూది బస్తాల కింద దాచి రాయ్ సినా బంజారాకి అందచేస్తాడు. ఈయన వంద దూది బస్తాలలో శవాన్ని దాచి కొడుకు గురుగోవింద్ సింగ్‌కి అందిస్తారు. అంతిమ సంస్కారాలు చేసినవారిని కూడా ఔరంగజేబు దండిస్తాడని భావించి వంద బళ్ల దూదిని కాల్చేస్తారు. ఆ తరువాత మొగల్ చక్రవర్తులను ఎదిరిస్తూ పదవ గురువు గోవింద్‌సింగ్‌తో జతకలిసి అతనికి తమ సహాయ సహకారాలు అందిస్తారు. అతడి వెంట నిలిచి ఢిల్లీ, పంజాబ్‌లనుండి బయలుదేరి దక్కన్‌లోని గోదావరి నది దాటి, తెలంగాణ సరిహద్దులలో గల నాందేడ్ వస్తారు. వీరిలో బంజారాలది కీలకపాత్ర. సిక్కులు, బంజారాల ఐక్యత, స్నేహంవల్ల మహమ్మదీయ రాజులను నిలువరించగలిగారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకోసం వారు చేసిన త్యాగాలు మరువరానివి. లంబాడా యోధుల చరిత్ర ఒక ఉద్విగ్న పర్వం. అనిక్‌సింగ్, బహురూపియా, బజ్‌కర్‌సింగ్ వంటి వారు యుద్ధంలో అమరులయ్యారు.
గురుగోవింద్‌సింగ్ మరాఠ్వాడాలో సిక్కుమతాన్ని స్థాపిస్తాడు. గురుగోవింద్ సింగ్ (1666-1708) నాందేడ్‌లో మరణించాడు. ఆయన సమాధే నాందేడ్‌లోని గురుద్వార. ఇక్కడే బంజారా సిక్కు మఠం కూడా ఉంది. ఇప్పటికీ ఏడాదికి సుమారు 400మంది సిక్కుమతం స్వీకరిస్తారని ‘బంజారా చరిత్ర’ రచించిన బి.చీనియానాయక్ తెలిపారు. ఈ మఠంలో బంజారా సిక్కులు సగం భాగం. అలనాటి గురు గోవింద్‌సింగ్ శిష్యులలో మహబూబ్‌నగర్ జిల్లాలోని కోసిగి గ్రామం తండాకి చెందిన లోకామనంద్ ఒకరు. అతను తన గ్రామానికి తిరిగివస్తాడు.
సంత్ గురు గోబింద్‌సింగ్‌తో ఉత్తర భారతదేశంనుండి వచ్చిన బంజారాలు కొంతమంది నాందేడ్‌నుండి కన్నడ ప్రాంతానికి తరలివెళ్లారు. ఆనాడు మైసూరు కర్నాటక రాష్ట్రానికి చెందిన బళ్లారి జిల్లాలో ఉన్న గుత్తికి దగ్గర గల ప్రాంతంలో అలా తరలివచ్చిన వారి కుటుంబంలో పుట్టాడు. ఇతర రాష్ట్రాల పరిశోధకులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. అక్కడే సంత్ సేవాలాల్ పాత గుడి ఒకటి ఉంది. అతను బాల బ్రహ్మచారి. బంజారా సమాజానికి ఒక దిశానిర్దేశం చేయాలని భావించాడు. తాము ఇక్కడకు వచ్చినప్పటినుండి ఆంగ్లేయులు తమని కష్టాలకు గురిచేస్తున్న విషయం గమనించాడు వారు తమకోసం వేసుకుంటున్న రైలు, రోడ్లు తమ రాకపోకలకు అంతరాయం కల్పించడం గమనించారు. పన్నులు వసూలు చేయడంకోసం కాంచీటీలు (డబ్బు రసీదు కేంద్రాలు) ఏర్పాటు చేయడం వారికి ఏమాత్రం రుచించలేదు. తమ వృత్తిమీద దెబ్బకొట్టడానికే అలా చేస్తున్నారని భావించి వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించిన బంజారాలను జైళ్లలో పెట్టడం, శిక్షల పేరుతో ఉరి తీయడం వారిని కలచివేసింది. ఆ సందర్భంలోనే వీరిని ‘నేరస్థ జాతి’గా పరిగణించడం బాధకు గురిచేసింది. తమ సంప్రదాయ వ్యాపారం దెబ్బతినడంవల్ల గోవులను మేపుకుని బతకడమే బతుకుతెరువైంది. బంజరు భూములలో పశువులను మేపుకొనడానికి అధిక రుసుము వసూలు చేయడం మొదలైంది. ఆనాడు కాటమరాజు వంటి యాదవులను కూడా పశువులు కాపుకుంటే విపరీతమైన ‘పుల్లరి’ విధించినందుకు నెల్లూరు నలసిద్ధి రాజుతో అనేకసార్లు యుద్ధాలు చేయాల్సి వచ్చింది. కాని అంతకుముందు వరకు యుద్ధాలు చేసి అలసిపోయిన అనుభవం బంజారాలది. యుద్ధం చేయాలంటే ఈ ప్రాంతంలో బంజారాలు ఎక్కువ జనాభా కలిగిలేరు. పైగా వారిలో అనైక్యత కూడా ఉంది. ఈ విషయాలు గమనించిన సేవాలాల్ ముందు బంజారా సమాజాన్ని సంస్కరించాలని అనుకున్నాడు. వ్యాపార సంచారం ఆపి వ్యవసాయం వైపు దృష్టిని మరల్చాలి. దురలవాట్లుంటే ఆ పని చేయలేరు. అందుకే మొదట వాటిని మానాలని చెప్పాడు. సంచారమే జీవితమైనప్పుడు రుతువులను అనుసరించిన పండగలు, వేడుకలు ఆనందానికి పరిమితం అవుతాయి. ధార్మిక జీవితం గురించి ఆలోచనలకు తావుండదు. అందుకే సద్ధర్మం అవసరమని చెప్పాడు. ముఖ్యంగా బంజారాలు తమ సంస్కృతిని, తెగ దైవాలను, జీవిత విధానాలను కాపాడుకోవాలని చెప్పాడు. ఈ సమస్య ఇక్కడిదే కాదు. దేశం మొత్తం వ్యాపించి వున్న బంజారాలకు తన సందేశం అవసరం అని నమ్మాడు. అందుకే తన పూర్వీకులు వచ్చిన దారిలోనే నాందేడ్ (హైదరాబాద్ సంస్థానం), మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ వంటి ప్రాంతాలకు వెళ్లి తన బోధనలను వినిపించాడు. ఆ రకంగా సేవాలాల్ రాజారామ్మోహనరాయ్ (1772-1833) కన్నా సుమారు వందేళ్ల క్రితమే, వీరేశలింగం (1848-1919) కన్నా చాలాముందే తన జాతికి సంస్కరణ భావాలను అందించిన భారతీయ దేశీ సంస్కర్త. ఈ సంస్కరణలకు తను జీవించిన సమాజమే పునాది. తాను సంస్కరింపబడుతూ జాతి జనులకు చైతన్యం అందించిన ఆచరణ శీలి. తిరుపతిలోని హాథీరాం బాలాజీ (1832-1928) వంటివారికి గురుతుల్యునిగా వున్న సేవాలాల్ బంజారా సమాజానికి తొలి ఆధునిక వేగుచుక్క. మారుతున్న కాలాన్నిబట్టి బంజారాలు ఆధునిక సమాజ పౌరులుగా తీర్చిదిద్దడానికి అతని సంచార జీవితమే ప్రధాన అనుభవ భూమిక అయింది.
ఐతే తమ మూలాలను కాపాడుకోవడానికి బంజారాలు చేసిన ప్రయత్నం తక్కువేమీ కాదు. గత సంస్కృతి, ఆధునిక అవసరాల మధ్య తమ జీవిత విధానాన్ని కాపాడుకున్నారు. కానీ ఇతర మతాలలోకి మారడం ఈ మధ్య ఎక్కువైంది. తాము శతాబ్దాలుగా పోరాడిన మహమ్మదీయుల ఇస్లాం మతంలోకి, తమని నేరస్థ జాతి అని ముద్రవేసిన ఆంగ్లేయుల క్రైస్తవ మతంలోకి, సాంప్రదాయక హిందూ మతానికి సమాంతర మతంగా ఏర్పడిన సిక్కు మతంలోకి, ఏనాడూ వీరిని మత, కుల వ్యవస్థల పరిధిలోకి రానివ్వని హిందూమతంలోకి ఇప్పుడు ఆకర్షితులు కావడం విచిత్రం.
ప్రకృతితో మమేకమై అందులోనే జీవించిన తెగ, ఇప్పుడు అందుకు దూరం కావడం వల్ల పరాయాకరణకు లోనవుతున్నారు. ఉన్నతీకరణ, సంస్కృతీకరణ ప్రభావంతో తమని తాము కోల్పోవాల్సి రావడం శాపమే. ఇది సేవాలాల్ బోధనలకి వ్యతిరేకం. సేవాలాల్‌ని ఒక దైవంగా మాత్రమే గుర్తించే చైతన్యానికి చేరువై, అతని అసలు సందేశాలను గుర్తించకపోవడం సేవాలాల్‌కి వ్యతిరేకం.
ఒక ప్రాంతంలో ఉన్నత కులం క్షత్రియులుగా, మరో ప్రాంతంలో వీరులుగా, వెనుకబడినవారుగా, రెండు తెలుగు రాష్ట్రాలలో ఆదివాసులుగా రకరకాల సామాజిక స్థాయి గుర్తింపు కలిగి వుండడం వారికి గుదిబండగానే వుంటుంది. లంబాడీలని, సుగాలీలని, లమణులని, గోర్‌మాటీలని ఎన్నో రకాలుగా పిలవబడడం భవిష్యత్తుకు సరికాదు. ఈ విషయాలపై ఆ సమాజం అత్యున్నత ధర్మపీఠం ఆలోచించి సమరూపత సాధించాలి. అందరికీ వర్తించేలా ఒకే పేరుని ఖరారు చేసుకోవలసి ఉంది.
ఇప్పుడు మరో సేవాలాల్ అవసరం ఉంది. పాత వృత్తిస్థానే విద్య, ఉద్యోగం, అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్న బంజారా సమాజం పూర్వ శక్తిని, బాధ్యతని సంతరించుకోవాలి.
నలుగురిలో నారాయణగా జీవిస్తారా? తమ ప్రత్యేకతని, జీవన విధానాల విలువలను కాపాడుకుని బంజారా జాతి ప్రతిపత్తి కాపాడుకుంటారా? అనేది ప్రస్తుతం ఎదురవుతున్న ప్రశ్న. సంత్ సేవాలాల్ స్ఫూర్తితో ఆలోచించడమే ఈ సందేహాలకి సమాధానం.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242