తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ముసలం పుట్టిన యాదవ కులంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘యాదవ సంస్కృతి, చరిత్ర, కళారూపాలు’ అం శంపై ప్రసంగించడానికి ఆగస్టు 20న చీరాలకి రావలసిందిగా పిలిచారు. మన దేశంలో వృత్తి స్వీకరణ పుట్టుకతోనే తప్పనిసరి. వృత్తులు మారరాని చట్రంలో బిగిసుకునిపోయాయి. మారడానికి ఎవరికీ ఎలాంటి స్వేచ్ఛ లేదు. అలా ఎన్నో శతాబ్దాలు గడిచిపోయాయి. వివిధ కులాలు తమ మూల చరిత్రని, వర్తమాన స్థితిగతుల్ని, తమ జీవన విధానాలను సమీక్షించుకోవడానికి కూడా నోచుకోలేదు. ఈమధ్య తప్పనిసరై అస్తిత్వ భావనలు పెరిగాక, గత వైభవాలను, చారిత్రక పాత్రనీ వెనుదిరిగి చూసుకుంటున్నారు. ఆ పనిలో భాగంగానే నా ప్రసంగం ఏ ర్పాటు.
యాదవులు పశుపోషణ వృత్తిగా జీవిస్తున్నారు. ఆ తరువాత కులంగా మారిపోయారు. వృత్తులన్నీ తదుపరి కు లాలై కొన్ని కట్టుబాట్లలో ఒదిగిపోయాయ. భారతీయ కుల వ్యవస్థ నిర్మాతలు హెచ్చుతగ్గులు, అంటరానితనం, దైవాలు, గుడిగోరాలను పకడ్బందీగా ఏర్పాటుచేశారు. నిజానికి పైకులాలు తమ గురించి తాము చరిత్ర రాసుకుంటూ తమ ఆధిపత్యాన్ని మరోమారు పునర్ వ్యవస్థీకరించుకుంటున్నాయి. కాని కింది వర్గాలవారు మాత్రం అలా చేయడాన్ని సహించనితనం అంతటా పెరిగిపోతోంది. వీరిది కులం భావన అంటారు. మరి ఆ భావనల నిర్మూలన కోసం సంస్థలు పెట్టడం తప్ప సాధించిందేమిటి? అని ప్రశ్నించుకోలేనివారే అధికం. అంటరాని కులాల మధ్య అనాదిగా చిచ్చుపెడుతున్నవారిని, చీల్చివేస్తున్నవారిని గౌరవిస్తూ, వారి కనుసన్నలలో బతుకుతూ, స్వీయ చైతన్యం లేకుండా, ఒకరికొకరు శత్రువులుగా తయారైన వైనం హాయగా విస్మరిస్తున్నారు. ప్రస్తుతం దళితుల వర్గీకరణ కారణంగా తమలో తాము కలహిస్తూ కుల నిర్మూలన భావనకి గండి కొడుతూ, కుల పెత్తనాన్ని సహిస్తున్న వ్యక్తులు, సంస్థలే ఎక్కువ. వారు కులాన్ని, కుల దౌర్జన్యాల్ని, అనాదిగా అణగదొక్కబడుతున్న రీతుల్ని అర్థం చేసుకోలేని అర్భకులే ఎక్కువ. మీరు కూడా ఇలాంటి కులసభలకి వెళ్తారా? అలాగా..! అని కొందరు చెణుకులు వేశారు. అవును. వెళ్తాను. వెళ్ళాలి. అప్రత్యక్షంగా మతాన్ని, కుల పెత్తందారీతనాన్ని చారిత్రక అధ్యయన ఆలోచనా విధానాన్ని వెలుగులో ప్రజలకు విడమరిచి చెప్పాలి. ఏ చిన్నవేదికనైనా అందుకు ఉపయోగించుకోవలసిందే.
ఈ దేశంలో పాలక వర్గాలు అంటే కులాలే. వామపక్షాలు కూడా ఇప్పటివరకు కొన్ని కులాల నాయకత్వానికే కట్టుబడి ఉన్నాయ. బ్రాహ్మణ వర్గాలు, ఆలోచనా వ్యవస్థలు కింది వర్గాలను రాజకీయార్థిక సాంఘిక సామాజిక సాహిత్య సాంస్కృతిక కళారంగాలలో తొక్కిపెడుతున్నాయి. విప్లవ రాజకీయ సాంస్కృతిక రంగాలలో సైతం ఎనిమిది దశాబ్దాలపైగా నిత్యం ప్రణాళికలు రచిస్తుంటే దేబెలు కొందరు కిందికులాల మొదటి కదలికలపై, మొదటిసారి చేసే రాజ్యాధికారం ఆలోచనలపై నీళ్ళు చల్లుతుంటారు. అంతిమ ఫలితంపై నమ్మకం లేనివారికి స్థానిక (వాళ్ళూ ప్రస్తుతం స్థానికులు కాదు) పరిస్థితులు కొన్నింటిని చూపుతూ అడ్డుపడడం అంత మూర్ఖత్వం మరోటి లేదు. అలాంటి సందర్భంలో నేనా ప్రసంగం చేయడానికే ఒప్పుకున్నాను. నా పక్కన ఎవరున్నారని కాదు, నా ముం దు శ్రోతలు ఎవరనేదే నాకు ముఖ్యం. ఆ సభకు సుమారు నాలుగు వందల యాదవ పెద్దలు హాజరయ్యారు. అందులో అప్పుడే క్షేత్రాలలో పని ముగించుకుని వచ్చినవారూ ఉన్నారు. మైదానాలలో, ఎండిన పొలాల్లో మేస్తున్న పశువుల్ని వేరేవారిని అప్పగించి వచ్చిన బురదకాళ్ళ మట్టిమనుషులూ ఉన్నారు. మనంద రం మన ఆకలి, మన పిల్లల ఆ కళ్ళకోసం కాని పనులు, ఖూనీపనులు, ఒకటీ అరా మంచి ప నులు చేస్తాం. కాని యాదవులు గొర్రెలు, మేకలు, ఆవులు వంటి నోరులేని పసలాల ఆకలి తీరుస్తారు. అందుకోసం వందలాది మైళ్ళు నడిచిపోతారు. వాటి ఆకలి తీర్చే పనిలో తమ కడుపుని మరిచిపోతారు. ప్రకృతే కాదు వికృత స్థానికాధికారం కూడా వారిని ముప్పతిప్పలు పెడుతుంది. నెలలకొద్ది సంచారం చేసి బావుకున్నదేమీ లేదు. పెళ్లాం, పిల్లల్ని వదిలి పసలాల్నే సంతానంగా ప్రేమిస్తూ ఇళ్ళనీ, ఊళ్ళనీ వదిలిపోయే యాదవులు విద్యాబుద్ధులకు చాలావరకు దూరమయ్యారు. ఈమధ్యే ఇటువేపు ఆలోచిస్తున్నారు.
***
వీరిది ప్రపంచంలో మూడు శాతం జనాభా. భారత్‌లో ఇరవై శాతం. నేపాల్‌లో ఇరవై శాతం. విదేశాలలో జీవిస్తున్నవారిలో పధ్నాలుగు శాతం. నాలుగు దేశాలలో వీరిది గణనీయమైన సంఖ్య. ఐనా వారిమధ్య ఐక్యత లేదు. ఐక్యతకోసం అర్రులు సాచిన ప్రతిసారీ వారిమీద నిందలు. ఐతే శ్రమకు, ప్రజాజీవిత రంగానికి, ఉత్పత్తికి దూరమైన కుహనా మేధావులు ఇలాంటి శ్రామిక వృత్తికులాలవారి ఐక్యతకి గండికొడుతునే ఉన్నారు. ఏ ఆధిక్య కులంవారూ నేరుగా ఇలా ప్రశ్నించరు. కొంతమందిని రెచ్చగొట్టి సాటివారిని ప్రశ్నించేలా ఉసిగొలుపుతారు. దళిత కులాలు తమ తమ చరిత్ర ఇప్పుడిప్పుడే రాసుకుంటున్నారు. సంతోషం. ఆ పని వెనకబడిన కులాల వారు చేస్తే తప్పు కాదు కదా. చరిత్ర లేనివారు చరిత్రని అనే్వషించుకుంటున్న సందర్భంలో, చరిత్ర కలిగి ఉన్నవారు దానికి ఎందుకు దూరం కావాలి?
భారతదేశంలోకి రానివ్వకుండా అలెగ్జాండర్‌ని ఎదుర్కొన్న పోరస్ యాదవుడే. చక్రవర్తి అశోకుడు, అతను సృష్టించిన అశోక చక్రం యాదవ సంస్కృతిలోంచే రూపొందింది. మహాచక్రవర్తి కనీస మానవుడి మానవ స్పందనకి గుర్తు అయినవాడు పశుపాలకుడే. మహాకవి కాళిదాసు కూడా పశు పాలక వర్గంలోనివాడే. జైనమతానికి చెందిన 22వ తీర్థంకరుడైన నేమినాథుడు, కేరళలో పద్మనాభస్వామి ఆలయం కట్టించినవాడూ, వీరత్వానికి సంకేతాలైన కాటమరాజు యాదవులే. ఇలా చెప్పుకుంటూ పోతే అతి పెద్ద చరిత్ర వుంది. అలాంటివారు ఇపుడు ఎందుకు ఇలా కునారిల్లుతున్నారన్నది ప్రశ్న. అల్లరి గొల్లడు కృష్ణుడు యాదవుడే. ఇతనొక్కడే వారికి దైవం. కాని ఇతర పౌరాణిక పురుషులు, దేవుళ్ళు లేరు వీరికి. వారు దైవంగా పూజించే కాటమరాజు మానవుడే. పాంచభౌతిక శక్తులలో ఒకరైన గంగమ్మతల్లి భౌతిక వాస్తవిక శక్తే. యాదవ సంస్కృతిలో భౌతిక సంస్కృతి ప్రధానమైంది. వారు పూజించే బీరప్ప, బసవన్న చారిత్రక పురుషులే. వారి చరిత్రని, వారి ఆలోచనలు, ఆ పాత్రలతోనే వీరి కథలు నడుస్తాయి.
ఒక్క యాదవులకి మాత్రమే పదిహేను ప్రదర్శన కళలున్నాయి. అది ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపద. కురుమలు, గొల్లలకు చెందిన వౌఖిక మహాకథనాలు బోలెడు. వారి సంగీతం, నృత్యం కలగలసిన జానపద ప్రదర్శనలు గొప్ప కళా ఖండాలు. వీటిలో ఒగ్గు కథ, మందహెచ్చు కథ, తెరచీరలవారు, బైకానివారు, గొల్లభాగవతులు, గొల్లసుద్దులు, తప్పెటగుళ్ళు, గొల్లదాసరులు, కొ మ్ములవారు, దేవినోళ్ళ కథ వంటివి అతి ముఖ్యమైనవి. ఇవి వీరగాథలే కాదు, యాదవుల పంచ ప్రాణాలు. వీటిని చెప్పేవారు గొల్లలకి ఉప కులాలవారు. అంటే వీరిపై ఆధారపడి జీవించేవారి సంఖ్య చాలా అధికం. అలా వారిని వేల ఏండ్లుగా పోషిస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. భామాకలాపంగా పేరుపొందిన గొల్లకలాపం కూడా వీరిదే. రాను రాను దానిని కూచిపూడి భాగోతులు కైవసం చేసుకుని అసలు ప్రదర్శన, కథేతివృత్తాన్ని మరుగునపరిచారు. ఈ కథలు చాలావరకు అగ్రకుల పెత్తనాన్ని నిలువరించి, తమ వృత్తి, జీవన విధానం, చరిత్రలపై ఆత్మగౌరవ ప్రకటనలుగా వాటిని తీర్చిదిద్దుకున్నారు.
తెలుగు సాహిత్యంలో తెలుగు చరిత్రలోని పుల్లరి వ్యతిరేక పోరాట ఘట్టం వీరగాథగా మారింది. నెల్లూరు రాజు నలసిద్ధిని ఎదిరించిన యాదవుడే కాటమరాజు. అచ్చతెలుగు, దేశీ భాషలో మహాభారత రచనకన్నా మించిన రచన ఇది. అందుకే దీనిని ‘యాదవ భారతం’ అన్నారు. ఎద్దులబండి మోయలేనన్ని తాళపత్ర గ్రంథాలు గల రచన ఇదే. ఇది తెలుగు ప్రజల సాహసోపేతమైన అసలు సిసలు వీరగాథ. ఐదు రాష్ట్రాలలో ఈ గాథని అనేక రూపాలలో పాడుకుంటారు. ఏ పండిత కులాలలో లేనన్ని ఘం టాలు యాదవులకు ఉండడం విశేషం.
ప్రకృతి ఒడిలో ఎక్కువకాలం జీవించే సంస్కృతి వీరిది. జీవరాశిని గౌరవిస్తూ, జీవాలను పెంచి పోషించడమే వీరి జీవిత లక్ష్యం. వీరి జీవన రీతిలో ధార్మిక ప్రవృత్తి ఎక్కువ. ధర్మదీక్షాబద్ధులైన యాదవులు ఒకనాడు రాజ్యాలేలి, యుద్ధాలు గెలిచారు. అందుకే ఆస్థానకవులు, కళాకారులను పోషించినట్లే అనేక ఉపకులాల కళా ప్రదర్శకులను ఈనాటికీ పోషిస్తున్నారు. వీరి కుల ఆత్మగౌరవాన్ని ఈ కింది రీతిలో చెప్పుకుంటారు. యాదవుని గోవులు కాసిన మాధవుడు యాదవుడే. మరి ఆ మాధవుడు పాల సముద్రంలో, యోగనిద్రలో ఉన్నపుడు అతని నాభి అనే తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మ ఎవరు? యాదవుడే అని పాడుకుంటారు. ఆ బ్రహ్మ ముఖం నుండి పుట్టిన బ్రాహ్మణులు ఎవరు? యాదవులే కదా? అందుకే మనుషులందరూ ఒకటే. హెచ్చుతగ్గులు లేని మానవత్వమే కులం కావాలి అని చెప్పేదే యాదవ సంస్కృతి. శరీర శ్రమ చేయలేని అంటే పనిపాటల వృత్తి లేని బ్రాహ్మలకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తయారుచేసి ఆహారంగా ఇస్తారు. వృత్తులు చేసే శ్రమజీవులకు లేదనకుండా మాంసాహారాన్ని అందిస్తారు.
యాదవకులంలో ముసలం పుట్టింది ఆనాడు. దాన్ని పుట్టించిన ఆధిపత్య కులాల్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఇపుడు వాటి కోరలు తీయవలసి వుంది. ఆ విధంగా యాదవ కులంలో విప్లవం పుట్టాలి. యాదవులు, ఇతర అణగారిన కులాలు ఒక్కటి కావలసి వుంది. అస్తిత్వ ఉద్యమాలు రాకమానవు. అది చారిత్రక పరిణామం. ఐతే వాటితో కొన్ని చిక్కులు ఉన్నాయి. నాయకులుగా చెలామణి అయ్యేవారు తమ స్వార్థం కోసమే కులాన్ని ఉపయోగించుకుంటారు. అనేకమంది నాయకులు తయారై పోటీలు పడతారు. ఎన్నో చీలికలు తెస్తుంటారు. ఈ ధోరణి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిజానికి కులసంఘాలు ప్రజా సంఘాలుగా ఏర్పడి, పీడిత ప్రజల సంఘటిత శక్తిగా మారాలి. అపుడే నిజమైన ఐక్యత ఏర్పడుతుంది. కులాలను నిర్మూలిస్తూ, రాజ్యాధికారం కోసం జరిగే పోరాటం నిర్మించాలి. ఈ సందర్భంలో అన్ని రకాల రాజకీయ పార్టీలు వీటిని ఎదగకుండా చేస్తాయి. అందుకే సీట్ల కోసం ఆలోచిస్తూనే అధికారం హస్తగతం చేసుకోవడంపై ఆలోచించాలి. ఈ శక్తుల ఏకీకరణే, విభిన్న సాంస్కృతిక శక్తుల ఐక్యతకు మార్గం. అది నేటి అవసరం. ఈ విషయం చెప్పడానికే అక్కడికి వెళ్లాను. శరీరం ఎక్కడున్నాదనేది ముఖ్యం కాదు. బుర్రలో ఆలోచన ఏమిటనేది ముఖ్యం.
*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242