తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

స్తబ్దతతో చేటు చేస్తున్న మేధావులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధాలకి కారణాలు ఏవైనా ఫరవాలేదు. ఆయా దేశాల ప్రయోజనాలు మాత్రం ముఖ్యం. అతి చిన్న దేశం, ఒక అతి పెద్ద అగ్రరాజ్యం ఇపుడు ‘యుద్ధం’ అని అంటున్నాయి. మరో రెండు పెద్ద రాజ్యాలు రష్యా, చైనాలు ఆ చిన్నదేశానికి అండగా ఉంటాయని ఉత్తర కొరియా భావన. నిజానికి ఆ దేశాల ప్రయోజనాలు కాపాడే హామీ లభించగానే అవి ప్లేటు ఫిరాయిస్తాయి. లేదా ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం కాస్త వాస్తవమై ప్రపంచ దేశాల ప్రజల నెత్తిమీద సమస్యలు బండల వర్షం కురవక తప్పదు. ఇది అంతర్జాతీయ దృశ్యం.
మన దేశంలో మరోరకం యుద్ధ వాతావరణం సై అంటున్నది. టెర్రరిజం పేరుతో ప్రపంచ దేశాల సమీకరణలో భారత్ పావుగా మారింది.. యుద్ధానికి తన వంతు దోహదం చేస్తున్నది. అటు చైనా, పాకిస్తాన్ దేశాల సరిహద్దుల్లో యుద్ధగాలులు వీస్తున్నాయి. దేశంలో వర్ణ వర్గ సమీకరణలు రణరంగచ్ఛాయలను తలపిస్తున్నాయి. ఏ యుద్ధమైనా మనిషి స్వేచ్ఛని హరిస్తుంది. దేశంలో ప్రతి మూల అలాంటి వాతావరణం సలసల కాగుతున్నది. ఆహారం పేరుతో, అభివృద్ధి పేరుతో, ఆర్థిక ప్రయోజనాల పేరుతో శబ్ద నిశ్శబ్ద యుద్ధం కొనసాగుతోంది. లోగడ ప్రజాస్వామ్యం పాలక వర్గాల ఊడిగం సరుకైంది. పెట్టుబడిదారి విధానం బరితెగించి సర్వాన్ని తనదిగా చేసుకుంటున్నది. ప్రపంచీకరణ గొడుగు కిందకు చేరిన భూస్వామ్య దేశీ శక్తులు విజృంభిస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష, అప్రత్యక్ష మద్దతుగా కలాలు, కులాలు, మేధావులు, ఆలోచనా విధానాలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేధావులు, నిర్మాణాలు, రచయితలు, అక్షరాలు ఏం చేయాలి? ఏం చేస్తున్నాయి? అని ఆలోచించాల్సిన అవసరం మరోమారు ఏర్పడింది. ఆ ఆలోచనల మేధోమథనమే ఈ వారం మీతో.
లౌక్యం, ద్వందనీతి పెరిగిన కాలం ఇది. పతన విలువల పతాక స్థాయి. మామూలు ప్రజల స్థాయిని మించిన దిగజారుడుతనం. ఉద్యమాలు, పోరాటాలు, విప్లవాలు అని వల్లించే వ్యక్తులు, సంస్థలు ఒక్కో కారణం రీత్యా తెల్లజెండా ఎత్తుతున్నాయ. దానినే ఎర్రజెండగా, నీలి జెండాగా, నిప్పుల జెండాగా ఎత్తిచూపుతున్నారు. అంతిమంగా సమాజం మీద ప్రభావం చూపని శక్తుల సౌరంభం. మాటలు కోటలు దాటుతాయి. కాని కాళ్ళు గలమలు దాటవు. ఇప్పుడు మేధావులు కనబడని పంజరాలలో బందీలు. వారు నిష్క్రియాపరులుగా మారిన పరిస్థితి. దానిని ఎదిరించే సత్తువ, ప్రణాళికకు మేధావులు దూరం. అందుకే కేవలం ప్రకటనలకే పరిమితం.
ఆచరణవాద మేధావులు సైతం తమ తమ నిర్మాణాదుల పంజరంలోంచే పలుకుతున్నారు. దశాబ్దాల క్రితపు పాత ప్రణాళికను తూచ తప్పడం లేదు. వెరసి పెత్తందారీ కొత్త ప్రపంచ నిర్మాణాన్ని ధ్వంసం చేయలేకపోతున్నారు. నగరాల్లో పెరిగిపోతున్న పెట్టుబడి, ఆ పలాయన సంస్కృతికి అడ్డుకట్ట వేయడంలో వైఫల్యం. గీ పెట్టి అరిస్తే సొల్లుకారడం తప్ప మరో ప్రయోజనం ఉండదనే చందంగా మారింది. ఇపుడు ఎవరు మేధావి అంటే- సమాజానికి, ప్రజల బతుకులకు దూరంగా ఉంటూ, ప్రత్యక్షంగా కంటితో పక్కవాడిని కూడా చూడలేనివాడు, ఊహాత్మక ప్రకటనలు చేసేవాడు అని అర్థం రూఢి అయ్యింది.
నిజానికి మేధావి అంటే- బౌద్ధిక కృషిలో భాగం అయ్యేవాడు. కార్మిక, కర్షక వర్గాలలోంచి, వారి ఉద్యమాల నుండి వచ్చినవాడు. నిత్యం భౌతికంగా, మానసికంగా ప్రజల మధ్య ఉండేవాడు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో కలిసి తిరిగేవాడు. వారి బతుకును అర్థం చేసుకుంటూ, వాటిని మార్చే ప్రయత్నం చేసేవాడు. నిర్దిష్ట సమస్యని, కాలం, స్థలాలలో అవగాహన చేసుకుని దానికి పరిష్కారం చెప్పేవాడే నిజమైన మేధావి. అంతేగాని సాధారణీకరించే భావాలను అన్ని రకాల సమస్యలకు నిరంతరం ఒకే రీతిలో సూత్రాలు చెప్పేవాడు అసంపూర్ణ మేధావి. అతను యాంత్రికవాది. సైద్ధాంతిక అవగాహనలోపం, ఆచరణ రంగంలో దూరం అతని లక్షణాలు.
గొంతు కలిగి, గలగల మాట్లాడే సామర్థ్యం, ఒక తీరు, సామాజిక స్థాయి, చదువు ఉన్నవాడు మేధావి అవుతాడు మన సమాజంలో. తీరిక, ఆర్థిక వెసులుబాటు కలిగిన కుటుంబాలనుండి వచ్చినవారే పాలకవర్గాల, ప్రజల మేధావులుగా చెలామణి అయ్యే పరిస్థితి. వీరు మొదటిదశలో ప్రజల కోసం చాలా ఉత్సాహంగా ఉంటారు. ప్రజల దినవారి సమస్యలపట్ల అసహనం చూపుతారు. కుల వర్గ వర్ణ సమస్యలు ముప్పిరిగొంటే అశక్తతకు లోనవుతారు. లేదా వాటిని కప్పిపెట్టి పబ్బం గడుపుతారు. ఆ సమస్యలను లేవనెత్తే ప్రజలే సమస్యాత్మకం అని అభిశంసిస్తారు. సరైన మార్గం చూపలేక డీలా పడిపోతారు. లోలోపల తమ అశక్తత, అశాస్ర్తియత వారిని నిలదీస్తుంది. దానిని ఎదిరించి నిలబడి ఆలోచించడం మాని, తన స్థానం, ఉనికిని మార్చుకుంటాడు. మరింత సురక్షిత స్థానంలోకి మారతాడు. అప్పుడు సాదాసీదాగా ఉన్నవాడు డాబు దర్పానికి దగ్గరవుతాడు. అంటే, ప్రజలకు ఎడంగా తయారవుతాడు. అందువల్ల స్థానిక శ్రామిక వర్గ దృక్పథానికి దూరంగా, కేవలం సైద్ధాంతిక సూత్రాలకు దగ్గర అవుతాడు. అలాంటి దశ ఆంధ్ర దేశంలో 1980 ప్రాంతాలలో విపరీతంగా ఉండింది. పోరాడే ప్రజలకి, కేవలం సూత్రాలకి వల్లెవేసేవారి మధ్య ఎలాంటి సయోధ్య కుదరలేదు. రెండు విడివిడిగా విడి భాగాలన్నట్లు వేరుపడిపోయాయి.
మేధావి తన అధ్యయనాన్ని ప్రజల పరం చేయాలి. కాని అది కేవలం ఉపన్యాసాలు, అక్షరాలకే పరిమితం అయ్యాయి. అప్పటినుండి తెలుగు నేలమీద మేధావి అంటే పై వర్గాల కులాలకి సంబంధించినవాడని రూఢి అయ్యింది. పోరాడే వర్గాలలో అట్టడుగు వర్గాలు, ఆదివాసీ దళిత వర్గాలనే ఆలోచన పెరిగింది. ఏదో ఓ రూపంలో మధ్యతరగతి అటునిటు కాకుండా తన సంక్షేమాన్ని, ప్రయోజనాలను పొందుతూ వచ్చింది. అందులోని కొంతమంది ప్రజలపక్షం వహించి త్యాగాలు చేశారు. ప్రజా మేధావులుగా కర్తవ్యం నిర్వహించినా వారిని నిర్మాణాలు ఎక్కువగా గుర్తించిన దాఖలాలు తక్కువే. అందుకే ప్రజా రాజకీయ రంగంలో నాయకులు, మేధావులు, రచయితలు ఆ వర్గాల నుండి వచ్చిన వారే ఎందుకు ఉండాలి అనే ప్రశ్న సంధింపబడింది.
దానికితోడు పార్టీల, నిర్మాణాలలో దాగిన పైవర్గ మత స్వభావంతో ఇమడలేక, పోటీపడలేక నిశ్శబ్దంగా ఉంటు ఒక్కొక్కరే అనేక నిర్మాణాల నుండి బయటకు వచ్చారు. అలా వచ్చిన వారిలో కొందరు తమ తమ కుల వర్గ సామాజిక అస్తిత్వాలతో కలిసిపోయారు. మరికొందరు నిశ్శబ్దంగా తలదాచుకున్నారు. పార్టీలలో నుండి బయటపడిన ఉన్నత వర్గాల నాయకులు వ్యాపారం చేసుకుని బాగుపడ్డారు. పత్రికలలో చేరి సామాజిక స్థాయి, ఆర్థిక వెసులుబాటుతో జీవితం గడిపారు. మరికొందరు మెల్లి మెల్లిగా ప్రభుత్వం, పాలక వర్గాల చంకలో దూరి ప్రజావ్యతిరేక భావజాలానికి దగ్గరయ్యారు. వారు పాలక వర్గాలని పొగిడి అందలాలు ఎక్కారు. మరికొందరు శాస్త్ర సాంకేతిక రంగాలలోకి చొరబారి తాయిలాలు అందుకుంటూ బూర్జువా వర్గానికి అనువుగా తయారుకావడం ప్రపంచవ్యాప్త వాస్తవం.
కలిగినవారు ఎన్జీవోల రూపంలో కొత్తగా అవతారం ఎత్తారు. వారి కృషి, కార్యకలాపాలు, అధ్యయనాలు జన బాహుళ్యాన్ని భ్రమల్లో ఉంచడానికే వినియోగింపబడతాయి. ఉద్యమ ప్రజా మేధావుల సంఖ్య తగ్గిపోయింది. వారి అధ్యయనం పనికిరాని పరిస్థితికి చేరింది.
ఉద్యమ రంగం తన దారిని తను చూసుకుంది. సమాజం, ప్రజలు మరో దారిలోకి బలంగా నెట్టివేయబడ్డారు. మధ్యన మేధావులు ఏ దారిలో, ఏ రంగంలో అధ్యయనం చేయాలో తెలియక నిమ్మకుండిపోయారు. రచయితలూ అంతే. ఈ పరిస్థితిలో రచయితల సంఘాలలో రాజకీయాలు పెరిగాయి. పై వర్గంవారు అట్టడుగు వర్గాలవారిని తొక్కి పెట్టడానికే తమ సృజన శక్తిని ఎక్కువగా వినియోగించారు. బాధతో వీళ్ళూ దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. అలా పై, కింది వర్గాల రచయితలు తమ అసలు బాధ్యతని నిర్వహించలేకపోయారు.
ఈ రచయితలు, మేధావులు దేశీయ అణచివేత రూపాలను గుర్తించరు. విదేశీ సిద్ధాంతాల అన్వయమూ చేయరు. అంతర్జాతీయ రాజకీయ ఘర్షణలపై విపరీతమైన దృష్టి పెట్టడంవల్ల వాటి ప్రభావాలు తెలియకుండా మన దేశంలోకి జొరబారిన రీతుల్ని పైపైనే గుర్తించీ గుర్తించకుండా వెనుకబడిపోవడం ప్రజలకు శాపంగా పరిగణించింది. చాలాసార్లు బూర్జువా ప్రజాస్వామిక రూపాలను ప్రజల స్వేచ్ఛాయుత జీవనంగా భ్రమించడం కూడా జరిగింది.
ప్రజలకు దేనినుండి స్వేచ్ఛ కావాలో మన బుద్ధిజీవులు ఏనాడూ పట్టించుకోలేదు! సామ్రాజ్యవాదాన్ని ఖండించాల్సిందే. కాని ఇక్కడ దేశీయంగా అనేకపాళ్ళలో పౌర స్వేచ్ఛ కులం, మతం, వివిధ రాజకీయ నిర్మాణాలు, ప్రభుత్వ శాఖలు, ఉద్యోగుల వల్ల అరికట్టబడింది. ఈ విషయంలో విస్తారిత దృష్టి లేకపోవడం, లోతైన అవగాహన కుంటుపడడం వల్ల ప్రజలు అస్వతంత్రతకి గురయ్యారు. అది ఒక కట్టుబాటుగా మారింది. ఏ రూపంలో వారి స్వేచ్ఛ తిరిగి వారికి అందించాలో తెలియకుండా పోయింది.
ప్రతిదీ పోరాటంవల్లే సాధ్యం అనే జిందా తిలిస్మాత్ సూత్రీకరణ వినిపించిన మేధావులను వారి కుహనా అవగాహనని ఎండగట్టక తప్పదు. ఇప్పటికీ బీరాలు పోయి, గొప్పలు చెప్పుకునే యాంత్రికవాదం మేధావుల పాలిటి శాపం. రాష్ట్రం విడిపోయ కొత్త రాష్ట్రాలు ఏర్పడి మూడేళ్ళు దాటినా ఇంకా సమయం కావాలి అనే నినాదాన్ని మేధావులు అంగీకరించారు. ఏ మాత్రం దృశ్యం మారకుండా, పాత నమూనా మారకుండా కొత్తగా ఏం చేస్తారు. ఈ విషయంలో ఇప్పుడు మేధావులు పూర్తిగా అడుగంటిపోయారు. మేధోరాహిత్యం మాత్రం పెరిగిపోయింది. మేధావులు, రచయితలు ప్రత్యక్షంగా పాలక వర్గానికి దాసోహం అన్నారు.
కొన్ని విప్లవ, ఉద్యమ నిర్మాణాలు - అధినాయకుని కార్యాలయంలోని ఉద్యోగులని కవచంగా పెట్టుకున్నారు. పైకి మాత్రం పోరాడాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ అభ్యంతకరమైన అక్రమ సంబంధాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఈనాటి మేధావుల, రచయితల లోపాయకారి ఒప్పందం. ఈ వైఖరితో ప్రజలు విసిగిపోయిన వైనం ఒక వాస్తవం.
దిగజారినవారి పక్షంలో చేరి ప్రజలు పోరాటాలు చేయలేరు. అందుకే ఇవాళ అంతటా స్తబ్దత!

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242