తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

వేదిక కింద తన వాళ్ల కోసం తచ్చాడుతున్న తెలుగమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండెలదిరేలా తెలుగు మహాసభలు ఆరంభమయ్యాయి. భాషా పండగ (ప్రారంభ సభ) అదిరిపోయింది.
బాణాసంచా వెలుగులు, లేజర్ మిరుమిట్లు చూసి తెలుగు ప్రజలు ఆనందంతో పులకించిపోయారు.
అనుకున్న దానికన్నా అధికంగా జనం విరగబడిన సభ ఈ మధ్య ఇదే.
భాషా సాహిత్యాల పండుగ కనుల పండగ్గా జరిగింది.
ముఖ్యమంత్రి పదమూడు పద్యాలతో 35 నిమిషాల ప్రసంగం ఆకర్షణీయం. తన గురువు మృత్యుంజయ శర్మకు పాదాభివందనం చేయడం ముఖ్యమంత్రి ఔదార్యానికి మచ్చుతునక.
ఈ రీతిలో సభ నిర్వహించడం న భూతో.. కేసీయారే తిరిగి ఇలా జరిపించలేనంత వైభోగంగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా వేనోళ్ల పొగిడాయి పత్రికలు.
అందుకు అనేకులు ఆనందించారు. ఇది వాస్తవం.
ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా ఆహూతులు పారవశ్యం పొందారు.
భాషామతల్లి సజీవ శరీరం కలిగి ఉంటే ఆమె ఒళ్లంతా పులకింతలే. తెలంగాణా తల్లి కూడా అంతే! అవి విగ్రహాలయిపోయి బతికాయి.
ఇక తాము ప్రజల తల్లులుగా మనగలుగుతామా అనే సందేహం శుక్రవారం రాత్రి నుండి ఏ మాత్రం వదలడం లేదు.
‘భాషకు బ్రహ్మోత్సవాలు’ అనే పదబంధం చాలా పత్రికలు వాడాయి. ఇలాగే, ఇంత ఆర్భాటంగా 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ మహాసభల సందర్భంగా రాశాయి. తిరుపతి సంస్కృతిలో ‘బ్రహ్మోత్సవాలు’ ప్రతి ఏడాది జరుగుతాయి. అలాగే ఉత్సవాలు పాలకులకి అవసరం కలిగినప్పుడల్లా జరుగుతాయి. చేతిలో ఏభై కోట్లుండాలే గాని, ఏ తల్లి పేరుతోనైనా సభలు జరపడం కష్టం కాదు. కాని ప్రజల పైసకు విలువ, లెక్క ఉంటుందని తెలిస్తే మాత్రం వేరేలా ఉంటాయి.
భాషను బతికించాలి. పట్టుచీర లోపల తెలుగు తల్లి ఎంత బలహీనంగా శుష్కించి ఉందో ఎవరు చూస్తారు. ఇప్పుడు ఆమెకు కావలసింది పుష్టి. ఆభరణాలు, మేకప్‌లు కాదని ఆమె చిరకాల వగపు. పదహారు కోట్ల మంది తన తనయుల ఆదరాభిమానాలు కావాలని ప్రాధేయపూర్వక విజ్ఞప్తి. తనని ఏ కొద్దిమందికో, ఏ ఒక్క వర్గానికో కట్టెయ్యడం ఆమె చాలా కాలం నుండి ఇష్టపడలేదు. తాను ప్రజలందరి నాలుకల మీద ఉంది కాబట్టే ఇప్పటికీ నిలవగలిగానని నమ్ముతుంది. ప్రజల నాలుకలే తన ఆనవాళ్లని ఆమెకు తెలుసు. పరభాషా పాలకులు పాలించిన కాలాలలో పండితులు, రాయసగాళ్లూ ఆయా భాషల వేషం వేసుకున్న ఘట్టాలకు తానే సాక్ష్యం. అప్పుడప్పుడు చేసిన తప్పుకు వారు ప్రాయశ్చిత్తంగా తెలుగు భాషని మననం చేసుకుంటారు.
ఇండియాలో చదివిందంతా ఆంగ్లంలో, తెలుక్కి సంబంధం లేని డిగ్రీలే. లక్ష్యం విదేశాలు. సంపాదన డాలర్లలో. కాని అక్కడికి వెళ్లాక కొట్టిన బోరులోంచి తెలుగు పాట అందుకోవడం మామూలు. వారిని అలా తయారుచేసే ప్రభుత్వం, తల్లిదండ్రులు. వ్యవస్థ ఇక్కడ బలంగా ఉంది. డబ్బున్న వారి జీవిత లక్ష్యం ప్రైవేటు బడులలో ఆంగ్లంలో చదవాలి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో, సంస్థలలో కోర్సులు చేస్తూనే వీసా కోసం ప్రదక్షణలు. ఇప్పుడా అవసరం లేకుండా డబ్బున్నవారు విదేశాల్లోనే చదువుకుని, అక్కడే ఏజంటుకి జీతంలో పాతిక శాతం ముడుపులు చెల్లించి ఉద్యోగాలు చేయడం. వాస్తవం. పైగా వీళ్లే మాతృభాష కోసం అప్పుడప్పుడు తుంపిర్లను ఖర్చు పెడతారు. భాషామతల్లి కోసం ఎక్కడలేని ఆదుర్దా వీళ్లకే.
చాలాకాలంగా మన ప్రభుత్వాలు భాషా స్థితిని చూస్తూ మిన్నకుంటాయి. తెలుగు ఒక విషయంగా కూడా నిర్బంధం చేయవు. తెలుగు పాఠశాలలను మూసివేసి, తెలుగుతల్లికి నిష్క్రమణ గీతం పాడుతాయి. బడుల నుండి, కొత్తగా ఏర్పడే రెసిడెన్షియల్ పాఠశాలల నుండి ఆమె కన్నీళ్లతో రోడ్డున పడుతుంది.
భాషంటే పద్యం అనుకునే మందమతులు పెరిగిన చోట, భాషామతల్లి ముక్కెరే ముఖం అనుకునే రాజకీయ మేధావుల పాలనలో ఆమె అసలు స్వరూపం ఎవరు చూస్తారు? నన్నయ నుండే ఆమె ఆచూకీ ఉందనుకునే వారికి భాష గంగా ప్రవాహంలా ప్రాచీనమని... ఉపనదుల, యాసల కాలువల, మాండలికాల ఊటల సమూహారమని ఎలా అర్థం చేసుకోగలరు?
ఆమె పంపన రాసిన కురిక్యాల శాసనంలో కందపద్యమై వెలసింది. ఆచార్య దివాకర్ల వేంకటావధాని రాసిన ‘ప్రాఙ్ఞన్నయ యుగపు తెలుగు’గా అనేక శాసనాలలో, కోటిలింగాల నాణేలలో తెలుగై వికసించింది. ననె్నచోడుని ‘కుమార సంభవం’ కావ్యంలో మునుమార్గ కవితై, ‘దేశి’గా ఎదిగింది. తనని ఒక రాజాస్థానానికే బందీని చేయడం చూసి ఆమె గుండె కకావికలైంది.
కావ్య ప్రబంధాల కన్నా వేల ఏళ్ల ముందు నుండే తెలుగు అమ్మల కంఠాలు కవితల గంపలలో పదిలంగా ఉన్నాయి. ఆమె లాలి జోల పాటల కమ్మదనమైంది. శ్రమ క్షేత్రాలలో నిత్యం ఆమె భాషకు పురుడు పోస్తూనే ఉంది. అదే ప్రజల తెలుగు భాష. అదే కమనీయ నుడికారం. అన్ని రుచుల కలబోతని ఒక్క ‘కారానికే’ పరిమితం చేయడం వల్ల బాధతో గుండె బాదుకుంటోంది. నిరంతర ఊటల ఆశు సంప్రదాయంగా, నోటి భాషా జలపాతంగా, ఎదుగుతుంటే కేవలం ఒకేఒక్క చోటు చూపి అదే ‘్భష’ అనడం చూసి నొచ్చుకొంటున్నది. గుడ్డివాళ్లు ఏనుగుని తట్టి చూసి తమకి తోచిన రీతిలో చెప్పినట్లు తనని సమభాషగా కాకుండా ముక్కలు ముక్కలుగా చూసి పరిహసించినట్లు భావిస్తున్నది. అంబరం అంటిన తారాజువ్వ భూమి మీదకు ఎప్పుడు కిందకు దిగుతుందని మొన్నటి రాత్రి నుండి లేచి చూస్తోంది. ఆకాశంలో వెలిగిన లేజర్ కిరణాలను ఒడిసిపట్టే నేర్పు సభా నిర్వాహకులకు ఉందా అని వేచి ఉంది. కడుపు నిండా తిన్న పదార్థాలు హాయిగొలపగా మత్తుతో కనులు మూతపడుతున్న వైనాన్ని వేకువ వరకు చూస్తూనే ఉంది. సభా ప్రాంగణమంతా గంట గంటకు శుభ్రం చేసే శ్రామిక తల్లుల ఒడిలో కాస్తంత విశ్రమించాలని అనుకుంది. కాని, విజిళ్ల శబ్దంతో కోరికను చంపుకుని నిశే్చష్ట అయ్యింది.
వందలాది పాఠశాలల నుండి, కానె్వంట్ల నుండి ఆమెను ‘డిబార్’ చేశారు కదా, రేపటి నుండైనా తనని వాటిలోకి అడుగుపెట్టనిస్తారా అని ఆశతో రాత్రంతా అక్కడే జాగారం చేసింది. ఉదయం పత్రికల్లోని వార్తల పొంగుల్లో తనని బతికించే ప్రణాళిక ఏదైనా ఉందా అని అక్షరం అక్షరం అనే్వషించింది.
మాటలమ్మగా జానపద గిరిజన దళిత కళా రూపాలలో, పాటలలో కైతున్కగా వేలాడబడిన భాషని చూసి తన మూల రూపం, ముప్పాతిక భాగం గురించి ‘్ధఃఖ్ఖించ్చింది’. లేజర్ కిరణాల పక్కన జానపద బాణీలు, గీతాలు, ప్రదర్శనలు, డక్కులి, కినె్నర వాద్యాలు, ... శబ్దాలు, మాలల కడ్డీ తంత్రీ వాద్యం... అణగారిన తెలంగాణా ఆడపడుచుల బతుకమ్మ గీతాలు, చప్పట్ల సప్తస్వరాల సంగీత రాగాలు వినబడలేదని చిన్నబోయింది.
జానపద కళాకారులు తమ కళారూపాల ప్రదర్శనలు రవీంద్రభారతుల్లో ఇవ్వాలని ఇచ్చిన ఆధికారిక ఆదేశాలను, క్రూరాతి క్రూరంగా వెనక్కి తీసుకుంటే - తన అంటరాని భాష కంఠస్వరం వేదికలపై వినిపించలేక పోయినందుకు వెక్కివెక్కి ఏడ్చింది.
భాషా పండగలో అంటరానితనం మరోసారి, వికటాట్టహాసం చేసింది. తెలుగు తల్లి, తెలంగాణా అమ్మగా రూపమెత్తి భద్రకాళిలా గర్జించింది. ఒకే ఒక మాటతో శపించింది - వీళ్లంతా కలిస్తేనే ఏభై ఆరు అక్షరాలు. వీళ్లు లేకుండా ‘భాష’ బతుకదు. ఇదో చూడు! నా శరీరం ఇవ్వాళటి నుండి ఇలా శుష్కిస్తోంది చూడు’ అని తన కొంగుచాచి వలవల ఏడ్చింది. మీ భాషకు ప్రాణవాయువు లూదిన గిరిజన భాషలు, ఆ భాషల్లోని తెలుగు కవులు, రచయితలు లేకుండా, దళిత గళాల ప్రత్యేక సదస్సు లేకుండా, వందలాది మంది జనం కవులు, ప్రజా సాహిత్యం, ప్రదర్శనల ప్రాతినిధ్యం లేదు. ఏమిటీ సభా నిర్వాహకులారా! ఏమి తీరు ఇది! అని ఆక్రోశించింది.
ఆమె కన్నీరు నేల మీద బొట్టుబొట్టై రాలింది. మట్టిలో దాగిన మాటల, మూల ధాతువులు, రాగాల బీజాలు ఒక్కసారిగా చిటపటమని బీజవాపం చెందాయి. మిత్రులు ఆగ్రహంతో పగిలి రెండు దిక్కులా చేతులు పిడికిళ్లలా విచ్చుకున్నాయి.
ప్రజల భాషా సాహిత్య సంస్కృతుల కోసం మరో ఉద్యమ కేతనం ఎగరాలని తెలుగు నుడి వెదుక్కుంటోంది. తమిళనాడులో, మహారాష్టల్రో, కన్నడ ప్రాంతంలోని మూలమూల అంకురాలు విస్తరిస్తున్నాయి. కళింగాంధ్ర భాష, రాయల సీమ నుడి, కోస్తా స్వరం వాటిని ఆహ్వానిస్తున్నాయి.
బడుల పాఠాలలో, న్యాయ తీర్పులలో, మామూలు ప్రజల కందే ఉత్తర్వులలో, తను సజీవంగా వినబడాలని ‘నుడి’ కడలై ఘోషిస్తోంది.
మిగతా నాలుగు రోజులు ముగిసేనాటికి తన పూర్వ చిరునామాలు తనకి దక్కాలని చెయ్యెత్తి నినదిస్తోంది. సర్వకులాలు, సబ్బండ వర్ణాల భాషా సాహిత్యాలు అక్కడ కనుపించక ఒంటరిదై బిక్కుబిక్కుమంటోంది.
ఆ సభా ప్రాంగణాలలో తచ్చాడే ఆమెని ఎవరైనా గుర్తించారా?

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242