మెయిన్ ఫీచర్

నవ్య సృజనకే పట్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతికంగా, సృజనాత్మకతపరంగా, వాణిజ్యపరంగా తెలుగు సినిమా చేరుకున్న అత్యున్నత స్థితికి సాక్షీభూతంగా నిలిచిన సంవత్సరం 2015! జాతీయ స్థాయిలోనూ అందరూ తెలుగు సినిమా ‘స్టామినా’ను చూసి ఆశ్చర్యపోయేంత సంచలనానికి కారణమైన ఏడాదిదే. జనాల్లో సినిమాకి ఉన్న వినోదాత్మక విలువస్థాయిని చూపించడంలోనూ, సామాజికంగా ప్రేరణని అందించడంలో అది చూపించే ప్రభావాన్ని సాక్షాత్కారం చేయడంలోనూ సినిమాకి సినిమాయే సాటి అని మరోసారి నిరూపించిన సంవత్సరమిది!!

‘లయన్’, ‘బెంగాల్ టైగర్’, ‘షేర్’లు ప్రేక్షకులకు ‘కిక్’ని ఇవ్వలేవని, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఎంత ‘టెంపర్’తో ‘బ్రూస్‌లీ’ లెవల్‌లో కనిపించినా ‘పండగ చేస్కో’ లేమని ఆడియెన్స్ తెగేసి చెప్పారు...! ‘సినిమా చూపిస్త మావ’ అని వచ్చిన ‘రుద్రమదేవి’కి ‘కంచె’ లేవీ అడ్డుకావని, ‘శంకరాభరణం’, ‘సితార’లకు ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ అనీ, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే ప్రశ్ననీ, ‘భలే భలే మొగాడివోయ్’ అనే ఆశ్చర్యాలని సృష్టించగలిగిన ‘జాదూగాడు’, అసలైన ‘శ్రీమంతుడు’ ప్రేక్షకుడే అని మరోసారి నిరూపణ అయిది. 84 ఏళ్ళ తెలుగు సినీ ప్రస్థానంలో 2015 ‘బాహుబలి నామ సంవత్సరం’గా చెరిగిపోలేని ముద్రని వేసింది!

సినిమా అంటే మేకింగ్ పరంగా 24 క్రాఫ్ట్‌ల సమ్మేళనమే. కానీ ‘కంటెంట్’పరంగా మాత్రం అది నవరసాల సంగమం. తెలుగు సినిమా 1931లో తొలిసారి అడుగు వేసింది మొదలు, ఇప్పటివరకూ చేసిన ప్రయాణంలో కామెడీని, ఎంటర్‌టైన్‌మెంట్‌నీ, హారర్‌నీ, యాక్షన్‌నీ, లవ్- రొమాన్స్‌నీ, ఫ్యామిలీ సెంటిమెంట్‌నీ... ఇలా అన్ని రకాల రసాలని ప్రేక్షకుల అనుభవంలోకి తెచ్చింది. అయితే 2015 ప్రధానంగా ‘అద్భుతరసం’లోని ‘విస్మయం’ అనే అనుభూతిని వెండితెరపై సృష్టించి, ‘లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్’ సూత్రంతో యాక్షన్ -కామెడీలు రాజ్యమేలుతున్న సినీలోకంలోకి కొత్త విస్మయ ప్రపంచాన్ని పరిచయం చేసింది. అయితే ఈ ‘విస్మయానుభూతి’ ఈసారి రెండు రకాలుగా ప్రేక్షకుల అనుభవంలోకి రావడం విచిత్రం. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక హంగుల కారణంగా తెరమీద సృష్టించబడిన మాయాజాలం వల్ల కలిగిన ‘విస్మయం’ ఒక రకంకాగా, డిఫరెంట్ కథ -కథనంతో సున్నిత మానవ సంబంధాల నేపథ్యంగా ఆవిష్కరించిన ‘విస్మయం’ మరో రకం! ఏదేమైనా ఈ సంవత్సరపు సినీ సక్సెస్ ఫార్ములా ‘విస్మయం’ అని వెల్లడయింది!!
హీరోల ప్రోగ్రెస్ రిపోర్ట్
ఈ ఏడాది సంఖ్యాపరంగా మూడేసి సినిమాలతో ముందు వరసలో ఉన్న హీరోలు ముగ్గురు. వారిలో నాని (ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు, భలే భలే మొగాడివోయ్); సుధీర్‌బాబు (మోసగాళ్ళకు మోసగాడు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... భలే మంచిరోజు); అల్లరి నరేష్ (జేమ్స్‌బాండ్, బందిపోటు, మామ మంచు -అల్లుడు కంచు) తమదైన పంథాలో సినిమాలను చేశారు. కాగా, కళ్యాణ్‌రామ్ (పటాస్, షేర్); రామ్ (పండగ చేస్కో, శివం); గోపీచంద్ (జిల్, సౌఖ్యం); రాజ్‌తరుణ్ (సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్); సాయిధరమ్ తేజ్ (రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేర్); రానా (బాహుబలి, రుద్రమదేవి); నిఖిల్ (సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం); వరుణ్‌తేజ్ (కంచె, లోఫర్); వరుణ్‌సందేశ్ (పడ్డానండీ ప్రేమలో మరి, లవకుశ); సందీప్ కిషన్ (టైగర్, బీరువా); సుమంత్ అశ్విన్ (కేరింత, కొలంబస్); రవితేజ (బెంగాల్ టైగర్, కిక్-2) రెండేసి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
ఇక, పవన్‌కళ్యాణ్, వెంకటేష్ ఇద్దరూ ‘గోపాల గోపాల’తో, ఎన్టీఆర్ ‘టెంపర్’తో, రామ్‌చరణ్ ‘బ్రూస్ లీ’,; అల్లు అర్జున్ ‘డ/్య. సత్యమూర్తి’, ‘రాణి రుద్రమదేవి’తో, రాజశేఖర్ ‘గడ్డం గ్యాంగ్’తో, మంచు విష్ణు ‘డైనమైట్’తో, నితిన్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’తో, నాగచైతన్య ‘దోచెయ్’తో, శర్వానంద్ ‘మళ్ళీమళ్ళీ ఇదిరాని రోజు’తో, నారా రోహిత్ ‘అసుర’తో, సంపూర్ణేష్ బాబు ‘సింగం 123’తో, నాగశౌర్య ‘జూదగాడు’తో థియేటర్‌లలోకి వచ్చారు. సీనియర్ హీరో బాలకృష్ణ ‘లయన్’తో రాగా, నాగార్జున సినిమా ఏదీ ఈ ఏడాది విడుదల కాకపోవడం విశేషం. అయితే ఆయన పుత్రుడు ‘అఖిల్’ హీరోగా పరిచయమైన సినిమా ఎంతో హైప్‌తో వచ్చింది. అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ మిత్రుడు ఆకాశ్‌పూరి పరిచయ చిత్రం ‘ఆంధ్రాపోరి’ కూడా విడుదలైంది. కాగా, హీరో కళ్యాణ్‌రామ్ నిర్మాతగా ‘కిక్-2’ సినిమా వచ్చింది. ఇక, మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’, ప్రభాష్ ‘బాహుబలి’ సినిమాలు వారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌లుగా, వారి ఇమేజ్‌ని బాక్సాఫీస్ స్టామినాని మరింత పెంచిన సినిమాలుగా నిలిచాయి.
హీరోయిన్‌ల పరిస్థితేంటి?
తెలుగు సినిమా ప్రధానంగా హీరో డామినేటెడ్ సినిమా అని చెప్పాలి. అందువల్ల హీరోయిన్‌ల పాత్ర కౌశలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం అయిందనేది సత్యం. అయితే కొంతమంది హీరోయిన్‌లు ‘గ్లామర్ డాల్’గా ఉంటూనే, తమదైన తరహాలో ప్రత్యేక ముద్రతో వెళ్తున్నారు. అలా ఈ సంవత్సరం అనుష్క (బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో) హీరోలకు ఉండేంతటి క్రేజ్, ఫాలోయింగ్‌తో ప్రత్యేకతను చాటుకుంది. కాగా, శ్రుతిహాసన్ (శ్రీమంతుడు), కాజల్ (టెంపర్), శ్రీయ (గోపాల గోపాల), నిత్యామీనన్ (మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు), సమంత (S/o సత్యమూరి), త్రిష (లయన్, చీకటిరాజ్యం), ఛార్మీ (జ్యోతిలక్ష్మి), నందిత (శంకరాభరణం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ), తమన్నా (బెంగాల్ టైగర్, బాహుబలి), రెజీనా (సుబ్రహ్మణ్యం ఫర్ సేల్), లావణ్య త్రిపాఠీ ( భలే భలే మొగాడివోయ్), ప్రణీత (డైనమైట్), రాశిఖన్నా (శివం, జిల్), రకుల్ ప్రీత్‌సింగ్ (కిక్-2, బ్రూస్ లీ, పండగ చేస్కో), కలర్స్ స్వామి (త్రిపుర), అవికాగోర్ (తను నేను), సాక్షిచౌదరీ (జేమ్స్‌బాండ్), అమలాపాల్ (జెండాపై కపిరాజు), పూర్ణ (అవును-2), శ్రీదివ్య (వారధి, కేరింత), యామీ గౌతమ్ (కొరియర్‌బాయ్ కళ్యాణ్) నటించిన సినిమాలు విడుదలయ్యాయి. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా తెలుగు తెర కొత్త హీరోయన్‌లతో కళకళలాడింది వారిలో సాయేషా సైగల్ (అఖిల్), ప్రజ్ఞా జైస్వాల్ (కంచె), దిశా పటానీ (లోఫర్), హీబా పటేల్ (కుమారి 21ఎఫ్), సయామీ ఖేర్ (రేయ్), శ్రుతిసోథీ (పటాస్), నితికా శేరు (పడ్డానండీ ప్రేమలో మరి), త్రిథా చౌదరి (సూర్య వర్సెస్ సూర్య), మాళవికా నాయర్ (ఎవడే సుబ్రహ్మణ్యం) చెప్పుకోదగిన ముద్రని వేశారు. వీరిలో ప్రజ్ఞా జైస్వాల్ ఆకట్టుకునే అందంతోనూ, మాళవికా నాయర్ అభినయంతోనూ, హెబా పటేల్ ఆమె పోషించిన పాత్రలోని నవ్యతతోనూ యువతరాన్ని ఆకట్టుకోగలిగారు.
డిఫరెంట్ సినిమాకి పట్టం:
ఎన్ని చెప్పినా తెలుగు సినిమా అంటేనే రొటీన్ ఫార్ములా సినిమాగా, మాస్, మసాలా సినిమాగానే పేరు సంపాదించుకున్న మాట వాస్తవం. అయితే ప్రతీ సంవత్సరం అన్ని ఫార్ములా సినిమాల మధ్య కొన్ని వైవిధ్య చిత్రాలు, కంటెంట్ -బేస్డ్ సినిమాలు కూడా రావడం, వాటిని సైతం ప్రేక్షకులు ఆదరించి, తమలో అభిరుచి కలిగిన ప్రేక్షకులు ఉన్నారని నిరూపిస్తుంటారు. అలా ఈ ఏడాది కూడా కథ, కథనం, పాత్రల చిత్రణలలో విభిన్నతని చూపించిన సినిమాలు వెండితెరని పలకరించాయి. వాటిలో క్రాంతిమాధవ్ దర్శకత్వంలో వచ్చిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ కాలాలకు, ప్రదేశాలకు అతీతంగా నిలిచే శాశ్వత ప్రేమ భావనని సున్నితంగా చూపించగా, మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘్భలే భలే మగాడివోయ్’ సినిమా షార్ట్ మెమరీ ఉన్న యువకుడు తన ప్రేమని గెల్చుకున్న తీరును సెన్సిబుల్ హ్యూమర్‌తో అందించింది. అలాగే, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా మనిషిలోని అంతర్గత అనే్వషణ అనే తాత్విక అంశాన్ని ప్రకృతి నేపథ్యంలో చక్కగా ఆవిష్కరించింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో వచ్చిన ‘సూర్య ఒ సూర్య’ సినిమా - సూర్యుని కిరణాలు పడని ప్రత్యేక ఆరోగ్య స్థితి ఉన్న యువకుడి జీవితంలోని కోణాలని తెరకెక్కించగా, ప్రేమ్‌సాయి నిర్దేశనలో వచ్చిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ థ్రిల్లర్ కథాంశంగా వచ్చింది కాగా, కోవలెమూడి సూర్య ప్రకాష్‌రావు దర్శకత్వంలో బైలింగ్వుల్‌గా వచ్చిన ‘సైజ్ జీరో’ సినిమా మెట్రో అర్బన్ నగర జీవితాలలోని అమ్మాయిలలో సన్నగా ఉండటమే సౌందర్యం అనుకునే భావనని, దానిని ఆసరా చేసుకుని మార్కెట్‌లో జరుగుతున్న మోసాలని కొత్త తరహాలో ప్రజెంట్ చేసింది. అలాగే సుకుమార్ రచనలో సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమా సమకాలీన యువతీ యువకుల ఆలోచనలని, అనుమానాలని, అపనమ్మకాలని కథాంశంగా అల్లుకుని, ఉదాత్తమైన ప్రేమని ఆవిష్కరించి అమ్మాయిల ప్రవర్తనలోని కొత్తకోణాన్ని ఆకట్టుకునేలా ప్రత్యక్షం చేసింది. యువ ప్రేక్షకుల మనసు దోచుకుంది.
అలాగే, కొన్ని దశాబ్దాల కాలంగా తెలుగు తెరపై కనుమరుగై పోయిన హిస్టారికల్ పీరియడ్ సినిమా మళ్ళీ ‘రుద్రమదేవి’తో దర్శనమిచ్చింది. కాగా, తెలుగు సినిమా ‘జెనార్’లలో ఇప్పటివరకూ రాని ‘వార్ ఫిల్మ్ జెనార్’ ఈ సంవత్సరం జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహించిన చిత్రం ‘కంచె’తో పరిచయం అయింది. ఈ సినిమా ‘వార్ ఫిల్మ్’ గానే కాక, పీరియడ్ ఫిల్మ్‌గా 1940 దశకపు వాతావరణాన్ని, కాస్ట్యూమ్స్‌నీ, సెట్టింగ్‌లనీ తెరపై రీక్రియేట్ చేసి అందమైన ప్రేమకథతో నవ్యతని చూపించింది. ఇక జానపద వస్తువుని, కాల్పనిక శైలిని కలగలిపి ‘్ఫక్ ఫాంటసీ జెనార్’లో వచ్చిన ‘బాహుబలి’ సినిమా ఈ శైలిపరంగా తెలుగు ఫార్ములా సినిమాలకు పూర్తిగా భిన్నమైనదే. అంతేకాక, ‘2-పార్ట్‌మూవీ’ అనే స్టైల్‌కు ‘రక్తచరిత్ర’ తర్వాత ఆ శైలిలో వచ్చిన సినిమాగా కూడా ప్రత్యేకతను సాధించింది.
100 కోట్ల క్లబ్
ఎన్నో ఏళ్ళుగా తెలుగు సినిమాని ఊరిస్తున్న ‘‘100 కోట్ల క్లబ్’ కల ఈ సంవత్సరం సాకారమయింది. నెలరోజుల వ్యవధిలో విడుదలైన బాహుబలి (జూలై 10 విడుదల), శ్రీమంతుడు (ఆగస్టు 7 విడుదల) సినిమాలు రెండూ కలెక్షన్లపరంగా 100 కోట్ల మైలురాయని దాటేసి, ఆ రికార్డ్ సృష్టించిన బాలీవుడ్, కోలీవుడ్ తర్వాత మూడో ఫిల్మ్ ఇండస్ట్రీ స్థానాన్ని టాలీవుడ్‌కు కట్టబెట్టాయి.
ఆ మూడు ‘సిత్రాలు’:
2015 సంవత్సరంలో రిలీజైన సినిమాలలో మూడు చిత్రాలు మాత్రం అన్ని రకాలుగానూ తెలుగు సినిమా ప్రతిష్టనూ, ఖ్యాతినీ దశదిశలా చాటాయని చెప్పాలి. వాటిలో గుణశేఖర్ దర్శకత్వం చేసిన ‘రుద్రమదేవి’ సినిమా 12వ శతాబ్దం నాటి కాకతీయ సామ్రాజ్జ రాణిరుద్రమదేవి జీవిత కథగా తెరకెక్కింది. హిస్టారికల్ డ్రామాగా, బయోపిక్‌గా, 3-డిలో వచ్చిన తూలి హిస్టారికల్ చిత్రంగా, హీరోయిన్ - ఓరియెంటెడ్ చిత్రంగా ఎనె్నన్నో విశిష్టతలను సంతరించుకోవడమే కాక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే వినోదపు పన్ను మినహాయింపును పొందింది.
అలాగే, కొరటాల శివ దర్శకత్వంలో గ్రామాలను దత్తత తీసుకోవడం అనే కథాంశంతో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎంతోమంది ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకొనేందుకు స్ఫూర్తినిచ్చింది. ప్రభావవంతమైన మాధ్యమంగా ప్రజల ఆలోచనలను సామాజిక ప్రయోజనం దిశగా మళ్ళించడంలో ఎంతకీలకమైన పాత్ర పోషిస్తుందో మరోసారి ఈ సినిమా నిరూపించింది. అలాగే సంస్కరణలు, ఆదర్శాలు, సందేశాత్మక భావనలతో కూడిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా వర్కవుట్ కావు అనే అభిప్రాయం తప్పు అని ఈ సినిమా, తెరసాక్షిగా వెల్లడించింది.
ఇక, రాజవౌళి దర్శకత్వంలో విజయేంద్రప్రసాద్ రచనలో వచ్చిన ‘బాహుబలి’ సినిమా ఎన్నో రకాలుగా తెలుగు సినిమా రేంజ్‌ని, ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింప చేసింది... ఫోక్ ఫాంటసీ చిత్రంగా, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన ‘గ్రాఫికల్ వండర్’గా, తెలుగు సినీ చరిత్రతో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా (దాదాపు 150 కోట్లు), అత్యధిక వసూళ్ళు చేసిన చిత్రంగా (దాదాపు 150 కోట్లు ఒక్క తెలుగులోనే), అత్యధిక భాషలలోకి ‘డబ్’ అయిన చిత్రంగా, అంతర్జాతీయంగా దాదాపు 530 కోట్ల (అన్ని భాషల వర్షన్‌లూ కలిపి) కలెక్షన్‌లను సాధించిన ఏకైక తెలుగు చిత్రంగా, ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో ‘‘బజ్‌రంగీ భాయిజాన్’ తర్వాత రెండో సూపర్‌హిట్ చిత్రంగా ఎన్నెన్నో రికార్డులను, విశిష్టతలను సాధించింది. 2015 సంవత్సరాన్ని టాలీవుడ్‌కి ‘బాహుబలి నామ సంవత్సరం’గా మిలిచింది.
రీమేక్‌లు.. సీక్వెల్‌లు.. హారర్‌లు
ఈ ఏడాది కూడా రీమేక్‌లు, సీక్వెల్‌లు, డబ్బింగ్ చిత్రాలు వచ్చాయి. వాటిలో మళ్టీస్టారర్‌గా వచ్చిన ‘గోపాల గోపాల’ హిందీ సినిమా ‘ఓ మైగాడ్’కు రీమేక్‌గా వచ్చింది. ‘గడ్డం గ్యాంగ్’ కూడా ఈ కోవలోకే చేరింది. అలాగే ‘కిక్-2’, ‘అవును-2’ సీక్వెల్స్‌గా కొత్తకథలతో వచ్చాయి. ఇక పాతతరం చిత్రాల పేర్లతోకూడా కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో శంకరాభరణం, సితార చిత్రాలు ఆ కోవలోనివే. అయితే, సినిమాలు గత చిత్రాలకున్న ఉన్నతత్వాన్ని ఇబ్బందిపెట్టాయనే విమర్శలు ఎదుర్కొన్నాయి. ఇక కొత్త కథనాలకు, దర్శకులకు, లోబడ్జెట్ మేకింగ్‌లకు కేరాఫ్‌గా చెప్పుకునే సినిమాలు హారర్ చిత్రాలు ఇటీవలి కాలంలో తెలుగు తెరపై హారర్ కామెడీలు హిట్టవ్వడంతో ఆ వరుసలో ఈ ఏడాది కూడా ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. కాలింగ్‌బెల్, చంద్రిక, త్రిపుర, అవును-2 సినిమాలు ఆ కోవలోనివే. రాజుగారిగది సినిమా ఓ ప్రేక్షకుడు మరణించడం చర్చనీయాంశమైంది.
కొత్తపాఠం:
2015లో రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు తమ ఆదరణ నిరాదరణతో మరోసారి తన తీర్పును చెప్పకనే చెప్పారు. కొత్తదనాన్ని, ప్రయోగాత్మకతను, కథ కథనాల్లో నవ్యతని ఫిల్మ్‌మేకింగ్‌లో అద్భుత ప్రతిభని ప్రదర్శించిన సినిమాలని, సామాజిక చైతన్యాన్ని అందించిన సినిమాలని, సున్నిత వినోదాన్ని అందించిన సినిమాలను నెత్తికెత్తుకున్నారు. వంశాలు, వారసత్వాలు పేరుతో ఊదరగొట్టినంత మాత్రాన సినిమాల్లో విషయం లేకపోతే అపజయం పాలుకాక తప్పదని గట్టిగా హెచ్చరిక చేశారు. సినిమా సక్సెస్‌ని ఫార్ములా కన్నా క్రియేటివిటీయే ఫైనల్ అని, అలాంటి సృజనాత్మకతకు పట్టంగట్టడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని కూడా చెప్పకనే చెప్పారు. మొత్తంమీద ఈ కొత్తపాఠం వెల్లడిచేస్తున్న సత్యాల బాటలో రాబోయే సంవత్సరంలోనూ తెలుగు సినిమాలు రూపొందుతాయని ఆశిద్దాం.

**

- మామిడి హరికృష్ణ