భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా -17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది పవిత్రమైన పంబా నదీ తీరం! పందల రాజ్యం సమీపంలోని దట్టమైన అరణ్యాల మధ్యగా ప్రవహిస్తుండే పంబా నదీ జలాలు ఆ ప్రాంత వాసులకు జీవనాధారాలు! ఒడ్డున పచ్చని పచ్చిక ఆకులు పచ్చని తివాచీ పరిచినట్లు ఎవరి రాకకోసమో ఎదురుచూస్తున్నట్లున్నది! చల్లటిగాలి, గలగలమని పారుతున్న నదీ జలాలు, పూవులు జలజలమని రాలుస్తున్న వృక్షాలు- ప్రకృతి శోభాయమానంగా ముస్తాబై ఎవరికో స్వాగతం చెప్పడానికి ఆత్రుత పడుతున్నట్లుగా వున్నది! ఆ నిరీక్షణ ఫలించినట్లు ఆకాశం నుండి జ్వాజ్వలమానంగా వెలుగుతున్న జ్యోతి పుంజం సాక్షాత్కరించింది నదీ తీరాన! అందులోనుండి హరిహరులు వారి మధ్యగా భూతనాథుడు ప్రకటితమైనారు!
హరిహరులు భూతనాథునివైపు ప్రసన్నంగా చూస్తూ ‘‘కుమారా! నీవు మానవ రూపంతో భూమిమీద కావించవలసిన దుష్టశిక్షణకు నాంది పలకవలసిన శుభ సమయం ఆసన్నమైంది! ఇక్కడికి మరికొద్దిసేపట్లో మా భక్తుడైన పందల రాజు రాగలడు! నీవాయనకు పుత్రుడివై ఆయన చిరకాల వాంఛితాన్ని నెరవేర్చు!’’ అన్నారు.
‘‘మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను!’’ అంటూ కళ్లు మూసుకుని ధ్యానించాడు భూతనాథుడు! మరుక్షణమే పొత్తిళ్లలో పాపడుగా మారి పచ్చికమీద సాక్షాత్కరించి కెవ్వుమన్నాడు!
హరిహరులు శిశువు తలమీద నిమిరి దీవించారు! మహావిష్ణువు మెడలో మణిహారంతో ప్రకాశిస్తున్న శిశువువైపు ఆప్యాయంగా చూస్తూ ‘‘ఇకపై మణికంఠుడనే పేరుతో ప్రవర్థమానుడై ఈ ప్రాంత వాసులను తన లీలలతో ధన్యులను కావిస్తాడు భూతనాథుడు’’ అన్నాడు.
‘‘అవును! మహిషిని సంహరించి ధర్మ సంస్థాపన కావిస్తాడు ధర్మశాస్తా!’’ పరమేశ్వరుడు ప్రసన్నంగా చూస్తూ అన్నాడు!
దూరం నుండి కలకలం వినరావడంతో అంతర్థానం చెందారిద్దరూ!
***
‘‘సారథి! ఆగు!’’ రథాన్ని ఆపించి దిగి చుట్టూ చూసాడు రాజశేఖరుడు! చెవి వొగ్గి జాగ్రత్తగా విని ‘‘ఎవరో పసిపాడి ఏడుపు వినిపిస్తున్నది ఆ ప్రక్కనుండి! అటువైపు పోనివ్వు!’’ అంటూ ఎక్కి కూర్చున్నాడు.
రథం పంబానది ఒడ్డుకు చేరింది! దిగి చుట్టూ చూసిన రాజుకు పచ్చికమీద పొత్తిళ్లలో పడుకుని కెవ్వుమని ఏడుస్తున్న పపిసాపడు కనిపించడంతో గబగబా అటువైపు వెళ్లాడు!
అంతవరకు పడగ ఎత్తి పట్టి బాలుడి మీద ఎండ పడకుండా చూస్తున్న పాము రాజు వస్తుండటం చూసి చర్రున ప్రక్కకి జారిపోయింది.
‘‘ఆహా! ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు! మెడలో ఆ మణిహారం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది! ఎవరీ బాలుడు? ఎవరీ విధంగా విడిచి వెళ్లుంటారు! పాము పడగ ఎత్తి పట్టి కాపాడుతూ వుండిందంటే ఈ బాలుడెవరో మహత్తర జాతకుడై వుంటాడు! ఈ చుట్టుప్రక్కల మనుష్య సంచారం లేదు! ఆ పరమేశ్వరుడు తన కోసమే ఈ శిశువు నిక్కడ వుంచి వుంటాడా? సందేహం లేదు! నారద మహర్షి చెప్పినట్లు తన కోసమే ఈ శిశువును అనుగ్రహించి వుంటాడు ఆ పరమేశ్వరుడు అన్న ఆలోచన రాగానే మనస్సులో ఆ బాలుని మీద పుత్ర వాత్సల్యం పొంగి వచ్చింది రాజశేఖరునిలో!
జాగ్రత్తగా రెండు చేతులలో ఎత్తుకుని రథంమీద ఒడిలో పరుండబెట్టుకుని కూర్చున్నాడు! ఏడుపు మాని నవ్వుతున్నట్లు తనవైపే చూస్తున్న బాలుడి ముఖంలోకి తదేకంగా చూస్తూ ఈ చిన్నారి మోము మునుపెప్పుడో చూసినట్లనిపిస్తున్నది! ఎక్కడ చూసి వుంటాను?’
అనుకున్నాడు.
నామకరణ మహోత్సవం
చేతుల్లో పసివాడితో అంతఃపురంలో అడుగుపెట్టిన భర్తకు సంభ్రమానందాలతో ఎదురువచ్చింది రాణి!
భర్త చెప్పింది వింటూ పిల్లాడిని తన ఒడిలోకి తీసుకుంది. ‘‘మనం ఇంతకాలంగా ఎదురుచూసిన వరపుత్రుడు ఈనాటికి మన ఒడిని చేరాడు! భగవంతుడు మనమీద కృపాదృష్టిని కురిపించాడు! ఈ పసివాడినే మన పుత్రునిగా స్వీకరిద్దాము!’’ అన్నది పసివాడిని ముద్దులాడుతూ! మెడలో మణిహారాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ‘‘ఈ హారాన్ని మీరు అలంకరించారా?’’ అడిగింది.
-ఇంకా ఉంది

-డా. టి. కళ్యాణీ సచ్చిదానందం