భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా -19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తిప్రపత్తులతో గురువుగారికి పాదాభివందనం కావించాడు మణికంఠుడు! వినయం వుట్టి పడుతున్నది. మాటలతో ఇట్లా అడిగాడు!
‘‘గురుదేవా! విద్య నేర్పిన గురువుకు గురుదక్షిణ సమర్పించుకోకపోతే ఆ శిష్యుని జీవితం నిర్థకవౌతుంది! మీకు నేను ఏమి సమర్పించినా అది మీరు నేర్పిన విద్యకు, నాపట్ల చూపిన వాత్సల్యానికి సరికాదు! దయయుంచి ననే్నమి ఇవ్వమంటారో మీరే సెలవిచ్చి నన్ను ధన్యుడిని చేయండి!’’
ఆ మాటలు విని కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ వుండిపోయాడు గురువు!
‘మణికంఠుడు సామాన్య మానవ బాలుడు కాదనీ, కారణ జన్ముడని తన మనస్సు చెబుతున్నది! ఆ తలపు తప్పుకాకపోవచ్చును! ఈ విధంగా అడిగి చూస్తాను ఏం చేస్తాడో చూస్తే తన అంచనా నిజవౌతుంది!’ అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చి లోపలకు వెళ్లాడు!
ఆశ్రమంలో ఒక మూలగా కూర్చుని వున్న పదేళ్ల కుమారుడిని చేయిపట్టి నడిపించుకుంటూ బయటకు తీసుకువచ్చాడు.
‘‘మణికంఠా! ఈ నా పుత్రుడు మూగతనంతో, అంధత్వంతో, చెవిటితనంతో పుట్టి మాకు తీరని దుఃఖాన్ని ప్రసాదించాడు! ఈ సంగతి నీకు కూడా తెలుసును గదా! పూర్వజన్మలో చేసిన పాపానికి ఈ విధమైన శిక్షననుభవిస్తున్నాడీ జీవుడని తెలిసినా పుత్ర వ్యామోహం నన్నీ విధంగా అడగటానికి పురికొల్పుతున్నది! నాయనా! నా కుమారుని ఆరోగ్యవంతుని చేయగలవా?’’ అని అడిగాడు రుద్ధకంఠంతో! చిన్నగా నవ్వి ఆ బాలుడి దగ్గరకు వెళ్లి కళ్లను, చెవులను, ముఖాన్ని తడిమి ‘‘నీ పాదాలు ఈనాటితో పరిహారమైనాయి. గురుపుత్రా! ఇలా చూడు’’ అన్నాడు మణికంఠుడు గంభీరంగా.
గురుపుత్రుడు మణికంఠుని వైపు చూస్తూ నిలిచాడు! అతనికి జ్యోతి రూపంలో కనిపించాడు మణికంఠుడు! ఆ జ్యోతిలో నుండి ఓంకార నాద తరంగాలు గురుపుత్రుని చెవిలో ప్రవేశించాయి! నోటినుండి అప్రయత్నంగా మాటలు వెలువడ్డాయి!
‘‘జ్యోతి రూపంలో దివ్యంగా ప్రకాశిస్తున్న పరమాత్మా నీకు నా ప్రణామాలు! ఓంకారనాదం నీ నుండి వెలువడింది. ఆ నాదం నాకు స్పష్టంగా వినిపిస్తున్నది! ఈ మాటలు నీ అనుఅగహంవల్లనే నా నుండి వెలువడుతున్నాయి! నాకు మీ దర్శనభాగ్యం, ఓంకార నాదాన్ని వినే భాగ్యం, మాట్లాడే సామర్థ్యం ప్రసాదించిన ఓ జ్యోతి స్వరూపా! నీకివే నా కోటి కోటి ప్రణామాలు!’’ అంటూ నమస్కరించాడు!
గురువు ఆనందం వర్ణనాతీతం!
‘‘మణికంఠా! నీవే పరమాత్ముడవు! ఈ రూపంలో మా మధ్య వుంటున్న నిన్ను చూస్తూ నీతో కాలం గడిపే అదృష్టాన్ని అనుగ్రహించావా స్వామీ! వేదాలు, పురాణాలు, శృతి శాస్త్రాలు అన్నీ నీలోనే నిక్షిప్తమై వుండగా నీకు నేను గురువుగా నేర్పాననుకోవడం భావ్యం కాదు! నీవే అందరికీ బ్రహ్మజ్ఞానాన్ని అందించగల సమర్థుడివి! హే! ఓంకార రూపా! మాకు బ్రహ్మజ్ఞానం గూర్చి తెలియజెప్పి మమ్మల్ని అనుగ్రహించు!’’ అని వేడుకున్నాడు భక్త్యావేశంతో పులకించిపోతూ!
వాళ్లిద్దరి వైపు ప్రసన్నంగా చూసాడు మణికంఠుడు! గురువు కోరినట్లు బ్రహ్మజ్ఞానం గూర్చి ఉపదేశించాడు!
మణికంఠుని ఉపదేశము
‘‘గురువర్యా! గురుపుత్రా! ఈ సృష్టి సర్వానికి మూలమైన భగవంతుడు నిరాకారుడు! జ్యోతి రూపంలో దర్శనమిస్తాడు జ్ఞాన నేత్రాలకు! సృష్టి విస్తరణ కోసం ప్రకృతి పురుషులుగా ప్రకటితమై ప్రాణికోటిని సృష్టిస్తాడు బ్రహ్మరూపంలో! ఆ ప్రాణకోటిని విష్ణువుగా పోషించి, పాలించి తిరిగి శివుని రూపంలో అంతం కావిస్తుంటాడు!
-ఇంకా ఉంది
*
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-డా. టి. కళ్యాణీ సచ్చిదానందం