భక్తి కథలు

కాశీ ఖండం.. 81

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేన వేల యోజనాల వైశాల్యంతో అలరారే లక్ష కోటి శలాకలతో (ఊచలతో) అలంకరించబడిన, నక్షత్రాల వంటి పెద్ద ముత్యాలతో పొదుగబడిన శే్వతచ్ఛత్రాన్ని వెనకయ్య వెన్నుడికి పట్టాడు.
పట్ట్భాషేక సమయంలో పలు రీతులుగా విష్ణుమూర్తిని పార్వతీదేవి అలంకరించింది. సరస్వతీదేవి మణులు కూర్చిన అద్దాన్ని చూపింది. శచీదేవి మణిమయ దీప సమూహంతో నివ్వాళి పట్టింది.
సప్తమాతృకలలో ఒకతె అయిన చాముం.. వేస్తున్న జంపెతాళానికి (పది అక్షరాల కాలం కలది) భృంగిశ్వరుడు అనే ప్రమథుడు ‘ప్రేంఖణం’ అనే అభినయంతో కూడి నృత్యం ఆడాడు. సూర్యచంద్రు ఇరువురు వెనుకవైపు నిలిచి కనక భూషణాలు మ్రోగుతూ వుండగా వింజామరలు వీచారు. వెండికట్టుల వేత్రం కేల దాల్చి యముడు జన సమ్మర్దాన్ని ఎడము కలిగేలా వారించాడు. సమయోచితంగా గద్య పద్య సరణిని చదువుల తల్లి కైవారం ఒనరించింది. సమస్త లోకాలకు, సకల బ్రహ్మాండాలకు ఆధిపత్యం వహించి సింహాసనమున ఆసీనుడై రుషులచేత, వేల్పుల చేత మ్రొక్కులు గైకొంటూ అచ్యుతడు కొలువుతీర్చి వున్నాడు.
ఆ సమయంలో ఆ రాజీవాక్షుడికి అచ్చెరువు గొల్పు భక్తితో గణాధిపులు మ్రొక్కారు. బ్రహ్మదేవుడు చేతులు మోడ్చాడు. మునీశ్వర బృందం జోతలు పెట్టింది. దిక్పాలకులు హస్తాలు ముకుళించారు. మరుత్తుల గణం ఐదు పది చేసింది. గరుడుల సమూహం అంజలించింది. దనుజ సంఘము దోయిలి ఘటించింది. ఉరగరాజులు ఏటికోళ్లు చేశారు. చతుర్వేదాలు నమస్కరించాయి. మంత్ర సమూహాలు జోహారు చేశాయి. ఇతిహాసాలు కైగవ ముడిచాయి. పర్వతాలు అభివాదాలు సల్పాయి. నద సమూహాలు వందనములు కావించాయి. చతుస్సముద్రాలు అలల హస్తాలు ముడిచాయి.
ఈ చందంగా నారాయణుడిని నిండు నెయ్యంతో భూలోక, భువర్లోక, సువర్లోకాల సామ్రాజ్య భారం మోయడం కోసరం పట్ట్భాషేకం ఒనరించి, ఫాలనేత్రుడు పరమ శివుడు వర్షామేఘ గర్జన గంభీరమైన కంఠస్వరంతో బ్రహ్మ, దేవేంద్రుడు మున్నగు అమరులు ఆలింపగా ఈ విధంగా పలికాడు.
‘‘నేనే విష్ణువుని. విష్ణువు నేనే. నాకూ విష్ణువుకి భేదం లేదు. విష్ణువు సకల శుభాలకి నిలయుడు. హరి మాననీయుడు. జగద్రక్షా పరాయణుడు. ఆది మధ్యాంతరహితుడు. విష్ణుమూర్తి ఆదిపురుషుడు. సర్వ దురితహరుడు అని సెలవిచ్చి ఇచ్చవచ్చిన చోటుకి విచ్చేశాడు. ఈ ఆఖ్యానాన్ని చతుర్భుజాఖ్యానం అని పేరు. దీనిని చదివినా, వినినా, వ్రాసినా మనుష్యులకు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అభివృద్ధి చెందుతాయి. ఓ శివశర్మా! నువ్వు ఈ రహస్యమైన ధర్మసూక్ష్మం, మర్మం ఎరిగి హరి హర భావాల యెడ భేదభావం చెయ్యక వుండునది’’ అని వాక్రుచ్చారు.
అంత ఆ విమానం విష్ణులోకాన్ని సమీపించింది. ఆ శివశర్మని కాంచి ‘‘ఇది వైకుంఠలోకం. ఇందు లక్ష్మీదేవితో కలిసి విష్ణుమూర్తి వుంటాడు. నువ్వు ఈ లోకంలో పరమానందంతో శతానంద సంవత్సరం పర్యంతము (బ్రహ్మమానాన్ని బట్టి ఒక్క సంవత్సరకాలం) వసిస్తావు. అటమీద జరుగబోయేది ఆలించు. పుణ్యతీర్థం సమీపాన మరణించడంవల్లను, పురాకృత సుకృత విశేషమువల్లను ధరణీ మండలానికి దిగి, అక్కడ నంది వర్థన నగరమున వృద్ధకాలుడు అనే పేర నృపతివై చిరకాలం రాజ్యం ఏలగలవు. నీ రాజ్యంలో నెలకు మూడు వానలు కురుస్తాయి. ఆవులు పొదుగులు చేపి పాలు పితుకుతాయి. పుణ్యం జరుగుతుంది. నాగళ్లచే దున్నిన కొండ్రలు వేళ్లకొల్చుగ పండుతాయి. ప్రజలు అందరికి పురుషాయుషం వుంటుంది.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి