భక్తి కథలు

కాశీ ఖండం.. 95

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరికి సప్తలోకాల్లోను మధురమూ, జిహ్వకి రుచించేది అయిన స్వచ్ఛమైన తేట నీరు కనుగొనలేకపోయాడు.
అంధకాసుర వైరి అయిన శివుడు నాలుక పిడుచకట్టుకుపోయిన దప్పికవల్ల పుట్టిన ఆర్తిచేత, ఈశానుడు అనే నామం తాల్చి ప్రళకాలంలోనయినా పచ్చని పసిమి రంగు చెడ వుండేది కాశీనగరమే అని నిశ్చయించి అక్కడికి అరిగాడు.
తొలుకారు మెరుపును కన్నవారెవరూ లేరు. ఉరుము అనే మాట కథలో మాటగా నిలిచిపోయింది. మబ్బు అనే వార్త కుందేటి కొమ్ము మొలవడం అయింది. అటువంటి తరిలో జలం ఏ విధంగా లభిస్తుంది?
అంత ఈశానుడు ఏ కాశీ నగరం సంసారం అనే సస్య బీజాలకి ఊషర క్షేత్రం, కైవల్య సంపదకి నీడపట్టు. జంబూద్వీపానికి అవతంస కుసు మం. ముముక్షువులకి కామధేనువుడు. విశే్వశ్వర దేవరకి విహార భూమి. సర్వమంగళకార్యాలకి మూలకారణం. డుంఠి విఘ్నేశ్వరుడికి కట్టుకంబము (ఆలనస్తంభం) పరబ్రహ్మానికి ప్రణవ కారము. ఏదో ఆ కాశీపురానికి ఏతెంచాడు. పసిడి యోగదండం, ఎర్రని జడలు, నీలకంఠం, త్రిశూలాయుధం ధరించి తపస్వి వేషంలో ఒప్పారుతూ హరుడు అరుదెంచాడు.
ఆ రీతిగా కాశీకానగరం చొచ్చి ఈశానుడు శ్రీమన్మహాదేవుడు, నిర్మల జ్యోతిర్మయలింగాకారుడు అయినదేవుడు సహస్ర కలశాభిషేకం చేయుటకున్ను, స్నాన, పాద, తీర్థాలు అనే మువ్విధాల తీర్థాలను సేవించడం కోసరం సంకల్పించాడు.
మన్మథ వైరి అయిన లలాటాక్షుడు కాశీనగరం చేరువలో వాడిమొన కలతన త్రిశూలాన్ని బలంగా ఊది ధరణీ చక్రాన్ని ఛేదించినప్పుడు ఆ పవిత్రాయుధం సప్త పాతాళ లోకాల్ని చీల్చుకొంటూ పోయి ఆవరణ జల ప్రవాహాలు పెల్లుగా వుబికి వచ్చే రీతిని దిగబడింది. దృఢంగా బలంగా అదిమి శూలాన్ని పైకి లాగాడు. ఆ రీతిగా లాగినప్పుడు ఆ భూమి యొక్క పెద్ద వివరం నుంచి, ఏడు పాతాళాలు దాటి భూమిని కూడా చీల్చుకొని ఆ ఆవరణ జలధార ఆకాశాన్ని అందుకొంది.
భూచక్రప్రమాణానికి పది రెట్లు ప్రమాణం కలది అయి, స్వచ్ఛ స్ఫటికంలాగ నిర్మలమున్ను, శరత్కాల చంద్రిక క్రియ తెల్లనిదిన్ని, చంద్ర ఖండ శిభమున్ను, అమృత ధార బాగున మధురమున్ను, పాటలీ కుసుమం తావిని పోలిన సౌరభం కలదిన్ని ఆ జల ప్రవాహం వెండి తీగ భంగి పైకి ఎగయగా, ఈశానుడు సహస్రధారలు స్రవించే కలశంతో వెయ్యి మారులు పంచాక్షరి, సద్యోజాతాది పంచ బ్రహ్మము, శతరుద్రీయం, ప్రణవం, అఘోర పాశుపతం ఆదిగాగల మంత్రాలు ఉచ్చరిస్తూ విశే్వశ్వర శ్రీమన్మహాదేవుడి దివ్య లింగాల్ని అభిషేకించాడు.
లీలా పాశుపతవ్రత దీక్ష పూనిన ఈశానుడికి లయకాల తాండవ కేళి సమయంలో పుట్టిన దప్పిక ఆవరణ జలంతో శివుణ్ణి అభిషేకించనంతనే తొలగిపోయింది. అంత విశే్వశ్వరుడు ప్రసన్నుడయి ఆ ఈశానుడు కోరిన ప్రకారం జ్ఞానోదకం, శివజ్ఞానం, శివతీర్థం, జ్ఞానతీర్థం, జ్ఞాన వాపిక అనే సంజ్ఞలు కలిగి స్నాన, అభిషేకాల చేతను, స్పర్శన, సంకీర్తన, ధ్యాన, దర్శనాల చేత యజ్ఞ్ఫలం ఒసగడాలుప్రభావమున్ను, మోక్షలక్ష్మిని అనుగ్రహించడంలో చాతుర్యమున్ను, సన్నిహతి, ఫల్గుతీర్థం మున్నయిన తీర్థాలకన్నా సమధికత్వమున్ను, బ్రహ్మరాక్షసుల్ని, పిశాచాల్ని, శాకినీ గ్రహాలనీ, కూశ్మాండగ్రహాలనీ శమింపజేసే సామర్థ్యాన్ని ఈశానకుండికకి ప్రసాదించాడు? అని సెలవిచ్చి, విశే్వశ్వరస్వామి అంతర్హితుడు అయాడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి