భక్తి కథలు

కాశీ ఖండం.. 104

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భుజించడానికి వీలయినంత వేడిమి కలదీ అయిన స్వచ్ఛమైన అన్న అన్నాన్ని ప్రాణపానాలు మున్నగు ధాతువులన్నింటికి తనివి కలిగే విధంగా దర్భముడి వుంగరం అనామికకి తొడిగి స్వాహా కారణ తుదిని కలయై దువాయువుల పేరులతో- జఠరాగ్నితో అన్నకబళాలనే ఆహుతులుగా హోమం చేసే విప్రుడు భోజన పదార్థాల రుచుల్ని పేర్కొనరాదు.
కుక్షిలోగాలికి కొంత యెడం విడిచి, అన్నపానీయాలని, తృప్తి కలిగేటట్లు మజ్జిగ కాని, శీతలోదకం కాని అనుపానంగా గ్రహించాలి. భూసురుడు అమృతపిథానమను శబ్దంతో ప్రారంభం అయే మంత్రాన్ని సముచితి రీతిగా పఠించి, ఉదకాన్ని సగం ప్రాశన చేసి, తక్కిన సగం జలం నేలపై భోజనం పూర్తి అయాక చెయ్యి కడుగుకోక విడిచిపెట్టాలి.
కడుగుకోని కుడి చేయి బొట్టనవ్రేలి మూలం నుంచి విడువబడిన ఆ ఉదకం, పాప్యులైన వారికి నివాసం అయిన రౌరవ నరకములో అర్బుధాలు, పద్మాల సంఖ్యల సంవత్సరాలుగా నివాసం వున్న పితృదేవతలకి సంతృప్తిని చేకూరుస్తుంది. హస్తాలు కడుగుకొని ఆచమనం చేసి, శుచియై కొమ్ము చెంబు నీరు దక్షిణ పాదం అంగుష్టంపైన ధారగా పోయాలి.
ఆ ఉదకధార ఆ కుడి కాలి బొట్టనవ్రేలుని ఆశ్రయించుకొని వున్న అంగుష్ఠమాత్ర పురుషుణిణ సంతుష్టుణ్ణిగా చేస్తుంది. పిమ్మట నాభిప్రదేశాన్ని నిమురుకొంటూ ప్రాణాపాన వ్యానో దాన సమాన అయిదున్ను తృప్తి చెంది నన్ను ఆశీర్వదించుగాక! అని అనుకోవాలి. తర్వాత తాంబూల చర్వణంతో, పురాణ శ్రవణంతో ప్రొద్దుపుచ్చాలి. చతుర్వర్ణాలలోను భూసురవర్ణం అధికం. చతురాశ్రమాలలోను గార్హస్థ్యాశ్రమం అధికం. ఆ గృహస్థు ధర్మానికి శుభ లక్షణవతి అయిన ధర్మపత్నే ఆలంబనం.
స్ర్తి లక్షణ నిరూపణము
పాదతలాలు, రేఖలు, అంగుష్ఠాలు, వ్రేళ్లు, గోరులు, మీగాళ్లు, గుల్ఫాలు (చీలమండలు), జంఘలు (పిక్కలు), మోకాళ్లు, రోమాలు, ఊరువులు, నడుము, నితంబం (పిరుదులు), జఘనం (నడుము ముందరిభాగం), యోని, పొత్తికడుపు, నాభి, కుక్షి, పార్శభాగాలు, వళులు (ముడుతలు), నూగారు, హృదయం, పాలిండ్లు, చనుమొనలు, మూపులసంధి అస్థులు, మూపులు, రెండు మణికట్టులు, మీదిచేతులు, అరచేతులు, ముచ్చిలిగుంట, కంఠము, చిబుకము, హనువులు (చెక్కిళ్ల భాగాలు), కపోలాలు, ముఖము, పైపెదవి, క్రింది పెదవి, నాలుక, తాలువులు, నవ్వు, నాసిక, కన్నులు, కనురెప్ప వెండ్రుకలు, కనుబొమ్మలు, కర్ణాలు, నొసలు, శిరోజాలు- అనే అరవై ఆరు అవయవాలు శుభలక్షణాలతో కూడి వుండాలి. అటువంటి శుభలక్షణవతి అయిన భార్య గృహలక్ష్మి అని పిలువబడుతుంది. గృహలక్ష్మి కారణంవల్ల కదా గృహస్థుడు ఇహలోక పరలోక సుఖాలు రెండింటికి పాత్రుడు అవుతాడు’’ అని వాక్రుచ్చి కుమారస్వామి అగస్త్య మహారుషితో ఈ గతి పలికాడు.
ఇల్వల రాక్షసుణ్ణి సంహరించిన అగస్త్య మునీశ్వర భవిష్యత్ దృష్టి వున్న అలఘుమతులకి పైన చెప్పిన ఈ అవస్థలు అన్నీ పడినా ఊర్థ్వలోక ప్రాప్తి కలుగుతుందని వచించలేము. కాని కాశీ పుణ్యక్షేత్రంలో ముక్కునుంచి నిశ్వ్వాస ఆగిపోయిన వెంటనే ముక్తి ఒదవుతుంది అని సదాచారాలు వర్ణించి, కుమారస్వామి ఇంకా ఏమి అడుగగోరుతావు? అడుగవలసింద’’ ని వాకొన్నాడు. అపుడు అగస్త్యుడు ‘‘జ్ఞానకారణాలు ఏవి? తెలుపు’’ అని అడిగాడు. కుమారస్వామి క్రింది విధంగా చెప్పసాగాడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి