భక్తి కథలు

కాశీ ఖండం.. 136

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖ కౌమోదకీ పద్మచిత్రాలు తాల్చిన నన్ను విద్వాంసులు జనార్దనుడు అని వాకొంటారు. శంఖ చక్ర గదా పద్మాలలో కూడిన నామూర్తిని గోవిందుడు అని వచిస్తారు. శంక పద్మగదా చక్ర సహితుణ్ణి అయిన నా రూపాన్ని పండితులు త్రివిక్రముడు అంటారు. శంఖ పద్మ చక్ర గదలు ధరించిన నా రూపాన్ని జగము శ్రీ్ధరుడని పిలుస్తుంది.
శంఖ చక్ర గదా పద్మాలు తాల్చిన మూర్తి హృషీకేశుడు. శంఖ చక్ర పద్మగదలు పట్టిన రూపం నృసింహుడు. శంఖ గదా పద్మ చక్రాలు తాల్చిన ఆకృతి అచ్యుడు.
శంఖ చక్రగదా పద్మాల రూపం వాసుదేవుడు. శంఖ పద్మ గదా చక్రాలు క్రమంగా తాల్చిన నన్ను నారాయణుడని చెపుతారు. శంఖ పద్మ చక్ర గదలు ధరించిన మూర్తి పద్మనాభుడు. శంఖ గద చక్ర పద్మాల్ని వరుసగా తాల్చిన రూపం ఉపేంద్రుడు. శంఖ చక్ర పద్మ గదల తోడి రూపు హరి. శంఖ పద్మ గదా చక్రాలు కలవాడు కృష్ణుడనీ విలసిల్లుతారు. ఇప్పుడు పేర్కొన్న యివి అన్నీ నా దివ్యమూర్తి భేదాలు అని సెలవిచ్చారు.
కార్యాంతరంలో చిక్కుకొనడంవల్ల మాధవదేవుడు అంతర్హితుడు అయాడు. అగ్నిబిందు మునీంద్రుడున్ను చరితార్థుడు అయి బిందు మాధవదేవుడి రూపంలో కలిసిపోయాడు. ఇది మాధవాగ్ని బిందు సంవాదం అనే ఇతిహాసం. దీనిని వినినా, చదివినా, వ్రాసినా మనుష్యులకి భోగం, మోక్షం రెండూ సిద్ధిస్తాయని కుమారస్వామి వాక్రుచ్చాడు.
అది విని అగస్తి ముని మరలా కుమారస్వామితో ఈ రీతిగా వచించాడు.
వృషభధ్వజావిర్భావం
‘పార్వతీనందనా! విష్ణువు, విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి వేర్వేరుగా మాయలు, ఉపాయాలు, వేషాలు, భాషలు ఆదిగాగల విధాలతో దివోదాసుడిని వెడలగొట్టి, ఆ మేలి వార్తని మందర పర్వతం మీద వున్న శివుడికి చెప్పి పంపించారు. హరుడున్ను గిరిజాసహితుడై కాశీనగరానికి విజయం చేశాడు. పిమ్మట నిండు కొలువు తీర్చి క్రమంగా యోగినుల్ని సూర్యుడిని, బ్రహ్మదేవుణ్ణి, ప్రమథ గణాన్ని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, వినాయకుణ్ణి గౌరవించి సమస్త లోక సామ్రాజ్య పట్ట్భాషేకాన్ని వహించాడని వచించాడు.
సామాన్యంగా సంగ్రహంగా- సంక్షిప్తంగా ఆలించడం చేత ఆ వృత్తాన్ని వినడంలో నాకు తృప్తి చాలకున్నది. విశేషంగా విస్తరించి వివరించవలసింది. కాశీ మహాత్మ్యానికి తక్కిన వృత్తాంతాలు అప్రధానాలు- ఈ వృత్తాంతం ఆధికారికం కదా! ప్రధానం కదా!’’ అగస్త్యుడి వాక్కులకి మిక్కిలి సంతుష్టి చెందిన అంతరంగంతో కుమారస్వామి లోపాముద్ర వల్లభుడితో ఈ చందంగా వాక్క్రుచ్చాడు.
విష్ణుమూర్తి అధికమైన కార్యకౌశలంతో దివోదాసుణ్ణి కాశీనుంచి పూర్తిగా వెడలనడిచాడు తొలుత. తర్వాత తన దూత అయిన గరుడుణ్ణి ‘బంగారు కమ్మ’ ఒసగి మందరగిరికి రీతిగా పంపాడు. ‘‘దేవరవారి ఆన తలదాల్చి నేను, విఘ్నేశ్వరుడు, లక్ష్మియున్ను చేసిన వంచనవల్ల సకల కార్య ప్రయోజనం సమకూడింది’’ అని సంతోషకరం అయిన సందేశం వ్రాసి గరుత్మంతుడి చేతికీయగా అతడున్ను అసమాన శీఘ్ర గమనంతో లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురాసముద్రమూ దాటి, కుశద్వీపాన్ని సమీపించాడు.
కాశీవిరహమే అనే చింతతో కూడిన మనస్సుతో మందారాద్రి అగ్రభాగాన ఉపవిష్టుడైవున్న శివుణ్ణి, గరుత్మంతుడు తన రెక్కల నల్లార్చడంలోని ఒక విధం చేత కార్య సంసిద్ధిని ఊహింపచేస్తూ, శంకరుణ్ణి డాసి, మాటిమాటికి సాష్టాంగ నమస్కారాలు ఆచరించి చెంతకి చేరవచ్చి, నందికేశ్వరుడి చేతికి విష్ణువు పంపిన సందేశ లేఖ ఒసగాడు. అక్కడ అంజలి ఒగ్గి నిలిచాడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి