భక్తి కథలు

కాశీ ఖండం.. 140

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివుడు మన్మథ వైరి. వేశ్య మదనుడి ఆరవ కుసుమ బాణం. ఆయన మెచ్చడం ఏమిటి? ఆ పరమశివుడు ఉద్ధత తాండవ నాట్య విద్యకి ఆదిగురువు. ఇక అమ్మవారో? లలితమైన లాస్యానికి కన్నతల్లి!
ఈ విధంగా ఆలయంలో పరమేశ్వరుడిని ఆరాధించి, అనంతరం ఆ వేశ్యకాంత ఒక రోజున వేరొక పని పడడంవల్ల అన్య దేశం అరిగి విధివశమున కాలధర్మం పొందింది. పురాజన్మయందలి ఈశ్వరారాధనంవల్ల లభించిన సుకృత హేతువుగా ఆమె గంధమాదన పర్వత సమీపంలో ‘వసుభూతి’ అనే గంధర్వరాజుకి ప్రభవించి, రత్నావళి అనే అభిధేయంతో రూపం, లావణ్యం, విలాసాలకి ఆవాసం అయి పూర్వజన్మ వాసనాబలంతో కాశీనగరంలో రత్నేశ్వరుణ్ణి దినదినమున్ను కొలిచి తన గృహానికి మరలిపోతూ వుంటుంది. నిర్మల కరుణాన్వితుడు అయిన రత్నేశ్వరుడు తన్ను నిరంతరం కొలిచే ఆ గంధర్వ తనయకి రత్నావళికి తనకి సేవకుడైన పాతాళరాజు అయిన ఆదిశేషుడి వంశానికి చెందిన రత్నచూడుడికి వివాహం కావించాడు.
రత్నేశ్వరదేవుడు ఎటువంటి వేడుక కాడో? పాము స్వప్నంలో రత్నావళిని కూరుస్తాడు. రత్నావళి స్వప్నంలో పాముని లేక రత్నచూడుణ్ణి నిలుపుతుంది. కడకు ఆ ఇరువురునీ దంపతుల్ని కావించువరకూ శివుడు తన చలము - పంతం విడువలేదు. హాలాహలగ్రీవుడు కాలయాపన బుద్ధితో లీలామయమైన కేవలత్వానికి ఆలంబం అవుతూ ఉబుసుపోకకి లోక యాత్రని నడిపించసాగాడు.
అగస్త్య సంయమీశ్వరా! శ్రీకాశీ స్థానంలో రత్నేశ్వరాలయ నికట భూమిలో రత్నచూడ సర్పరాజు నామంతో రత్నచూడతీర్థం ఏర్పడింది.
కృత్తివాస తీర్థ మహాత్మ్యము
ఇంక కృత్తికాసస్తీర్థ మహాత్మ్యం వివరిస్తాను. సావధాన చిత్తంతో వినవలసింది. ఒకనాడు కాశీ ప్రవేశ ద్వారానికి ముందర వున్న విష్కంభంలో (నాలుగు బాటల కూడలి) గంభీర కంఠ నిర్ఘోషతో నింగిని చాతక పక్షులున్ను, నేలపైన నెమళ్ల గుంపున్ను క్రమ క్రమంగా ఉల్లాసాన్ని పొందచేస్తూ కడిమి పువ్వుల కేసరాల వాసనలతో సంవాదం పొందిన మదజలం అనే సురాసార వాసనచే దశదిశల్ని వ్యాపించాయి.
తలని మీదికి విసురుట చేత బ్రహ్మాండ భాండాన్ని తన దంతకులిశంతో బ్రద్దలు చేసేదాని లాగు సుదీర్ఘ శుండంతో పుక్కిలించి ఉమిసిన జల ప్రవాహాలతో ఆకాశగంగా ప్రవాహంతో మేఘ పథాన్ని వీడ్కొల్పుతున్నదానివలె, పాదఘట్టనల చేత క్రిందికి దిగబడిపోతూ వున్న భూభారం చేత వరాహ కూర్మ సర్పరాజులు వంగిపోతూ వుండగా, తీవ్ర పూత్కారాలచే జనించిన వాయువేగం చేత మేఘపటలం నలువలంకులకి చెదరి పారిపోగా, కర్ణాతాళాలు అనే దుందుభి నిధ్వానం కుల పర్వత దరుల నుంచి ప్రతిధ్వనులీనగా ఉన్నత కుంభములు అనే బురుజులు కలది
కనుక గర్వానికి నివాస దుర్గమున్ను, శీకరధారలు అనే వర్షాల చేత క్రోధానికి హిమధారా గృహమున్ను, మదజల వర్షాలకి వానాకాలమున్ను, దర్వాంధకారానికి కాళరాత్రి సమయమై ఆనందకాననంలో గర్వ సంరంభ విజృంభణంతో చించివేసింది. చెండాడింది. కాళ్లతో మట్టింది. గోళ్లతో చిదిమింది. విరిచింది. క్రొచ్చింది (త్రవ్వింది) అదిమివేసింది. పిండీగుండా చేసింది. త్రుంచింది లేక ఖండించింది. మోదింది. ఎదిరించింది. ఉద్ధతిలో కూల్చింది.
గజరూపంలో వున్న అమరవైరి కాశీపురం అయిదు క్రోసుల మేర భూమండలంలో నిర్లక్ష్య సంచారాల చేత భీకరంగా ఉద్యానవనాల్నీ, సౌధాలనీ, ప్రాకారాలనీ, బురుజులనీ పురవీధుల్నీ నాశనం చేశాడు.

-ఇంకా ఉంది