భక్తి కథలు

కాశీ ఖండం.. 150

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివుడు ‘అకారేశ్వరుడై’ విష్ణుమూర్తి ఆకారంతో ప్రత్యక్షం అయాడు. శివుడు ‘ఉకారేశ్వరుడు’ అనే పేరుగల శ్రీమహాదేవుడై బ్రహ్మాదేవుడి రూపాన్ని తాల్చి అలరారాడు. భవుడు ‘మకారేశ్వర’ రూపుడయి చంద్రకళాధరుడి ఠేవ ఆవిర్భవించాడు. నాగకేయూరుడు అయిన శంభుడు నాదేశ్వరుడు అయి ప్రకాశించి శబ్ద రూపాన్ని తాల్చాడు. జగదేకనాథుడు బిందు ఈశ్వరుడు అయి సమస్త భువన సమవాయ కారణ భావాన్ని వహించి భాసిల్లాడు. ఇంతమందిన్ని బ్రహ్మకి అభీప్సితాలను ఒసగారు. ఈ పంచలింగాలున్ను ప్రణవస్వరూప లింగాలే అని తెలుసుకోవలసింది. ఓంకారేశ్వర లింగంతోపాటు ఇవి అయిదున్ను దివ్యలింగాలే సుమా!
వింధ్య దర్పదమనా! దమనుడు అనే నామధేయం కల బ్రాహ్మణుడు భరద్వాజగోత్రంలో జన్మించాడు. అతడు బ్రహ్మచర్యాశ్రమంలో వుండగానే పాశుపాత శైవదీక్ష స్వీకరించి, అవిముక్తసీమ అయిన కాశీపురిలో మోక్షసిద్ధిని పొందాడు.
అగస్త్య సంయమీశ్వరా! ఈ అవిముక్త కాననానికి ఉత్తరదిశకి భారభూతేశ్వర శివలింగమున్ను, తూర్పు దిక్కున మణికర్ణికేశ్వర లింగమున్ను, దక్షిణ దిక్కున బ్రహ్మేశ్వర లింగమున్ను, పశ్చిమ దిక్కున గోకర్ణేశ్వర లింగమున్ను సరిహద్దులు-
ఇక అట్టహాసుడు అనే ప్రమథుడు తూర్పు వాకిలినీ, భూతధాత్రీశ్వరుడు దక్షిణ ద్వారాన్ని, గోకర్ణుడు పడమటి వాకిలిని, ఘంటాకర్ణుడు ఉత్తర ద్వారాన్ని కావలి కాస్తూ ఉంటారు. భాగవక్త్రప్రమథుడు ఈశాన్య విదిక్కున, భీషణుడు ఆగ్నేయకోణాన్ని, శంకుకర్ణుడు నైతృతి విదిక్కునీ, ద్రుమిచండుడు వాయవ్యకోణాన్ని, అనేక ప్రమథగణ పరివేష్టితులై రక్షిస్తూ వుంటారు. మరి గంగాతీరాన్ని కాలాక్షుడు, రణభద్రుడు కాలేయుడు, కాలకంపనుడు అనే ప్రమథులు కాపుకాస్తూ వుంటారు. వీరభద్రుడు నభస్సు, కర్దమాలిప్త విగ్రహుడు, స్థూలకర్ణుడు, మహాబాహుడు, ఈ గణనాయకులు అసినదీ తీరాన్ని కావలి కాస్తూ చరిస్తారు. విశాలాక్షుడు మహాభీముడు, కుండోదరుడు, మహోదరుడు దేహాళీ ప్రాంతాన్ని రక్షిస్తూ వుంటారు. నందిషేణుడు, పాంచాలుడు ఖరపాదుడు, కరంటకుడు, ఆనందుడు, గోపికుడు, బభ్రుడు వరణానదీ తీరాన్ని కావలి కాస్తు సంచరిస్తారు.
ఒక సమయంలో కాశీ పవిత్ర క్షేత్రంలో కపిలుడు, సావర్ణి, శ్రీకంఠుడు, పింగళుడు, అంశుమంతుడు- ఈ ఏవురికిన్ని పంచభూతాత్మక శరీరాలతోనే శివుడిలో ఐక్యం అయే మహభాగ్యం పట్టింది. ఆశ్చర్యం. ఈ కాశీ క్షేత్ర మహాముని ఏమని వర్ణిస్తాను?
అగస్త్య మహర్షీ! ఇంతకంటే అద్భుతావహ విషయం చెబుతాను. విను. ఈ కాశీ క్షేత్రంలో ఒక బుద్ధిశాలి అయిన పుణ్యపురుషుడు శివలింగాన్ని తిలలతోను, అక్షతలతోను పూజ సల్పి వెడలిపోయాడు. అప్పుడు శివలింగం నుండి ఒలికిన అక్షతలనీ, నువ్వులనీ మేయగోరి ఒక చిట్టెలుక ప్రదక్షిణం కావించి, ఆ మూషిక శరీరాన్ని విడిచిపెట్టకుండానే కైలాస శిఖరం ఎక్కింది సుమా! సమీప స్థలంలో పొంగిపొరలి ప్రవహిస్తున్న గగన గంగ కెరటాల తుటుముల స్పర్శచే పెట్లిపోతున్న పాప సమూహాలు కల శ్రీకాశీనగరానికి అన్యనగరాలు సాటి వస్తాయా? అగస్త్య మునిచంద్రా! డుంఠి విఘ్నేశ్వరుడి గండ ఫలకాలనుంచి స్రవిస్తున్న మదజల ధారలు కలవడంవల్ల పోటెత్తిన విధంగా పొంగి పొర్లుతున్న వరణానదీ సంగమం సంపన్నమైన గంగా తీరాన వున్న కాశీ పవిత్ర క్షేత్ర రాజ సౌభాగ్యాన్ని వర్ణించడం బ్రహ్మ అంతవాడికి అయినా శక్యమా?
మునిప్రవరా! ప్రాతఃకాలారంభవేళల్లో ఏ నరుడు చిత్తెకాగ్రతతో ‘అవిముక్తం, అవిముక్తం, అవిముక్తం’ అని ముమ్మారు పలుకుతాడో ఆ నరుడు ధన్యాతిధన్యుడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి