భక్తి కథలు

కాశీ ఖండం.. 151

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశీనగరం పొలిమేరలో ప్రాణి లేక జీవుడు మరల తెరవకుండడం కోసం కనుదోయి మూస్తాడో- ఆ సమయంలో ఆ రీతిగా కనుగవ మోడ్చిన దీర్ఘనిద్రలో ఒక నిక్కలకంటాడు. ఆ నిక్కలలో ఆ జీవుడు తానే శివుడయిపోతాడు.
ఇల్వల వైరీ! నేను అల్పబుద్ధిని. కాశీనగరంలోని శంభులింగాల అనుకంపా గుణాన్ని ఏ విధంగా సన్నుతింపగల్గుతాను? ఒకానొక వనిత వరువాత శివలింగం కట్టెదుటి వాకిలిలో చేరి వున్న చెత్త చెదారాన్ని, గడ్డీగాదాన్నీ చీపురు కట్టతో ఊడ్చుతూ చేతిలోని చీపురకట్టతో సహా తాను ఓంకారేశ్వర లింగంలో ప్రవేశించి లీనమైపోయింది!
ఓంకార శ్రీమహాదేవుడి లింగం దగ్గర ఒక బిలం వుంది. అది పాతాళలోకానికి ఏగే పెనుత్రోవ? ఆ బిల ద్వారం చెంత కావలి కాస్తూ కురుచని ఎర్రని జడలు గల మునులు వుంటారు.
తన్ను వెన్నాడి వేటాడ తరుముకొంటూ వస్తున్న కాకికి వెరచి ఒక ఆడు కప్ప ఓంకారనాథేశ్వరుడి మందిరం చుట్టూ ప్రదక్షిణం ఒనర్చిన మహిమవల్ల ఆ ఆడుకప్ప బొందితోనే శివుడిలో లీనమైపోయింది.
ఒక ముదిత (పాంచాలి) వంజళం అనే గీత భేదం పాడి అభవుణ్ణి మెప్పించింది. ఒక లేమలలిత లలితమైన లాస్యం చేసి కపర్దిని మెప్పించింది. ఒక సుకుమారి శివుణ్ణి స్తోత్రం చేసి సంతోషపెట్టింది. కాశీక్షేత్రంలోని ఓంకారనాథుడు కరుణగలవాడు.
ఏ మనుష్యుడు కాశీనగరానికి చనడో, మోక్షలక్ష్మీ స్థానం అయిన మత్సోదరీ తీర్థాన్ని కాంచడో, ఓంకారేశ్వర శివమూర్తి అయిన చంద్రకళావౌళికి మ్రొక్కడో ఆ దురాత్ముడు బాహుమూల కూలంకష స్తనభారాలస అయిన జననీ తారుణ్య సంపత్తిని కని తన వినాశనానికి తానే కారకుడు అవుతాడు.
ఓ వాతాపిదమనా! పని పెట్టికొని ఫాలాక్షుడు పార్వతీదేవికి ఆనతిచ్చిన క్రమంగా నీకు ఏమీ దాచక చెప్పుతాను- అవధానంతో ఆలించు. పుణ్య సంపదకి ఆలంబనమున్ను, సర్వపాపహారి అయిన త్రివిష్టపేశ్వరుడు అదే త్రిలోచనుడి చరిత్రని వినవలసింది.
పరమ రుషిప్రవరా! ‘విరజం’ అనే నామం కల పీఠం కాశీపురికి రత్నాభరణం. ఆ పీఠాన్ని దర్శించుకొన్న నరుడు నిమేషమాత్రంలోనే రజోగుణ వికారాలు తొలగించుకొంటాడు.
అనఘచరిత్రా? యమున, సరస్వతి, నర్మదానదులు మూడున్ను ఆ విరజాపీఠం అంతికంలో చేరువలో, దక్షిణ దిక్కున శివుడి పాద పీఠాన్ని ఒరసి కొంటూ ప్రవహిస్తూ వుంటాయి.
ఆ నదులు మూడున్ను నిండారిన భక్త్భివనతో ముప్రొద్దును కరాంబురుహుధృత స్వర్ణకలశ మిళిత గంధసార సుగంధ జలధారలతో శంభుడిని విస్రంభంతో చనువుతో తీర్థమాడిస్తారు.
ఆ స్థలంలో ఆ పుణ్య తరంగిణులు యమునా సరస్వతీ నర్మదలు మూడున్ను చంద్రకళాలంకారాలూ నాగాభరణాలూ అయిన నానా మణిశిలామయ శివలింగాలను ప్రతిష్ఠించాయి.
నిండు హృదయంతో త్రివిష్టపేశ్వర చంద్రవౌళిని సాష్టాంగ నమస్కారమందలి ఆసక్తితో అర్చించిన మానవ కోటికి మరలా కర్మబంధాలు కల్గుతాయా? మరల మనోవ్యధ వికార బాధలా? తిరిగి మాతృయోని పథం నుంచి జారిపడే సంకటాలు కల్గుతాయా?
మానవుల గయాక్షేత్రానికి అరుగుట దేనికి? కాశీపురంలోని నదీత్రయ మధ్య ప్రదేశాలలోని సైకత వేదికల పయిని తల్లిదండ్రుల్ని మాతామహుల్నీ, మాతామహిల్నీ, పితామహీ పితామహుల్నీ పేరు పేరున పేర్కొంటూ పిండాన్నాలను పెట్టరాదా? పితృదేవతలు హర్షంతో చేతులు చాస్తూ వాటిని స్వీకరించరా?
త్రివిష్టపేశ్వర స్థానానికి చేరువని దక్షిణ దిక్కున సరస్వతీ క్షేత్రం వుంది.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి