భక్తి కథలు

కాశీ ఖండం.. 161

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ సోమపీఠీ! ‘‘శివుడికి వామాంగం వైకుంఠవాసి విష్ణుమూర్తి. అతడి దక్షిణాంగం బ్రహ్మ’’ అని ఎరుగున్నావో? ఎరుగవో? అటువంటి పరమశివుణ్ణి అధ్వరానికి రావించవద్దా?
పరమ వంచకుడైన ఈ యక్షరాజు కుబేరుడు నీలకంఠుడికి నెచ్చెలికాడు కాదు కాబోలును- పాలుమాలిన ఈ అగ్ని సర్ప కంకణుడికి మూడవ కన్ను కాడు కాబోలును- నిర్భాగ్యుడైన ఈ చంద్రుడు త్రిపుర వైరికి అవతంస కుసుమం కాడు కాబోలు- కుత్సితులలో కుత్సితుడైన ఈ దేవేంద్రుడు గంగాధరుడికి దాసానుదాసుడు కాడు కాబోలు- హరుణ్ణి వెలిపెట్టిన ఈ యాగానికి (ఈ+ఆగానికి=అల్లరికి) ఇళ్లు విడిచిపెట్టి ఏమి కుడువ ఏతెంచారు? పంచవదనుడి కన్ను జేవురిస్తే తత్‌క్షణంలోనే తమ భార్యల మంగళ సూత్రాలు తెగిపడవా?
లేత నెలతాల్పు అయిన శివుడు లేని ఈ యోగ విధికి యముడు ఏ నిమిత్తం ఏతెంచాడు? బెట్టిదం అయిన పిడుగుపాటువలె కరుణ లేని శూలపాణి ఎడమ కాలి మడమ తాపు మరచిపోయాడా? ఏమిటి?
శే్వతాశ్వతర ఉపనిషత్తు ‘‘శివుడు భోక్త- భుజించువాడు- భోజ్యము లేక భుజింపబడేద శివుడే ప్రేరేపకుడు సర్పధరుడున్ను శివుడే’’ అని వచించెనో లేదో అనే విషయాన్ని సావధానులై విని వుండరాయేమి?
ఆకాశం మొదలుకొని పరమాణువు అంతంగా గల చరాచరాత్మక గమన శీలం అయిన ప్రపంచానికి సృష్టికర్త, స్థితికారకుడు, లయకారణభూతుడు అయిన శివుడు నీకు మాననీయుడు కాకపోవడం ఎలాగు? విచారణ చేసి వచించు.
దక్షా! బ్రహ్మవేత్తనైన బ్రాహ్మణుడిని. నీకు ఆశ్రీతుణ్ణి. నీ మేలుగోరు పరమహితుడిని. ధర్మజ్ఞుడవై నా ఒక్క మాట ఆలకించవయ్యా? క్రతుఫలాధీశుడు, భువనరక్షా దీక్షితుడు అయిన నాగకంకణుణ్ణి ఈ యాగానికి రావించవలసింది.
అర్థం పర్థంలేని వాక్యమున్ను, వేదవిహిత కర్మలాచరించని శరీరమున్ను, భర్తను కోల్పోయిన నారీరత్నమన్ను, గంగానది లేని దేశమున్ను, పుత్రులు కలుగని దాంపత్యమున్ను, దానం చెయ్యని సంపదయున్ను మంత్రిలేని రాజ్యమున్ను, వేదవిద్య నేర్వని అందమున్ను, స్ర్తి లేని సౌఖ్యమున్ను, దర్భలు లేని సంధ్యా వందనమున్ను, నువ్వులు లేని పితృ తర్పణమున్ను, హవిస్సు లేని హోమమున్ను నిరర్థకాలూ- నిష్ప్రయోజనాలూను’’.
ఈ విధంగా పలుకగా దక్షుడు ముక్కుమీదకి కోపం తెచ్చుకొని ‘‘ఈ బ్రాహ్మణుడిని ప్రాగ్వంశ మందిరంనుంచి (హవిర్గృహానికి ముందుండే సభా భవనాన్ని ‘ప్రాగ్వంశ’మని యాజ్ఞికులు వ్యహరిస్తారు) వెడలగొట్టమని పలికాడు. అంత ఆ విప్రుడు- దధీచి తనంత తాను ఆ ఆస్థానం అంతా అదిరిపోయే రీతిగా నిరంకుశ వైఖరితో వెలువడ్డాడు.
ఆ దధీచితో దూర్వాసుడు, ఉదంకుడు, ఉపమన్యుడు, రుచికుడు, గాలవుడు, మాండవ్యుడు, వామదేవుడు, ఉద్దాలకుడు కూడా వెళ్లిపోయారు. అంతకుముందే రాబోవునది గ్రహించి బ్రహ్మదేవుడు సత్యలోకానికి ఏగాడు. యజ్ఞం ప్రారంభం అయింది. ఆ వృత్తాంతం సర్వమున్ను నారద దేవర్షి ముఖాన విని సతీదేవి మహేశ్వరుడి అనుజ్ఞ గైకొని, దివ్య రథం అధిరోహించి, తండ్రిన దక్ష ప్రజాపతికి బుద్ధి గరపడం కోసం కైలాసంనుంచి ఏతెంచింది.
యజ్ఞవాటి ప్రవేశించి సకల జనని రత్న సింహాసనంపైన ప్రీతితో ఉపవిష్టురాలు అయింది. సద్భక్తితో దేవసభా, బ్రహ్మర్షి సభా అంజలులు నొసలు కీలించారు. అప్పుడు దక్ష ప్రజాపతి కోపించి, అధ్వరానికి ఏతెంచిన కుమార్తె మనస్సుని తెలిసికొని ఈ కరణి వాకొన్నాడు.
‘‘శివుడు అమంగళకర వేషధారి అవునో కాదో చెప్పు. తెలియక నిన్ను అతగాడికి ఇచ్చాను. ఏమి చెప్పేది?

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి