భక్తి కథలు

కాశీ ఖండం.. 163

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ త్రిపుర హరుడు రాకున్నా కొదవ లేశమయినా కలుగదు. తాను కేల ఒక భిక్షా కపాలాన్ని తాల్చి వచ్చి అగడు చెయ్యడంకంటె రాకుండడమే లెస్స’’.
అంత సతీదేవి తండ్రితో ఈ పగిది పలికింది.
‘‘ఆహా! బాగు! మంచి యుక్తాయుక్త వివేకం! యజ్ఞంలో నువ్వు ఒసగే స్వాహాకార హవిర్భాగాన్ని పురహరుడు ఆశించి వున్నాడా ఏమిటి? శంభుని విడిచి ఇక్కడికి వచ్చి నీ యజ్ఞంలో నేను మృష్టాహారం భుజింప ఏతెంచానా? మోహాంధుడవై ఈశ్వర ద్రోహం ఎందుకు చేస్తావని హితబుద్ధులు కరపడం కోసం ఏతెంచాను.
శివుడు దాత. శివుడే భోక్త. సర్వమున్ను శివుడే. అతడు శాశ్వతుడు. అటువంటి శంభుణ్ణి వేరుచేసి యజ్ఞక్రియలు సాగింపవచ్చా? ఇంత వెఱ్ఱి వెంగలివి ఎందుకు అయావు? చెప్పు-
ఆ శివుడు ఎల్లవేళల మాటిమాటికి స్మరింపదగినవాడు. మననం చేసుకోవలసినవాడు. అతడు సర్వదా వినదగినవాడు. అచంచల చిత్తంతో చూడదగినవాడు. పరబ్రహ్మ స్వరూపుడు. సృష్టి, స్థితి ఆదిగాగల పంచ కృత్యాలతో లోకాలను పట్టి పాలారుస్తాడు. రుద్రుడు విశ్వాధికుడని ఆమ్నాయాలు ఆ శివుణ్ణి ముక్తకంఠంతో ఘోషిస్తూ వుంటాయి.
నిత్యం, సత్యం, శుద్ధం, బుద్ధ, అనంత, శాంత, కూటస్థ, స్వప్రతిష్ఠ, అఖండ, అద్వితీయ, సత్ స్వరూపం అనీ, అచించత్యం, ఏకం, అనంతం, అవేద్యం, దిక్, దేశ, కాలాల చేత పరిచ్ఛేదం చేయడానికి అశక్యం అయిన బ్రహ్మం అనీ అంటారు.
ఆయన తత్త్వాన్ని వేద వేదాంత మహాకావ్యాల వాక్యార్థ విచారంతో పరమ హంసలు విచారణ చేస్తూ వుంటారు. శివయోగులు యోగమార్గావలంబులై శరీరాంతరాళంలోని అగ్నికి వాసమై త్రికోణం అయిన మూలాధారం నుంచి వెలువడే కాంతి రేఖ చేత అనుస్యూతంగా వికసించే షట్కమల గర్భాలలో కంపింపనిదై నీవార శూకాన్ని పోలినదై సహస్ర విద్యుత్కాంతుల చేత ఆక్రాంతమై పనె్నండు ఆకులు లేక రేకులు వున్న చంద్ర మండల నిష్యం అయిన అమృత ధారల్లో మునిగితేలుతూ ఆ దేవుని లోలోపల కనుగొంటూ వుంటారు. అతడొక్కడే భూతాత్మ. ప్రాణుల్లో వుండి అనేకత్వాన్ని పొందినట్లు వుంటుంది. ఏ రీతిగా అని అడిగితే- ఘటంలో వుండి ఘటాకాశం, పటంలో వుండి పటాకాశమై- ఒకే ఆకాశం అనేక ఆకాశాలు అయినట్లు తోచడంలేక భాసించడం వంటిది.
పరమేశ్వరుడు త్రిపుర మథనుడు, ఫాలనేత్రుడు, త్రిలోకీ కుటుంబి. త్రరుూ శిరోమాణిక్య ఖండం బ్రహ్మాండాలను కుక్షిలో భరించేవాడు. శంభుడు, సర్పరాజు కంఠహారుడు, గజచర్మధరుడు. మృత్యుంజయుడు. నాగకుండలుడు. పాండురంగుడు. చంద్రశేఖరుడు. గిరీవుడు. వలరాచదొరవారిని నొసటి కంటి మంటచే పదటు చేసినవాడు. త్రిలోకాలని ఆక్రమించుకొని కబళించబోయే సమయంలో కాలకూటాన్ని హేలగా మ్రింగిన నీలగళుడు. బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతల కిరీట మాణిక్యకాంతుల చేత విరసే అడుగుదమ్ములు కలవాడు. అటువంటి సకల భువనాధీశ్వరుడు క్రతుక్రియ ప్రారంభ సమయంలో పూజ్యుడు. తండ్రీ! ఆ కనక శైల కోదండుణ్ణి చిన్నపుచ్చరాదు. త్రరుూ విద్యావధూసీమంత సింధూరం చేత ఎర్రవారిన పాద పద్మాలు గల స్వామి. దైతేయ కాంతా కపోల కస్తూరికా మకర పత్రాలు చెరిపివేసిన బాహుబలుణ్ణి నువ్వు అవమానించవద్దు. నీకీ గర్వం తగదు.
ఓ విష్ణుదేవా! నువ్వు ప్రబుద్ధుడివి. ఇటువంటి దుశే్చష్టితాన్ని చూస్తూ ఉపేక్షిస్తున్నావా? సూర్యదేవా! ఈ దుర్గోష్ఠిలో ఎందుకు చేరావు? ఏ ముఖంతో శంకరుడి చరణాంబుజాలను సందర్శిస్తావు?

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి