భక్తి కథలు

కాశీ ఖండం.. 165

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ సమయంలో పార్శ్వభాగాల్లో వెనుకను ఎదుటను నింగీ నేలా నిండునట్లు బెట్టిదంగా వృషభ ధ్వజుడి సుభటులు అకుంఠితమైన వీర భావ ప్రతాపాల భీకరం అయిన స్ఫురణతో కొందరు భటులు తరువులు, గండ శిలలు చేతుల ధరించి, కహ కహ ధ్వనులతో నవ్వుతూ అసంఖ్యాకులై యజ్ఞవాటికకి ఒకరినొకరు అతిక్రమిస్తూ ఉద్ధతితో అరిగారు.
ప్రమథుల సైన్యంలోని కొందరు యూపస్తంభలా (పశువుల్ని బంధించే స్తంభాలు) పెళ్లగించారు. కొందరు యజ్ఞ కుండాల్ని పూడ్చివేశారు. కొందరు మంటపాలని పడద్రోశారు. మరికొందరు వేదికుల్ని త్రవ్వివేశారు. కొందరు వేలిమి చేసే పదార్థాన్ని లేక హవిస్సుని భక్షించివేశారు.
వేరుకొందరు అన్నాలు ఆరగించారు. ఇంకా కొందరు పాయస్నానం తినివేశారు. మరికొందరు వంటకాలు మ్రింగివేశారు. కొందరు నెయ్యి, పెరుగు, పాలు, తేనె, చెరకు గడలను ఫలాలను ఆస్వాదించారు. మరికొందరు యజ్ఞపాత్రలు పగులగొట్టారు. ఇంకా కొందరు స్రుక్కులు స్రవాలూ విరిచివేశారు. కొందరు శకటాలని వీటతాటం చేశారు. కొందరు యూపస్తంభాగ్రభాగాల కొయ్య కడియాలను చెవులకి తగిలించుకొన్నారు.
ఈ వడువున హద్దులేనిదై, అడ్డులేనిదై ప్రమథుల ఆగ్రహం చెల్లుబడి అవుతున్నది. అప్పుడు కోపాటోపంతో వీరభద్రుడు తన మీద ప్రయోగించతలచగా వజ్రాయుధాన్ని ఎత్తగా ఇంద్రుడి భుజం స్తంభించుకుపోయింది. కైటభ వైరి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా వెంటనే ఆ చక్రాన్ని చక్కిలం బాగున విరిచివేసి భక్షించాడు.
తీవ్రమైన చెంపపెట్టుతో పండ్లు డుల్లగొట్టి సూర్యుడి నోరు బోసి నోరు చేసివేశాడు. శుక్తిలోని మంచి ముత్యాలు రాలగొట్టినట్లు భగుడి గ్రుడ్డులు అదిరిపోయే రీతిగా బలంగా తన్నాడు.
అర్థచంద్రాకార బాణంతో యజ్ఞమృగం శిరస్సుని తెగత్రుంచి ఆకాశంలో వ్రేలాడగట్టాడు. బ్రహ్మ ముక్కు సమూలంగా తెగగోశాడు.
శివద్రోహులైన దేవతలలో కలిసివున్న ఏకాదశ రుద్రుల్ని తన తండ్రి పేరి వారు కావడంవల్ల వారిని బాధించక పారిపోవడానికి అనువుగా విడిచిపెట్టాడు. అంతటా భగ్గన సంహరిస్తున్న ఆ వీరభద్రుడి ధాటికి నిర్జరులు నుజ్జు నుజ్జు అయి, శిథిల శిథిలమై, గగ్గులకాడై (్ధన్యం దాల్చిన కంకెల పొలం అయి) చెల్లాచెదరై లజ్జ విడనాడి ఎవరికి వారే యమునా తీరే అయి విడివడి పారిపోయారు.
వీరభద్రేశ్వరుడు అంతతో ఆగలేదు. దక్ష ప్రజాపతి అల్లుళ్లు చంద్రుడు, ధర్ముడు మున్నయిన వారి యెడల త్రాళ్లు కట్టి యూపస్తంభాల్ని గుదిబండలు లాగు ఆ త్రాళ్ళతో జత పరిచి వాటిని దీర్ఘమైన త్రాళ్లకి అమర్చి క్రమంగా పశువుల్ని తోలిన రీతిగా నడిపించాడు.
ప్రయోజనం శూన్యం. నన్ను ఎందుకు బాధిస్తావు? అబ్రహ్మణ్యం అయాను (అవధ్యుణ్ణి అయాను)- మొఱ్ఱో అని ఉచ్చైస్స్వరంతో ఆక్రోశం ఒనర్చగా యజ్ఞశాల లోపల తన భటుల చేత ‘్ధమోర్ణ’ అనే నామంగల యమధర్మరాజు పట్టమహిషి స్తనద్వయంమీద ఆడే అతడి హస్తద్వయాన్ని వెనకకి విరిచి బంధింపచేశాడు.
వీరభద్రస్వామి- ఆక్రోశం పెడుతూ వున్న కుబేరుడి ముఖాన్ని ఉత్తర వేదికకి చెందిన బండరాతి అంచున రాయించాడు. ఆ పాపపు యాగంలో ఉత్తములైన వారున్ను తొట్రుపాటు చెందారు.
మాయల మారి అయిన దేవేంద్రుడు మదించిన నెమలి కొదమ ఆకారాన్ని తాల్చి, సమీపంలోని క్రీడాశైల శిఖరం ఎక్కి ఉద్వేగం లేని స్థిమిత బుద్ధితో వీరభద్రేశ్వరుడు వేల్పుల్ని బాధించుతున్న తీరును పరికిస్తూ కూర్చుండి వున్నాడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి