సంపాదకీయం

వ్యూహాత్మక వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాల్‌దీవుల ప్రభుత్వ ‘ప్రత్యేక దూత’ మన దేశానికి రాకూడదని మన ప్రభుత్వం గురువారం నిర్దేశించడం దౌత్య వైపరీత్యం. ఈ వైపరీత్యానికి ఒడిగట్టడం వల్ల కల్లోలగ్రస్తమై ఉన్న మాల్‌దీవుల్లో ప్రశాంత స్థితిని నెలకొల్పడానికి వీలుగా ‘మధ్య వర్తిత్వం’ వహించే అవకాశాన్ని మన ప్రభుత్వం మరోసారి జారవిడుచుకుంది. మాల్‌దీవుల్లో తన నియంతృత్వ ‘పాలన’ను శాశ్వతం చేసుకొనడానికి అబ్దుల్లా యమీన్ చేస్తున్న ప్రయత్నం ప్రస్తుత కల్లోలానికి కారణం. రాజకీయ ప్రత్యర్థులను జైళ్లపాలు చేసిన యమీన్ తమ దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం- సుప్రీం కోర్టు- జారీ చేసిన ఆదేశాలను లెక్కచేయకపోవడంతో మాల్‌దీవుల్లో సంక్షోభం ముదిరింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్ నషీద్‌ను 2012లో ప్రభుత్వ సాయుధ దళాలు పదవి నుంచి తొలగించిన నాటి నుంచి మాల్‌దీవుల్లో ‘రాజ్యాంగ ప్రక్రియ’ కూలబడి ఉంది. ప్రస్తుతం పెత్తనం చెలాయిస్తున్న అబ్దుల్లా యమీన్ ‘పోలీసుల-సైనికుల’ మద్దతుతో అరాజకం సృష్టిస్తున్నాడు, రాజకీయ ప్రత్యర్థులను నిర్బంధించాడు. అన్యాయంగా పదవీచ్యుతుడైన మహమ్మద్ నషీద్ శ్రీలంక నుంచి తన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన నాయకత్వంలోని మాల్‌దీవ్ ప్రజాస్వామ్య పక్షం- మాల్‌దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ- ఎండీపీ- ప్రస్తుతం శ్రీలంక రాజధాని కొలంబోలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. నిర్బంధంలో ఉన్న మరో మాజీ అధ్యక్షుడు అబ్దుల్ మామున్ గయూమ్‌ను, మరో ఎనిమిది మంది రాజకీయ నాయకులను నిర్బంధం నుంచి విడుదల చేయవలసిందిగా సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాన్ని యమీన్ తిరస్కరించాడు. తమ దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను పునరుద్ధరించడానికి వీలుగా జోక్యం చేసుకోవాలని మాల్‌దీవుల సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈనెల నాలుగవ తేదీన మన ప్రభుత్వాన్ని అర్థించారు. కానీ మన ప్రభుత్వం వౌనం వహించింది. తమ ప్రజాస్వామ్య రాజ్యాంగ సార్వభౌమ వ్యవస్థను యమీన్ నియంతృత్వం నుంచి విముక్తం చేయడానికై జోక్యం చేసుకోవాలని ఏడవ తేదీన మహమ్మద్ నషీద్ మన ప్రభుత్వాన్ని కోరాడు. ఇది రెండవ అభ్యర్థన! సుప్రీం కోర్టు ఆదేశాన్ని ఖాతరు చేయని యమీన్ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితి- ఎమర్జన్సీ-ని ప్రకటించింది. సర్వోన్నత న్యాయమూర్తులపై అసత్య అభియోగాలను నమోదు చేసింది, వారిని నిర్బంధించడానికి రంగం సిద్ధం చేసింది. ప్రతిపక్ష రాజకీయ నాయకులను నిర్బంధం నుంచి విడుదల చేయాలన్న తమ తీర్పును సర్వోన్నత న్యాయమూర్తులు రద్దు చేశారన్న ప్రచారాన్ని కూడా యమీన్ ప్రభుత్వం చేయిస్తోంది. కానీ ఇరుగు పొరుగు దేశాల్లో మాత్రమే గాక అంతర్జాతీయంగా ఈ ‘కల్లోలం’ గురించి ప్రచారం అవుతుండడంతో యమీన్ భయపడుతున్నాడు. అందువల్ల మన ప్రభుత్వానికి తన వాదం వినిపించడానికై ప్రత్యేక ప్రతినిధిని మన దేశానికి పంపిస్తున్నట్టు యమీన్ ప్రకటించాడు. కానీ మన ప్రభుత్వం మాత్రం ‘ప్రత్యేక దూత’ను రానివ్వరాదని నిర్ణయించింది..
మాల్‌దీవుల్లోకి చైనా చొరబడకుండా నిరోధించలేకపోవడం మన విదేశాంగ విధాన వైఫల్యం. ఈ వైఫల్యం దశాబ్దికి పైగా కొనసాగుతున్న మన ‘నిర్లిప్తత’ ఫలితం! మన దేశానికి నైరృతి దిశలో హిందూ మహాసముద్రంలో నెలకొని ఉన్న చిన్న దేశం ‘మాల్‌దీవులు’. మాలా ద్వీపాలుగాను, పగడాల ద్వీపాలుగాను ప్రసిద్ధికెక్కిన మాల్‌దీవులు ఒకప్పుడు మన దేశంలో భాగం. క్రీస్తుశకం పనె్నండవ శతాబ్ది నుంచి జిహాదీలు, ఆ తరువాత ఐరోపావారు దురాక్రమించిన కారణంగా ‘మాలా ద్వీపాలు’ మన దేశం నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది. మన లక్ష ద్వీపాలకు అత్యంత సమీపంలో ఉన్న మాల్‌దీవులు 2000వ సంవత్సరం వరకూ మనకు సన్నిహిత మిత్రదేశం. మాల్‌దీవులకు, లక్ష ద్వీపాలకు మధ్య ఉన్న ఇరుకైన సముద్రం ‘అంతర్జాతీయ జలమార్గం’గా ఏర్పడి ఉండడం ఉభయ దేశాల భద్రతతో ముడివడి ఉన్న భౌగోళిక వాస్తవం. చైనా 2010లో మాల్‌దీవుల్లో దౌత్య కార్యాలయం ఏర్పరచుకొన్న నాటి నుంచి ‘మాల్‌దీవులు’ మనకు దూరంగా జరుగుతోంది. మన దేశానికి దక్షిణంగా ఉన్న మాల్‌దీవులతో చైనాకు ఎలాంటి చారిత్రక సంబంధాలు లేవు. కేవలం మన దేశాన్ని దక్షిణం వైపునుంచి దిగ్బంధం చేయడానికి వీలుగా చైనా యుద్ధనౌకలు, గస్తీ నౌకలు, జలాంతర్గాములు మాల్‌దీవుల్లో, శ్రీలంకలో తరచూ తిష్ఠ వేస్తున్నాయి. శ్రీలంకలోని ‘హంబన్ తోట’ ఓడరేవును చైనా అభివృద్ధి చేయడం ‘్భరత్‌ను దిగ్బంధం చేసే’ వ్యూహంలో భాగం. కానీ గుట్టుచప్పుడు కాకుండా చైనా కొనసాగిస్తున్న ఈ ‘విస్తరణ’ కుట్రను మన ప్రభుత్వం ఏళ్ల తరబడి నిరోధించలేక పోవడం మాల్‌దీవుల సంక్షోభానికి కారణం. పాక్, చైనాలు కలసికట్టుగా మాల్‌దీవుల్లో జిహాదీలను సమర్థిస్తున్నాయి. 2012లో ‘పోలీసులు-సైనికులు’ తిరుగుబాటు చేసి నషీద్‌ను- మాల్‌దీవుల్లో మొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నషీద్‌ను తొలగించడానికి ‘పాకిస్తాన్- చైనా’ ఉమ్మడి షడ్మంత్రం కారణం. మాల్‌దీవుల్లో ‘పోలీసులు-సైనికులు’ ఒకే ఏకీకృత వ్యవస్థ.. వీరిలో అత్యధికులు జిహాదీలు..
నషీద్‌పై పోలీసులు తిరుగుబాటు చేసిన సమయంలోనే మన ప్రభు త్వం సైనిక జోక్యం చేసుకుని ఉండవలసింది. గయూమ్‌పై ‘కిరా యి’ జిహాదీ మూకలు తిరుగుబాటు చేశాయి. ఆ సమయంలో మన సైనికులు- నౌకాదళం వారు వె ళ్లి కిరాయి మూకల నుంచి మాల్‌దీవుల ప్రభుత్వాన్ని విముక్తం చేశారు. మాల్‌దీవుల ప్రభుత్వ అభ్యర్థన మేరకు మన ప్రభుత్వం ఈ ‘విముక్తి’ని ప్రసాదించింది. ‘్భరతీయులు విముక్తి ప్రదాతలు, విస్తరణవాదులు కాదు, దురాక్రమణ కారకులు కాదు..’ అని నషీద్ ఈ నెల ఏడవ తేదీన అభివర్ణించడానికి ఇదీ నేపథ్యం. కానీ 2012లో నషీద్ సైనిక సహాయం కోరినపుడు మన ప్రభుత్వం సహాయం చేయలేదు. ఇది మన ప్రభుత్వం చేసిన వ్యూహాత్మక మహాపరాధం. 1988లో వలెనే 2012లో కూడ మన నౌకాదళం మాల్‌దీవులకు వెళ్లి ఉండినట్టయితే ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోకుండా నిలబడి ఉండేది. మహమ్మద్ నషీద్ పదవీచ్యుతుడై ఉండేవాడు కాదు. ఇరుగు పొరుగు దేశాల్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మనతో మైత్రిని పాటిస్తున్నాయి. కానీ నేపాల్ లోని మావోయాస్టులు, మాల్‌దీవుల్లోని జిహాదీలు, బర్మా- మ్యాన్‌మార్-లోని మాజీ సైనిక నియంతలు చైనా మద్దతుదారులు..
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం 2012 నాటి మన విధానం. కనీసం ఇప్పుడైనా మన ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారా కాని, సైనికచర్య ద్వారా కాని మాల్‌దీవుల్లో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను, మానవ అధికారాలను పునరుద్ధరించడానికి పూనుకోవాలి. 2012 నాటి మన నిర్లిప్త విధానం వల్ల చైనా ఇప్పటికే ఆర్థికంగా, వ్యూహాత్మకంగా మాల్‌దీవుల్లో ప్రాబల్యం పెంచుకొంది. మనం మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించినట్టయితే ఆ ‘బాధ్యత’ను నిర్వహించడానికి చైనా సిద్ధంగా ఉంది. మధ్యవర్తిత్వం నిర్వహించడానికి తాను సిద్ధమని చైనా ప్రకటించింది కూడ. నషీద్ మన దేశాన్ని ప్రశంసించడానికి, చైనాను ‘దురాక్రమణ శక్తి’గా వర్ణించడానికి ఇదీ నేపథ్యం.